సబ్ ఫీచర్

నైపాల్ అంతరంగం.. అక్షరాలతో ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేన్నయినా సృష్టించడానికి కూర్చున్న తొలి క్షణాలలోనే, అంటే ఆరంభంలోనే, ఆ సృష్టించబడ్డ వస్తువుకి సంబంధించిన శిథిలావశేషాల చిత్రాన్ని చూడగలగడం, దానికి గల అవకాశాన్ని ఊహించగలగడం - ఇది నా స్వభావం. ట్రినిడాడ్‌లో నేను గడిపిన నా చిన్నతనం నాటి మా కుటుంబ పరిస్థితులు ఇందుకు కొంత కారణం కావచ్చు. మేము నివాసంవున్న ఆ సగం కూలిపోయిన ఇళ్ళు, ఎన్నో స్థానచలనాలూ, ఫలితంగా మామూలుగానే మా మనసులలో పేరుకుపోయిన అనిశ్చితత్వము. ఈ తరహా అనిశ్చితి, బహుశా, నా అంతరాంతరాలలోకి బలంగా కూరుకుపోయి, అనువంశికంగా దిగుమతి అయినటువంటిదైన నన్ను తయారుచేసిన నా చరిత్రతోపాటు వచ్చినదది.
ఆరేళ్ళ క్రితం- ఆ వయసులో ఆరేళ్ళ యవ్వనకాలం అంటే దాదాపు సగం జీవితం అన్నట్లుగా లెక్క- పోర్టు ఆఫ్ స్పెయిన్‌లో ప్రతిదీ నా వీడ్కోలుతో అలంకరించబడి వున్నట్లుగా నాకు కనుపించింది. ప్రతి వస్తువులోనూ నా ప్రయాణం తాలూకు ఉత్సాహం, న్యూయార్క్, సౌతాంటన్, లండన్, ఆక్సుఫొర్డ్ లాంటి లోకప్రసిద్ధ ప్రదేశాలకు నా సుదీర్ఘ ప్రయాణం తాలూకు ఉత్సాహంతో మెరిసిపోతున్నట్లుగా కనుపించింది. ప్రతి మెరుపులోనూ నిశ్చయమై కనుపించిన రచయిత జీవితం, ఒక అద్భుతమైన కల, అందమైన మహానగరం జీవితం. అయితే, ఆరేళ్ళ తరువాత ఇప్పుడు, నేను వదిలేశాననుకున్న ఆ ప్రపంచమే నాకోసం ఎదురుచూస్తున్నది. కుంచించుకుపోయి వుంది ఆ ప్రపంచం, దానితో సమానంగా నేనూ కుంచించుకుపోయానని నాకు అనిపిస్తోంది.
లండన్‌లో నాకెవరూ గైడు-మార్గదర్శకుడు- లేడు. అయితే, అక్కడ అప్పటి వర్తమానంతో నా భూత కాలాన్ని, అందులో జరిగిపోయిన సంగతులను జోడించి బేరీజువేసే వాళ్ళు, నా మనోస్థైర్యాలనూ దౌర్బల్యాలనూ పరిశీలనగా చూసి గుర్తుంచుకునే వాళ్ళుకూడా అక్కడ ఎవ్వరూ లేరు. నాకు నచ్చిన వ్యక్తిత్వాన్ని నేను ఎంచుకొని అలాంటి వ్యక్తిగా కనుపించే స్వాతంత్య్రం అప్పుడు అక్కడ నాకు వుంది. కనుకనే, చాలా తేలికపాటిదైన, ఆకర్షణీయంగా కనబడేదైనట్టిది, ఫాషన్ గురించి అతి శ్రద్ధ చూపించే వ్యక్తి బాగా డబ్బు ఖర్చుపెట్టే ‘కొలొనియెల్’ వ్యక్తిత్వాన్ని నేనప్పుడు ఎంచుకున్నాను, నా ‘స్కాలర్‌షిప్’ ఆదాయంతో సంబంధం లేకుండా.
