సబ్ ఫీచర్

బయోపిక్‌ల డైలమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారాన్ని గుదిగుచ్చి బయోపిక్ అనడం టాలీవుడ్‌లో పరిపాటిగా మారుతోంది. నడుస్తున్న చరిత్రలోని వ్యక్తులపైనా సినిమాలు తీసేస్తూ -ఆయా వ్యక్తుల బయోపిక్‌లంటూ ప్రస్తావించడం చూస్తుంటే నవ్వొస్తోంది. ఒక టైంకి ఒక వ్యక్తిపై సినిమా తీసేస్తే -సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ వ్యక్తి జీవితం సినిమా క్లైమాక్స్ మాదిరే ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు. ఒక దశవరకే సినిమా అని చెప్పుకోవాల్సి వస్తే అది బయోపిక్ అని ఎలా అనగలం.

సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ఊహలు, కలలు, కథలు, కల్పనలు, చరిత్రతో కలిసుండేది. చరిత్రలో నిక్షిప్తమైన కథను సైతం కళ్లముందు చూపించగల సత్తా సినిమాకే ఉంది. అలాగని చరిత్రను వక్రీకరిస్తే -పక్కదారి పట్టినట్టే. కాకపోతే కాసింత మెలోడ్రామాను మిక్స్ చేయడం తప్పేమీ కాదు. ఇప్పటికే లక్షల కథలు అన్ని భాషల్లో రకరకాలుగా ప్రేక్షకులకు కనులవిందు చేశాయి. అయినా -కొత్త కథలతో సినిమాలు వస్తూనే ఉంటాయి. చిన్న బడ్జెట్ సినిమానే కావొచ్చు, వందల కోట్లతో నిర్మించే చిత్రాలే కావొచ్చు. ఏమొచ్చినా -ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. అయినా కథలపై కొత్త మోజుతో దర్శకులు -బయోపిక్స్‌నీ తెరకెక్కిస్తున్నారు. ఒకరి జీవిత చరిత్రను సినిమాగా స్క్రీన్‌కు ఎక్కించాలంటే -ఆ వ్యక్తి దినచర్యగానీ, వారి జీవితంలో జరిగిన ప్రతీ విషయం, సందర్భం అన్నీ సూక్ష్మంగా, సవివరంగా నమోదుచేసిన ఆటోబయోగ్రఫీ అందుబాటులో ఉండాలి. అలా నిక్షిప్తమైన కంటెంట్‌ను తీసుకుని తెరకెక్కిస్తేనే -అర్థం, పరమార్థం. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌కు సంబంధించి బయోపిక్‌ల పర్వం ‘మహానటి’తో మరింత ఎక్కువైంది. రాబోయే రెండు మూడేళ్లలో వరుసపెట్టి వదిలేందుకు బయోపిక్‌లపై ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్‌లోని తొలితరం నటి సావిత్రి బయోపిక్‌కు మంచి ఆదరణ లభించటంతో -సెలబ్రిటీల బయోపిక్‌లపై ఇప్పుడు చాలామంది దృష్టి పెడుతున్నారు.
బయోపిక్ అంటే మనిషిలోని ప్రతి కోణాన్నీ ప్రతిబింబించేలా, ఆవిష్కరించేలా ఉండాలి. ప్రస్తావించలేని కొన్ని అంశాలు -అంటూ గోప్యతను పాటిస్తే దాన్ని బయోపిక్ అనలేం. అనకూడదు కూడా.
బయోపిక్ -వ్యక్తి వాస్తవిక జీవితాన్ని మాత్రమే కాకుండా, ముందుతరాన్నీ, నిజానిజాలు, పరిస్థితులు సవివరంగా చూపించాలి. అంతేకాదు -పుట్టుకనుండి బాల్యం, విద్యాభ్యాసం, యుక్తవయస్సు, వివాహం, పిల్లలు, కుటుంబం, వృత్తిరీత్యా చేసిన పనులు ఇవన్నింటినీ వరుసక్రమంలో ఉన్నదున్నట్టు కథలోకి కనీసం చొప్పించగలగాలి. కానీ ఇప్పుడొస్తున్న బయోపిక్స్‌లో -సినిమాటిక్ సరుకును మాత్రమే ఎంచుకుని కథను డిజైన్ చేస్తున్నారు. నాలుగైదు విషయాలను పోగేసి అదే బయోపిక్‌గా ప్రచారం చేసుకోవడం దారుణం. పైగా సేలబుల్ కానె్సప్ట్‌నే కథ చేసుకుని, బయోపిక్ ద్వారా ఆయా వ్యక్తుల గొప్పతనాన్ని రిజిస్టర్ చేస్తున్నామని చెప్పుకోవడం మరీ దారుణం.
