సబ్ ఫీచర్

‘మహావలస’ సంక్షోభానికి పరిష్కారమేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్య అమెరికా దేశాల ప్రజల ‘మహావలస’ కొనసాగుతోంది. తమ తమ దేశ ల్లో పాలన అస్తవ్యస్తంగా ఉండటం, జీవనం సజావుగా సాగకపోవడం, భవిష్యత్ అంధకార బంధురంగా కనిపించడంతో ఆ ప్రజలు అగ్రదేశమైన అమెరికాలో బతికేందుకు వలసబాట పట్టారు. అమెరికాలో చిన్నాచితకా ఏదైనా పనిచేసుకుని జీవనం గడపొచ్చన్న ఆశతో తమ సొంత దేశంలోకన్నా కొంత మేరకైనా మెరుగైన-మేలైన జీవనం గడపొచ్చన్న ఆకాంక్షతో వేలాది మంది ప్రజలు వేలాది కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు. తమ దేశాల జెండాలను ప్రదర్శిస్తూ కదులుతున్నారు. అలాగని వీరిని అమెరికా ఆహ్వానించడానికి ఏ విధంగానూ సిద్ధంగా లేదు.
వలస వచ్చేవారిలో సంఘవ్యతిరేక శక్తులు ఉండే అవకాశముందన్న నెపంతో వలస చట్టాల ఉల్లంఘన మరికొన్ని ఇతర కారణాలతో వారిని దేశం సరిహద్దులు దాటి లోపలికి రానివ్వకుండా అమెరికా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇనుప కంచెను నిర్మిస్తోంది. అయినప్పటికీ వలసదారులు వెనక్కి తగ్గడం లేదు. వారు కెరటాలు కెరటాలుగా కదులుతూ ఉన్నారు. అమెరికాలో జీవనం సాగించే తమ కలను సాకారం చేసుకుంటామని మొండి పట్టుదలతో వారు ముందడుగు వేస్తున్నారు. గ్వాటిమాలా- మెక్సికో దేశాల సరిహద్దుల్లోనే వీరిని నిలిపేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒక ప్రాంతం నుంచి విస్థాపన జరగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అనిశ్చితితో అడుగు వేయడమే. అయినప్పటికీ మధ్య అమెరికా దేశాల ప్రజలు ముఖ్యంగా ఆండ్రూస్, గ్వాటిమాలా దేశాల యువకులు సాహసం చేసి కొత్త జీవితం గడిపేందుకు రోజుల తరబడి నడుస్తున్నారు. బస్సుల్లో, కార్లలోనో ప్రయాణించేందుకు అవసరమైన డబ్బులేక వారు గుంపులు గుంపులుగా కాలినడకన శరణార్థులుగా కదులుతున్నారు. మార్గమధ్యంలో వాగులు-వంకలు, నదులు ఎదురైనప్పటికీ వాటిని దాటుకుంటూ ముందుకే కదులుతున్నారు. వెంట తెచ్చుకున్న స్వల్ప సామాగ్రి- టెంట్లతో చీకటి పడగానే ఎక్కడో ఒకచోట మూకుమ్మడిగా గుడారాలు వేసుకుని గడుపుతున్నారు. తెల్లవారేసరికి తిరిగి నడక ప్రారంభిస్తున్నారు. రహదారి వెంబడి నడుస్తున్నప్పుడు దయగల కొందరు ట్రక్కు డ్రైవర్లు వారిలో కొందరిని కొంత దూరం తీసుకెళుతున్నారు. దారిలో ఎదురైన పట్టణాల్లో కొందరు దాతలు కొన్ని ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఆమాత్రం సహాయానికే సంబురపడిపోతూ అమెరికా చేరుకోవాలన్న ఆశను తమలో చావనీయకుండా కదులుతూ ఉన్నారు. కొందరు దీన్ని పెద్ద మానవ సంక్షోభంగా పరిగణిస్తున్నారు.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని నడ్తున్నారు. చిన్న పిల్లల్ని భుజాలపై మోసుకుంటూ కదులుతున్నారు. తమ జీవితాలు కష్టాలతో కునారిల్లిపోయినప్పటికీ తమ పిల్లలైనా మంచి జీవితం గడపాలన్న అభిలాషతో వారు నడుస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అదే మాటను వారు వినిపిస్తున్నారు.
నిరుద్యోగం- అశాంతి, అరాచకం, ద్రవ్యోల్బణం, హింస, ధరల పెరుగుదల, గ్యాంగ్‌ల దాడులు, అభద్రత కారణాలతో ఆయా దేశాల ప్రజలు మూకుమ్మడిగా రహదారుల వెంట, నదులు దాటుతూ ఉండగా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మెక్సికోలాంటి దేశాల్లో ఆతిథ్యమిచ్చినా అంగీకరించేందుకు వారు సిద్ధంగా లేరు. తమకు ఆయా ప్రాంతాల్లో భద్రత కనిపించడం లేదని, ముఖ్యంగా జీవనానికి భరోసా కుదరడం లేదని అంటున్నారు. అందుకే అమెరికావైపు కదం తొక్కుతున్నారు.
