సబ్ ఫీచర్

మహాజ్ఞాని మదాలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋతధ్వజుడనే రాజు భార్య మదాలస. ఆమె మహాజ్ఞాని. ఒక శుభలగ్నంలో ఆమెకు ప్రథమ కుమారుడు జన్మించాడు. రాజు అతనికి విక్రాంతుడు అని నామకరణం చేశాడు. ఆ పేరు విన్న రాజోద్యోగులు అంతఃపుర పరివారం ఎంతో సంతోషించారు. కాని మదాలస ఒక చిరునవ్వు నవ్వింది. ఏడుస్తున్న ఆ బాలుని ఊయలలో పరుండబెట్టి ఊపుతూ ఈవిధమైన అర్థం వచ్చే జోలపాట పాడింది. ‘‘నాయనా, నీవు శుద్ధుడవు, నిరంజనుడవు, నిరాకారుడవు. నీకు పేరు లేదు. ఈ పేరు కవిత్వం మాత్రమే. పంచభూతాత్మకమైన ఈ శరీరం నీవు కాదు. దీనికి నీకు ఎట్టి సంబంధం లేదు. సంసార మాయకు నీవు అతతుడవు. ఇక ఎందుకు రోదించడం? భౌతిక పదార్థాలతో భౌతిక శరీరం వృద్ధి పొందుతుంది. భౌతికంగా నశిస్తుంది. ఈ శరీరం ఒక ఉత్తరీయం వంటిది. అది నశించినా నీవు విచారించవలసిన పనిలేదు. తండ్రీ అని కొంత సేపు తల్లీ అని కొంతసేపు భార్య అని కొంతసేపు తనయా అని కొంతసేపు-ఇట్టి భౌతిక విషయాలకి ఎందుకు ఆరాటపడతావు? రక్తం మాంసం అస్థిపంజరం మొదలైన వాటితో కూడిన ఈ శరీరంపై ఆపేక్ష అనవసరం. ఈవిధంగా నిత్యం ఆత్మతత్వాన్ని బోధించే పాటలు పాడుతూ కుమారుని పెద్ద చేసింది. అతడు క్రమంగా తల్లి ఉపదేశానుసారం ఆత్మజ్ఞనాన్ని పెంచుకున్నాడు. అందువలన యుక్తవయస్సు రాగానే గృహస్థాశ్రమం స్వీకరించకుండా పరివ్రాజకుడైనాడు. మదాలసకు రెండవ పుత్రుడు జన్మించాడు. రాజు అతనికి సుబాహువు అని పేరుపెట్టాడు. ఆ పేరు వినగానే మదాలస తిరిగి నవ్వింది. అతనికి కూడా తత్వోపదేశం చేసింది. అన్నవలె ఆత్మజ్ఞాని అయి అతని బాట పట్టాడు. తిరిగి ఆమెకు మూడవ పుత్రుడు జన్మించాడు. రాజు అతనికి అరిమర్దనుడని నామకరణం చేయగా మదాలస మరలా నవ్వింది. అతడు కూడా మాతృబోధనలు ఆకళింపు చేసుకుని అన్నవలె విరాగి అయినాడు. తిరిగి నాల్గవ కుమారుడు జన్మించిన అనంతరం రాజు మదాలస వైపు చూచి నేను పేరు పెట్టినపుడు ప్రతి పర్యాయం నీవు నవ్వడానికి కారణం ఏమిటి? నేను పెట్టిన పేర్లన్ని క్షత్రియులకి తగినవి. ఇలాంటివి నీకు నచ్చకపోతే నీవే ఈ బాలునికి పేరు పెట్టు అన్నాడు. మదాలస అతనికి అలర్కుడని పేరు పెట్టింది. అతడు బుద్ధిమంతుడై ఘనకీర్తి పొందుతాడని చెప్పింది. ఆ పేరు విన్న రాజు ఎంతో వ్యధ చెంది అలర్క శబ్దానికి వట్టి కుక్క అని అర్థం. ఇట్టి నీచమైన పేరు నా కుమారునికి ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా, ఆమె ‘‘రాజా వ్యవహారముకొరకే ఈ పేరు పెట్టాను. నీవు పెట్టిన పేర్లు కూడా నిరర్థకాలే. మొదటివానికి విక్రాంతుడని పేరు పెట్టావు. పురుషుడు (ఆత్మ) సర్వవ్యాపకుడని ప్రాజ్ఞులు చెబుతున్నారు. ఒకచోటనుండి మరియొక చోటకు పోయే గమనాన్ని కాంతి అంటారు. విక్రాంతుడు అంటే విశేష గమనం గలవాడని అర్థం. సర్వవ్యాపకమైన ఆత్మకు రాకపోకలెక్కడివి? అసలు చలనమే లేనివానికి విక్రాంతుడని పేరు పెట్టడం నిరర్థకం కాదా? రెండవవానికి సుబాహువు అని నామకరణం చేశావు. అది కూడా వ్యర్థమే. ఆత్మకు అకార వికారాలు లేవు. అది నిరాకారం. నిరాకారానికి బాహువులెక్కడుంటాయి? మూడవ పేరు అరిమర్దనుడు. సర్వ శరీరాలతోను ఉన్న ఆత్మ ఒక్కటే. అట్టి ఆత్మకు శతృవులెవరు? తనకంటే అన్యం ఉన్నపుడే కదా శతృ మిత్రుత్వాలుంటాయి. ఆకారమే లేని ఆత్మకు మర్దనమన్నది లేదు. ఈ పేర్లన్నీ వ్యవహారికం కొరకు పెట్టినవే. కనుక అలర్కుడని పేరు పెడితే వచ్చే నష్టం ఏమిటి? మదాలస విశే్లషణకు రాజు నిరుత్తరుడైనాడు. మదాలస అలర్కునికి తత్వోపదేశం ప్రారంభింపగానే రాజు మొదటి మువ్వురు పుత్రులను విరాగులుగా చేశావు. ఇతనిని కూడా అలా చేస్తావా? నా వంశం విచ్ఛిన్నం కావాలని కోరుతున్నావా? ఇతనిని కూడా సన్యాసిగా చేస్తావా? ఇతనినైనా ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టు. కర్మ తంతువు తెగిపోకూడదు. కర్మమార్గంలో పయనించేవాడు దేవతలను పశుపక్ష్యాదులను, అన్నార్తులను తృప్తిపరుస్తాడు. కనుక అలర్కుని ఐహికాముష్మికాలలో నిపుణునిగా చేయి అని కోరాడు. భర్త ఆదేశానుసారం ఆమె అతనికి ఈ విధంగా ఉపదేశించింది.
నాయనా, ఆయురారోగ్యాలతో వర్థిల్లు. ఉత్తమ కార్యాలతో తండ్రిని సంతోషపెట్టు. సజ్జన రక్షకు దుర్జన శిక్షకు అవసరమైన కర్మ మార్గాన్ని అనుసరించు. నీవు గొప్ప పాలకుడుగా పేరు పొందుతావు. దేవేంద్ర వైభవాన్ని అనుభవిస్తావు. పరోపకార పారాయణుడవై జీవించు. పరస్ర్తిలనుండి మనసు మళ్లించు. కీర్తికొరకు ధనం వ్యయం చేయి. కష్టంలో వున్న ప్రజలను ఆదుకో. యజ్ఞయాగాదులు నిర్వహించి దేవతలను తృప్తిపరచు. సూర్యుడు భూమిపైగల జలాన్ని గ్రహించినట్లు సూక్ష్మోపాయంతో పన్నులు రాబట్టాలి. యమధర్మరాజువలె అందరిని సమదృష్టితో చూడాలి. ఈ విధమైన తల్లి బోధలు అలర్కుడు ఆకళింపు చేసుకున్నాడు. కొంతకాలానికి వృద్ధుడైన ఋతుధ్వజుడు అలర్కుని పట్ట్భాషేకం చేసి భార్యతో వనవాసానికి వెళ్లాడు. భర్తను అనుసరించి వెళ్ళే సమయంలో అలర్కనితో తిరిగి ఇలా అన్నది. గృహస్థాశ్రమమంలో వుంటూ రాజ్యపాలన చేసేవారికి కష్టాలు ప్రాప్తించవచ్చు. నీకు పెద్ద విపత్తు ఏదైనా సంభవించినపుడు ఈ తాయెత్తుతో సూక్ష్మాక్షరాలతో వ్రాయబడిన విషయాలు పరిశీలించు అని ఆ తాయెత్తు అతని మెడలో వేసింది.
(ఇంకావుంది)

-వేదుల సత్యనారాయణ 96183 96071