సబ్ ఫీచర్

యంత్ర యుగంలో మావోల పాత్ర శూన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ఇప్పుడు యంత్రయుగం వైపు పరుగులు పెడుతోంది. అన్ని రంగాలలో జరుగుతున్న ఆవిష్కరణలు,పరిశోధనలు యంత్రయుగం వైపే కొనసాగుతున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విస్తృతి కారణంగా సమాజంలో నాలుగో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. డిజిటల్ విప్లవం ఈ దశలో కీలకపాత్ర పోషిస్తోంది. మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ-కామర్స్‌తో ‘దృశ్యం’ పూర్తిగా మారిపోతోంది. నైపుణ్యాల ఆధారంగా ఉపాధి లభ్యమయ్యే రోజులొచ్చేశాయి. కేవలం ‘శారీరక శ్రమ’ ఆధారంగా ఉపాధి లభించే విధానం క్రమంగా మృగ్యమవుతోంది. కాలానుగుణంగా నైపుణ్యాలను అందిపుచ్చుకున్నప్పుడే ఆయా రంగాల్లో రాణించే అవకాశం వుంది.
వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలలోకి పరచుకుంటోంది. దాంతో డిజిటల్ అక్షరాస్యత అనివార్యమవుతోంది. ఇదంతా కృత్రిమ మేధ చుట్టూ అల్లుకుని కనిపిస్తోంది. ఆ కృత్రిమ మేధను పసిగట్టకుండా- ఏమి ఊహించినా అవి తలకిందులు అవుతాయి, మానవ మనుగడ మృగ్యమవుతుంది. ఈ కృత్రిమ మేధనే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు కారణం కానున్నది. మొత్తం జీవన విధానమే తారుమారు కాబోతున్నది. ఇప్పటికే ఆ ఆనవాలు స్పష్టంగా కనిపిస్తోంది. అది మరింత చిక్కబడుతున్నది. అమెరికా,బ్రిటన్, చైనా దేశాలు దూసుకుపోతుంటే మిగతా ఆర్థిక వ్యవస్థలు తదనుగుణంగా తమ విధానాలను మార్చుకునే పరిస్థితి నేడు కనిపిస్తోంది. దీన్ని పసిగట్టి ప్రతిస్పందించిన వారే భవిష్యత్‌ను ఆశాజనకంగా చూడగలరు.

ఎన్‌కౌంటర్ మరణాలు..
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. గాయపడిన కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. బీజాపూర్ జిల్లా మిర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని మడ్‌పల్లి అటవీ ప్రాంతంలో సమావేశమైన మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో కొన్ని ఆయుధాలు, కొంత మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం లభ్యమైనట్టు పోలీసులు ప్రకటించారు. ఈ నెలలో జరిగే ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలను భగ్నం చేసేందుకు మావోయిస్టులు పథకం పన్నారని, అందులో భాగంగా సమావేశమయ్యారని, ఆ పథకాన్ని ముందుగానే పసిగట్టి భగ్నం చేశామని పోలీసులు అంటున్నారు. ఈమేరకు వారివద్ద మావోయిస్టుల ‘ఎన్నికల బహిష్కరణ’ పిలుపునకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.
వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవానికి, మార్కెట్ రహిత విధానమంటూ మావోయిస్టులు జరుపుతున్న హింసాకాండకు, విధ్వంసకాండకు, ఎన్నికల బహిష్కరణ కార్యక్రమానికి ఎక్కడైనా పొంతన కుదురుతున్నదా? ప్రపంచం ఓవైపు వేగంగా పరుగులు తీస్తుంటే మావోయిస్టులు అందుకు భిన్నమైన వ్యవస్థను ఊహించుకొని, దానికి ఊపిరిపోయాలని భావించి వేలాది మంది ప్రజల ఊపిరి తీసేయడం వింత గాకపోతే ఏమవుతుంది? మావోయిస్టులు ఆశిస్తున్న వ్యవస్థ ఎక్కడా మనుగడలో లేదు. ఒక్కప్పుడు సోవియట్ యూనియన్, చైనా దేశాలు ఆ వ్యవస్థలో కొనసాగి, ఆ భారాన్ని మోయలేక పీకల్లోతు కష్టల్లో మునిగి అందులోంచి బయటపడేందుకు ప్రస్తుతం ప్రపంచం అనుసురిస్తున్న విధానాలనే ఆలింగనం చేసుకుని అడుగుముందుకేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. చైనా ఇప్పుడు చివరకు ‘కృత్రిమ చందమామ’లను రూపొందిస్తోంది. నీటిపై అతిపొడవైన వంతెనను నిర్మించి ప్రపంచ రికార్డును చైనా సృష్టించింది. హాంకాంగ్, మకాల్ లాంటి ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. దీన్ని వీక్షించేందుకు నిరాకరిస్తే ఎలా?
