సబ్ ఫీచర్

నదీ జలసంపదకు ఆపద..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎప్పుడూ ఎడతెగక ప్రవహించే ఏరు’ బతకటానికి ఇచ్చే స్వచ్ఛతా ప్రాధాన్యతను సుమతీ శతకకారుడు ఏనాడో ప్రస్తావించాడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ- పర్యావరణానికి పెట్టనికోటగా, పవిత్ర గంగానదిని అవిరళ జలప్రవాహంగా పయనింపచేయాలనే స్వచ్ఛ ఆలోచనలతో తలమునకలవుతోంది. హిమాలయ పర్వత శిఖరాల నుండి జాలువారే నదులు ప్రస్తుత స్థితిగతులలో జీవం కోల్పోవడం మనకు తెలిసిందే. సమృద్ధిగా నీటిప్రవాహం కలిగి ఉండే ‘సజీవ జల సంపద’, ప్రకృతి రమణీయత కనుమరుగయ్యేలా అభివృద్ధి పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ విధ్వంసాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. పలు రకాలుగా కాలుష్యం శ్రుతి మించటంతో భారతీయ జనజీవన ఐహిక, ఆముష్మిక ప్రదాయిని గంగానది వంటి అమృతజల ప్రవాహాలకు- దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం మానవ సమానమైన ప్రాణంతో సంచరించే ‘జీవి’ హోదాను ప్రసాదించింది.
దశాబ్దాలు గడుస్తున్నా నది కదులుతోంది కాని జీవత్వం లేకపోవటం భక్తజన సందోహానికి, పర్యావరణ ప్రేమికులకు ఆందోళన కలిగించే అపర్కిృత సమస్యగా పరిణమిస్తోంది. సుమతీ శతకకారుని కాలంలో సమృద్ధిగా జలకళతో ప్రవహించే నదులు ప్రస్తుతం- కాలంతో సంబంధంలేకుండా కుంగి కృశించి వట్టిపోయిన జాడలతో లేదా స్పృశించటానికి కూడా సాహసించలేని మురికి ప్రవాహాలుగా దర్శనం ఇస్తున్నాయి. హిందూ మత ఆధ్యాత్మిక జీవన ఔన్నత్యానికి ప్రాణప్రదమైన జల దైవత్వ తీర్థయాత్రా పవిత్రతను ప్రస్తుత ప్రభుత్వాలు పర్యాటక రంగంలో ఆదాయ లక్ష్యంతో విపరీత ప్రచారంతో ప్రోత్సహిస్తున్నాయి. అందువల్ల స్నాన పానాదులు భక్తిశ్రద్ధలతో ఆచరించే అశేష భక్తజనావళికి దృష్టిలో పెట్టుకొని నదీ జల సంరక్షణ బాధ్యతగా నిర్వర్తించవలసి వస్తోంది. అతివృష్టి అనావృష్టిగా నదులు వరద ఉద్ధృతితో ఊళ్ళు ముంచటం లేదా సాగునీటికి, తాగునీటికి కూడా ఇబ్బందులుపడే వాతావరణ దుష్పరిణామాలలో చిక్కుకొంటున్నాయి.
పైపుల కింద పవిత్ర స్నానాలు, మోకాళ్ళు మునగని స్నానఘట్టాలు, అనారోగ్యాన్ని ప్రసాదించే అపరిశుభ్ర పరిస్థితులు గోదావరి పుష్కరాల సందర్భంలో భక్తులకు అనుభవమే. కలుషిత జలాల్లో స్నానమాచరించే భక్తులను కలరా, విషజ్వరాలు, చర్మ సంబంధిత వ్యాధులు పీడిస్తుంటాయి. గోదావరి నది వద్దనే కాదు, దేశంలో అనేక పుణ్యనదుల వద్ద భక్తుల అవస్థలు వర్ణనాతీతం. గంగానది సుదీర్ఘ ప్రయాణం అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ ద్వీప సముదాయంలోని సాగర్ ద్వీపంలో జరిగే గంగాసాగర్ మేళాలో మకర సంక్రాంతి పురస్కరించుకొని వచ్చే 20లక్షల పైగా భక్తుల పవిత్ర స్నానాలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
దేశవ్యాప్తంగా నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. గంగా మాతను పరిరక్షించటానికి 2011లో స్వామీ నిగమానంద, 2018 అక్టోబరులో స్వామీ గ్యాన్ స్వరూప్ సనంద్ ఆమరణ ప్రాయోపవేశ దీక్ష నెలల తరబడి కొనసాగించి స్వచ్ఛందంగా ప్రాణత్యాగాలు చేసారు. గంగానది పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని, పరీవాహక ప్రాంతంలో గనుల తవ్వకాన్ని నిలువరించాలన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. కాని స్వామీజీ ఆత్మబలిదానం తరువాత కేంద్ర జల వనరులశాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఏడాది పొడుగునా గంగానదిలో వివిధ ప్రాంతాలలో నీరు ఉండే విధంగా జల విద్యుత్ కేంద్రాలు వాటి నిర్వహణ తీరుతెన్నులను నిర్వహించుకోవాలని ఒక నోటిఫికేషన్ జారీచేసారు. కనిష్ఠ పర్యావరణ ప్రవాహం (ఇన్ ఫ్లో) నదిలో వుండటం వలన సహజమైన పర్యావరణ పరిస్థితులు నీటి స్వచ్ఛతకు దోహదం చేసే అవకాశం వుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. నదిలో ప్రవాహం అవిరళంగా ఆపులేకుండా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ ప్రకారం డ్యామ్‌లు, బ్యారేజీల ద్వారా వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు, గృహాల వినియోగానికి నీటి తరలింపుశాతాలను నిర్ధారించి ప్రకటించారు. గంగానదీ బేసిన్‌లో 784 డ్యామ్‌లు, 66 బ్యారేజీలు, 92 వైయర్స్, 45 ఎత్తిపోతల పథకాలలో సీజన్‌ల బట్టి నెలవారీ సగటును వివిధ శాతాలుగా ప్రవాహాల పరిమాణాన్ని నిర్ధారించారు. ఈ ఇన్ ఫ్లో అవిరళ ప్రవాహ ప్రకటన అక్టోబర్ 9న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రయత్నాలన్నీ 2019 మార్చి నాటికి గంగానదిలో ప్రస్తుత కాలుష్యం కనీసం 70 శాతాన్ని నిర్మూలించటానికి ఉద్దేశించినవి.
