సబ్ ఫీచర్

‘ఆపద్ధర్మం’ ఎలా ధర్మం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టం, న్యాయం, ధర్మం.. ఈ మూడు పదాలు సమానార్థకాలుగానే కనబడుతున్నా- వీటిలో స్వల్ప తేడాలున్నాయి. చట్టం కంటే న్యాయం, న్యాయం కంటే ధర్మం బరువైన అర్థమున్న పదాలు. చట్టం కంటె న్యాయం, న్యాయం కంటే ధర్మం ఉత్కృష్టమైనవి. వ్యవస్థ మనుగడకు మనం ఏర్పరచుకున్న నియమాలే చట్టాలు. కొన్నిసార్లు చట్టానికి అతీతంగా న్యాయం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని నడిబజార్లో హత్య చేసినా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. చట్టప్రకారం నిందితుడు కేసు నుంచి తప్పించుకున్నా, న్యాయం ప్రకారం శిక్షపడాలి. ఇలాంటి తీర్పులు చాలా అరుదుగా వస్తాయి. చుండూరు, పదిరికుప్పం దాడుల్లో దళితుల ప్రాణాలు పోయింది నిజం. కానీ సాక్ష్యాలు చూపలేదన్న సాకుతో ఎవరికీ నింద పడలేదు. అక్కడ హత్యలు జరిగాయన్నది వాస్తవం. చంపిన వారికి శిక్షపడాలి కదా!
మన దేశంలో రాజకీయ నేతలు రాజనీతి శాస్త్రంలోని నీతిని, శాస్ర్తియతను దూరం చేసి దాన్ని ‘రాజకీయ శాస్త్రం’గా మార్చారు. రాజకీయాలను రచ్చ చేశారు. వీరికి చట్టంపై, రాజ్యాంగంపై గౌరవం లేదు. ఇక న్యాయం, ధర్మం మాటెక్కడిది? అధికారం కోసం చట్టాలకతీతంగా వీరు వ్యవహరిస్తారు. న్యాయవ్యవస్థను తమ జేబుసంస్థగా వాడుకుంటారు. ధర్మాన్ని అపహాస్యం చేస్తారు. ఎన్నికల కమిషన్‌ను సైతం ప్రభావితం చేస్తారు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి ఒక్క నిజం కూడా మాట్లాడకుండా ఓట్లు వేయించుకుంటారు. అందుకోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతారు. అయినా వీరికి శిక్షేం పడదు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చినా, చట్టపరంగా నేరమే అయినా కమిషన్ ఏం చేయలేదు. అప్పుడప్పుడు అధికారంలో ఉన్న వారి ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలపై చర్య తీసుకున్నట్టు చేస్తారు. అధికార పక్షం వారు అంతకంటే ఎన్నో రెట్లు అవినీతిపరులని తెలిసినా ‘బాధ్యత గల అధికారులు’ నోరుమూసుకునే ఉంటారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో చట్టం, న్యాయం, ధర్మానికి తావెక్కడిది?
ఇటీవల తెలంగాణలో జరిగిన రాజకీయ సంఘటన, ఆ తర్వాతి పరిణామాలు ఇందుకు చక్కని ఉదాహరణలు. ఇప్పుడైతేనే తాను గెలుస్తానన్న జాతకాన్ని నమ్మి, ఎవరికీ తెలియకుండా తాను ఎన్నికలకు అన్నీ సన్నద్ధం చేసుకొని, ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా- 9 నెలలకు ముందుగా అసెంబ్లీని రద్దు చేయడం ప్రజాస్వామిక చర్య అవుతుందా? అదీ రహస్యంగా ప్రధానమంత్రితో, ఎన్నికల కమిషన్‌తో మాట్టాడానని ఫలానా రోజునే ఎన్నికలు జరుగుతాయని తానే ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దుచేయడం ఏ దుర్మార్గ రాజ్యనీతికి నిదర్శనం? నీ ఇష్టమైనప్పుడు, నీకు సమయానుకూలంగా ఉన్నదనుకున్నప్పుడు ఎన్నికలు పెడితే మరి ఎన్నికల కమిషన్ ఎందుకు? రాజ్యాంగమెందుకు? చట్టమెందుకు? ఇది చట్టాన్ని గౌరవించినట్టేనా?
లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉండగా తన ఒక్క రాష్ట్రానికే ముందస్తు ఎన్నికలు జరపాలని శాసించడం ప్రజాస్వామ్యమా? దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుంది? అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు వేల కోట్లు, లోక్‌సభ ఎన్నికలకు మరిన్ని వేల కోట్లు ఖర్చుచేయడం ప్రజాస్వామ్యమా? చట్టబద్ధమా? న్యాయ సమ్మతమా? ‘ప్రగతి నివేదన సభ’ పేరిట వందలు, వేల కోట్లు ఖర్చుపెట్టి జనాన్ని తరలించడం, ప్రతి మనిషికీ మద్యం బాటిల్, బిర్యానీ పొట్లం ఇవ్వడం చట్టబద్ధంగానే జరిగిందా? ఆ సొమ్ముకు లెక్కలేవి? ప్రజలను తాగుబోతులను చేసి, వారిని మభ్యపెట్టి సభకు తేవడం ధర్మసమ్మతమేనా? ఎన్నికల కమిషన్‌కు, ఇతర దర్యాప్తు సంస్థలకు, అవినీతి నిరోధక శాఖకు ఇవేమీ తెలియవా? కాబోయే వేల కోట్ల ఎన్నికల ఖర్చును, ఆపద్ధర్మంగా ఉండి ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికించి గెలువాలనుకోవడం చట్టప్రకారం జరుగుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తోందా? ఈ విషయాలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని రద్దుచేయగానే ఆగమేఘాల మీద ఎన్నికలు వెంటనే పెట్టాలని, రద్దయిన రాష్ట్రాలను చాలాకాలం వరకు ఆపద్ధర్మంలో ఉంచవద్దని ఎన్నికల కమిషనరే ప్రకటించి హడావిడి పడటం ఏ సంస్కృతికి నిదర్శనం?
సాధారణ పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు, ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేనప్పుడు, పరిపాలన సాగించలేనపుడు, తీవ్రవాద ముప్పు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని రద్దుచేసి వెంటనే ఎన్నికలు జరపాలి. అదీ 6 నెలల లోపు. మరిప్పుడు తెలంగాణలో ‘పరిపాలన సాగించలేని’ ఏ అసాధారణ పరిస్థితులున్నాయి? ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేసినట్టు? ఇవేవీ పరిశీలించకుండా ఎన్నికల కమిషన్ సైతం ‘తానా అంటే తందాన’ అనడం సరైనదేనా? ఒక్కసారి మాజీ ఎన్నికల ప్రధానాధికారి శేషన్ ధైర్యసాహసాలను జ్ఞాపకం చేసుకోండి. తాను పాలించలేక, పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను భరించలేక ఓటమి భయంతో ప్రభుత్వాన్ని రద్దుచేస్తే అందుకు ఎవరు బాధ్యులు? అలాంటప్పుడు రాష్టప్రతి పాలన విధించకుండా రద్దుచేసిన నాయకునికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవినిచ్చి ఆయన మాట ప్రకారమే వెంటనే ఎన్నికలు జరపాలని నిర్ణయించడం చట్టం ప్రకారం సరైందేమో కానీ- న్యాయ సమ్మతం, ధర్మ సమ్మతం కానే కాదు. చట్టప్రకారం కూడా ఆరునెలల వరకు ఆగవచ్చు. డిసెంబర్‌కు బదులుగా మరో నెల ఆగితే ఎలాగూ లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు ఆగవచ్చు. సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఎన్నికలు జరిపితే ఖర్చూ తగ్గుతుంది. ఏ కారణం లేకుండా రద్దు చేశాడు గనుక తొందరపడాల్సిన అవసరం లేదు.
