సబ్ ఫీచర్

గురువు ఉండి తీరాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సాయి సచ్చరిత్రలో గురువు ఆవశ్యకత గురించి బాబా ఏమన్నారో హేమాడ్ పంతు రాయలేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ అనే గొప్ప భక్తుడు ఈ విషయమై తాను రాసుకున్న అనుభవాన్ని ప్రచురించాడు. హేమాడ్‌పంతు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకునేలా చేయటంలో నానాసాహెబు చాందోర్కర్‌తోపాటు కాకాసాహెబు దీక్షిత్ కూడా కారకుడే. హేమాడ్ పంతు శిరిడీ వెళ్లి బాబాను కలిసిన రెండో రోజు కాకాసాహెబు కూడా అక్కడికి వచ్చాడు.
కాకా బాబా ఎదుట వినమ్రంగా నిల్చుని ‘‘శిరిడీనుంచి వెళ్లవచ్చునా?’’ అని అడిగాడు.
బాబా ‘‘అలాగే’’ అని జవాబిచ్చారు.
ఈ సంభాషణ అర్థం కాక ఎవరో ‘‘ఎక్కడకు?’’ అని అడిగారు.
‘‘చాలా పైకి’’ అని బాబా చెప్పారు.
‘‘మార్గమేది?’’ అని దీక్షిత్ అడిగాడు.
‘‘అక్కడకు వెళ్లటానికి అనేక మార్గాలున్నాయి. శిరిడీ నుంచి కూడా ఒక దారి ఉంది. అయితే ఆ మార్గం మిక్కిలి ప్రయాసకరమైనది. మార్గమధ్యంలో ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవు’’ అని బాబా బదులిచ్చారు.
‘‘మార్గదర్శకుడిని వెంట తీసుకుని వెళ్తే ప్రయాస తప్పుతుంది కదా?’’ అని కాకాసాహెబు అడిగాడు.
‘‘అలా అయితే కష్టమే లేదు’’ అని బాబా చెప్పారు. ఇంకా ఇలా చెప్పారు.
‘‘మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానానికి చేరుస్తాడు. మార్గమధ్యంలో ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుంచి మార్గదర్శకుడు తప్పిస్తాడు. మార్గదర్శకుడే లేకుంటే అడవి మృగాల బారిన పడవచ్చు. లేదా దారి తప్పి గుంటలలో పడిపోయే ప్రమాదం ఉంది.’’
ఈ సంభాషణ జరగటానికి ముందు హేమాడ్ పంతు శిరిడీలోని ఒక భక్తుడితో గురువు ఆవశ్యకతపై వాగ్వివాదానికి దిగాడు. మన స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని విడిచి మరొకరికి ఎందుకు లొంగి ఉండాలనేది హేమాడ్ వాదన. మసీదులో కాకాసాహెబుతో బాబా జరిపిన పై సంభాషణ వినగానే హేమాడ్ పంతు సందేహాలు పటాపంచలయ్యాయి. గురువు అవసరమా? కాదా అనే తన సందేహానికి పై సంభాషణే తగిన సమాధానమని గుర్తించాడు. వాగ్వివాదాలకు, ఘర్షణలకు అహంకారమే కారణమని తెలుసుకున్నాడు. వేదాంత విషయాలలో మనిషి స్వేచ్ఛాపరుడు కాదా? అను వివాదం వల్ల ప్రయోజనం లేదని గ్రహించాడు. పరమార్థం నిజంగా గురుబోధలవల్లనే లభిస్తుందని, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీవులకు అణుకువతో సేవచేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారని, గురుసేవకు దృఢమైన నమ్మకము (నిష్ఠ), ఓపిక (సబూరీ) అను రెండు గుణములు అవసరమని హేమాడ్‌పంతు గ్రహించాడు.
