సంపాదకీయం

మనం.. విశ్వనరులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో గోద్రా అల్లర్లతో వివాదాల్లోకెక్కిన గుజరాత్ ఇప్పుడు ప్రాంతీయవాదంతో అట్టుడుకుతోంది. ఒకప్పుడు మతం పేరిట జరిగిన మారణహోమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు ప్రాంతీయ వాదం, భాషాదురభిమానం వెర్రితలలు వేస్తున్నాయి. మతం, ప్రాంతం, కులం అనే మూడు అంశాలు ప్రజలను విడదీస్తున్నాయి. తాజా సంఘటన విషయానికొస్తే గుజరాత్‌లో ఒక పసిబాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆ యువకుడి స్వరాష్ట్రం బిహార్. దీంతో ఆగ్రహించిన ఠాకూర్ల సేన కార్యకర్తలు ‘ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అంటూ దాడులు మొదలుపెట్టారు. బిహారీ, ఉత్తరప్రదేశ్ వారే అధికంగా గుజరాత్‌కు జీవనోపాధికి వస్తున్నారు. వీరంతా పొట్ట చేతబట్టుకొని వచ్చిన వలస కూలీలు. ఒక వ్యక్తిచేసిన తప్పిదానికి అతని రాష్ట్రానికి చెందిన ప్రజలను బాధ్యులుగా చేయడం సబబు కాదు. ఇందుకు మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకున్నారని, కొందరు తెలంగాణ ఉద్యమ నాయకులు ‘ఆంధ్రోళ్లు’ అంటూ ఒక ప్రాంతం ప్రజలపై గురిపెట్టడం విద్వేషం పెంచే ఓట్ల రాజకీయమే. పాలనా వైఫల్యాలకు ఒక ప్రాంత ప్రజలను తిడుతూ, వారిని ‘టార్గెట్’ చేయడం, భయపెట్టడం ప్రమాదకరమైన ప్రాంతీయ వాదమే. ప్రాంతీయ వాదం అనేది- వనరుల కోసం, హక్కుల కోసం అయితే ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ ప్రాంతీయ కోణంలో మరొక ప్రాంత ప్రజల మీద విద్వేషం రగిలించడం పూర్తిగా అనైతికం. బిహారీ యువకుడు చేసిన ఘాతుకానికి అతనిని శిక్షించకుండా, ఆ రాష్ట్రం నుండి వలస వచ్చిన వారినందరినీ బాధ్యుల్ని చేయడం భయంకర ప్రాంతీయవాదం. ‘మహారాష్ట్ర మరాఠాలదే’ అనే శివసేనకు, ‘కర్నాటక కన్నడిగులదే’ అంటూ బ్యాంకు నియామకాల పరీక్షలకు వెళ్లిన ఆంధ్రులపై దాడి చేసిన సంఘాలకు అరాచక శక్తులకు ఎలాంటి తేడా లేదు.
ఉత్తరాది వారిని, దక్షిణాది వారిని వేరుచేసి చూపే ఉత్తరాది ఆధిపత్యం కూడా ఎవరూ సహించలేనిది. ‘చక్ దే ఇండియా’ హిందీ సినిమాలో కథాపరంగా ఆంధ్రా నుండి సెలెక్ట్ అయిన ఒక క్రీడాకారిణి తన పేరును నమోదు చేసుకోవడానికి ఉత్తరాదిలో జరిగే కోచింగ్ క్యాంప్‌కి వెళితే తన పేరు ఏదో ‘రెడ్డి’ అని చెప్పగానే అక్కడున్న వ్యక్తి ‘మదరాసీ..’ అంటాడు. ఆమె ‘ఆంధ్రా’ అంటుంది. తేడా ఏముంది? అని అడిగితే ఆమె వివరంగా సమాధానిస్తుంది. ఇది నిజంగా చక్కని సమాధానం.
