సబ్ ఫీచర్

‘సర్వే’శ్వరులకు మళ్లీ గిరాకీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది చివర్లో కొన్ని రాష్ట్రాలకు, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ వేడి రాజుకుంది. పగ్గాలు సుస్థిరం చేసుకునేందుకు అధికారంలో ఉన్న పార్టీలు, అందలం ఎక్కేందుకు విపక్షాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. అధికారమే పరమావధిగా భావించే రాజకీయ పార్టీలు పదునైన వ్యూహాలతో, కులాలు, మతాలు, వర్గాల ప్రాతిపదికన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులు వేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ‘సెఫాలజిస్టుల’ సంఖ్య పెరుగుతోంది. వీరినే ‘ఎన్నికల పండితులు.. వ్యూహకర్తలు’ అంటారు.
‘సెఫాలజీ’ శాస్త్రం ఇంగ్లాండ్‌లో పుట్టింది. 1948లో తొలిసారిగా సెఫాలజీ అనే పదానికి రూపకల్పన చేశారు. డబ్ల్యుఎఫ్‌ఆర్ హార్డీ అనే వ్యూహకర్త ‘సెఫాలజీ’ పదాన్ని ప్రస్తావించాడు. బ్యాలెట్‌కు సంబంధించిన శాస్త్ర అధ్యయనం చేసే వారిని ‘సెఫాలజిస్టులు’ అంటారు. తెలుగులో వీరిని బ్యాలెట్ నిపుణులు, ఎన్నికల పండితులు అని చెప్పవచ్చు. కాలక్రమంలో వ్యూహకర్తలు (స్ట్రాటెజిస్టులు) గా వీరు రూపాంతరం చెందారు. ఇటీవలి కాలంలో సెఫాలజిస్టులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వీరి అంచనాలు నూటికి నూరుపాళ్లు నిజం కాకపోవచ్చు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సెఫాలజిస్టులు ఘోరంగా విఫలమయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. యుపీఏ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏ సెఫాలజిస్టు కూడా అంచనా వేయలేదు. సోనియా గాంధీ అనూహ్యరీతిలో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు. పదేళ్ల పాటు ఆయన పాలన అందించారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంలో సెఫాలజిస్టులు విఫలమయ్యారు. కొన్ని సంస్థలు బీజేపీకి స్వల్ప మెజార్టీ వస్తుందని చెప్పాయి. అనూహ్యంగా బీజేపీకి యూపీ అసెంబ్లీలో 300కుపైగా సీట్లు వచ్చాయి. కర్నాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సెఫాలజిస్టుల అంచనాలు విఫలమయ్యాయి.
మనకు తెలిసిన సెఫాలజిస్టులు ప్రణయ్ రాయ్, జీవీఎల్ నరసింహారావు, ప్రశాంత్ కిషోర్ (పీకే), రంజిత్ చిబ్, జీటీ కులకర్ణి, వైజీ షిండే వంటివారు ఉన్నారు. ఎన్నికలు, బ్యాలెటింగ్‌కు సంబంధించి శాస్ర్తియమైన అధ్యయనం చేయడమే ‘సెఫాలజీ’. ఎన్నికల గణాంక వివరాలు, గత ఎన్నికల్లో ఓటింగ్ రికార్డులను వీరు అధ్యయనం చేస్తారు. ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయాన్ని పసిగడతారు. ప్రచారంపైన, నిధుల ఖర్చుపైన వ్యూహకర్తలు సలహాలిస్తారు. సెఫాలజిస్టులే కాలక్రమంలో స్ట్రాటెజిస్టులుగా మారారు. ఎన్నికలకు ముందు పలు దఫాలు సర్వేలు చేసి, అధికార పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల తీరు తెన్నులను, ప్రజల మనోగతంపై నివేదికలు అందిస్తారు. లోపాలు ఎత్తిచూపిస్తారు. ఏ సీట్లో ఏ అభ్యర్థి బలంగా ఉన్నారో, టిక్కెట్ ఇస్తే గెలుస్తారో లేదో అనే వివరాలపై సర్వే చేస్తారు. పొత్తులుంటే మంచిదా? ఒంటరిపోరు మంచిదా? అనే అంశాలపైనా సలహాలిస్తారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యూహకర్తలు ఇచ్చే సలహాలు వేరుగా ఉంటాయి. జనాకర్షణ నేతగా ఎలా ఎదగాలి ? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి ? పొత్తులుంటే ఎలా ఉండాలనే అంశాలపై సలహాలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులాల ఓట్లు, పోలింగ్ సరళి, యువత మనోగతం, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికలు ఇస్తారు. శాస్ర్తియ కోణంలో ఆలోచించి, గణాంకాలను జోడించి నివేదికలిస్తారు.
