సబ్ ఫీచర్

ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘మత సామరస్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మతసామరస్యాన్ని’ ప్రతిబింబించే రచనలు కోకొల్లలు. విభిన్న సాహితీ ప్రక్రియలు ఈ సృజనాత్మక భావాలను చైతన్య స్వరాలుగా వెదజల్లడానికి తెలుగునాట కంకణం కట్టుకున్నాయి. వీటిలో కథ, గేయం, గీతం, పద్యం, వచనకవిత, మినీ కవిత వంటి రచనా ప్రక్రియలు తమ వంతు పాత్రను చాలా సమర్థవంతంగా పోషిస్తూ వస్తున్నాయి. ఈ ప్రవాస పరంపరలో ఆధునిక వచన సాహిత్యం గురజాడ అప్పారావు రచనలతో ఊపిరిపోసుకుంది. వ్యవహారికభాషకు పట్టం కట్టి, గిడుగు పిడుగు రామమూర్తి పంతులుగారితో కలిసి విప్లవాత్మమైన మార్పులను తీసుకొచ్చాడు గురజాడ. బరంపురంలో జరిగిన సర్వమత సహపంక్తి భోజనాల ప్రభావంతో ‘ముత్యాల సరాలు’ అనే మాత్రా చందస్సును ప్రవేశపెట్టి కవితా రచనకు శ్రీకారం చుట్టాడు. ఆధునిక వచన సాహిత్యానికి వేగుచుక్కై మత సామరస్యాన్ని ప్రతిఫలింపజేయడంలో సంఘ సంస్కరణోద్యమానికి మూలపురుషుడయ్యాడు గురజాడ.
‘‘మీ పేరేమిటి?’’ కథలో భిన్న మతస్థుల సంఘర్షణతో తలెత్తిన వివాదం, గుండం తొక్కే మిషతో జరిగిన రచ్చ మధ్యలో... అప్రయత్నంగా ఊడిపడిన నాంచారమ్మ తెగువ గొప్ప చైతన్యానికి ప్రతీక. పలు తెగలమధ్య జరుగుతున్న మత వివాదానికి చరమగీతం పాడేలా చేసిందామె. రామనామం జపించే పీరు సాహెబు అగ్ని గుండంలోంచి ‘అల్లా-రామ్’ అంటూ నడిచిపోతాడు. గురజాడ మాటల్లో చెప్పాలంటే.. ‘‘రాముడే కాదు.. ఏ దేవుడిమీదైనా నిజమైన నమ్మకమన్నది ఏడిస్తే.. ఒక గుండమే కాదు-అన్ని కష్టాలు తరించవచ్చు..’’ అంటాడు. ఈ కథలో గురజాడ ప్రబోధించినట్టుగా.. ఏ మతాన్ని అవలంభించినా, ఏ దేవుణ్ణి ఆరాధించినా.. మానవుడికి ఆత్మ సంకల్పం, వ్యక్తిగత విశ్వాసం అవసరమని బలంగా నొక్కి చెబుతాడు.
‘‘శివుడూ, విష్ణూ.. పేర్లే ఐనపుడు, బుద్ధుడు శివుడు కారాదా?’’ అన్న శాయన్న భుక్త పలుకులు సర్వమత సామరస్యానికి అద్దం పడతాయి. ‘‘సంస్కర్త హృదయం’’ కథలో కూడా.. ‘‘ఎంతటి విరుద్ధ మతమైనా.. శాస్త్ర సమ్మతమేనని సమర్థించగల పండితుడు’’ అంటూ విశ్వనాధశాస్ర్తీని దృష్టిలో పెట్టుకొని... ఈ మాటలు పలికిస్తాడు గురజాడ. ‘్భన్న మతాల కలయిక సారం ఒక్కటే’ అన్న అంతర్లీన ధ్వని వినిపిస్తుంది ఇందులో. కాబట్టే.. గురజాడ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని మత విశ్వాసంతో సగర్వంగా ఎలుగెత్తి చాటగలిగాడు.
