సబ్ ఫీచర్

కమ్యూనిస్టులకు ఓట్లెందుకు రావంటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ఎన్నికల హోరు పెరిగింది. అధికార పక్షం, విపక్ష కూటమి ప్రధానంగా పోటీపడుతున్నాయి. విపక్ష కూటమిలో సిపిఐ ఉండటం గమనార్హం. ఇక సిపిఎం- ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్)’ పేరుతో బరిలోకి దిగుతోంది. న్యూడెమొక్రసీ లాంటి నక్సల్ పార్టీ గుమ్మడి నర్సయ్యను నమ్ముకుంది. ఒకప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా కనిపించేది. క్రమంగా వారి ప్రాభవం నేలమట్టమైంది. ప్రాంతీయ పార్టీలకు ‘తోక’గా మారేందుకు పరిమితమయ్యాయి. ఉభయ కమ్యూనిస్టుపార్టీలు కొంతకాలం తెలుగుదేశం వెలుగుల కోసం పరితపించాయి. ఆ రకంగా తమ ఉనికిని కొంత చాటుకున్నాయి. అనంతరం తమ ‘గ్రాఫ్’ పడిపోవడాన్ని పరిశీలించకపోవడం విషాదం. వీరు తమ ప్రాధాన్యత ఎందుకు తగ్గుతోంది? అన్న ప్రశ్నవేసుకుని లోతుగా అధ్యయనం చేసి సమాధానం చెప్పుకున్న పాపాన పోవడం లేదు. గాలికి కొట్టుకుపోయిన చందంగా అలా కొట్టుకుపోతున్నారు తప్ప సిద్ధాంత బలం- ఆచరణ మృగ్యమైంది. ఈ విషయ సారాంశాన్ని పట్టుకోనంత కాలం ఇలాగే వారి ‘గ్రాఫ్’ అడుగంటుతుంది.
కార్మిక- కర్షకుల కోసం ప్రత్యేకంగా పనిచేసి వారికి ‘సోషలిజం’ద్వారా స్వర్గాన్ని దివినుంచి భువికి దింపుతామని వాగ్దానాలతో పొద్దుపుచ్చినంత కాలం ప్రజలు వామపక్షాలను విశ్వసించారు. అది బూటకం అని తేలిపోయాక వారు చతికిలపడ్డారు. రష్యాలో వర్షం కురిస్తే సిపిఐ వారు తెలుగు నేలపై గొడుగులు పట్టుకుని తిరుగుతారని, బీజింగ్ (చైనా)లో మంచు కురిస్తే కొలకత్తాలో కోట్లు ధరించి సిపిఎం వారు తిరుగుతారని ఒక మాట చాలాకాలం వినిపించింది. విదేశాల్లోని కమ్యూనిస్టు పాలన-పార్టీలపై మన వారికి అంత ‘గురి’అన్నమాట. పాతికేళ్ల క్రితం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై పలు దేశాలుగా విడిపోయిన అనంతరం అక్కడి వ్యవస్థ సంపూర్ణంగా మారిపోయింది. దాంతో ఆ వ్యవస్థను- ఆ దేశాన్ని నమ్ముకున్న తెలుగు ప్రాంతాల కామ్రేడ్లు, ఆమాటకొస్తే మొత్తం భారతదేశ కమ్యూనిస్టులు కళ్లుతేలేశారు. చైనాలో మావో అనంతరం డెంగ్ జియావోపింగ్ అధికారంలోకి వచ్చాక అక్కడ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి, పెట్టుబడిదారీ విధానాన్ని ఆహ్వానించడంతో ఇక్కడి సిపిఎంతోపాటు వామపక్ష తీవ్రవాద గ్రూపుల గొంతుల్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అంటే సిపిఐ, సిపిఎం కలలు కల్లలయ్యాయి. అసలు మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతం కుప్పకూలడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపించింది.
సమాజంలోని మార్పులను పసిగట్టడంలో, ‘జ్ఞానం’పై సరైన అంచనా లేకపోవడంతో, రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కోసం ప్రపంచం ఎంతగా పరితపిస్తున్నదో పసిగట్టడంలో కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు విఫలమయ్యారు. దాంతో ప్రజల్ని ప్రభావితంచేసే అనేక ఆవిష్కరణలు వెలుగుచూశాక, అవి ప్రజల్లో మమేకం కావడంతో దశాబ్దాలుగా మూస పద్ధతిలో దోపిడీ, దౌర్జన్యం, పెట్టుబడిదారీ విధానం అంటూ వాదించడంలో ‘పస’లేదని తేలిపోయింది. రెండువర్గాలున్న కమ్యూనిస్టుల మాటకు మాన్యత లేకుండాపోతోంది. ఆ సన్నని రేఖ క్రమంగా కరిగిపోతోంది. ప్రపంచీకరణ అనంతరం జ్ఞానం, తెలివితేటలు ఎవరివద్ద ఉంటే వారు శ్రీమంతులు కావడం ప్రారంభమైంది. సామాన్యులు కోటీశ్వరులు కావడం కళ్ళముందు కనిపించసాగింది. మరి ఇదంతా దోపిడీ ద్వారా పెట్టుబడిదారుల్లా, దౌర్జన్యంగా సంపాదిస్తున్నారా? అంటే లేదు. అవకాశాలను అందిపుచ్చుకుని చొరవతో దూసుకుపోయి దారిద్య్రంలో మగ్గినవారు సైతం కుబేరులైన ఉదాహరణలు కోకొల్లలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. నాణ్యమైన విద్యను అభ్యసించి మెరుగైన ఆర్థిక స్థితిని చేరుకునే ‘మార్గం’ కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తుండటంతో కమ్యూనిస్టులు చెప్పే ‘దోపిడీ సిద్ధాంతం’లో ఏమాత్రం ‘బలం’లేదని అవగతమైంది. ఇంకా అనేక మందికి అవగతమవుతోంది.
