సబ్ ఫీచర్

విశ్వాసమా? రాజ్యాంగమా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత విశ్వాసాలు చాలా బలీయమైనవి. మత విశ్వాసాలను నమ్మేవారు హక్కులను వదులుకొని బానిసలుగా బతకడానికి సిద్ధపడతారు. ‘మతం మత్తుమందు’ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ అన్నారు. ‘మతం ఒక భ్రమ, అశాస్ర్తియమైనది’ అని ఏంగెల్స్ అన్నారు. వారు అధ్యయనం చేసింది క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలనైనప్పటికీ మత వివ్వాసాలన్నీ అశాస్ర్తియమైనవే. ప్రపంచంలో ఏ మతం మనుషులను మనుషులుగా చూడలేదు. మతాల పెద్దలు ప్రజాస్వామ్య, సామ్యవాద ఉద్యమాలను తొక్కేశారు. విజ్ఞాన పరిశోధనలను వెలుగులోనికి రానివ్వలేదు. కొన్ని మతాలు మనుషులను జాతులుగా విడగొట్టి హీనంగా చూస్తే, హిందూ మతం కులాల పేరుతో అంటరానితనం పాటించి అత్యంత దారుణంగా హింసించింది. ఇక్కడ చాలా కాలం మనువాద సిద్ధాంతం రాజ్యమేలింది. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలు మహిళలను తక్కువగా చూశాయి, చూస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్తలు కోపర్నికస్, గెలీలో, జాన్ కెప్లర్, బ్రూనో వంటివారు క్రైస్తవులైనప్పటికీ ఆ మత పెద్దలే వారిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారు. వారి పరిశోధనా పాత్రలు, గ్రంథాలపై నిషేధం విధించారు. వాటిని తగులబెట్టారు. మత విశ్వాసాలు ప్రపంచ అభివృద్ధిని వందల ఏళ్లు వెనక్కు నెట్టేశాయి. మన దేశం ఇప్పుడు రెండు మతాలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ సమస్యలు రెండూ మహిళల సమానత్వానికి సంబంధించినవే. 21వ శతాబ్దంలో భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం అత్యంత దారుణం. ఈ మత విశ్వాసాలు రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం బాధాకరం. దేశంలో న్యాయంపై మతం, రాజకీయాలు పైచేయి సాధించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం.
కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబరు 28న ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును చదివారు. ‘‘చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలి. దైవత్వం లింగ విభేదాలు చూపించదు. అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చు. భారతదేశంలో మహిళలను దేవతలతో కొలుస్తారు. అలాంటప్పుడు లింగ భేదం చూపలేం. మహిళను తక్కువగా చేసి చూడలేం. మతం అనేది ప్రాథమిక జీవన విధానంలో భాగం. మతం విషయంలో మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందే. శారీరకమైన మార్పులను సాకుగా చూపి మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిరాకరించడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లను ఉల్లంఘించినట్టే’’ అని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగా, ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయం తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదన్నారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయిన మతపరమైన ఆచారాల్లో మార్పు చేయవద్దన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని దేవస్థానం బోర్డు స్వాగతించింది. తీర్పుపై బోర్డు రివ్యూ పిటిషన్ కూడా వేయదలచుకోలేదు.
అయితే అయ్యప్ప భక్తులు ఈ తీర్పుని వ్యతిరేకించారు. కేరళ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళల చేత కూడా చేయించారు. ఆందోళనలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళలను అడ్డుకున్నారు. వారిపై దాడులు కూడా చేశారు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎవరి హక్కులనైతే కాపాడటానికి అత్యున్నత న్యాయస్థానం ప్రయత్నిస్తుందో వారు కూడా ఆ హక్కులు వద్దనడం మత వ్ఢ్యౌనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో స్ర్తి పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘వనితా మతిల్’ పేరుతో భారీ మానవహారాన్ని ఏర్పాటుచేశారు. 2019 జనవరి 1వ తేదీ సాయంత్రం సముద్ర తీరం వెంబడి రహదారులపై ఉత్తరాన కాసర్‌గాడ్ నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 620 కిలోమీట్ల పొడవున దాదాపు 40లక్షలమందికి పైగా మహిళలు భారీ మానవహారంలో పాల్గొన్నారు. మహిళా శక్తి ప్రదర్శనలో కేరళ ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయం. చివరకు జనవరి 2వతేదీ తెల్లవారు జామున 3.45 గంటలకు కొందరి రక్షణతో 50ళ్ళ లోపు వయసున్న ఇద్దరు మహిళలు బిందు అమ్మిని (40), కనకదుర్గ (39) తొలిసారిగా ఆలయంలోపలకు ప్రవేశించారు. దీంతో రెచ్చిపోయిన హిందూ మత సంస్థలు, అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఈ నెల 3వతేదీ కేరళ బంద్‌కు పిలుపుఇచ్చారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. ఈ సంఘటనలకు రాజకీయ రంగు పులుముకున్నది.