అందుకే -బయోపిక్‌లలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జీవితాలు, రాజకీయ నాయకుల జీవితాలే తెరకెక్కుతున్నాయి. పెద్దవాళ్ళ జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలుంటాయి. వాటన్నింటిని క్షుణ్ణంగా చూపిస్తున్నారా? ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అతని జీవిత చరిత్రను సినిమాగా తీసినట్లయితే కాస్త అటో, ఇటో ఒక నమ్మకంతో ప్రేక్షకులు చూస్తారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి వారి జీవితాన్ని సినిమాగా తీయాలంటే సాధ్యమేనా? ఒకవేళ అలా సినిమాగా తెరకెక్కిస్తే అందులో ఎంత నిజం ఉంటుందో చెప్పలేం. ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, పరిస్థితులు గుర్తులు యధార్థంగా తీయొచ్చు. మరి ఆ తరువాత వారి జీవితం ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు? అంటే బయోపిక్‌లలో కూడా కలలు, కల్పనలు, కథలు, ఊహలుండే ప్రమాదం లేకపోలేదు. గొప్పవారి జీవితాలను, జీవిత చరిత్రను సినిమాల ద్వారా తెరకెక్కిస్తున్నారు, సరే. కానీ ఆ సినిమాలకు ఎలాంటి క్లైమాక్స్, ఎటువంటి మెసేజ్ ఇవ్వదలచుకున్నారు? సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ కదా! మరి ఎలాంటి క్లైమాక్స్‌లతో బ్రతికున్నవారి జీవిత చరిత్రలను తెరకెక్కించనున్నారు? రాజకీయ నాయకుల్లో న్యూట్రల్‌గా ఎవరూ ఉండలేకపోవచ్చు. ఎంత గొప్ప నాయకుడైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు. మరి అలాంటి పొరపాట్లు, తప్పులను ఎవరూ చూపించలేరు కదా! అలాంటి నిజానిజాల్ని చూపిస్తే కాస్త నెగెటివ్‌గానే ఉంటుంది. తప్పులు, తప్పిదాలు చేయని వారుండరు. కానీ ఏ చిన్న పొరపాటు కూడా చేయనట్టు చూపించడం సబబుకాదు. ప్రేక్షకులు కూడా దాన్ని ఒప్పుకోరు, జీవిత చరిత్రల్లో కూడా అందరూ తమ తప్పులను, తాముచేసిన పొరపాట్లను ఖచ్చితంగా వ్రాయలేకపోవచ్చు. అంతటిస్థాయికి ఎదగడానికి తాము చిన్నప్పట్నుండి పడిన కష్టాలు, తాము కోల్పోయిన జీవితాన్ని గురించే వ్రాస్తారు. కానీ కొన్ని పచ్చి నిజాలు చెప్పలేరు. చెబితే ఎక్కడ జనాల దృష్టిలో తాను చెడ్డవాడినవుతానోననే భయం. ఇలా చేసినట్లయితే వారెలా గొప్పవారనిపించుకుంటారో వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఒకవేళ నిజాలు నిర్భయంగా చెప్పకపోతే అదెలా బయోపిక్ అవుతుంది? సాధారణ సినిమాలు చూసినట్లే ప్రేక్షకులు రెండున్నర గంటలపాటు చూసి టైంపాస్ చేయాల్సిందేమరి! దివంగతులయిన వారియొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రికార్డుగా లేకపోతే వారియొక్క కుటుంబ సభ్యులు చెప్పేవన్నీ నిజాలే అనుకొని తెరకెక్కించక తప్పదు. మరి అలాంటివారి కుటుంబ సభ్యులందరూ ఉన్న విషయానే్న చెబుతారనే నమ్మకం నూటికి నూరు శాతం ఉండకపోవచ్చు. ఎవరికి తెలిసింది, ఎవరికి తోచిన విషయాలను, ఎవరికి అనుకూలంగా వారు చెప్పే అవకాశంకూడా లేకపోలేదు. ఇలా చెప్పడంవల్ల కూడా కుటుంబ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పవచ్చు. ధనవంతులు, సినిమా ఇండస్ట్రీకి చెందినవారు, రాజకీయ నాయకుల కుటుంబాల్లో నిజాలు నిగూఢంగానే ఉంటాయి. వాటిని విప్పిజెప్పడం అసాధ్యం. ఒకవేళ ఉన్నదిఉన్నట్లుగా బయటపెడితే కుటుంబ వ్యవస్థ అంతాకూడా విచ్ఛిన్నమై సమాజంలో నవ్వులపాలయ్యేటటువంటి ప్రమాదం తప్పనిసరిగా ఉంటుంది. అప్పటివరకు వారిపైన ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. తద్వారా వారి ఎదుగుదల, కీర్తిప్రతిష్ఠలు బూడిదలో పోసిన పన్నీరయిపోతాయి.