ఆధ్యాత్మిక పర్యటనలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరింత చొరవ చూపిస్తూ, అవిరళత కంటే ముందు నదీప్రవాహ ప్రక్షాళనను సమర్ధవంతంగా నిర్వహించవలసినదిగా కేంద్ర జల వనరులశాఖను ఆదేశించారు. ఇటీవల ‘ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్’లో అవిరళత కంటే స్వచ్ఛత చర్చనీయాంశం అయింది. ఐఐటి ప్రతినిధులు ఇతర నిపుణులతో కమిటీల ప్రయత్నాలు సత్ఫలితాలు యివ్వవలసి వుంది. గంగారివర్ బేసిన్ మేనేజిమెంట్ పథకం అమలులో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్‌గంగ, జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సంయుక్తంగా నిర్వహించిన రెండురోజుల వర్క్‌షాప్‌లో జర్మనీ, లావోస్, ఆస్ట్రియా, ఈజిప్టు దేశాల నిపుణులతో, డానుబి, రైన్, మెకాంగ్ నదీలోయల స్వచ్ఛతను సాధించటానికి కేంద్రం పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అవిరళ ధార, నిర్మల ధార, పర్యావరణ పరిరక్షణ, భూగర్భ రక్షణ, విపత్తుల కార్యాచరణ, వ్యవసాయ సమగ్రత, పర్యావరణ జ్ఞాన వికాసం, అవగాహనా కార్యక్రమాలకు ప్రత్యేక మిషన్‌లు ఏర్పాటుచేయాలని కేంద్రం సంకల్పిస్తోంది. గంగానదిని రక్షించే విధంగా ప్రత్యేక డ్రాఫ్ట్ సిద్ధమైంది.
ఆధ్యాత్మిక పర్యటనలకు ప్రోత్సాహం యిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాత్రికుల జీవన భద్రతను మాత్రం దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. మహాకుంభమేలా, శబరిమల.... అన్నింటికీ మించి చార్‌ధామ్ యాత్రలో ప్రకృతి వైపరీత్యం వేలాది భక్తుల మరణాలకు కారణమైంది. 2013 జూన్ ఆకస్మిక వరదల విపత్తులో 5,360 మంది గల్లంతు అయినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ధారించింది. మరోవైపు భూతాప విపరీత దుష్పరిణామాలు వెంటాడి వేటాడుతున్నాయి. నదీ తీరాలలో విపరీత భక్తజన సందోహం కారణంగా తొక్కిసలాటలు జరుగుతూ ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ‘ఆధ్యాత్మిక పర్యాటకం’ జాతీయ వ్యాప్తంగా అశేష జనప్రవాహాలను ఆకట్టుకొంటోంది. ప్రగాఢమైన మత విశ్వాసాలు, యాత్రికులను బలీయంగా నడిపిస్తున్నాయి. నదులలో నీటి లభ్యతకు ప్రకృతి కరుణించవలసినదే. ఆధ్యాత్మిక భావావేశం శ్రుతి మించటంతో, జలవనరులను కాలుష్య కాసారాలుగా నిర్జీవ ప్రవాహాలుగా మారుతున్నాయి. భవిష్యత్ తరాలకు మనం ఏం సందేశం యిస్తున్నాం? ప్రకృతి, సంస్కృతి విధ్వంసం కాకుండా ఉంటేనే పర్యావరణం సురక్షితంగా ఉంటుంది. నదీ జలాల్లో ప్రవాహం కనిపిస్తుంది. ఇది సాధ్యమైనప్పుడే- ‘ఎప్పుడూ ఎడతెగక స్వచ్ఛ జల సంపదతో నదులు సజీవంగా మనకు జీవన్ముక్తి ప్రసాదిస్తాయి.

-జయసూర్య 94406 64610