అమెరికా చదువులు...
ఇదిలా ఉంటే అమెరికాలో చదివేందుకు భారతీయ విద్యార్థులు ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి వెళుతున్నారు. వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉద్యోగావకాశాల్లో ఆ దేశం ఎన్ని కొర్రీలు పెడుతున్నా ఆ దేశపు విద్యకోసం భారతీయ విద్యార్థులు పోటీపడుతున్నారు. తాజాగా 2.27 లక్షల మంది విద్యార్థులు అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో విద్యను ఆర్జిస్తున్నారు. 2014 సంవత్సరంలో 1.34 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్ళగా, 2018 సంవత్సరంలో ఆ సంఖ్య 2.27 లక్షలకు చేరడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుడుకు వ్యవహారం, అడపాదడపా జాత్యహంకార దాడులు కొనసాగడం ఇలా రకరకాల ప్రతికూల అంశాలు వెలుగు చూస్తున్నప్పటికీ, అక్కడికి వెళ్లే మన విద్యార్థుల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతూ ఉంది. ఈ ఒక్క ట్రెండ్‌ను బట్టి భారతీయ యువతరం ఆకాంక్షలు ఎలా ఉన్నాయో ఊహించవచ్చు. నాల్గవ పారిశ్రామిక విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న అమెరికాలో విద్యాభ్యాసం వల్ల అందరికన్నా ముందు నిలుచునే అవకాశముంటుందనే అభిలాష ఆ విద్యార్థుల్లో ఉండటం వల్లనే ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికా డాలర్ కన్నా మన రూపాయి విలువ దారుణాతిదారుణంగా పడిపోతున్నా తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడికి పంపుతున్నారంటే ప్రజల నాడి ఎలాఉందో ఊహించవచ్చు. అమెరికాలో ఆవిష్కృతమైన అనేక ఐటి ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాలో కొత్త మార్గాలు.. ఇవన్నీ ప్రపంచాన్ని పదేపదే మార్చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచాన్ని ఎన్నోసార్లు మార్చేసింది. గూగుల్ సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈ ప్రపంచాన్ని మార్కెట్ రహిత ప్రపంచంగా మారుస్తామనడంలో విజ్ఞత ఉందా?
పేదలే శ్రీమంతులు...