మరొక విశిష్టమైన కథా రచయిత సలీం రాసిన ‘‘రాణీగారి కథలు’’ హిందూ- ముస్లిం సమైక్యతకి, మతసామరస్యానికి సజీవ దర్పణంగా నిలుస్తాయి. వీటిలో.. ‘ఆరడుగుల నేల’ కథ గొప్ప మానవతా విలువలకి పట్టం కట్టి, మతాతీతమైన అనుబంధానికి నిలువుటద్దంగా కనిపిస్తుంది. నిఖా జరిగే సమయానికి పెళ్లికూతురు వేరే హిందూ అబ్బాయిని ప్రేమించి, రక్షణ కోసం పోలీసు శాఖను ఆశ్రయించి, వివాహం జరపవలసిందిగా కోరుతుంది. దీనికి ససేమిరా అంగీకరించని ఇరువైపుల మత పెద్దలు.. గొడవకి దిగి, రక్తపాతాన్ని సృష్టిస్తారు. నజీర్ రెహ్మాన్ అనే ముస్లిం సంఘ సంస్కర్త హిందూ యువతిని పెళ్లాడి.. మతంకన్నా మానవత్వం గొప్పదని విశ్వసించి ఆదర్శనీయమైన జీవితాన్ని గడుపుతాడు. అలాంటివ్యక్తి కాలం చేశాక-స్మశానంలో అతనికి ‘ఆరడుగుల నేల’ చోటుని దక్కనీయకుండా.. తమ మతాచారాలను కించపరిచాడనే ఉద్దేశంతో వెలివేస్తారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో బెస్తవాళ్లు తమ పూరి గుడిసెల మధ్య అతనికి సమాధి కట్టించి, ఖనన సంస్కారాలు పూర్తిచెయ్యడంతో కథ ముగుస్తుంది. ఈ కథతోపాటు గేయ కవిత్వం కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగివుంది. ఈ ఒడుపును గురజాడ చాలా సమర్థవంతంగా అందిపుచ్చుకున్నాడు. ‘దేశభక్తి’ గేయంలో ఓచోట గురజాడ ఇలా చెబుతాడు. ‘‘మతం వేరైతేను ఏమోయి / మనసులొకటై మనుషులుంటే’’ అని అనడంలో.. మతాలు వేరైనా మనసులు కలిసిన మనుషులే ముఖ్యం అని చాటిచెబుతాడు. మతానికన్నా మనసుకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇక్కడ గమనార్హం.
‘‘మతములన్నియు మాసిపోవును / జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’’ అంటాడు. ఇక్కడ మతంకంటే జ్ఞానానికే పెద్ద పీట వేస్తాడు గురజాడ. అన్ని మతాలకు మూలం జ్ఞానం అనే ఇంగితజ్ఞానాన్ని లోకానికి సందేశ రూపంలో అందిస్తాడు.
ఇలాంటి కోవకి చెందిన జాతీయ సమైక్యతా గీతమొకటి బోయి భీమన్న కలం నుంచి జాలువారింది.
‘‘ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము? / ఎల్ల మతముల సారమొక్కటే / హృదయమే మతము’’ అనే సందేశాత్మక గీతం మతసామరస్యం యొక్క ఆవశ్యకతను సాహితీ లోకానికి చాటిచెబుతుంది. పద్యం హృద్యమైన భావ సందేశాన్ని అందిస్తుంది. ఈ అనుభవాన్ని చాలా దూరదృష్టితో కవి రాయప్రోలు సుబ్బారావుగారు ఒకచోట గాఢాభివ్యక్తితో వ్యక్తీకరిస్తాడు.
‘‘అర్చకులెల్ల మందిరమునందు సమాహితమైన వేళ వ్రే
మార్చి రగిల్చి రుూ మత మతాంతర వైరము లెల్ల కాల్చి చ
ల్లార్చితివేని శంఖరవ మందె నమాజుల పిల్పు మేళమై
పేర్చి వినంబడున్ పిదప ప్రేమనే నిర్గుణమందు రందరున్’’
- అంటూ మత వైరములను లేకుండా చేసి, ప్రేమను అందరిలోనూ వ్యాపించేట్లు చేయాలని కవి రాయప్రోలు సుబ్బారాగారి ఉవాచ. దీనికి కారణం ఆధునిక కవులు ఈ మత కల్లోలాలను ప్రత్యక్షంగా చూసినవాళ్లున్నారు. అనుభవించినవాళ్ళూ ఉన్నారు. ఈ వేదనను మత సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆరాటపడుతున్నాడు కవి.
