సబ్ ఫీచర్

మూల్యాంకనం.. పోటీ కోసం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఒక అసెస్‌మెంట్ తర్వాత ఇలా చేశాం. తరగతి గదిని 5 బ్యాచ్‌లుగా వర్గీకరించాం. ప్రతి బ్యాచ్‌లో తెలివిగల పిల్లలు ఇద్దరిని, మధ్యతరగతిగా ఉన్న ఇద్దరిని, పరీక్షలు బాగా రాయలేని పిల్లలు ఇద్దరిని ఒక బ్యాచ్‌గా పెట్టారు. ఇలా 5 బ్యాచ్‌లు చేశాం. ఆ అసెస్‌మెంట్‌లో ప్రతి గ్రూపులో పరీక్ష పేపర్లు దిద్దాక ఆ టీమ్‌లో ఆరుగురు అందరి పేపర్లను అందరూ పరిశీలించాలి. దానిలో బాగా రాసిన ఇద్దరు పిల్లలు తాము ఎలా రాశారో ఇతరులకు చెప్పాలి. తోటి పిల్లలు తమ అనుభవాలను చెబితే ఆ గ్రూపు పిల్లల్లో మంచి ఉత్సాహం వచ్చింది. తాము రాసిన తప్పులను ఉపాధ్యాయులు చెప్పిన దానికి బదులుగా తోటి పిల్లలు ఆ బలహీనమైన విద్యార్థికి చెబితే ఆ ఇద్దరి మధ్య గాఢమైన మైత్రి ఏర్పడింది. ఆ అసెస్‌మెంట్‌ను చర్చకు పెట్టటంతో పిల్లల్లో అవగాహనా శక్తి కూడా పెరిగింది. ఒక వీక్ స్టూడెంట్‌ను తోటి విద్యార్థికి అతని భాషలో చెబుతున్నప్పుడు రకరకాల అనుమానాలను వ్యక్తం చేయటం జరుగుతుంది. దానివల్ల బాగా రాసిన వారికి సబ్జెక్టు స్పష్టీకరణ అయ్యింది. అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి.
అసెస్‌మెంట్ అంటే తరగతి గదిలో ర్యాంకింగ్ చేయటం కాదు. అవగాహనతో ఉన్న లోపాలను తొలగించటం. దీంతో తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పని కొత్త అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ చేశాక అది గట్టిపడటానికి నీళ్లు కొడతాం. వాటరింగ్ వల్ల గోడ గట్టిపడుతుంది. పరీక్ష పెట్టగానే పని అయిపోదు. మూల్యాంకాన్ని చర్చకు పెడితే అది సబ్జెక్టుకు బలం. పాఠం సుస్థిరంగా మారుతుంది. బలహీనమైన విద్యార్థికి చురుకైన విద్యార్థి చెబితే అది ఇద్దరికీ లాభం అవుతుంది. ఇతరులకు చెప్పినప్పుడు తెలివైన విద్యార్థికి స్పష్టత వస్తుంది. వీక్ స్టూడెంట్ తన తోటి పిల్లవాణ్ణి స్వేచ్ఛగా అడుగుతాడు. అతని మాదిరిగాను తనుకూడా ఆలోచించాలన్న ధ్యాస ఆ బలహీన విద్యార్థిలో మొదలవుతుంది.
కాబట్టి అసెస్‌మెంట్ అన్నది లెర్నింగ్ (సాధన)ను సుస్థిరపరచాలి. బలహీనమైన విద్యార్థులు నిరాశా నిస్పృహలకు బదులుగా రెండు అడుగులు ముందుకు వేయటానికి దోహదపడాలి. ఇది కొద్దిగా కష్టమైన పని. ఓపికతో చేయవలసిన పనేనని ఒక టీచర్‌గా నేను ఒప్పుకుంటాను. దీనివల్ల తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. స్కూలు లోపల కూడా పిల్లల్లో మైత్రి పెరుగుతుంది. బలహీనుడ్ని ఇంకా బలహీనుణ్ణి చేయకూడదు. బలహీనమైన తన తోటి విద్యార్థికి శిక్షణనిచ్చి శక్తివంతుణ్ణి చేసినవాడే నిజమైన క్లాస్‌మేట్. మూల్యాంకనం పోటీని పెంచటానికి కాదు, ఒకరికి ఒకరు సహకారం అందించుకోవడానికే అని మరిచిపోకూడదు.