సాధారణ ఎన్నికలకు ఆరునెలల పైనే సమయం ఉంది కదా అనవచ్చు. అలాంటప్పుడు రాష్టప్రతి పాలన విధించాలి. కాని ఒకరి ప్రయోజనం కోసం మొత్తం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. తన స్వార్థం కోసం రాష్ట్రంపై ఇలా ఎన్నికల భారం మోపడం తగదు. తన పదవికి తాను రాజీనామా చేసే హక్కు, తన పార్టీ వాళ్ల చేత రాజీనామాలు చేయించే హక్కు కేసీఆర్‌కు ఉంది. కానీ ఉత్తపుణ్యానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే హక్కు ఎవరికీ లేదు. అలా రద్దవడానికి అత్యవసర, పాలన చేయలేని పరిస్థితులేమీ లేవు. ఇది చట్టరీత్యాను నేరమవుతుందో కాదో కానీ- న్యాయం రీత్యా, ధర్మం రీత్యా నేరమే. లక్షలాది మంది తమకు ఓట్లేయరు అనుకున్నవాళ్ళ పేర్లను తొలగించి, ఓటర్ల లిస్టును సరిచేయకుండానే ఎన్నికలు పెట్టడం న్యాయమూ కాదు, ధర్మమూ కాదు. ఈ తప్పులన్నీ సరిదిద్దడానికి సమయం తీసుకోవాల్సిందే. సాధారణ ఎన్నికల వరకు వేచి ఉండటమే దీనికి సరైన పరిష్కారం. ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచి ఏ విధానపర నిర్ణయాలూ, తాయిలాలూ ప్రకటించకూడదు. ఈరోజు అన్నీ ప్రకటించి రేపు ప్రభుత్వాన్ని రద్దుచేయడం చట్టరీత్యా సరైందేనా? ఎన్నికల కోసం కనీసం ఆరునెలలు ఆగాలి కదా! స్పీకర్‌తో శాసనసభ్యులను సస్పెండ్ చేయించి, కోర్టు తీర్పు ఇచ్చినా చర్యలు తీసుకోకుండా ఉండటం కోర్టు ధిక్కారం కాదా? ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు హడావుడి చేయడం చట్టసమ్మతమేనా?
ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించడం చట్టరీత్యా సరైందేనా? ప్రభుత్వాన్ని రద్దుచేసిన వారికే ఆపద్ధర్మ పదవి ఇవ్వడం ప్రతిపక్షాలపై పగ తీర్చుకోవడానికా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఎన్నికలకు ఆరునెలల ముందు ఏ సంక్షేమ పథకాలు ప్రకటించినా, విధానపర నిర్ణయాలు తీసుకున్నా, రాజకీయ కక్ష తీసుకునే చర్యలు చేసినా అది ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం కాదా? చట్టరీత్యా కాకపోవచ్చునేమో కాని న్యాయ, ధర్మరీత్యా అది నేరమే. ‘కోడ్’ను ఉల్లంఘించడానికి కూడా ప్రభుత్వం వెనుకాడటం లేదు.
ఏదిఏమైనా ఏ కారణం లేకుండా ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రంపై ఎన్నికల భారాన్ని మోపడం, లోపాలను సవరించకుండా హడావుడిగా, ఎన్నికలకు తయారుకావడం, రద్దుచేసిన వారికే ఆపద్ధర్మం ఇచ్చి ప్రతిపక్షాలపై పగ తీర్చుకునేట్టు చేయడం చట్టరీత్యా, న్యాయ రీత్యా, ధర్మరీత్యా నేరమే. దొంగకు తాళపుచెవి ఇవ్వడం లాంటిదే. అందువల్ల రాష్టప్రతి పాలన విధించి, లోక్‌సభ ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుపడం చట్టసమ్మతం, న్యాయ సమ్మతం, ధర్మసమ్మతం కూడా.. స్వతంత్ర వ్యవస్థగా చెప్పుకోబడే ఎన్నికల కమిషన్ ఏ రాజకీయ ఒత్తిళ్ళకూ లొంగకుండా సాధారణ ఎన్నికలు జరిపే ముందు- ఓటర్లలిస్టు సవరణ, కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశముంటే అదీ పూర్తయ్యాక వచ్చే మే నెలలో సాధారణ ఎన్నికల సమయంలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిపి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సి ఉంది.

-డా. కాలువ మల్లయ్య 98493 77578