ఇటీవల వెలుగు చూసిన గణాంకాల ప్రకారం.. మన దేశంలో 81వేల మంది ఏటా కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు. గత మూడేళ్లలో వీరి సంఖ్య మరీ పెరిగింది. వీరు తమ ఆదాయం రూ. కోటికి మించిందని పన్నులు చెల్లిస్తున్నారు. వీరందరూ ఆగర్భశ్రీమంతులు కాదు... మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కొండకచో పేదవర్గాల నుంచి వచ్చినవారూ ఉన్నారు. అంటే- అవకాశాలను ఎవరు అందిపుచ్చుకుంటే వారు శ్రీమంతులవుతున్నారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యం, జ్ఞానం, కీలకమన్న మాట. ఈ జ్ఞానం, నైపుణ్యం దోపిడీలు చేస్తే వచ్చేది కాదు, దొంగిలిస్తే లభించేది కాదు, కొల్లగొడితే సొంతమయ్యేది కాదు. ఈ కీలకమైన అంశాన్ని విస్మరించడం కారణంగానే మార్క్స్ అభిమానులు, మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నారు. తమ వాదనలోని డొల్లదనాన్ని ఇంకా పసిగట్టలేకపోతున్నారు. దోపిడీకి గురవుతున్నారని చెప్పే వర్గాలవారు శ్రీమంతులవుతున్నప్పుడు- మావోయిస్టులు చెప్పే సిద్ధాంతానికి మాన్యత ఎక్కడిది? జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల కోసం తపించేతత్వం ఎవరివద్ద ఉన్నా వారు మొత్తం మానవాళికి ఉపయోగపడుతూ తామూ శ్రీమంతులవుతున్నారు. చిరకాలంగా ఈ ‘సూత్రం’ ఆధారంగానే సమాజం కొనసాగుతోంది. దీన్ని పసిగట్టడంలో విఫలమై సమాజాన్ని తలకిందులు చేస్తామని, దోపిడీని నివారిస్తామని, శ్రమజీవికి పెద్దపీట వేస్తామని మావో శిష్యులు గొప్పలు పోవడంలో ఏ మాత్రం అర్థం కనిపించడం లేదు. శ్రమకన్నా నేడు కృత్రిమ మేధకు ప్రాధాన్యత పెరిగిన తరుణంలోనూ- కాలం చెల్లిన నినాదం ఇస్తే నష్టపోయేది ఆ శ్రమ జీవియే అన్న ఇంగితం తెలియకపోవడం విడ్డూరం.
‘జియో’ విప్లవం...
కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో జియో-4జీ సర్వీసులు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో గతంలో ఎన్నడూ చూడలేని గొప్ప విప్లవాన్ని జియో తీసుకొచ్చింది. 4జీ ద్వారా వినియోగించుకునే డేటానే ఇప్పుడు ఇంధనంగా, ధనంగా భావించేవారున్నారు. దాంతో సమాచార విప్లవం ఎంత ఎత్తుకుచేరుకుందో దీన్నిబట్టి అర్థమవుతోంది. 4జీ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరంగా మారింది. అంతగా ప్రజల్లోకి ఇది చొచ్చుకుపోయింది. అది వారి అవసరాలను ఎలా తీరుస్తున్నదో- కాస్త శ్రద్ధపెట్టి ఆలోచించినా.. ఇంతకన్నా గొప్ప విప్లవం మరొకటి కనిపించదు. డేటా సర్వీసుల ద్వారా డేటా విప్లవాన్ని అతితక్కువ కాలంలో తీసుకొచ్చి ప్రపంచస్థాయి సేవలను గ్రామీణులు అందుకోవడం, శ్రామికుల పిడికిట్లో ‘స్మార్ట్ఫోన్’ అనే సాధనం ఇమిడిపోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోకి చొచ్చుకుపోయి వారి జీవితాలను పరివర్తనకు గురిచేయడానికి మించిన ‘విప్లవం’ మరొకటి ఏముంటుంది? ప్రపంచం ఎటువైపు పయనిస్తున్నదో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దారి చూపుతోంది. దీన్నికాదని మందుపాతరలు, మర తుపాకులు, ఆధునిక ఎ.కె.47 ఆయుధాలతో ప్రజల జీవితాల్లో విప్లవం (మార్పు) తీసుకొస్తామనడం వెర్రితనం గాక ఏమవుతుంది? ఆ విప్లవం వల్ల రక్తం ఏరులైపారడం, అశేష ప్రజల జీవితాలు ధ్వంసం కావడం, భారీగా ఆస్తిపాస్తులు నేలమట్టం కావడం అవసరమా? అది పూర్తిగా అనాగరికం, అమానవీయం. అయినా ఆ ‘మార్పు’ చోటుచేసుకునే వీలు వీసమంతైనా ఎక్కడాకనిపించదు. మావోయిస్టులు ఈ సాయుధ దాడుల కోసం దండకారణ్యంలో ‘దండు’ నిర్మించడం భావ్యమా? వారికి భవిష్యత్ శూన్యమని స్పష్టంగా కనిపిస్తోంది.

-వుప్పల నరసింహం 99857 81799