సబ్ ఫీచర్

మావోయస్టుల మాట.. వంకర టింకర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మేల్యే సివేరి సోమలను హత్యచేసిన మావోయిస్టులు వారం తరువాత ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించడం గమనార్హం. ‘కటాఫ్ ఏరి యా’లో భద్రతా బలగాలు రాలేవని తెలిసి ఆ మారుమూల ప్రాంతంలో మావోయిస్టులు ఆదివాసీలతో సభను నిర్వహించారు. ఒడిశాకు చెందిన గిరిజనులే పెద్దసంఖ్యలో ఆ సభకు హాజరయ్యారని వినికిడి. బలిమెల రిజర్వాయర్‌లో నీటి నిల్వ పెరగడంతో ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఒడిశా ప్రభుత్వాన్ని మావోలు డిమాండ్ చేసి, తమ ఉనికికి చాటుకున్నారు. సాయుధ దాడులు, గెరిల్లా పోరాటం తప్ప, గిరిజన-ఆదివాసీల ఆర్థిక పోరాటాలను అంతగా పట్టించుకోని మావోలు తాజాగా ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం విచిత్రమే! సభ పెట్టి, ఇలా డిమాండ్ చేయడం వారి ఎత్తుగడలా కనిపిస్తోంది. బాక్సైట్ గనుల తవ్వకాలతో నష్టపోయే వారిని ఉద్దేశించి ఇలాగే బహిరంగ సభ పెట్టి ప్రసంగిస్తే గిరిజన ప్రతినిధులైన కిడారి, సివేరి ప్రాణాలు దక్కేవి.
విశాఖ మన్యంలో ఒక పద్ధతిని, సరిహద్దు ప్రాంతంలోని మిగతా మన్యంలో మరో పద్ధతి అవలంబించడంవల్ల మావోల ఊసరవెల్లి విధానం బయటపడింది. ఇద్దరి ప్రాణాలు తీసేంత నష్టం అటు ప్రజలకు, ఇటు మావోలకు జరగలేదు. మరెందుకు వారిని కాల్చి చంపడం? ప్రకృతి సహజమైన నీటి ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం కోరినట్టుగా బాక్సైట్ తవ్వకాల వల్ల ఇబ్బందుల పాలైన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసేందుకు అవకాశం ఉండి కూడా ఆ పద్ధతి గాక బుల్లెట్లకు పని కల్పిస్తే అదెలా న్యాయం?
నమ్మక ద్రోహం..
కిడారి సర్వేశ్వరరావుతో సన్నిహితంగా ఉంటూ ‘బావా.. బావా’ అని తిరిగిన ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారావు మావోలతో కుమ్మక్కైనట్టు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. సుబ్బారావును చంపేస్తామని బెదిరించి లొంగదీసుకుని అవసరమైన సమాచారాన్ని మావోయిస్టులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇలా నమ్మక ద్రోహానికి పాల్పడినందువల్లనే ఇద్దరు ప్రజాప్రతినిధులు పిట్టల్లా రాలిపోయారు. ఇంత దారుణం మరొకటి ఏముంటుంది? ఎంతో భవిష్యత్ ఉన్న కిడారిని పొట్టనపెట్టుకోవడం వల్ల గిరిజనులకే నష్టం జరిగింది తప్ప మరొకరికి కాదు.
తన ప్రాంత ప్రజల అభివృద్ధికి, అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే కిడారి ఎంతో కృషిచేసిన అంశం అందరికీ తెలుసు. అనేక ప్రజోపయోగ పనులు చేయిస్తున్న వ్యక్తిని అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కాల్చి చంపడం వల్ల మావోలకు ఒరిగిన ప్రయోజనమేమిటి? గిరిజనులకు జరిగిన ప్రయోజనమేమిటి? బాక్సైట్ తవ్వకాలు అంతటితో అంతమయిపోతాయా? ఆ గనుల జోలికి ఇక ఎవరూ పోరని భావిస్తే అది పూర్తిగా అమాయకత్వమే!