బిహార్ ఇప్పటికీ వెనుకబడిన రాష్టమ్రే. అక్కడ దొంగల బెడద ఎక్కువ అని, బందిపోట్ల బెడద ఎక్కువని వింటూ ఉంటాం. కానీ ఆ పరిస్థితుల్లో ఇంతవరకు మార్పులేకపోవడం ఇది పాలకుల వైఫల్యం. ఒక యువకుడు చేసిన తప్పుకు అతని రాష్ట్రం వారిని వెదికి మరీ హింసిస్తున్నారంటే- ఇది ఆటవిక యుగం అన్పిస్తుంది. కావేరీ జలాల వివాదంలో తమిళనాడులోని కోయంబేడు బస్టాండ్‌లో కర్నాటక బస్సులను తగలబెట్టిన సంఘటన గుర్తొస్తుంది. గుజరాత్‌లో ఇప్పుడు యూపీ కూలీలను కూడా తరిమివేస్తున్నారు. జరిగిన సంఘటనతో వారికేమిటి సంబంధం? ఇక్కడంతా ఒక వర్గం ఆధిపత్యం నడుస్తోంది. ఒక రాష్ట్రం నుండి మరొకరిని వెళ్లిపోవాలని చెప్పడం ఆధిపత్యం ప్రదర్శించడమే. గుజరాత్‌లో ఠాకూర్ సేనలది పూర్తిగా కులాధిపత్యం.
రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా- సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఉత్తరాది, దక్షిణాది అనే ప్రాంతీయ వాదాలు విజృంభిస్తున్నాయి. ప్రాంతీయ వాదంతో కొన్ని పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. అధికారం కోసం ఈ పార్టీల నేతలు ప్రాంతీయ విద్వేషాలను రగిలించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ వాదాన్ని ఎగదోసి కొన్ని పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. ప్రాంతం పేరిట ఇలా విద్వేషాలను కొందరు రగిలిస్తుండగా, మరికొందరు నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఉప కులాలు, మతాల పేరిట ప్రజలను విడదీస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే తరిగిపోతున్న ఐక్యతా భావనలు, తెగిపోతున్న ప్రాంతీయ సంబంధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో సామాజిక భారతం, సమతా భారతం సాధ్యమా? అనిపిస్తుంది. అందరూ సమానులమే అనే భావజాలం నుండి ఐక్యత, జాతీయ వాదం పుట్టుకొస్తాయి. కానీ- ‘ఐక్యత’ పేరుతో నేడు ప్రజల విభజన ప్రాంతం, మతం, కులం అనే ప్రాతిపదికన జరుగుతోంది. సంస్థానాల విలీనంతో వివిధ ప్రాంతాల ప్రజల కలయిక నిజంగా జరిగిందా? రాష్ట్రాలుగా విడిపోయాక జనమంతా కలసి మెలసి ఉంటున్నారా? అంటే నిజంగా కాదనే సమాధానం వస్తుంది. బాధితులను, నిందితులను కూడా ప్రాంతం, కులం, మతం కోణంలో చూస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టడం సంస్కారమా?
ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలంతా మనుషులుగా కలసి మెలసి ఉండాలి. దురదృష్టవశాత్తూ నేడు ప్రజలు మానవులుగా విడిపోయి, ప్రాంతాలుగా కలిసి ఉన్నారు. ప్రతి మానవుడు ప్రపంచ పౌరుడు. ఇది తెలుసుకొని ఐక్యతతో మసలుకొంటూ, హక్కుల కోసం అందరూ సమష్టిగా పోరాడాలి. ఎవరు ఏ దేశం వెళ్లినా- మానవుడిగా మాత్రమే గుర్తింపుపొందడం విశ్వ నరత్వం. అందుకే ప్రఖ్యాత కవి జాషువా.. ‘నిఖిలలోక మెట్లనిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను’- అన్న మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మనమంతా విశ్వమానవులం అని అందరూ గ్రహించాలి. ప్రజలకు కావల్సింది నేతల భారీ విగ్రహాలు కాదు.. కులం, మతం, ప్రాంతం, వర్ణం, లింగ భేదం లేని విశ్వనరత్వం ఇపుడు అవసరం. ప్రాంతీయ అడ్డుగోడలు సరిహద్దుల మధ్యనే కానీ ప్రజల మధ్య కాదు. మనం మానవులం, విశ్వనరులం.

--పచ్చల రాజేష్ 83318 23086