రచయితగా నేనొక ప్రారంభం చేశాను. కానీ, నేను రాసిన రెండు పుస్తకాలలో ఏదీ ఇంకా ప్రచురణ కాలేదు; నాకు ముందు మరి దారి కనుపించలేదు; మరింకో పుస్తకాన్ని గురించిన ఆలోచన కూడా ఏదీ నా మనస్సులో లేదు. ఆరేళ్ళక్రితం నేనొక అప్పుడప్పుడే యవ్వనంలోకి కళ్ళనిండా ఎన్నో కలలతో అడుగుపెడుతూన్న ఒక పిల్లవాడిని... ఎవ్వరికీ జవాబివ్వవలసిన అవసరం లేని చిన్న వాడిని. ఇప్పుడు అలా లేదు, నా తండ్రి గతించాడు; చుట్టూ అప్పులు పేరుకుపోయాయి; కుటుంబ బాధ్యతలు నామీద పడ్డాయి. కానీ నేను వాటిని మోయగలిగే స్థితిలో లేను. నన్ను నేనే పోషించుకోలేని స్థితి నాది. నావద్ద ఉన్నది ఒకటే కొత్తగా నేను గుర్తించిన విద్య; నేను చేయగలిగినదీ, నన్ను నేను పోషించుకోవడానికి నేను చేయాల్సినదీ, నేను ఇంగ్లాండు వెళ్ళిపోవడం- నాకు అదిప్పుడేమీ ఒక కలల ప్రదేశం కాదు; కేవలం రేడియోకి పనికివచ్చే వ్రాతలతోనూ, పత్రికలకు చిరు వ్యాసాలతోనూ, నా పుస్తకాలు ప్రచురించబడే దాకా, రచయితగా నాకు ఒక చిన్నపాటి జీవితాన్ని అందించగల ప్రదేశం.
ఇంగ్లాండులో ఇంతకాలం గడిపాక కూడా, నాలో ఇంకా కొత్త ప్రదేశానికి సంబంధించిన బెరుకుతనం గూడుకట్టుకుని ఉండేది; ముక్తసరి సమాధానాలిచ్చే మొగమాటమనేదే లేనితనం, మనది కాని ప్రదేశంలో ఉన్నామన్న భావన, పరిసరాలనుంచి నాకు నేనే అనుభవించే ఏదో వింత దనం, నాదైన పూర్తి ఏకాంతం. (ఇంగ్లండులోనే) ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళిన ప్రతిసారీ- వేరే ఎవ్వరికైనా అది ఒక ఆహ్లాదకరమైన అనుభవం అయ్యేటువంటిది- నాకు మాత్రం మానకుండా వున్న ఎప్పటిదో ఒక పాత గాయాన్ని ఎవరో బలంగా పట్టి కెలుకుతున్నటువంటి అనుభూతి కలిగేది. ఒక గదినుంచి మరో గదికి, ఒక ప్రదేశాన్నుంచి మరో కొత్త ప్రదేశానికి, అలా అలా మారుకుంటూ దూరంగా, ఇంకా దూరంగా, చివరికి నగరం నడిబొడ్డునుంచి అంచులకు చాలా దూరంగా! ఆ ఇళ్ళు, అవి అందించే తాత్కాలికత, పెళుసుదనపు అనుభూతి. పైపై పొరల మీదనే చదును చేయబడిన వ్యవసాయ భూములపై పైపైన నిర్మించబడిన తాత్కాలిక నివాస ప్రదేశాలవి. ఆ అంగళ్ళు! ఆ వార్తల ఏజెంట్లు! ప్రతిచోటు చేరిన కొద్ది రోజులలోనే నిరాసక్తంగా తయారయేది. నాలో చాలా అసహనం పెరిగిపోయేది. గమనం తప్ప వేరే ఏ కారణమూ లేకుండా, ఒక ప్రదేశాన్నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించేవాడిని. పక్కన దాచి వుంచుకున్న కొద్దిపాటి డబ్బును ఇందుకోసం ఖర్చుపెట్టేవాడిని.
ఒక మాట తప్పనిసరిగా చెప్పాలి, అదేమంటే మనలో చాలామందిమి ధనానికి పేదలం. అయినా దీనిని గురించి పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు. కారణమేమంటే, మనలో చాలామందికి చాలా పెద్ద మొత్తంలో రాసులు రాసులుగా ధనార్జన చేయడం అంటే ఏదో చెప్పలేని భయం, కాకపోతే అదెలాగో తెలియనితనం. నా ప్రయత్నాలలో నేను సఫలీకృతుడనౌతానని నాకు పూర్తినమ్మకం. నేను బ్యాంకుకు 150000 డాలర్లు అప్పువున్న రోజులలో కూడా నా ఈ నమ్మకానికి సడలింపు ఉండేది కాదు, నా మనసుకు అది ఒక ఇబ్బందికర ఆలోచనగా అనిపించేది కాదు.