పాదయాత్ర...
మావోయిస్టుల దుశ్చర్యలకు, ఘాతుకానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లాలోని గాంధీ ఆశ్రమం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ వరకు శాంతి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతి రోజున మావోలు కటాఫ్ ఏరియాలో ఆయుధ పహారాలో, మందు పాతరల సహాయంతో సభ నిర్వహిస్తే- అదే రోజున దేశవ్యాప్తంగా శాంతి సందేశాన్ని ఇస్తూ పలు సభలు-సమావేశాలు జరిగాయి. గాంధీ ప్రబోధించిన శాంతి, అహింసలను మరోసారి గుర్తుచేస్తూ ఎందరో ఉత్తేజపూర్వక ప్రసంగాలు చేశారు. గాంధీ బోధనలు ఇప్పటికీ అనుసరణీయమని వక్తలు గట్టిగా చెప్పారు. ఒకేరోజున అటు మావోల, ఇటు గాంధీ వాదుల మాటలు ప్రజలముందుకు వచ్చాయి.
ఎవరి వాదనలో ఎంత ‘పస’ ఉందో ఇట్టే అర్థమవుతోంది. తుపాకీ గురిపెట్టి హత్యలు చేస్తూ తమ పెత్తనం సాగించే వైఖరికి, అహింసా పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి బాటలో శాంతియుతంగా సహజీవనం చేయాలన్న మాటలకు ఎంత తేడా ఉందో ఎవరికివారే అంచనా వేసుకోవచ్చు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి హైదరాబాద్‌లోని బాపూఘాట్ వరకు ఎందరో ప్రముఖులు జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఒక వ్యక్తి ఓ శక్తిగా మొత్తం దేశాన్ని నడిపించి ఆదర్శంగా నిలిచిన గాంధీ బోధనలు- భజనలు ఇంకా స్ఫూర్తిదాయకమని ఎందరో గుర్తుచేశారు. మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని కొందరు ప్రతిన పూనారు. అపరిశుభ్రతపై ఎందరో యుద్ధం ప్రకటించారు. ‘స్వచ్ఛ్భారత్’ పేర అనేక చోట్ల వివిధ కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ ఎంతో ఆలోచనాత్మకంగా, అందరిని సమైక్యపరిచేలా ఉన్నాయి. మావోలు మాత్రం ‘కటాఫ్ ఏరియా’లో ఎవరూ రానిచోట స్థానిక ఆదివాసీలతో సభ నిర్వహించి ప్రభుత్వాలకు ‘సవాల్’ విసిరామనుకుంటున్నారు. సవాల్ విసిరినా, విసరకపోయినా- వారు దూకుడు స్వభావంతో చీటికి మాటికి హత్యలు చేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదు.
కేంద్ర కమిటీ ప్రకటన...
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఇటీవల ఒక పత్రికా ప్రకటన విడుదలచేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు జరిగిన కుట్రలో- పోలీసులు అరెస్టు చేసిన వరవరరావుసహా మరి కొందరికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అజ్ఞాతంలోని గెరిల్లా దళాలతో వారికి ఎలాంటి సమీప సంబంధం లేదని అలాంటప్పుడు ప్రధాని హత్యకు వారు కుట్ర పన్నారనడం అర్థరహితమన్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వమే మేధావులు, హక్కుల నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. రెండు పేజీల పత్రికా ప్రకటనలో ఆయన ఇంకా అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రధాని హత్యకు కుట్ర జరిగినట్టు బయటపడిన లేఖలను సృష్టించింది పోలీసులేనని ఆయన పేర్కొన్నారు. వరవరరావు, సాయిబాబా, వినాయక్ సేన్ లాంటి విప్లవ మేధావులు బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం జీవితాలను అంకితం చేసిన వారని అభయ్ కితాబునిచ్చారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను మోదీ - అమిత్ షాలు గుర్తుతెచ్చుకోవాలని కూడా ఆయన ఆ ప్రకటనలో అన్నారు. ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అర్బన్ నక్సలైట్లు అన్న మాటను సృష్టించి వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పక్షపాతం...
