సబ్ ఫీచర్

‘నేను సైతం’ అంటూ గళం పెంచిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు ఏ పత్రిక తిరగేసినా.. ఏ సోషల్ మీడియాలో చూసినా ఒకటే చర్చ.. ‘మీ టూ’.. ఈ పోరాటం అన్ని వర్గాల మహిళల్లో స్పందన కలిగిస్తోంది. గొంతును పెగిల్చేలా చేస్తోంది. హృదయంలో ఏ మూలో గత కాలపు చేదు జ్ఞాపకాల దొంతర కళ్లముందు కదిలి మనసు కన్నీరు కారుస్తుంది.. ‘ఆ రోజు నేనెందుకు ధైర్యం చేసి మాట్లాడలేకపోయాను.. అపుడెందుకు ఎదిరించలేకపోయాను..’ అని ప్రతి మహిళా ఆ చేదు జ్ఞాపకాలను తలచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది.. ‘నేను సైతం..’ (మీ టూ) అని చెప్పడం వల్ల నాకు న్యాయం జరగకపోవచ్చు. కానీ ఇలా మరొకరు కాకుండా జాగ్రత్త పడతాం కదా’ అని ప్రతి మహిళా సాటి బాధితుల్లో భరోసాను అందించగలిగేందుకు సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లూ అనుభవించిన మానసిక సంఘర్షణ నుంచి బయటకు వచ్చి ‘మీ టూ’ అంటూ గళం విప్పుతోంది నేటి మహిళ..
మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కడైనా ఎదురుకావచ్చు. దీనికి ఫలనా రంగంతో పనిలేదు. ఏ రంగంలోనైనా మహిళలు ఎదురు పడగానే వికృత చూపులు, ద్వంద్వార్థాల మాటలు, ఏదో వంకతో తాకే ప్రయత్నం చేయడం, బలవంతంగా తాకడం, శృంగారం చేయమని కోరడం.. వంటివి చాలా చూస్తూ ఉంటాం. కానీ మహిళలు వీటిని ఎవరితోనూ పంచుకోరు. ఎవరికీ చెప్పరు. కానీ నేడు ‘మీ టూ’ వంటి కాంపైన్లు జోరుగా కొనసాగడంతో కొంతమంది మహిళలు గొంతును వినిపించాలనుకుంటున్నారు. తమకు ఎదురైన వేధింపుల గురించి బయటకు చెప్పాలనుకుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అసలు ‘మీ టూ’ అంటే.. నేను కూడా..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది.. అని ఓ కవి చెప్పినట్లుగా ఈ ‘మీ టూ’ ఉద్యమం కూడా న్యూయార్క్‌లో మొదలైంది.
తరానా బర్క్‌ది న్యూయార్క్. ఒకప్పుడు ఆమె ‘గాళ్స్ ఫర్ జెండర్ ఈక్విటీ’ అనే సంస్థలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేసేది. అమ్మాయిల క్షేమం కోసం పనిచేసే ఆమెపై రెండు సార్లు అత్యాచారాలు జరిగాయి. ఎంత ధైర్యంగా మహిళల సమానత్వం కోసం పనిచేసినా.. శరీరంపై దాడి జరిగినప్పుడు మహిళ.. మానసికంగా, శారీరకంగా కుంగిపోవడం సహజమే.. ఈ వ్యథ నుండి ఆమె ఎన్ని రోజులకు కోలుకుందో తెలియదు కానీ- 2006లో ఆమె ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. తనకు జరిగిన అన్యాయం గురించి అంతర్జాలంలో పెట్టింది. అలా ప్రారంభమైంది ‘మీ టూ’ ఉద్యమ సెగ.. ఇప్పుడు మన దేశంలోని వ్యక్తులకూ ఆ సెగ తగులుతోంది.
