సబ్ ఫీచర్

మానసిక వికాస.. వినోద చూపులు చాటువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం పుట్టుకను చాటి చెప్పినదే చాటు కవిత్వం! ఆదికవి వాల్మీకి నోటినుండి వెలువడినమానిషాద ప్రతిషాత్వం.. అనే శ్లోకం ఒకవిధంగా చాటువే అని చెప్పవచ్చు. అనేకమంది కవులు వివిధ సందర్భాల్లో స్పందించిన ప్రతి స్పందనల రూపమే చాటువులు. వీటికి కవిత్వ సామగ్రి అవసరం లేదు. పట్టు పాన్పులు.. పడతుల సహకారం.. పడకగదుల రసరమ్య పరిమళాలు ఏవీ అవసరం లేదు. కటిక దరిద్రం, కన్నీళ్లు, కోపం, కలహం, దూషణలు, భూషణలు, భాషణలు, సౌందర్యం కనిన వేళ.. అహంకారం పొడసూపినవేళ కూడా చాటువులు.. మహాకవుల హదృయాంతరాల్లోనుంచి కదలి వచ్చాయి. కావ్యాల్లో కలకాలం నిలిచి ఉన్నాయి.. ఉంటాయి.
చాటువులు మహాకవులు తమ జీవన పథమున వదలి వెళ్లిన పాదముద్రలు.. వారి కవితా స్రవంతుల పిల్లకాల్వలు.. వారి జీవిత ప్రవాహవేగమును..సుడిగుండాలను ఆటుపోట్లను విశదపరచిన కల రేఖలు.. చాటువనగాప్రియమైన మాట ఈ శబ్దమునకు మనోహరమైన అనే అర్థం కూడా వుంది. కూలంకష చాటువుల మాటకారితనంబు మెరసి.. అనే అల్లసాని వారి చతురత చాటువులకు చాటుధారలని కూడా పేరు (అప్పకవి రావిపాటి తిప్పన చాటుధార అని ప్రయోగించారు)
సాహిత్యం సర్వకాలజనహితం.. సర్వకాల జీవనం.. ప్రతీ సాహితి ప్రక్రియ నిన్న -నేడు-రేపులను దర్శించాలి. కవులు ద్రష్టలు.. ప్రాచీన కవుల చూపు మరీ లోతైనది.. నాటి రామాయణ, భారత భాగవతాదుల నుంచి నేటి విశ్వనాధ వారి వరకు కూడా సాహిత్యం వేనవేల సంవత్సరాల జీవనస్రవంతికి జవసత్వాలనందించింది. కనుకనే నాటి చాటువులు నేటి సమాజంలోని చూపును చిత్రించింది. వర్తమాన సమాజ స్థితిగతులకు అద్దంపట్టిన చాటువులు ఎన్నో, ఎనె్నన్నో.. ప్రాచీన సాహిత్య అధ్యయనం, ఆవశ్యకతను అవగతం చేసుకుంటే వర్తమాన సమాజంలో మనిషి మనుగడ ఎంతో సరళతరంగా సాగిపోతుంది. కాని అంత సమయమేది? ఆంగ్లమాధ్యమ మోజులో ఆపాతమధురాల్లోని రసాస్వాదన, జీవన సాఫల్య జీవిత సూత్రాలను అధ్యయనం చేసే తీరిక, ఓపిక ఏవి? అల్లసాని, శ్రీనాథుడు, రంగాజమ్మ, ముద్దుపళని, వేములవాడ భీమకవి, కూచిమంచి జగ్గన్న, పింగళి సూరన, మడికి సంగన్న, విన్నకోట పెద్దన, అనంతామాత్యులు, కవయిత్రి మొల్ల, కుందుర్తి వెంకటాచలపతి-ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతుండదు.
వీరంతా చాటువులను ఆనాటి సామాజిక, ఆర్థిక, కౌటుంబిక ప్రతిబింబాలుగా చెప్పినవారే.. చాటు స్వభావమును బట్టి 7 లక్షణాలను కలిగివుంటుందని లాక్షిణకులు తెలియజేశారు. ముక్తక లక్షణమును కలిగి ఉండటం (స్వతంత్ర), ఆశుకవిత, సంఘటన, సందర్భము, లఘురూపము- మనోహరం, హృదయ రంజకం, కర్తత్వ నిర్థరణ కొన్నిచోట్ల చేయటం కుదరదు. కర్త నిజ జీవితమునందలి అనుభవాలను వ్యక్తీకరించును. ఉల్లాసం, వినోదమును అల్పాక్షరాల్లో గుదిగ్రుచ్చి చెప్పిన చాటువులు వీటి వెనుక ఓ సమాజపు విరుపు.. మెరుపులను కూడా గమనించవచ్చు.
జొన్న చేనుకాడ సొగసుగత్తెను జూచి / నిన్నటేలనుంచి నిదురాదు / దాని నన్ను గూర్చి దయజూపు మాధవా / పొన్నపూలు దెచ్చి పూజసేతు.