విచిత్రమేమిటంటే వరవరరావు తదితర మేధావులపై ప్రేమను చూపిన అభయ్, అన్యాయంగా అసువులు బాసిన కిడారి, సివేరి గూర్చిన ఊసుకూడా తీసుకురాలేదు. మావోయిస్టుల పక్షపాతబుద్ధి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయంతో తెలిసిపోతోంది. సమాజమంతా అన్యాయంగా ఇద్దరు ప్రజాప్రతినిధులను పొట్టనపెట్టుకోవడం జరిగిందని నిరసన వ్యక్తంచేస్తుండగా- మావోలు ఆ విషయమై పెదవి విప్పలేదు. ఆ సంఘటన జరిగిన వారం పదిరోజుల అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పత్రికా ప్రకటన చేస్తూ- అర్బన్ నక్సల్స్‌గా పేరొందినవారి అరెస్టులపై స్పందిస్తే ప్రజలన్నా- ప్రజాప్రతినిధులన్నా వారికి గల ప్రేమ, గౌరవం ఎలాంటిదో తెలుస్తోంది. ప్రధానిని హత్య చేయడానికి దండకారణ్య మావోలతోపాటు అర్బన్ మావోలు కుట్ర పన్నిన సంగతి వారి ఉత్తరాలే బయల్పరిచిన సంగతి తెలిసిందే! వారి దగ్గర, వారి ‘హార్డ్‌డిస్క్’లో లభ్యమైన ఉత్తరాలను సైతం నకిలీవని, సృష్టించినవని ఎదురుదాడి చేయడంతో వారి మానసిక స్థితి ఎలాంటిదో ఇట్టే తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక వారోత్సవాల సందర్భంగా ప్రజలకు, వారి ప్రతినిధులకు సానుకూల పనులు, సంక్షేమ పనులు చేయడం మాట విస్మరించి వారి ప్రాణాలు తీసుకుంటే వారి వైఖరి ఎంత దుర్మార్గమో ఇట్టే అర్థమవుతోంది.
ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని దాడులు జరిపినా, ఎన్ని బహిరంగ సభలు నిర్వహించినా, ఎన్ని పత్రికా ప్రకటనలు పంపినా గొర్రె తోక బెత్తెడు మాదిరి మావోల ఉద్యమం ఉంటుంది తప్ప ముందుకు సాగదు. ప్రపంచ పరిస్థితులు ఒక తీరున ఉంటే తద్భిన్నమైన మార్గాన్ని మావోలు ఎంచుకుంటే వారి మార్గమెలా ప్రధాన స్రవంతి అవుతుంది? శ్రమజీవులదే ఈ ప్రపంచం కాదు. సాంకేతిక పరిజ్ఞానందే ఈనాటి ప్రపంచంగా ఎదిగింది. ఈ కీలకమైన మార్పును పసిగట్టక ఎంత పోరాడినా ఏమిటి ప్రయోజనం? పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు వ్యూహం-ఎత్తుగడలు దానికి అనుగుణంగా ఉండాలి కాని మారిన పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం మావోయిజంలో లేనప్పుడు ఆ ఇజం ఎలా విజేతగా నిలుస్తుంది? వారి మాటలన్నీ వంకర టింకరగానే కొనసాగుతాయి.
కొసమెరుపు...
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా-దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఓ మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మరికొందరు మావోలు అడవుల్లోకి పారిపోయారని పోలీసులు ప్రకటించారు. దీనివల్ల ఏమర్థమవుతోంది? చంపడం-చావడం తప్ప నిర్మాణాత్మక పనులేమైనా కనిపిస్తున్నాయా?

-- వుప్పల నరసింహం 99857 81799