సబ్ ఫీచర్

‘చుక్కల’ చిక్కులకు పరిష్కారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ‘చుక్కల భూముల’ సమస్య ఇకపై పరిష్కారం కానుంది. దాదాపు 64 సంవత్సరాల నుంచి రైతులు, వారి కుటుంబాలు తమ భూములకు సంబంధించి ఈ ‘చుక్కల’ చిక్కులతో అల్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ‘చుక్కల’ వెనక పెద్ద కథే ఉంది. బ్రిటీష్ పాలకుల హయాంలో 1906లో దేశవ్యాప్తంగా భూములపై సర్వే జరిగింది. ఆ తర్వాత 1954లో రీ సర్వే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ భూములపై సమగ్ర సర్వే గానీ, రీ సర్వే గానీ మళ్లీ జరగలేదు. అందువల్ల భూమి హక్కులకు సంబంధించి 1954 నాటి రెవెన్యూ రికార్డులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నాయి. 1954లో రీ సర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్ వారీగా భూమి హక్కుదారుల పేర్లు, సర్వే నెంబర్లు, వాటి విస్తీర్ణం వంటి వివరాలను నమోదు చేశారు.
అయితే, ఎవరూ యాజమాన్య హక్కు కోరని భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో చుక్కలు (డాట్స్) పెట్టారు. అప్పటి నుంచి ఈ భూములను చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్స్)గా పిలుస్తున్నారు. 1954 తరువాత ఆ భూములను సాగుచేసుకునే వారికి ఎటువంటి యాజమాన్య హక్కులు లేవు. ఆ తరువాత భూముల రీ సర్వే చేయకపోవడం వల్ల ఈ సమస్య కొనసాగుతోంది. వాటిని వారసత్వంగా బదిలీ చేయడానికి గానీ, అమ్ముకోవడానికి గానీ అవకాశం లేదు. అప్పటి నుంచి రైతులను ‘చుక్కల చిక్కులు’ వెంటాడుతున్నాయి. ఆ తరహా భూములన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుంచి దశాబ్దాలుగా ఆ భూములను సాగుచేసుకుంటున్న వారికి కూడా యాజమాన్య హక్కులు లేకపోవడంతో అనేకమంది కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులను విచారించిన ధర్మాసనం- హక్కు పత్రాలున్న వారికి న్యాయం చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఈ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ చుక్కల భూములు ఎక్కువగా ఉన్నాయి. రాష్టవ్య్రాప్తంగా 24 లక్షల ఎకరాలకు పైగా చుక్కల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు అంచనా. వీటిలో 17.7 లక్షల ఎకరాలను ప్రభుత్వం కొంతమందికి అసైన్ చేసింది. లక్షా 80 ఎకరాలను రైతులు సాగుచేసుకుంటున్నట్లుగా రికార్డుల వల్ల తెలుస్తోంది. ముఖ్యంగా వా రు ఆ భూములపై త మకు హక్కులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
రెవెన్యూ సంస్కరణలలో భాగంగా రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని 22-ఏ1లో నిషేధిత ఆ స్తుల జాబితా నుంచి చుక్కల భూములను 2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం రైతుల ఆధీనంలో సాగులోఉన్న చుక్కల భూములను మాత్రం ఆ తేదీనుంచి ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించవలసి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలు కాలేదు. ఈ సమస్యపై మళ్లీ వేల సంఖ్యలో రాష్టవ్య్రాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని తీవ్రంగా పరిగణించి జవవరి 4న ఈ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం నూతన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్లు పంపుతారు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం ప్రకారం- 1బి రిజిస్టర్ 2వ కాలమ్‌లో నమోదైన పట్టాదారు పేరును సరిచూసుకొని తదనుగుణంగా 1బి రిజిస్టర్ 8వ కాలమ్‌లో కొనుగోలు లేదా వారసత్వం లేదా వంశపారంపర్యం అని నమోదుచేసిన వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 8వ కాలమ్‌లో ఏమీ రాయకపోయినా పట్టాదారు భూమిగా పరిగణించి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 8వ కాలమ్‌లో 1954కు ముందు ఇచ్చి న డి-పట్టా, డికెటి పట్టా, అసైన్‌మెంట్ భూ ములు అని నమోదు చేసినట్లైతే వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 1954 త రువాత ప్రభుత్వం ఇచ్చి న భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి.
చుక్కల భూములను స్వాధీనంలో ఉంచుకున్నవారు, వాటిని అనాదిగా సాగుచేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన పత్రాలలో ఏదోఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా భావించి రిజిస్టర్‌లో వారి పేరు నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్, లింకు డాక్యుమెంట్ పత్రాలు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రికార్డు ఆఫ్ హోల్డింగ్సు నమోదు చేసిన పత్రాలు, ఎన్‌క్యూంబరెన్స్ పత్రం, 10(1) అకౌంట్, భూమి శిస్తు రశీదులు, రెవెన్యూశాఖ జారీచేసిన ఆర్‌వోఆర్ రికార్డు, న్యాయస్థానాలు, సంబంధిత అధీకృత అధికారి జారీచేసిన ఉత్తర్వు ప్రతులు తదితరాలను రిజిస్టర్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. 2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్‌లో వారి పేరు నమోదు చేస్తారు. చుక్కల భూములకు సంబంధించి రైతులు ఫిర్యాదు చేసిన, రెవెన్యూశాఖ వద్ద, తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలనలో ఉన్నవాటిని కూడా రెవెన్యూ సిబ్బంది తమంతటతాముగా పరిశీలిస్తారు. వాటికికూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
చుక్కల భూములపై పరిశీలన పూర్తి అయిన తరువాత తుది జాబితాని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రదర్శనకు పెడతారు. ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే రెవెన్యూశాఖ వాటిని పరిశీలిస్తుంది. అభ్యంతరాల పరిశీలన తరువాత సవరించిన తుది జాబితాను ప్రకటిస్తారు. నిషేధిత భూముల నుంచి చుక్కల భూములతోపాటు ఇతర భూములను తొలగించి సెక్షన్ 22-ఏ1 (ఏ)టు (డి) కొత్త జాబితాని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతారు. సెక్షన్ 22-ఏ1(ఇ) జాబితాలను ప్రభుత్వానికి పంపుతారు. ప్రభుత్వం దానిని గెజిట్‌లో ప్రచురిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు సక్రమంగా అమలు జరిగితే లక్షమందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. జనవరి 24వ తేదీ లోపల ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందువల్ల చుక్కల భూములు ఎక్కువగా ఉన్న జిల్లాలకు అదనంగా అధికారులను పంపించే అవకాశం కూడా ఉంది.

-శిరందాసు నాగార్జున 94402 22914