ఒక నటి పర్సనల్ లైఫ్‌లో ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయ. ఆ నటిపై తీసే బయోపిక్‌లో ఆ నిజాలను చూపిస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అస్సలు చూపించే పరిస్థితి ఉంటుందా? ‘కన్నతల్లికయినా కాస్త కనుమరుగై ఉండాలనే’ ఒక సామెత ఉంది. మరి అలా దాచిపెట్టి ఇలాంటి కథలు తెరకెక్కిస్తే వచ్చేటటువంటి ఫలితమేంటి? ప్రతి మనిషికీ గోప్యత (రహస్యం) ఉంటుంది. ఉండాలి కూడా అని కొందరంటారు. గోప్యతను గోప్యంగానే వుంచి ఇలాంటివి చెయ్యడం వక్రమార్గాలనే చెప్పవచ్చు. మరి ఇలాంటి బయోపిక్‌లలో సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చేది నిజమా? నిగూఢమా? కల్పితమా అనేది ప్రేక్షకులు ఆలోచించాలి.
ఇక రాజకీయ నాయకుల జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌లో ఆయన రాజకీయ జీవితాన్ని తాను మరణించేంతవరకు మధ్యలో జరిగిన మంచి, చెడులను చూపించవచ్చు. అందులోకూడా గోప్యత ఖచ్చితంగా ఉండితీరుతుంది. గోప్యతగా ఉంచే విషయాల్ని సినిమాగా చూపించడం సరయినదికాదు. సరే ఇప్పుడు వై.ఎస్.ఆర్.గారు లేరు కాబట్టి ఆయన జీవితంలోని ఎత్తుపల్లాలను, రాజకీయ ఎదుగుదలలో ఆయన సాధక బాధకాలను కాస్త పెంచేసి చూపించటంవరకు ఫరవాలేదు. కానీ ఆయన జీవితంలో ఉన్న మైనస్ పాయింట్లను ప్రక్కనపెట్టి పాజిటివ్‌గా మాత్రమే చూపించినట్లయితే చరిత్రను, ప్రేక్షకులను ప్రక్కదారి పట్టించినట్లవుతుంది.
ఇక అదే కోవలోకి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయోపిక్ కూడా తెరకెక్కేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలిదశ ఉద్యమంలో 2001వ సంవత్సరం నుండి నిరసనల సెగ రగులుతూ రగులుతూ ఎన్నో కష్టనష్టాలు, ఎందరెందరో అమాయకుల, అమరుల త్యాగాల ఫలితంగా 2014వ సం.లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మలిదశ ఉద్యమంలో మొదటి అమరుడు శ్రీకాంతాచారి, ఆ తరువాత కానిస్టేబుల్ కిష్టయ్య లాంటివాళ్లు దాదాపుగా 1000కి పైగా అమరులయినారు. ఇట్టి మలి దశ ఉద్యమానికి ఉద్యమనేతగా కేసీఆర్ ముందు నిల్చున్నారు. ఎన్నో సమ్మెలు, అరెస్టులు నిర్బంధాలు ఇవన్నింటి తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఎన్నికలు జరిగి తెలంగాణలోని 119 స్థానాలకుగాను 63 స్థానాలు సాధించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఆ తరువాత స్వరాష్ట్రంలో ఎన్నో పథకాలు, ప్రాజెక్టులతో ప్రభుత్వం సాగుతోంది. ఇదంతా రాజకీయ కోణం.
ఇక ఇప్పుడు కేసీఆర్ బయోపిక్‌లో ఇప్పటివరకు జరిగిందంతా కూడా మొదటి ఇన్నింగ్స్ అనుకుంటే.. మరి రెండో ఇన్నింగ్స్ ఎలా వుంటుందని భావించవచ్చు? కథ అల్లాలా? కలలు కనాలా? ఊహల్లో విహరించాలా? ఏమిచేస్తే కేసీఆర్ బయోపిక్ కథ కరెక్టుగా ఉంటుందో ఎవరికి తెలుసు? క్లైమాక్స్‌లో ఏమవుతుందో సినిమాలో చూపించినట్లు నిజజీవితంలో, రాష్ట్ర పరిపాలనలో, అభివృద్ధిలో చూపిస్తారా? ఎలా చూపించినా నూటికి నూరుపాళ్లు నెగెటివ్‌గానే ఉంటుంది. మరి ఇలాంటి నెగెటివ్ స్టోరీని ప్రేక్షకులకు చూపించడం కరెక్టుకాదు. జరిగింది జరిగినట్టు చూపించడమనేది మన కళ్ళముందు జరిగింది కాబట్టి సినిమాగా తీయవచ్చు. మరి జరగబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని మిగతా సినిమా తీయడమంటే అందులో ఎంతమాత్రం నిజం ఉండదు. ఖచ్చితంగా కల్పితమే ఉంటుంది. మరి అలాంటి కల్పితాలకు కూడా బయోపిక్‌లని పేరెందుకు? ఇలాంటి వాటితో ప్రేక్షకులు డైలమాలో ఉండటంతో తప్ప చేసేదేమీలేదు. ఇవన్నీ ప్రేక్షకులను డైలమాలో పడేసేవేనని చెప్పటంలో అతిశయోక్తిలేదు. గతాన్ని యదార్థంగాచెప్పి భవిష్యత్తును ఊహించి సినిమాతీస్తే అది బయోపిక్ అనిపించుకోదు.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431