ఇక రెండవది ముస్లింలకు చెందిన ట్రిపుల్ తలాక్ అంశం. ఇది కూడా స్ర్తి పురుష సమానత్వానికి చెందినదే. ముస్లింలలో భర్తలు భార్యలకు విడాకులు ఇవ్వడం అత్యంత సులభమైన పని, ఏకపక్షమైనది. న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఎలాంటి కారణం చెప్పకుండా ఏకపక్షంగా భర్త మూడుసార్లు తలాక్ చెప్పి ఇచ్చే విడాకులను తలాక్ అంటారు. మరో మూడురకాలుగా కూడా భార్యాభర్తలు విడిపోతారు. అయితే ఈ తలాక్ పద్ధతే అత్యంత దారుణమైనది. భార్యను నిరాశ్రయురాలిని చేస్తుంది. భర్తకు భార్య తలాక్ పద్ధతిలో విడాకులు ఇచ్చే అవకాశం లేదు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టు 2017లో రా జ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అయినా ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. ఈ తీర్పు వెలువడిన తరువాత కూడా దేశ వ్యాప్తంగా దాదాపు 45 మంది భర్తలు తమ భార్యలకు తలాక్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వారికి అండగా నిలవలేకపోయింది. తలాక్ చెప్పిన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడు. సరైన చట్టాల రూపకల్పన ద్వారా స్ర్తి పురుషులిద్దరికీ సమాన న్యాయం అందించవలసిన బాధ్యత పార్లమెంటుపై వుంది. ముస్లిం పర్సనల్ లా తప్ప అన్ని వర్గాల పర్సనల్ లాలను పార్లమెంటు సంస్కరించింది. ముస్లిం పర్సనల్ లా సంస్కరణకోసం ముస్లిం మహిళలే దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేశారు. వారు సంఘటితమై సమాన న్యాయం కోసం ఖురాన్ బోధనలు, రాజ్యాంగ నిబంధనలపై అవగాహనను పెంచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా అందజేశారు. సంప్రదాయ ముస్లిం మత పెద్దలు ముస్లిం మహిళల డిమాండ్లను అసలు పట్టించుకోలేదు. హిందూ, క్రైస్తవ, జైన్ మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకు కూడా న్యాయం అందించాలన్న అంశంపై దేశంలోని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ముస్లిం మహిళలకు న్యాయం చేసే తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు) 2018 డిసెంబర్ 27న లోక్‌సభలో 245 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే పలు విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లును డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే విపక్ష పార్టీల సభ్యులు బిల్లును అడ్డుకున్నారు. దీనిపై సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను జనవరి 2కు వాయిదా వేశారు. రాజ్యసభలో ఈ బిల్లు భవితవ్యం అనిశ్చితిలో పడింది. ఈ బిల్లుకు యథాతథంగా మద్దతు ఇవ్వం అని కాంగ్రెస్ ప్రకటించింది. బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తోంది. వివిధ కారణాల రీత్య విపక్షాలు ఈ బిల్లుకు మద్దతు తెలుపడంలేదు. పూర్తిగా వ్యతిరేకించడంలేదు. బిల్లులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యితిరేకించి నిరసన ప్రదర్శనలు చేయడం శోచనీయం.
ఈ బిల్లుపై తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆ కారణంగా ముస్లిం బాధిత మహిళలు నష్టపోతారు. మత విశ్వాసాలు ఎంత బలీయంగా ఉంటాయో, ప్రభుత్వాలను కూడా ఎలా ఇరుకున పెడతాయో, రాజకీయాలను కూడా ఎలా శాసిస్తాయో ఈ సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది.

-శిరందాసు నాగార్జున 94402 22914