ఎదుటి వ్యక్తి కళ్ళలో మనకు మనం ఎలా కనబడతామో, తుది సారాంశంగా అలా అవుతాం మనం. మనం మనల్ని వదిలి బయటికి రావడానికి ప్రయత్నించినపుడల్లా స్థూలంగా, మనకు పొడిగింపులాంటి వ్యక్తులకోసమే వీధిలో వెతుకుతాం. నగరంకోసం వెదుకుతాం, కానీ చిన్నచిన్న గుహల లాంటి వ్యక్తిగత ఆవాసాల సాంద్ర సముదాయాన్ని ఎదుటగా చూస్తాం. అది మరెక్కడో కాదు, నగరంలోనే మనకుమనం ఒక్కరమే అయిన ఏకాంత వ్యక్తులం అనే విషయం పదే పదే మన తలపులకు గుర్తుచేయబడుతుంది. అయినప్పటికీ, నగరం అనే ఒక అమోఘమైన సంఘటిత భావన మన మనస్సులను ఎప్పుడూ ఆవహించే వుంటుంది; నగరమనే ఒక ఆనందమయమైనదనిపించే ఒక అనంతాత్మకోసం వెదుకులాడుతాం, అది దొరికేది కాదని అనుభవం చెబుతున్నప్పటికీ, తెలిసి తెలిసీ! నా రహస్యాలను నేనెప్పుడూ గౌరవించలేదు, భద్రంగా దాచుకోలేదు. దానికి అనుగుణంగానే నా బహుసున్నితమైన జ్ఞాపకశక్తి వాటిల్లో చాలా వాటిని తుడిచేసి, తగిన విధంగా సంపాదకత్వం నిర్వహించి, మొత్తంమీద నా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను ఒక అస్పష్టమైన చలనచిత్రపు ముక్కగా మార్చేసింది. కానీ ఆ కాస్త కూడా నన్ను బాధపెట్టడానికి సరిపోయేంత సమర్ధత కలిగినదిగా వుంటుంది.
అత్యద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి వుండడం కూడా సరైనది కాదు. అది బాధకు హేతువుగా పరిణమిస్తుంది.
బాధను ఒక స్థాయి దాకానే ఇతరులతో పంచుకోవడం సబబు. ఆ స్థాయిని మించి పంచుకోవాలని చూడడం సాహసమే అవుతుంది. మా టీచర్‌కోసం చేతిలో ఒక ఆపిల్ పండుతో వెళ్ళడం స్కూలుకు సంబంధించిన నా మొదటి జ్ఞాపకమే. ఇది నాకు ఎప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, ఇసబెల్లాలో ఆపిల్ పండ్లే దొరకవు. బహుశా అది ఆరంజి పండు అయి వుండొచ్చు. కానీ నా జ్ఞాపకశక్తి మాత్రం ఆపిల్ పండు అనే భీష్మించుకు కూర్చుంటుంది. ఇంతకుమునుపు చెప్పిన నా జ్ఞాపకశక్తికి సంబంధించిన ఎడిటింగులో ఏదో తప్పు జరిగింది. కానీ, ఏమిటి చెయ్యడం? ఇప్పుడు నా జ్ఞాపకంలో ఆ ఎడిటింగ్ చేయబడిన కూర్పే నిక్షిప్తమై వుంది. విజయం విజయమే; ఒకసారి అది సంభవించిందంటే దాని గురించి అదే లోకానికి పూర్తిగా అర్థమయ్యేలా తెలియజేసుకుంటుంది. శిఖరం ఎక్కేటప్పుడు దారిలో ఎదురయ్యే వ్యక్తులతో స్నేహంగానూ, కరుణతోనూ వ్యవహరించమని పెద్దల సూక్తి. కారణమేమంటే, శిఖరం మీద నుంచి దిగేటప్పుడు లేదా అంత ఎత్తునుంచి (ఏదైనా ప్రమాదం జరిగో, కాకుంటే కర్మకాలో) పడిపోయేప్పుడు దారిలో ఎదురయ్యే వ్యక్తులు కూడా వారే అయివుంటారు కాబట్టి. రోజులో అప్పుడు ఎటువంటి మనఃస్థితిలో వున్నా, కూడదీసుకుని కలం చేత పట్టుకుని అక్షరాలతో ముందుకు కదలడమే రచయిత జీవితమంటే!
(The Enigma of Arrival, The Mimic Men అనే పేర్లుగల రెండు రచనలలో, కథనం మధ్యలో సర్.వి.ఎస్.నైపాల్ తన గురించి తాను సందర్భానుసారంగా వ్రాసుకున్న వాక్యాలకు భావానువాద చిత్రణ ఈ వ్యాసం.)

- భట్టు వెంకట్రావ్