సిరిగలవానికి జెల్లును, / తరుణల పదయారువేల దగ బెండ్లాడన్ / తిరుపమునకిద్దరాండ్రా? / పరమేశా! గంగవిడుపు పార్వతి చాలున్.
శ్రీనాధుడు రాయలసీమ ప్రాంతంలో పర్యటించేవేళ పట్టెడన్నం పెట్టేవారు కాని, గుక్కెడు నీళ్ళు ఇచ్చేవారు లేరు. వర్షాభావ ప్రాంతమది. నీటికి కటకట. సంకట ముద్దతో కారం (నెయ్యలేదు మరి) ఇస్తే కళ్ళ వెంట నీరు వచ్చి.. ఆయనకు దేవుడు కనిపించాడు.
సిరిగలవాడు విష్ణువుకు ఇద్దరు పెళ్లాలున్నా పెంచగలిగాడు. కాని బిచ్చమ్తె తిరిగే శివునికి ఇద్దరు పెళ్ళాలెందుకని వివరించినతీరు చతురోక్తి అయినా.. అందులోని సామాజిక కష్టంను ఎత్తిచూపిన విధం గొప్పది. వ్యంగ్యానికున్న శక్తి అది..
చమత్కారయుత సమస్య (పొడుపు కథ)లనుకూడా కవులు సమాజ దృక్కోణం నుంచే చెప్పుకొచ్చారు. శ్రీనాధుడు పల్నాటి సీమలో పర్యటించిన వేళ అక్కడి ప్రజాజీవితమును తన చాటువులలో వివరించెను.
చిన్న చిన్నరాళ్ళు చిల్లరదేవుళ్ళు / నాగులేలినీళ్లు నాపరాళ్ళు / సజ్జజొన్న కూల్లు సర్పాంబులును దేశి / పల్లెనాటిసీమ, పల్లెటూళ్ళు.
పల్నాటి సీమలోని గ్రామాలలోని దైన్యాన్ని ఆయన ఈవిధంగా వివరించెను. ఎటువంటి భాష్యం, భావం ఈ అలతి అలతి పదాల చాటువుకు చెప్పుకోనవసరం లేదు.
సమాజాభివృద్ధికి, వ్యక్తిగతాభివృద్ధికి కూడా సోమరితనం చేటని చెబుతూ.. చదువు మట్టుపడును! సంస్కృతి చెడిపోవు / సంపదలు తొలంగు! సౌఖ్యమడుగు / గౌరవంబు పోవు గావున సోమరి / తనము కన్న హీనగుణము గలదే?
పదాల అల్లిక, పద మాలికలో చమత్కారం, చతురత వంటివి ఎనె్నన్నో చాటువులలో మనసుకు ఆహ్లాదపరుస్తుంది. తెలుగు భాషామాధుర్యాన్ని చాటిచెబుతుంది.
మామా మోవౌ వౌమా / మామా మిమ్మొమ్మువౌమమామామీ / మే మొమ్మమ్ముము మీమైమా / మేమే మమ్మోము మోము మిమ్మవ్మౌమా
పోతన-అడిగెదనని కడువడిజను అడిగిన తనుమగు డనుడుడవడనినడయుడుగన్, తెనాలి రామకృష్ణ కవి- తొకకొకమేక తోక తోక వంటి చమత్కార అక్షర విన్యాస చాటువులు, శాస్త్ర ప్రహేళికలు, సమస్య పురణాలు, పరిష్కారాలు, ఏకాక్షరలు, స్వరాక్షర విలోమ పదాలు, ప్రశ్నోత్తరైక పదాలు, మా అన్వయి క్లిష్ట ప్రహేళికలు, పొడుపు కథలు, చిత్ర కల్పన మాజిక్ ( తన మనసులో అనుకొన్నది ఎదుటివారు చెప్పటం-పంచక్షపక్షి, కర్ణపిశా వంటివ్యాలంటారు)
చాటువులది ఒక విశ్వరూపం. సంపూర్ణ సాహిత్యదర్శనం. హాస్యం, చతురత లుప్తవౌతున్న వర్తమానంలో చాటువులు వలన మనిషికి మానసికానందం కలుగుతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. సంఘ సంస్కరణ దృష్టితో మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ వారన్న మాటను ఆరుద్రగారు కొద్దిగా మార్చి మంచి గతమున ఘనమేనోయ్ అని భరోసా ఇచ్చారు. ప్రాచీన సాహిత్యంలోని వివిధ ప్రక్రియల పఠనం వలన మానసికోల్లాసంతోపాటు మేథ వికశిస్తుంది. వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. ఎన్నో సంక్లిష్టతల నడుమ వర్తమానంలో మానవ జీవితం నిరాశాజనకగా కొనసాగుతున్నది. ఇటువంటి సమయంలో చాటువులలోని చమత్కారం, సమస్యా పరిష్కారం, మెరుపులు.. పద విరుపుడు వంటివి గొప్ప మానసిక ప్రశాంతతను కలిగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.

- భమిడిపాటి గౌరీశంకర్, 9492858395