విచిత్రమేమిటంటే లాటిన్ అమెరికా దేశాలు అమెరికా అంటే ఆడిపోసుకుంటూ, ద్వేషిస్తూ, ఆ వ్యవస్థను నిందిస్తూ తమ దేశాల్లో విప్లవాగ్నులు రగిలిస్తూ, సోషలిస్టు వ్యవస్థలను తీర్చిదిద్దేందుకు దశాబ్దాలుగా కత్తులు దూస్తున్న సంగతి తెలిసిందే! అమెరికా పెట్టుబడిదారీ దేశమని, సామ్రాజ్యవాద పోకడలుగల దేశమని, దోపిడీ పాలకుల నిలయమని అనేక విధాలుగా దూషిస్తూ ప్రపంచమంతటా ఆ భావజాలాన్ని ప్రచారం చేస్తూ అమెరికాను ఏకాకిని చేయాలన్న తాపత్రయం సాకారం కావడం లేదు. పైగా అమెరికా రోజురోజుకూ మరింత శక్తిమంతమవుతోంది, బలపడుతోంది. ఆర్థికశక్తిగా ఎదుగుతోంది. అందుకే మధ్య అమెరికా దేశాల ప్రజలు ఆర్థిక అవకాశాల కోసం, ఆ ఆర్థికశక్తిలో భాగస్వాములు అయ్యేందుకు, ఎంతోకొంత పాలుపంచుకుని జీవితాల్ని బాగుపరుచుకునేందుకు కలలుకంటూ ఎన్నో కష్టాలను దిగమింగుతూ మహా వలసబాటపట్టారు.
లాటిన్ అమెరికా వైఖరికి, మధ్య అమెరికా దేశాల వైఖరికి మధ్య ఎంత తేడా ఉందో దీనివల్ల అర్థమవుతోంది. లాటిన్ అమెరికాలోని వెనిజులా దేశం అయితే ఒక అడుగు ముందుకేసి అమెరికాను దూషించని మాటలేదు. హద్దుమీరు దూషించారు, ద్వేషించారు. ఛావెజ్ లాంటి నాయకుడయితే ‘కసి’ని ప్రదర్శించారు. చివరికి ఆ దేశమే దివాలా తీసింది. ద్రవ్యోల్బణం ఆకాశానికంటింది. ప్రజల బతుకు భారమైంది. సోషలిజం మైకంలో జోగిన పాలకులకు వాస్తవం తెలిసొచ్చేసరికి ‘అద్దం’ పగిలి ముక్కలైంది. ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. దాంతో ఆ దేశం నుంచి సైతం భారీఎత్తున వలసలు జరుగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు పొరుగు దేశాలకు పయనమవుతున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. దేశ రాజధాని కార్కస్‌లోనూ జీవన భద్రత లేదు. కనీస అవసరాలు తీరడం లేదు. చివరికి శుభ్రమైన నీరు లభించడం లేదు. దాంతో ఆకలిచావులు పెరిగాయి, దోపిడీలు-దొమీలు పెరిగాయి. జీవనం నరకప్రాయమైంది. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. మధ్య అమెరికా దేశాల పరిస్థితి కన్నా ఘోరంగా లాటిన్ అమెరికాలోని వెనిజులా మరికొన్ని దేశాల పరిస్థితి కనిపిస్తోంది.
పెట్టుబడిదారీ వ్యవస్థనే అన్ని సంక్షోభాలకు కారణమని విశే్లషించి చెప్పే మార్క్సిస్టు మేధావులు మార్క్సిజం ఆధారంగా సోషలిజం వెలుగులో పాలన కొనసాగిన వెనిజులా లాంటి దేశాలు దివాలా తీయడం, ప్రజల బతుకు దుర్బరంకావడానికి గల కారణాలేమిటో చెప్పగలరా? ఆ విశే్లషణకొచ్చేసరికి అనేకానేక ముసుగుల్లోకి వారు దూరిపోతున్నారు. వాస్తవానికి ఆర్థిక మేనేజ్‌మెంట్ సరైన పద్ధతిలో కొనసాగడం ముఖ్యం. ఈ కీలకాంశాన్ని విస్మరించి సిద్ధాంతాల ముసుగులో శతాబ్దం క్రితం కన్నుమూసిన నాయకుల ఆలోచనా విధానాలకు బానిసలుగా పనిచేయడం కారణంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వెనిజులా లాంటి దేశాల్లో దీన్ని ఎక్కువగా గమనించవచ్చు. పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన లాటిన్ అమెరికా దేశాల పోకడలను అనుసరించాలనుకునే దేశాలు సైతం అదే గోతిలోపడిపోయాయి.
వర్తమాన మార్కెట్ ఎకానమీని పక్కనపెట్టే పరిస్థితులు ఎక్కడా లేవు. ఈ విషయం గ్రహించి తదనుగుణమైన విధానాలను అనుసరించడంలోనే ప్రజల బాగోగులు ఆధారపడతాయి తప్ప ఏవేవో కలలుకంటూ, ఊహాలోకాల్లో తేలిపోవడంవల్ల స్వర్గం దిగి రావడంకాదు కదా?.. సంక్షోభం ఎదురవుతోంది. ఆ పరిస్థితినే అటు లాటిన్ అమెరికా, ఇటు మధ్య అమెరికా దేశాల ‘మహావలసలు’ పట్టి చూపుతున్నాయి. ఇది ఎంతవరకు ఆహ్వానించదగ్గ పరిణామం? ప్రజలు తమ జీవితాలను పణంగాపెట్టి తమ దేశంగాని దేశంలో శరణార్థులుగా, ద్వితీయశ్రేణి పౌరులుగా జీవించే పరిస్థితులు కల్పించడం 21వ శతాబ్దంలో ఎంతవరకు సబబు? దేశాల మధ్యన వలసలేగాక ఒక దేశంలోనూ అంతర్గత వలసలను సైతం నివారించినప్పుడే, విస్థాపనలను నిరోధించగలిగినప్పుడే ప్రజల జీవనం మెరుగుపడుతుంది.

-వుప్పల నరసింహం 99857 81799