వ్యూహకర్తల నివేదికలు కచ్చితంగా ఉంటాయా? అంటే చెప్పలేం. స్థానిక పరిస్థితులపై ఎంతమంది వ్యూహకర్తలకు పట్టు ఉంటుందన్నది అంచనా వేయలేం. మన దేశంలో ప్రజల స్పందన క్లిష్టంగా ఉంటుంది. అన్ని అంశాలపై అసేతు హిమాచలం ఒకే రీతిన ప్రజలు స్పందించరు. 1977లో సెఫాలజీ అనేది లేదు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు తక్కుతుక్కుగా ఓడించారు. ఎమర్జన్సీ పేరిట రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిన ఇందిరా గాంధీని ఆంధ్ర ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు.
కాగా, గ్రామీణ భారతాన్ని వ్యూహకర్తలు అంచనా వేయడంలో విఫలమవుతుంటారు. మన సమాజం వైవిధ్యంగా ఉంటుంది. ఎన్నికలు వచ్చేసరికి మనం అడిగే ప్రశ్నకు చెప్పే సమాధానం ఒకటి, పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఓటు మరొకరికి వేసే తత్వం ఎక్కువ. దీని వల్ల ప్రజల అభిప్రాయాలను బట్టి కచ్చితంగా నిర్ణయానికి రాలేం. కులాల వారీగా లోతుగా అధ్యయనం చేయడం ఎవరి తరమూ కాదు. అలా అని అన్నింటికీ కులమే కొలమానం కాదు. ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం వీస్తే తుపానుకు కూకటివేళ్లతో వటవృక్షాలు పడిపోయినట్లు రాజకీయ పార్టీల అడ్రసులు గల్లంతవుతుంటాయి. ఈ తరహాలో అంచనావేసే స్థాయిలో మన వ్యూహకర్తలు లేరు. ప్రస్తుతం వ్యూహకర్తలను పెట్టుకోవాలంటే కోట్లాది రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వారికో టీం ఉంటుంది. వ్యూహకర్తలు, వారి టీం సభ్యులు రాగద్వేషాలకు అతీతంగా ఉంటే 75 శాతం వరకు అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంటుంది. తమతో ఒప్పందం కుదుర్చుకున్న నేతలు ఫీలవుతారేమోనన్న ఆలోచనలున్న స్ట్రాటెజిస్టుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల వరకు పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగమే స్ట్రాటెజిస్టు పాత్ర పోషించేది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్ధితి. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను పిలిపించి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేవారు. కాంగ్రెస్‌లో అధికారం కోసం నాయకుల మధ్య పోటీ ఉండేది. ప్రత్యర్థుల కదలికలను పసిగట్టేందుకు నిఘా విభాగాన్ని బాగా ఉపయోగించుకునేవారు. ప్రాథమిక సర్వే జరిపి ఎన్ని సీట్లు రావచ్చో చెప్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అప్పటి నిఘా విభాగం అంచనా వేయలేదు. కాంగ్రెస్ పార్టీ సోదిలోకి లేకుండా పోయింది. ప్రతి నియోజకవర్గంలో నిఘా సిబ్బంది సర్వే చేసేవారు. ఇవేమీ శాస్ర్తియమైన సర్వేలు కావు. మనకు తారసపడే పోలీసు శాఖలో నిఘా విభాగం ఉద్యోగులు నాలుగు వీధుల్లోకి వెళ్లి నలుగురు పెద్ద మనుషులు, నాలుగు కులాల నేతలను కలిసి మాట్లాడి నివేదికలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో వీటికి విశ్వసనీయత ఉండేది. ఈ రిపోర్టు బాగా ఉంటే, అధికార పార్టీ వీటిని మీడియాకు సమాచారాన్ని అందించేది.