భగవంతుని అనుగ్రహం మూగవానిని మాట్లాడేలా చేస్తుంది. కుంటివానికి పర్వతాన్ని అధిగమించే శక్తినిస్తుంది. లోకంలో తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకొను చాతుర్యం ఆ భగవంతునికే ఉంది. హార్మోనియానికి కానీ, వేణువునకు కానీ ధ్వనులు ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియదు. వాటిని వాయించువారికే ఆ విషయం తెలుస్తుంది. చంద్రకాంతం ద్రవించటం, సముద్రం ఉప్పొంగుటం వాటివల్ల జరుగవు. అవి చంద్రోదయంవల్ల జరుగుతాయి. అలాగే భగవంతుని దర్శించటం, ఆత్మసాక్షాత్కారం పొందటం సామాన్య భక్తులవల్ల కాదు. వాటిని సాధించాలంటే గురుకృప కావాలి. గురువు ఇంతకుముందే సాధనతో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉండటంవల్లదానిని పొందే మార్గాన్ని శిష్యునికి తేలికగా బోధించగలరు. ఒకరు జ్ఞాని కానిదే మరొకరికి జ్ఞానాన్ని ఎలా బోధించగలరు? అందుకే గురువు ఉండి తీరాలి.
మనస్తత్వాలు సాయితత్వాలు కావాలి
భూమి, ఆకాశం, నీరు, నిప్ప, గాలి.. వీటిని ఎవరు సృష్టించారు? జనన మరణాల రంగుల రాట్నాన్ని ఎవరు నడుపుతున్నారు? భగవంతుడు అనేది అందరూ చెప్పే సమాధానం. త్రిమూర్తుల్లోని సృష్టి, స్థితి లయ, కారకాలను, అఖిలాండాలను ఏలే జగన్మాతలని శక్తి స్వరూపాన్ని కలబోసుకుని అనేకత్వంలోని ఏకత్వంలా భాసిల్లే దైవం శిరిడీ సాయిబాబా. అనేక శక్తుల స్వరూపం కాబట్టే సాయి దివ్యావతార ప్రాశస్త్యాన్ని కొనియాడుతూ సహస్రనామాల్లో ‘సారుూశ్వరం’ అని కొనియాడతారు.
ఈ విశ్వంలో చైతన్యమై వెలుగొందుతూ జంతు, జీవరాశుల్లో ప్రేరణ కలిగించే శక్తి సాయితత్వమే. ఫకీరు రూపంలో ఈ నేలపై నడయాడిన సాయినాథుడు మానవాళికి అద్భుత పరమార్థాన్ని బోధించారు. మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొలిపారు. మనిషికి నడవడిక నేర్పేందుకు స్వయంగా మానవావతారం ధరించారు. సాయితత్వమంటే మానవత్మమే. సాయి తన అవతారకాలంలో చేసిన ఉపదేశాలు, చాటిన లీలలు, చూపిన మహత్మ్యాలు అన్నీ మనిషిని మహనీయుడిని చేసేవే. వాటిలోని నీతులు జీవనరీతుల్ని నేర్పుతాయి.
మానవాళికోసం బాబా
ఆదర్శ జీవన ప్రణాళిక
సాయిబాబా మానవాళికోసం చక్కని జీవన ప్రణాళికను రూపొందించారు. ఎవరికి ఏది మంచిది? ఎవరికి ఏది చెడ్డది? ఎవరు దేనిని పట్టించుకోగలరు? ఎవరు దేనిని పట్టించుకోలేరు? అని వివేచించి ఎవరికి ఏది మంచిదో అదే జరిగేలా ప్రణాళిక రచించారు. సాయిపథంలో నడిచేవారికి మాత్రమే అందులోని పరమార్థం అర్థమవుతుంది. అజ్ఞానం, మూర్ఖత్వం, సోమరితనం పెనవేసుకుపోయిన ఈ లోకంలో తన దివ్యత్వపు కాంతిరేఖలను ప్రసరించటమే సారుూశ్వరుని కర్తవ్యం. మానవాళిని ఉద్ధరిచాలన్నదే సాయినాథుని సంకల్పం. అందుకు బాబా సాధనంగా, ఆయుధంగా చేసుకున్నది మనిషినే.
ఇంకావుంది...
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566