(అసెస్‌మెంట్ ఈజ్ మెంట్ ఫర్ కొలాబిరేషన్ నాట్ ఫర్ కాంపిటీషన్)
నియంత్రణ ముఖ్యం...
నేడు ప్రతి విద్యార్థికి 15 ఏళ్ల వయసుకే కారు డ్రైవ్ చేయాలని కోరిక. నాకు లైసెన్స్ ఉన్నదికదా నేనెందుకు డ్రైవ్ చేయకూడదంటాడు. ఓ విద్యార్థి డ్రైవింగ్‌లో రాత పరీక్ష పాసయ్యాడు. తండ్రి కారు తాళాలు ఇచ్చేందుకు భయపడుతూనే ఉన్నాడు. కారు డ్రైవ్ చేసే వాడికి పరీక్షలు కావు. మొదలు తనకుతాను నియంత్రించుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నప్పుడు వేగం పెంచాలనే ఆసక్తి కలుగుతుంది. వయసులో కంట్రోల్ ఉండదు. అందుకే తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా తల్లిదండ్రులు కారు ఇచ్చేందుకు భయపడతారు. పరీక్షకు, అసెస్‌మెంట్ (మూల్యాంకనం)కు తేడా ఉంది. పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ప్యాస్ అవుతాడు. కానీ, ఉపాధ్యాయుడు మాత్రం మూల్యాంకనంతో విద్యార్థి ఎదుగ గలుగుతున్నాడా? లేదా? అని పరీక్షిస్తాడు.
మొక్కలను బట్టి వాటి ఎదుగుదలలో తేడా ఉంటుంది. చెట్టు ఎదగకుండా బతికి ఉండవచ్చు. ఉపాధ్యాయుడు కోరేది విద్యార్థి ఎదుగుదల. ఎదుగుదలలో విద్యార్థి విశే్లషణాశక్తి పెరిగిందా? లేదా? కొత్త విషయాన్ని కనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నాడా? లేదా? కొత్త ఆలోచనలు పుడుతున్నాయా? చదివింది జ్ఞానంగా మారుతోందా? లేదా? ఇది ఉపాధ్యాయుడి ఆరాటం. పరీక్షాపత్రాలను దిద్దే వారు సమాధానాలే చూస్తారు. అంతవరకే పరిమితం. కానీ, మూల్యాంకనం సాధనలో ఒక భాగం. పరీక్ష అంటే స్టాంప్ కొట్టటమే. తరగతి గదిలో వారానికొకసారి, రెండుసార్లు అయినా ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేసుకుంటాడు. మూల్యాంకనం వల్ల తన పథకానికి ప్రాతిపదిక ఏర్పడుతుంది. పిల్లల చదువు కన్సాలిడేట్‌గా మారిందా? లేదా? అని కూడా ఉపాధ్యాయుడు చూసుకుంటాడు. వారానికొకసారి జరిగే మూల్యాంకనం పేరిట విద్యార్థుల్లో ఒత్తిడి పెంచకూడదు. మూల్యాంకనం కాగానే మార్కులు చూసి పిల్లలపై ఒత్తిడి చేయకూడదు. ఇది చదువుచెప్పటంలో ఒక భాగం. మూల్యాంకనం టీచింగ్ అండ్ లెర్నింగ్‌కు కొలబద్ధ కానీ పిల్లల ర్యాంకింగ్ కోసం కాదు. అందుకే లైసెన్స్ ఉన్నా కారు తాళం ఇచ్చేందుకు తండ్రి జంకుతాడు. డ్రైవింగ్ అనుభవంతోనే వస్తుంది.

-చుక్కా రామయ్య