ఈ రోజు సెఫాలజిస్టు, స్ట్రాటెజిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న జీవీఎల్ నరసింహారావు ఎన్నికల జోస్యాలు చెబుతూ, చివరకు బీజేపీలో చేరి రాజ్యసభ సభకు ఎన్నికయ్యారు. ప్రశాంత్ కిషోర్ మొన్నటిదాగా చాలా పార్టీలకు స్ట్రాటెజిస్టుగా పనిచేసి ఇటీవలే బిహార్ సీఎం నితీష్‌కుమార్ సమక్షంలో జేడీయూలో చేరారు. సెఫాలజిస్టు ముదిరితే వ్యూహకర్తగా మారుతారు. వ్యూహకర్త ముదిరితే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున స్ట్రాటెజిస్టులు, సెఫాలజిస్టులు పుట్టుకొస్తున్నారు. వీరు నియోజకవర్గాల వారీగా కులాల ఓట్లు, యువ ఓటర్ల ఆలోచనా ధోరణులు, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, విపక్షాల బలాలు- బలహీనతలపై అంచనాలు వేస్తుంటారు. కాక్‌టెయిల్ స్ట్రాటెజిస్టులు, డిన్నర్ స్ట్రాటెజిస్టులు, పర్స్ స్ట్రాటెజిస్టులు ఇలా ఉన్నారు. కులాల ప్రాతిపదికన వీరు చీలిపోయి, భావోద్వేగాలకు లోనై తమ అభిప్రాయాలను టీవీ చర్చలు, మీడియా కథనాల ద్వారా జనంపై రుద్దుతుంటారు. వీరు గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. తమకు నచ్చినవారికి ‘అంతా కలసి వస్తుందనే’ అభిప్రాయం బయటపడనివ్వకుండా, ఆ దిశగా ఎన్నికల చర్చను చాకచక్యంగా నడిపిస్తుంటారు. వీరి కంటే జ్యోతిషం చెప్పేవారు, నిఘా సిబ్బంది చెప్పేవాటిల్లో కొంత వాస్తవం ఉంటుంది. జ్యోతిషం చెప్పేవారు ఈ మధ్య సామాజిక సంబంధాలు, మార్పులను కూడా చదివి, పాండిత్యాన్ని జోడించి గ్రహాల ప్రభావంతో అనుసంధానం చేసి చెబుతున్నారు. తాము ఆరాధ్య దైవాలుగా భావించే నేతలు గెలుస్తారని చర్చల్లో చెప్పించేందుకు చాలా మంది మీడియా నిపుణులు, జర్నలిస్టులు ఆరాటపడుతుంటారు. వీరికి అనుకూలంగా చర్చ జరగకుంటే- వారి ముఖ కవళికల్లో మార్పులు వస్తాయి.
రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలు చూసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే పెద్ద వ్యూహకర్తలు. అయినా వీరి వద్ద అస్థాన విద్వాంసుల మాదిరి కొందరు స్ట్రాటెజిస్టులు ఉంటారు. దేశంలో రాజకీయంగా ఏమి జరుగుతుందో ఒక సెఫాలజిస్టు, ఒక వ్యూహకర్త కంటే చంద్రబాబుకు బాగా తెలుసు. ముందస్తు ఎన్నికల్లో ‘మహాకూటమి’ని ఎదుర్కొనే పరిస్థితి ఉందని కేసీఆర్‌కు తెలుసు.
గ్రామాల్లో చెట్ల కింద పత్రికలు చదవి గంటల తరబడి విశే్లషణలు చేసేవారు ఎక్కువ. ఒకరకంగా వీరు కూడా వ్యూహకర్తలే. వీరు చెప్పేవాటిల్లో కొన్ని నిజాలు ఉం టాయి. కాని శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు. కోట్లు కుమ్మరించి కనె్సల్టెన్సీలను పెట్టుకుని, శాస్ర్తియ అధ్యయనం పేరుతో వారిచ్చే గణాంకాలకే విలువ ఇస్తాం. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వద్ద సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన జోసెఫ్ గోబెల్స్ చెప్పినట్లు ‘వీధుల్లో గెలిచే వారికి సంకల్పం ఉండాలే కాని రాజ్యాన్ని గెలుస్తారు. రాజకీయాధికారం కోసం ప్రతి చోటా పోటీపడాలి. ఓటమి ఎదురైనా జంకరాదు. వీరు నియంత రాజ్యంలో కూడా ఉన్నత స్థానానికి వస్తారు. వీరి మూలాలు వీధుల్లోనే ఉంటాయి. మీరు అబద్ధం చెప్పాలనుకుంటే పెద్ద అబద్ధాన్ని చెప్పాలి. కాని ఒక రోజు ఈ అసత్యాలన్నీ కుప్పకూలుతాయి. నిజమే గెలుస్తుంది’ అని ఆయన చెప్పేవారు. వ్యూహకర్తల అంచనాలు కొంత వరకే. జనానికి రోత పుట్టిందంటే ఎంతటివారినైనా ఇంటికి పంపుతారు.

--కె.విజయ శైలేంద్ర 98499 98097