సబ్ ఫీచర్

రాజకీయాల్లో నిబద్ధత జాడేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రానంతర కాలం నాటికి, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే క్రమంగా రాజకీయాలు ఎలా పతన స్థాయికి చేరుకున్నాయో అర్థమవుతుంది. మన దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ తనపై విమర్శలను, వ్యంగ్యోక్తులను సహృదయంతో ఆహ్వానించేవాడు. ప్రతిపక్షాలకు సముచిత గౌరవం ఇచ్చేవాడు. వాజపేయి లాంటి ప్రతిపక్ష నాయకున్ని గౌరవభావంతో చూసేవాడు. ఎలాంటి విమర్శనైనా స్వీకరించేవాడు. వాజపేయి లాంటి ఉత్తమ పార్లమెంటేరియన్‌లు చట్టసభల్లో ఉండాలని ఆతని గెలుపును నెహ్రూ ఆహ్వానించేవాడు. ప్రశ్నలు, విమర్శలు, బలమైన ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం ఉండకూడదని భావించేవాడు.
ప్రతిపక్షమంటూ లేకుంటే ప్రభుత్వ లోపాలెలా బయటకొస్తాయి? ఆడిందే ఆట పాడిందే పాటగా అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరించకుండా నిరోధించడానికి బలమైన ప్రతిపక్షం ఉపయోగపడుతుంది. ప్రజాస్వామిక వాది, ఆరోగ్యకరమైన విమర్శను హాయిగా స్వీకరించే స్వభావం ఉన్నవాడు కాబట్టే నెహ్రూ చాలావరకు విలువలున్న రాజకీయాలను నడిపించగలిగాడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ప్రతిపక్ష నాయకుడైన వాజపేయి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కాళీమాతతో పోల్చాడు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కార్టూనిస్ట్ శంకర్ తనపై వేసే హాస్యపూరిత కార్టూన్లను చూసి నెహ్రూ నవ్వుకునేవాడు తప్ప సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. కాని క్రమక్రమంగా రాజకీయాలు, రాజకీయ విలువలు దిగజారి పూర్తి పతన స్థాయికి చేరుకున్నాయి. తమకు పూర్తి మెజారిటీ ఉన్నా, లేకున్నా ప్రతిపక్షాలనేవి లేకుండా చేసి నిరంకుశ పాలన చేయడానికి అధికార పార్టీలు నేడు ఎలాంటి చర్యకైనా పాటుపడుతున్నాయి. బి.జె.పి.లాంటి పార్టీ అయితే తమ పార్టీని సమర్థించేవాళ్ళు దేశభక్తులని, కాని వాళ్ళంతా దేశద్రోహులుగా చిత్రిస్తుంది. తమపై ఎలాంటి విమర్శ వచ్చినా సహించడం లేదు. టి.ఆర్.ఎస్.లాంటి ప్రాంతీయ పార్టీ నేతలైతే ప్రతిపక్షమనేదే లేకుండా చేయడమే కాకుండా ప్రతిపక్షాలను బండబూతులతో తిడుతున్నారు. అధికార పార్టీలు నియంతలుగా మారుతూ తమపై విమర్శలనేమాత్రం సహించకుండా అన్నిరకాల మీడియాపై నియంత్రణను అమలుచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదే.
ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు పోటీచేస్తాయి. ఒకర్నొకరు తిట్టుకుంటారు. ఒకరి తప్పులను మరొకరు బయటపెడుతారు. తమ పార్టీ తప్ప ఇతర పార్టీలన్నీ నీచ్, కమీనే, కుత్తే పార్టీలని తిడుతారు. ఎన్నికలయిపోతాయి. ఓ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయి. అధికార పార్టీ కూడా తమ పార్టీలోకి రావడానికి ఇతర పార్టీల్లో గెలిచినా అభ్యర్థులను ‘ఎర’ చూపి ఆహ్వానిస్తుంది. నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు ఏవీ లెక్కచేయకుండా పార్టీ మార్పిడులు జరుగుతాయి. తిట్టినవాళ్ళు, తిట్టించుకున్నవాళ్ళు కలిసిపోతారు. పార్టీ మారే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంది. కాని ఒక పార్టీ గుర్తుతో గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండానే, ఇంకో పార్టీలోకి మారి పదవిని కూడా అనుభవించడం ఎంత సిగ్గుచేటు? ఎంత అనైతికం? ఎంత దుర్మార్గం? ఏ పార్టీలో గెలిచినవాడైనా తన పదవికి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరి పోటీచేసి గెలవాలి. కాని ఆ పని చేయరు. ఇవెంత నీతి బాహ్య రాజకీయాలు? ఒక పార్టీ టికెట్‌పై గెలిచి ఇంకో పార్టీలో మంత్రి పదవి పొందడం చట్టసమ్మతమేమో కాని నీతి బాహ్యమైన నిస్సిగ్గు చర్య. ఇది ప్రస్తుత రాజకీయాల్లో హాయిగా, ఏ సంకోచం లేకుండా సాగుతుంది. గెలిచిన పార్టీలోనే ఉండి అవసరమైతే అధికార పార్టీకి మద్దతివ్వడం వేరు కాని ఆ గెలుపుతోనే వేరే పార్టీలో చేరి పదవి పొందడం రాజకీయ వ్యభిచారమే.
మరో దుర్మార్గమైన, నిస్సిగ్గయిన రాజకీయ చర్య భారత రాజకీయాల్లో ప్రస్తుతం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఒకటి రెండు సీట్లుకూడా లేవు. అయినాసరే కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యులందరినీ పార్టీ మార్పు చేయిస్తుంది. తమ పార్టీ పాలనను సాగిస్తుంది. తాము అధికారంలోకి వచ్చినట్టు ప్రకటిస్తుంది. ఇదేం రాజకీయం? ఎంత హేయ రాజకీయమిది? అయినా కొన్ని అధికార పార్టీలు ఈ పనిని నిరభ్యంతరంగా కొనసాగిస్తున్నాయి.
పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలడగడం, జవాబులు రాబట్టడం ఉండాలి. కాని ప్రశ్నలకెప్పుడూ సూటి జవాబులుండవు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే అధికార పక్షం వాటికి జవాబులు చెప్పరు. మీ కాలంలో ఇంతకంటె ఎక్కువ అవినీతి చేసారని ఆరోపిస్తారు తప్ప ఆరోపణలకు జవాబులుండవు. అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకుంటారు. పెప్పర్ స్ప్రేలూ చేసుకుంటారు. ఒకరిగల్లాలు ఒకరు పట్టుకొని తన్నుకుంటారు కూడా. అసెంబ్లీనుంచి శాశ్వతంగా శాసనసభ్యున్ని సస్పెండ్ చేసే అర్హత స్పీకర్‌కు లేకున్నా సస్పెండ్ చేస్తారు. అది తప్పని కోర్టు తీర్పు ఇచ్చినా దాన్ని అమలుచేయరు. ఇదీ మన రాజకీయులకున్న రాజ్యాంగంపై ఉన్న ప్రేమ. ఏ సిద్ధాంతమూ, కమిట్‌మెంటూ లేని రాజకీయాలు ఈ దేశంలో విశృంఖల విహారం చేస్తున్నాయి. ఏ పార్టీలోనైనా మారిపోవచ్చు. అధికారమే పరమావధి తప్ప ఏ సిద్ధాంతమూ అవసరం లేదు.
నేరచరిత్ర ఉన్నవాళ్ళు పోటీచేయడానికి అనర్హులని చట్టం ఉందో లేదో కాని నేరాలు చేసిన వారైనా ఎన్నికల్లో నిలబడుతున్నారు. కొందరు గెలుస్తున్నారు. కొందరు ఓడుతున్నారు. మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. రాజకీయాలు ఈ దేశంలో చాలాకాలం నుండి మనీ, మాఫియా, మీడియాల ఆధారంగా వాటి ప్రభావంతో నడుస్తున్నాయన్నది వాస్తవం. పార్టీ ఏదైనా సరే కోట్లలో ఖర్చు పెట్టగలిగేవాడే సీటు సంపాదిస్తున్నాడు. గెలువడానికి కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ తర్వాత ఎన్నో రెట్లు అక్రమార్జన చేస్తున్నారు.