సుమన్ అనే ఆధునిక కవి పలుకుల్లో చెప్పాలంటే..
‘‘హిందూ ముస్లిం సోదర / బాంధవ్యము మంటగలిపి బలిమిన్ కలిమిన్ / కొందరు ముష్కరులెప్పుడూ / సంధింతురు పగల సెగలు సత్యము సుమనా’’ అంటూ వాపోతాడు కవి. మతపరమైన విధ్వంసానికి కొందరు ముష్కరులు ఏ విధంగా కారుణభూతులవుతున్నారో నిరూపించే పద్యం ఇది.
వచన కవిత్వం విషయానికొస్తే సర్వజన సమ్మతమైనదిగా కనిపిస్తుంది. అందుకే బాలసాహిత్యాన్ని సృజిస్తూ దేవులపల్లి కృష్ణశాస్ర్తీ ఒకచోట తన అంతరంగాన్ని ఇలా బయటపెడతారు. - ‘‘మతమన్నది నా కంటికి మసకైతే / మతమన్నది నీ మనసుకు మచ్చైతే / మతం వద్దు గితం వద్దు / మాయా మర్మం వద్దు / ద్వేషాలు, రోషాలు తెచ్చేదే మతమైతే / కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే / మతం వద్దు గతం వద్దు / మారణహోమం వద్దు’’ అంటూ కష్టాలు కొనితెచ్చే మతాన్ని నిలువెల్లా ఈసడిస్తూ నిర్మొహమాటంగా తన అభిప్రాయ ప్రకటనను వెలిబుచ్చుతారు కవి.
ఎల్లోరా అనే మరొక కవి వర్తమాన సామాజిక ప్రపంచాన్ని కళ్ళకు కట్టించే ప్రయత్నం చేస్తాడు. ‘‘ఈ నా ధరిత్రీ వదనాన్ని వికృతం చేసే / భరతజాతి మనుగడను కకావిలు చేసే / అవివేకులు స్వార్థపరులు అసంతృప్తి మతపిచ్చితో / తమని తాము బంధించుకొన్న సూత్రాలలోంచి / మూఢ నమ్మకాల లోంచి / బయటపడలేని నిస్సహాయ జీవులు’’ - అని మతవ్ఢ్యలను చూసి జాలిపడుతూ.. ‘‘అన్ని మతాల సారాన్ని ప్రవహించడం తప్ప / స్వార్థం ఎరుగని జీవనదుల్లా ఉప్పొంగుతాను’’ అంటూ సర్వమత సామరస్యాన్ని బోధిస్తాడు ఎల్లోరా.
మతాన్ని గురించి, సర్వమత సామరస్యాన్ని గురించి మహాకవి శ్రీశ్రీ ఇలా ఉపదేశిస్తాడు. ‘‘మతము ఎన్నియు దైవ సమ్మతములగును / మతములన దైవపూజకు మార్గములగు / అన్నిమతముల యందున ననుసరించు / దగిన నీతులు గలవు వందల కొలది’’ అంటూ సర్వమతాల నీతి అంతస్సారాన్ని గ్రహించి నిజాన్ని తెలుసుకోవాలంటాడు. నీతిని బోధించే మతాన్ని ఆచరించాలిన జ్ఞానబోధ చేస్తాడు.
మినీ కవితల ప్రస్థానంలోనూ అనేక హృదయావిష్కరణలు కనిపిస్తాయి. ఇలా ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో మత సామరస్యం’పై పలు రచనలు వెలుగు చూసి, మానవాళి అభ్యున్నతికి, పురోగతికి, మానసిక వికాసానికి దారితీశాయి. ఈ ముందుచూపు భావితరాలకు మత ప్రమేయం లేని రాజ్య వ్యవస్థను పటిష్టపరిచి విశ్వమానవ దృష్టిని ఏకత్వంతో ప్రసాదిస్తుందని ఆశిద్దాం!

- మానాపురం రాజా చంద్రశేఖర్, 9440593910