సబ్ ఫీచర్

పంటపొలాల్లో మరణ మృదంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ప్రతిరోజూ 50 మంది వరకూ రైతులు ఎక్కడో ఒకచోట బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, సేద్యం ఖర్చులు పెరిగిపోవడం, విత్తనాల సమస్య, ప్రభుత్వాల ఉదాసీనత రైతుల బతుకుల్ని చిదిమేస్తున్నాయి. మహారాష్టక్రు చెందిన సంజయ్ సాథే నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లిపాయలు పండించగా అతనికి వచ్చిన ఆదాయం కేవలం రూ.1064 రూపాయలు. దీంతో కడుపుమండిన అతను సాక్షాత్తూ ప్రధాని మోదీకి ఆ మొత్తాన్ని మనియార్డరు ద్వారా పంపించి నిరసన తెలిపాడు. 2010లో మన దేశంలో పర్యటించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ముచ్చటించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యుదయ రైతుల్లో సంజయ్ సాథే ఒకరు.
అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న మహారాష్ట్ర రైతులు నాసిక్ నుంచి ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర రైతులు నాసిక్ నుంచి ముంబయి వరకూ ‘లాంగ్ మార్చ్’ నిర్వహించి తమ సమస్యలపై గళం విప్పారు. గత నెల 30న ఢిల్లీలో రైతన్నల భారీ ప్రదర్శన దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. రైతులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రుణభారాన్ని తగ్గించాలనీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని కోరుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా వ్యవసాయ సంక్షోభం దేశంలో మూడు లక్షల మందికి పైగా రైతులను బలిగొన్నది. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలుచేస్తామన్న మోదీ ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేయడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహా మిగతా చోట్ల రైతు రుణమాఫీ వాగ్దానాల భారం 2 లక్షల కోట్ల రూపాయలని బ్యాంకుల అంచనా. రుణమాఫీతోనే రైతుల సమస్యలన్నీ తీరవు. దేశవ్యాప్తంగా కౌలు కమతాలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం, పంజాబ్‌లో 25, బిహార్‌లో 21, ఒడిశాలో 17, హరియాణాలో 15 శాతం కౌలు రైతులున్నారని అంచనా. రుణమాఫీ ప్రయోజనాలు వీరికి అందడం లేదు. గిట్టుబాటు ధరలపై స్వామినాథన్ సిఫారసులు ఆచరణ సాధ్యం కాదని 2018 జులైలో నీతి ఆయోగ్ తిరస్కరించింది. రైతాంగం వ్యవసాయాన్ని వదిలివేయకుండా జీవన వ్యయం, ఫిట్‌మెంట్ బెనిఫిట్‌తో కూడిన కనీస నికర ఆదాయం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
సారవంతమైన భూములు, కష్టపడే రైతులు ఉండి కూడా వ్యవసాయం ఎందుకు లాభసాటి కావడం లేదు? ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఎందుకు కుంచించుకుపోతున్నది? ఆర్థికాభివృద్ధి ఎగిసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర పాలకులు వ్యవసాయాభివృద్ధిపై నీళ్లు నమలడం ఎందుకు? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొండి ధైర్యంతో రైతులు సేద్యం చేస్తున్నందునే ఈ మాత్రం ఆహారమైనా జాతికి దొరుకుతున్నది. వారు కూడా విరక్తితో ఒక ఏడాది ‘కాడి’ కిందకు పడేస్తే, 130 కోట్ల జనాభా గతి ఏమిటి? రైతుకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించి భారీగా నిధులు ప్రవహింపచేస్తే తప్ప ఈ రంగం బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. పెద్దనోట్ల రద్దు వల్ల జాతీయ విత్తన కార్పొరేషన్ 1.38 లక్షల క్వింటాళ్ళ మేర విత్తనాలు విక్రయించలేకపోయింది. పప్పు్ధన్యాల ఉత్పత్తి 2017లో 2.29 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, 66 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇక రైతు ఎలా బతుకుతాడు? మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు నాలుగేళ్ళలో రూ. 3.5 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చింది. రైతుల పట్ల మాత్రం మొసలికన్నీరు కారుస్తోంది. ఇతర రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంటే వ్యవసాయ రంగం స్తంభించింది.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్వదేశీ, విదేశీ కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల పట్ల ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఉద్యమాలు చేపట్టారు.
నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత వ్యవసాయంలో వృద్ధిరేటు 1.5 స్థిరంగా ఉంది. 1960లలో సస్య విప్లవ కాలంలో వ్యవసాయ రంగ ఉత్పాదకత పేద, మధ్యతరగతి రైతాంగ శ్రమవల్లనే సాధ్యమైంది. కాని ఫలితాలు బహుళజాతి కంపెనీలు, బడా వాణిజ్య సంస్థలు పొం దాయి. సస్య విప్లవ కాలంలో రైతాంగానికి ప్రభుత్వమందించిన మద్దతునంతా క్రమంగా నూతన ఆర్థిక విధాన అమలుతో ఉపసంహరించారు. బహుళజాతి కంపెనీల వ్యాపారం రైతుల్ని సంక్షోభంలోకి నెట్టింది. భూమి, నీరు, పర్యావరణం వంటి వనరులపై రైతులకున్న హక్కుల్ని హరించివేసింది. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకాల ధరలన్నీ పెరిగిపోయాయి. ఇది రైతాంగాన్ని వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల్లోకి నెట్టింది. సంస్థాగత రుణ సౌకర్యాన్ని తగ్గిస్తూ రావటంతో పరిస్థితి మరింత దిగజారింది. వ్యవసాయోత్పత్తుల ధరలకు వాస్తవిక ఉత్పత్తి వ్యయాలు ప్రాతిపదిక కావాలి. ద్రవ్యోల్బణంతో వాటిని ముడిపెట్టాలి. ఉత్పత్తి వ్యయాలకు కనీసం 50 శాతం లాభాన్ని కలిపి ధరను నిర్ణయించి, పంటల సీజన్‌కు ముందే ప్రకటించాలి. వాటి అమలుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలి. ధాన్యం సేకరణ చేపట్టాలి. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ వ్యయాలు, ధరలు కమిషనర్‌ను ఏర్పాటుచేస్తే ప్రభుత్వ జోక్యానికి, ధరల స్థిరీకరణలకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ లెవీ, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో తగ్గుదల సంభవిస్తే రైతులకు పరిహారాన్ని చెల్లించాలి.
ప్రతి రైతు కుటుంబానికి నిర్ణీత ఆదాయానికి ప్రభుత్వం హామీ కల్పించాలి. ఆదాయానికి హామీని కల్పించే ఈ స్థిరమొత్తాన్ని రైతులకేగాక, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా చెల్లించాలి. ఏటా సాగులో ఉన్న భూమికి మాత్రమే ఈ మద్దతును వర్తింపచేయాలి. ఆదాయ మద్దతుకు ప్రాతిపదిక కుటుంబమే తప్ప భూ విస్తీర్ణం కారాదు. చిత్తశుద్ధితో, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో కృషిచేస్తే తప్ప వ్యవసాయ రంగం అభివృద్ధి చెందదు.

-పోతుల సురేష్