సబ్ ఫీచర్

తెలంగాణ ఎన్నికలు.. గుణపాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటరు స్వేచ్ఛగా, రహస్యంగా తన అభిప్రాయాన్ని ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల పట్ల తన ఓటు ద్వారా సానుకూలంగా లేక వ్యతిరేకంగా వ్యక్తం చేయటం జరుగుతుంది. ఓటు ద్వారా వెల్లడయ్యే ఈ ప్రజావాంఛ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వెల్లడయ్యిందో ఓసారి పరిశీలిద్దాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పలువురి అంచనాలను మించి భారీగా పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ రమారమి 75 శాతం వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి 47 శాతం ఓట్లు సంపాదించి 88 స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో కంటే ఇది 13 శాతం అధికం. కాంగ్రెస్ 28.4 శాతం ఓట్లతో 19 స్థానాలను కైవసం చేసుకుంది. టిడిపి 3.5 శాతం ఓట్లతో రెండు స్థానాలను, బిజెపి 7 శాతం ఓట్లతో ఒక్క స్థానాన్ని, ఇతరులు 11.57 శాతం ఓట్లతో మిగతా స్థానాలను కైవసం చేసుకున్నారు.
అధికార తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, టిజెఎస్ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. ‘మహాకూటమి’ రూపకర్తల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యుడు. తెలంగాణలో సెటిలర్లు అధికంగా ఉన్న 30 స్థానాల్లో అత్యధికంగా సెటిలర్ల ఓట్లు ఉన్న కొన్ని స్థానాలను ఎంపిక చేసుకుని కాంగ్రెస్, సిపిఐ, టిజెఎస్‌లతో జతకట్టి దివంగత ఎన్టీఆర్ మనుమరాలిని సైతం ఎన్నికల బరిలోకి దింపి అసందర్భ ప్రగల్భాలు పలికి చంద్రబాబు తనతోపాటు అందరి కొంప ముంచిండు. ఇపుడైనా బాబు గ్రహించవలసిన విషయం ఏమిటంటే- రాష్ట్ర విభజన పిదప తెలుగుదేశం పార్టీకి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అవి తెలంగాణతో తమకు ఉన్న రెలవెన్సును కోల్పోయినవి. ఈ రెండు పార్టీల మూలాలు ఉన్నది కోస్తా ఆంధ్రలోనే అన్న విషయాన్ని గ్రహించిన తెలంగాణ టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర విభజన జరిగాక తమకు తోచిన పార్టీల్లో చేరిపోయిన్రు- కొద్దిమంది నాయకులు తప్ప.
ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వైఎస్ జగన్ తన కార్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం చేసికొండు. తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చుటలేదు. బాబు దీనికి భిన్నంగా అవకాశం దొరికినప్పుడల్లా తలదూర్చే ప్రయత్నం చేస్తుండు. దీన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతుండ్రు. తెలంగాణలో స్థిరపడిపోయిన కోస్తాంధ్ర సెటిలర్లను ఓట్లకోసం తట్టిలేపినా వారు అతని వైఖరిని తిరస్కరించారు. సెటిలర్లు తాము స్థానికేతరులము ఎంతమాత్రం కాదని తాము ముమ్మాటికీ స్థానికులమేనని తమను ఓట్లకోసం విభజించి చూడడం హేతుబద్ధంగా లేదనే సందేశానే్న ఈ ఎన్నికల్లో ఇచ్చారు.
ఇక ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించిన అసందర్భ వ్యాఖ్యల గురించి ఓసారి పరిశీలిద్దాం. ‘హైదరాబాదును నేను అభివృద్ధిపరిచా, ఇది నా మానసిక పుత్రిక, దీనికి నేను రూపమిచ్చా..’- అనే దానిని పరిశీలిద్దాం. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే మన దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. దీని అభివృద్ధి వెనుక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని బాబు అభివృద్ధి పరిచింది ఏమీలేదు. బాబు పాలనలో ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి వస్తే- నిజాంల కాలంలో ఇక్కడ వెలసిన పరిశ్రమలను నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘన చరిత్ర బాబుది. ఆ విధంగా మూతపడ్డ పరిశ్రమలు ఒకటి, రెండు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నవి. బాబు పెట్టించిన ఐటీ పరిశ్రమల్లో నిరుద్యోగులకు లభించిన ఉద్యోగాలు ఎన్ని? మూతపడ్డ పరిశ్రమల్లో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారింది ఎంతమంది?