ఒకప్పుడు ఈ రకమైన వాతావరణం, విశాల ప్రపంచం, మేలైన జీవన విధానం కళ్ళముందు లేకపోవడంతో కమ్యూనిస్టులు చెప్పిందే సత్యమని భ్రమసి ప్రజలు వారిచుట్టూ పోగయ్యారు. కాలం మారుతున్నకొద్ది వారు చెబుతున్నది వాస్తవం కాదు, పేదలు సైతం కష్టపడి నైపుణ్యాలు అందిపుచ్చుకుని, కొంత ముందుచూపుతో కదిలితే ‘కలిమి’ని ఒడిసిపట్టుకోవచ్చని అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది.
కమ్యూనిస్టులు తమ పరిభాషిక పదాల మాటున గల మార్మికత మంచులా క్రమంగా కరిగిపోతుండటంతో అసలు సత్యం నగ్నంగా బయటపడసాగింది. ‘రాజుగారి దేవతావస్త్రాల’ మాదిరిగా కమ్యూనిస్టు సిద్ధాంతం బట్టబయలు కావడంతో ఆ సిద్ధాంతం పట్ల ఆకర్షణ తగ్గసాగింది. ఆ సిద్ధాంతాన్ని మూసధోరణిలో దశాబ్దాలపాటు మూర్ఖంగా ప్రవచించిన నేతల వ్యక్తిత్వాలపై ప్రశ్నార్థకాలు మొలవసాగాయి.
‘మేడే’ ఉత్సవం గాని, కార్మికుల హక్కుల సాధనకు చేసే సమ్మెలు- హర్తాళ్లు- బంద్‌లు ఇతర ట్రేడ్ యూనియన్లు సైతం సమర్ధవంతంగా, శక్తిమంతంగా నిర్వహించడంతో కమ్యూనిస్టుల ప్రాభవం కార్మిక రంగంలోనూ క్రమంగా మసకబారింది. వాస్తవానికి ఆ సిద్ధాంతంలోనే అవాస్తవికత- అవలక్షణాలు దండిగా ఉండటంతో, అవి ఆచరణలో వెలుగు చూడ్డం ఆరంభమయ్యాక పూర్వవైభవం ఎలా కొనసాగుతుంది?
మనిషికి, అతని మనుగడ ముఖ్యం. అందుకవసరమైన ఆవిష్కరణలు అత్యవసరం. వేల ఏళ్ల నుంచి మానవ జీవితం ఎప్పుడూ మెరుగుదల వైపు కదులుతోంది. దోపిడీ పేర, అసమానతల పేర సమాజాన్ని తలకిందులు చేయాలన్న ‘‘కమ్యూనిస్టుల పిలుపు’’ అంత సత్యమైనది కాదు. ఆ పిలుపును అనుసరించి అనేక త్యాగాలు- బలిదానాల అనంతరం రూపొందిన రష్యా-చైనా, తూర్పు యూరప్ దేశాల్లో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అంత పెద్దఎత్తున చేసిన ‘ప్రయోగం’నిష్ఫలమైంది. కారణం ఏమిటి?... మానవ ఆకాంక్షలకు కళ్ళెం వేసి, ఇనుప తెరల మాటున జీవించమని చెప్పడం. అది ప్రజలు జీర్ణించుకోలేదు. ఎప్పడూ అది ఆమోదయోగ్యం కాదు. దాంతో వారి ‘స్వప్నం’కాస్త కుప్పకూలింది. ఈ వాస్తవికతను చాలాకాలం భారతదేశ ఉభయ కమ్యూనిస్టుపార్టీలు మభ్యపెట్టి దాచాయి. ఇక ఎంతమాత్రం దాచే వీలులేని రీతిలో పత్రికలు-మీడియా, సోషల్ మీడియా విప్లవం రావడం, దీనికితోడు ఇంటర్నెట్ ప్రభంజనం పల్లెపల్లెకు పాకడంతో ‘పోరాడితే పోయేది ఏమీలేదు సంకెళ్లు తప్ప!’ అన్న మార్క్స్ మాటకు మాన్యత లేకుండాపోయింది. పోరాడితే ప్రాణం పోవడం ఖాయం అని తేలింది. జ్ఞానాన్ని పెంచుకుని, అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం అందరిముందు కనిపిస్తోంది. ప్రజలు అటువైపు కదులుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ ఎన్నికల వేళ ఉభయ కమ్యూనిస్టు పార్టీలను పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. అవి క్రమంగా తమ ఉనికిని కోల్పోతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి. పొత్తుల్లో హత్తుకుపోయిన వైనమే తేటతెల్లజేస్తోంది. అందుకే అవి ప్రజాదరణను కోల్పోయాయి.
ఇక నక్సల్స్‌లోని కొన్ని పార్టీలు ఒక చేత తుపాకీ, మరో చేత బ్యాలెట్ పత్రం పట్టుకు తిరుగుతున్నాయి. ఇవి మరింత ప్రమాదకరమైనవి. వారిలోవారికే స్పష్టతలేకుండా పొద్దుపుచ్చుతున్నాయి. ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిస్తూ బ్యానర్లు కడుతూ, కరపత్రాలు పంచుతున్న మావోయిస్టుపార్టీ రాజకీయ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తోంది. కమ్యూనిజమే కనుమరుగవుతుంటే తుపాకీ గొట్టం ద్వారా సమ సమాజాన్ని స్థాపిస్తామని కంకణం కట్టుకుంటే అదెలా మర్యాదవుతుంది?

-వుప్పల నరసింహం 99857 81799