ఈ దేశంలో రాజకీయం అనేది అన్నింటికంటే లాభసాటి వ్యాపారమైపోయింది. ఎన్నికల ఖర్చు విషయంలో పరిమితులున్నా అవి కాగితాల్లో మాత్రమే ఉంటాయి. వేల కోట్లు చేతులు మారుతూనే ఉంటాయి. అయినా ఎన్నికల కమిషన్ చూసీచూడనట్లుంటుంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థే అయినా అధికార పార్టీ కనుసన్నల్లోనే పనిచేస్తుందన్నది వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ ఒక నాలుగైదు దేశాలు తప్ప పేపర్ బ్యాలట్‌నే ఉపయోగిస్తున్నా, ఈవిఎంల ఉపయోగంపై ఎన్ని ఆరోపణలున్నా ఈ దేశ పాలకులు మాత్రం ఈవీఎంలనే ఉపయోగిస్తారు. ఎవరి మాటలనూ లక్ష్యపెట్టరు. ఎన్నికల్లో పోటీచేసే వారు తమ ఆస్తులను ప్రకటించాల్సి ఉంటుంది. పదులు, వందలు, వేల కోట్లు ఆస్తులున్న అభ్యర్థులైనాసరే తమ ఆస్తులను ఒక అంకె కోట్లలో కాని, ఇంకా తక్కువగా కాని ప్రకటిస్తారు. అవన్నీ తప్పుడు ధ్రువీకరణలని లోకమంతటికీ తెలుసు. అయినాసరే ఎవరేమీ చేయరు. ప్రకటించిన ఆస్తుల నుంచి మిగతావన్నీ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చు కదా! అదేం జరుగదు. రాజకీయాల్లో ఉండి ఆదాయాన్ని మించిన ఆస్తులున్న నేరంపై ఎవరూ ఇంతవరకు శిక్షకు గురికాలేదు. ఈ ఆయుధాన్ని అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంపై ఎన్నికల సమయంలో సంధిస్తుంది. ఎన్నికల తర్వాత మామూలే. ఇలాంటివి తమ పార్టీని వ్యతిరేకించే నాయకులపై ప్రయోగించడానికే ఉపయోగిస్తారు తప్ప ఎవరినీ శిక్షించడానికి కాదు. ప్రయోగించి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, తాను చెప్పిన వినని ఒకరిద్దరు నాయకులు శిక్షననుభవించకా తప్పదు.
ఇలా రాజకీయాల్లో కమిట్‌మెంట్, సిద్ధాంతం మచ్చుకు కూడా కనబడడం లేదు. వాగ్దానాల మాట కూడా నీటి మూటే అయ్యింది. గెలిచిన తర్వాత నాలుగేళ్ళకు పైగా గురక నిద్రలో ఉండి ఎన్నికల సంవత్సరంలో కొన్ని తాయిలాలూ, సంక్షేమ భిక్షాలు ప్రకటించి ఆ వేడి చల్లారకముందే ఎన్నికలు పెట్టడం మామూలయిపోయింది. ఓటుకు వేల రూపాయలిచ్చి కొన్నా ఎన్నికల కమిషన్, చట్టాలు ఏవీ చేయలేవు. రాజకీయ సంబంధిత ఏ విషయంలోనైనా కోర్టుకెళితే నాలుగైదేళ్ళు గడిచినా తీర్పు రాదు. ఆ తర్వాత తీర్పు వచ్చినా సమయం అయిపోయింది కాబట్టి చేసేదేమీ ఉండదు. ఉన్న చట్టాలు ఉన్నవాళ్ళ చుట్టాలుగానే ఉన్నాయి. నిజాయితీపరులకు, ప్రజల పక్షం వహించే మేధావులకు, డబ్బు లేనివారికి ఈ రాజకీయాల్లో చోటు లేదు. ఈ దేశ మేధావుల, కుహనా మేధావుల వౌనం, స్వార్థపూరిత చర్యలు అనర్హులు ధనబలంతో రాజ్యమేలడానికి దోహదం చేస్తున్నాయి.
ఇలా ఈ దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టాయి. చట్టాలు తప్పుపట్టాయి. రాజకీయాల్లోని భ్రష్టత్వాన్ని, చట్టాల్లోని తుప్పును వదిలించాలంటే ఈ దేశ బహుజన మేధోవర్గం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి జనాన్ని కదిలించాలి. అప్పుడే రాజకీయాల్లో గుణాత్మక మార్పు వస్తుంది.

-డా. కాలువ మల్లయ్య 91829 18567