ఈ నేపథ్యంలో అందరికీ ఓ డౌటు వస్తుంది. అసలు ఏవి లైంగిక వేధింపులు? ఏవి కావు? అని. ఒకేచోట పనిచేస్తున్న ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పడటం సహజం. ఈ క్రమంలో వారి మధ్య జరిగే సంభాషణలను పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి శ్రుతి మించుతాయి కూడా.. ఇలా శ్రుతి మించిన ప్రతి మాటా వేధింపుకింద వస్తుంది అని చెప్పలేం. మహిళ అభ్యంతరం చెప్పాక కూడా అవతలి వ్యక్తి అలాగే మాట్లాడుతుంటే అది కచ్చితంగా లైంగిక వేధింపే.. అవసరం లేకపోయినా షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజంపై చేయి వేయడం వంటివి మహిళ అనుమతి లేకుండా చేస్తే అది నేరమే.. వేధించే వ్యక్తి ఆఫీసులో తమకంటే పై స్థాయిలో ఉన్నవాడైతే వారిపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తే తమ ఉద్యోగాలకు ఎసలు వచ్చే అవకాశం ఉందని వారు భయపడుతుంటారు. అవతలి వ్యక్తి తమ ప్రాణాలను తీస్తాడనే భయం వల్ల కూడా మహిళలు వౌనంగా ఉండిపోతున్నారు.
పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో ఓ చట్టం అమల్లోకి వచ్చింది. అందులో ఎలాంటివి లైంగిక వేధింపుల కిందకు వస్తాయో స్పష్టంగా ఉంది. మహిళ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆమెను ముట్టుకోవడం, అసభ్య పదాలను ఉపయోగించడం, ఆమె నుంచి సెక్స్‌ను కోరడం.. వంటివన్నీ లైంగిక వేధింపులుగానే పరిగణించాలని చట్టం చెబుతోంది. పనిచేసే చోటంటే కేవలం ఆఫీసు మాత్రమే కాదు, ఆఫీసు పనికోసం వెళ్లే ఏ చోటైనా అది పని ప్రదేశమే.. ఈ చట్టం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకూ వర్తిస్తుంది. చట్టప్రకారంగా పది మంది కన్నా ఎక్కువ సిబ్బంది పనిచేసే ప్రతి సంస్థా ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని ఏర్పాటు చేయాలి. దీనికి ఒక సీనియర్ మహిళ నాయకత్వం వహించాలి. అందులో సగానికి పైగా మహిళా సభ్యులుండాలి. మహిళల కోసం పనిచేసే ఏదో ఒక ఎన్జీవో ప్రతినిధికి కూడా అందులో సభ్యత్వం ఉండాలి. పదిమందికంటే తక్కువ సిబ్బంది ఉన్న సంస్థల్లో ఎవరైనా మహిళ వేధింపులకు గురైతే జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయాలి. తరువాత ఆ కమిటీలే విచారించి, అది నిజమో, కాదో తేలుస్తాయి. ఒకవేళ అది నిజమైతే అంతర్గతంగా ఫిర్యాదు తీసుకోవాలా? లేక పోలీసులకు ఫిర్యాదు చేయాలా? అనే విషయాన్ని కమిటీలు నిర్ణయిస్తాయి. ఒకవేళ ఫిర్యాదులో పేర్కొనే విషయాలు అబద్ధమైతే, దానిపై చర్య తీసుకునే అధికారం సంస్థకి ఉంటుంది.
ప్రతి మహిళా తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటానికి సిగ్గుపడకూడదు. బాహాటంగా నిజం మాట్లాడటానికి భయమెందుకు? ఇది నా తప్పు కాదు, ఇలా జరుగుతుందనే విషయాన్ని ప్రపంచానికి చెప్పినట్లు అవుతుంది. అన్నిటికన్నా- వేధించే వ్యక్తిని నలుగురి ముందు దోషిగా నిలబెట్టినట్లు అవుతుంది. ‘ఇవి మనదేశంలో సాధారణమే కదా.. దీని గురించి ఇంత పచ్చిగా బయటకు చెప్పుకోవాలా?’ అనే వాళ్ళందరికీ ఇలాంటివి చెంపపెట్టు అవుతాయి. పైగా వచ్చే తరం మహిళలు కూడా తమపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగినా ధైర్యంగా ప్రపంచానికి చెప్పగలుగుతారు. కాబట్టి ప్రతి మహిళా మనసులో పడుతున్న బాధ నుంచి బయటపడి, ధైర్యాన్ని కూడగట్టుకుని ముందడుగు వేద్దాం.. కలిసి ఉద్యమిద్దాం..

సూర్యదేవర. -ఉమా మహేశ్వరి