స్వాతంత్య్రానికి పూర్వమే హైద్రాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉంది కాబట్టే చంద్రబాబు కళ్లు హైద్రాబాద్ మీద పడి విశాలాంధ్ర నినాదాన్ని తెరపైకి తెచ్చింది వాస్తవం కాదా? ఇలాంటి అసందర్భ వాదాలతో తెలంగాణలో ఓట్లు మహాకూటమికి ఎట్లొస్తయో అనుభవజ్ఞుడైన బాబే వివరించాలి. ఆయన పనిచేసింది ప్రజాకూటమి విజయానికా? లేక ఓటమికా? ఇక, ఎన్నికల ఫలితాల పిదప కూడ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోని పార్టీ కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి. అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలబెడతామని ప్రగల్భాలు పలికి, తీరా కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగి ఆ పార్టీ సాధించుకున్న మొత్తం ఓట్లు- ఒక్క హరీశ్‌రావు సాధించుకున్న మెజార్టీ ఓట్లకు కూడా సమానంగా లేవు. అంటే ఆ పార్టీకి తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆదరణ ఏపాటిదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కోదండరామ్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పిదప కూడా ‘టీ-జాక్’ (తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ)ని రద్దుపరచకుండా కోదండరామ్ కొనసాగించడం సహేతుకం కాదు. ఎందుకంటే రాష్ట్ర అవతరణతోటే ‘టీ-జాక్’ తన రిలవెన్స్‌ను కోల్పోయింది. తనకు ‘టీ- జాక్’ను ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలనే సంకల్పమే గనుక ఉండి ఉంటే రాష్ట్రోద్యమ కాలంలోనే దానిని ఒక రాజకీయ పార్టీగా తీర్చిద్దితే బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలుండేవి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని వ్యక్తులు రాజకీయాల్లో రాణించలేరన్న వాస్తవాన్ని గ్రహించి, ఇకనైనా కోదండరామ్ ముందుకు సాగడం మంచిది.
గత ఎన్నికల్లో గెలిచిన తెరాస ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టి దాని ఆధారంగా రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? వారి అవసరాలు ఏంటి? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటికి అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించింది. అందులో భాగంగానే మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ, యాదవుల కోసం గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మి పథకం కింద 3,45,577 మందికి, షాదీ ముబారక్ కింద 1,02,934 మందికి ప్రయోజనం కల్గింది. ఆ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే కాకుండా బీసీ, ఈబీసీ వర్గాలకు విస్తరించి గతంలో 75వేలుగా ఉన్నదాన్ని లక్షా నూట పదహార్లకు పెంచారు. వేతనాల పెంపుకూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలించింది. 27వేల మంది వరకు ఉన్న ఆశా వర్కర్ల వేతనాన్ని 1000 నుండి 6000కు పెంచారు. 18,491 మంది ఉన్న హోంగార్డుల వేతనాన్ని 12,000 నుంచి 20,000కు పెంచారు. 5,625 మంది అర్చకుల జీతాల్ని 8,000 నుండి 10,000కు పెంచారు. మినీ అంగన్‌వాడీల్లో పనిచేసేవారి జీతాలను 2,200నుండి 6,000కు, అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న 31,711 మంది సిబ్బంది జీతాలను 4,200 నుండి 10,500కు పెంచారు. ఇలా వేతనాల పెంపు వల్ల 1,02,183 మందికి ఆర్థిక ప్రయోజనం కలిగింది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 41 సంక్షేమ పథకాల ద్వారా తెరాస పార్టీకి ప్రజల్లో కులాలకు, మతాలకు అతీతంగా ఓటు బ్యాంకు పెరిగిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్ర జనాభా 3 కోట్ల 96 లక్షలు. కుటుంబాలు 83 లక్షల 4వేలు. కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో లబ్దిపొందుతున్న వ్యక్తులు 1,76,18,000. అంటే రాష్ట్రంలో కేసీఆర్ పథకాల ద్వారా లబ్ధిపొందని కుటుంబమే లేదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పథకాలతో టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో చెక్కుచెదరని పాజిటివ్ ఓటుబ్యాంక్ ఏర్పడినట్లు ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఈ పథకాలన్నింటినీ ఇకముందు కూడా సక్రమంగా అమలు జరిపితే టీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌కు సమీప భవిష్యత్తులో ఎలాంటి ముప్పు వాటిల్లదన్న విషయాన్ని గ్రహించి రాజకీయ పార్టీలు ముందుకు సాగటం మంచిది. ప్రజానాడిని పసిగట్టినోడే రాజకీయాలలో రాణించగలడు. తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోగలడు. తద్వారా ప్రజల ఆమోదం పొందగలడు. ఈ విషయంలో కేసీఆర్ తనకుతానే సాటినని నిరూపించుకున్నడు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఎన్ని కూటములు కట్టినా ప్రజల దృష్టిలో అవి కాలం చెల్లిన, కాలదోషం పట్టిన పార్టీలుగానే మిగిలిపోయినవి. కాంగ్రెస్, బిజెపి పార్టీలతోపాటు ఓటమి పాలయిన అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమికి గల కారణాలను లోతుగా విశే్లషించుకొని తప్పిదాలను తెలుసుకొని, తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాల్సి ఉంది.

-ప్రొ. జి.లక్ష్మణ్ 98491 36104