సబ్ ఫీచర్

సంధ్యా సమీరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మగానో కరకుగానో- సెన్సిటివ్‌గానో, సీరియస్‌గానో- ఘర్షణలతోనో సంఘర్షణలతోనో- పడుతూ లేస్తూనో, లేస్తూ పడుతూనో... ఆరుపదుల జీవితాన్ని చూసిన తర్వాత భవిష్య జీవితం ఆవలి తీరానికి చేరుకున్నట్లే!
చూసిన జీవితం కంటే చూడాల్సిన జీవితం చిన్నదే! అనుభవాల ముడుతలు పసిమి రంగును సింగారించుకుంటుండగా-
ఆవలి తీరాన అలిగినా అలక తీర్చే వారుండరు. కోపాలు, తాపాలు కరగాల్సిందే.
కన్నీళ్ళు సైతం కనురెప్పల మాటున దాగాల్సిందే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేని వయసు తీరం ఇది. సంపాదించిన డబ్బేకాదు, ఏ సంపాదననైనా ఖర్చుపెట్టుకోవాల్సిన వయస్సు... పది మందికీ ఉపకరించాల్సిన మనసు- ఈ ఆవలి తీరానిది.
* * *
కరిగిన కాలంకంటే కరగాల్సిన కాలం నిడివి తక్కువే! వెంట తెచ్చుకున్నదేదీ లేదు. కాబట్టి వెంట తీసుకుపోయేదీ ఏదీ ఉండదు!! జనన మరణాల మధ్య జీవించే బ్రతుకులో కూడబెట్టుకున్నదేదైనా ఇక్కడ ఖర్చు కావలసిందే!!
మనం అయినా ఖర్చు పెట్టుకోవాలి. లేదా మనవారో మనకయినవారో, మరెవరో ఖర్చుపెట్టాల్సిందే. కాబట్టి సంపాదనను ఉట్టికి కట్టి చూస్తూ చప్పరిస్తూ కూర్చుంటే ఆ ఉట్టి తరగదు కానీ మన జీవితం ఉత్తగానే, చప్పగానే కరిగిపోతుంటుంది.
* * *
మన సంతానమే.. మన పిల్లలే మన మనవలు, మనవరాండ్రే. మన సంపాదనను సంపదల రూపేణా వారికి గిఫ్ట్‌గా ఇవ్వాల్సిందే! అయితే ఈ గిఫ్ట్‌కంటే వారికి సంపాదించుకునే మార్గాలను, సంపాదించుకునే అర్హతలను గిఫ్ట్‌గా ఇవ్వగలిగితే బాధ్యతగా వ్యవహరించినట్టు అవుతుంది, సంతృప్తీ మిగులుతుంది.
మన సంపద వారికి కానుకే అయినా దాని మెరుపు వారి కళ్లలో కనిపించేది బహుకొద్ది కాలమే... వారి కాళ్లమీద వారిని నిలబడేలా చేయగలిగితే వారి జీవితంలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం మనకు చివరి శ్వాస వరకూ మెరుపు అవుతుంది.
మన సంపాదనను సంపూర్ణంగా మనవారికోసమేకాక కొంత మొత్తాన్ని ఈ సమాజానికీ ఇవ్వాల్సిన బాధ్యత మనమీదుంది. కుటుంబంతోపాటు సమాజమూ మనకు జీవితాన్నిచ్చిందన్న వాస్తవాన్ని మరవకూడదు. కాబట్టి, ఆ సమాజానికి మనమూ ఎంతోకొంత ఇవ్వాల్సిన బాధ్యత మనమీదుంది. దాన్ని సమాజం విరాళం అనవచ్చుగాక, ఆ మొత్తం ఒక జీవితాన్నో, మరికొన్ని జీవితాలనో నిలబెడుతుంది.
* * *
తొలి శ్వాసతో పుడమితల్లిని ముద్దిడిన క్షణంలో మనదంతా నగ్నతే... తుది శ్వాసలో, మట్టిలో మమేకమవుతున్న తరుణంలోను మనదంతా నగ్నతే! మధ్యన జీవితం ఎన్ని రంగులను సంతరించుకున్నా, ఎన్ని కీర్తికిరీటాలను ధరించినా, ఎన్ని సత్కారాలను పొందినా-అన్నీ ఇక్కడివరకే- అన్నీ చివరి శ్వాసలో లయించి పోవలసిందే! ఎంతటి ఘనకీర్తి అయినా మనం లేని తరుణం నుండి క్రమేణా కాలగర్భాన్ని చేరవలసిందే! కాబట్టి, మన ‘మంచి’ ఒక్కటే పెరుగుతూ పోతుంటుంది... అది ‘విత్తనం’గా కనిపించకపోవచ్చు కానీ, వృక్షంలా నీడనిస్తూనే ఉంటుంది.
* * *
ఆరు పదుల రిటైర్మెంట్‌లో అప్పటివరకు సంసార అవసరాలకు ఆదుకున్న సంపాదన గ్రాట్యుటీ రూపంలోనో, పెన్షన్ రూపంలోనో చేరుకుంటున్నప్పుడు వయసు పైబడుతున్న దంపతులకు అది ‘తమ’ అవసరాలకు పరిమితం కావాలి. తమ ఆనందానికే పరిమితం కావాలి. చూడని ప్రపంచాన్ని చూడటానికి ఉపకరించాలి.
నిజమే, వయసు సహకరించక పోవచ్చు. ఆరోగ్యమూ సహకరించడం లేదనిపించవచ్చు- అయినా, మనసుకు మల్లెల పరీమళాన్ని అద్దండి. కాళ్లు పరుగులు తీస్తాయి. ఆరోగ్యమూ సహజీవనానికొస్తుంది. నిజం, వయసు పైబడుతుంటే చూపు మసకబారవచ్చు... అయినా ఆ మసక చూపులోనే ఎంతో మెరుపు చోటుచేసుకుంటుంది.
అప్పుడనిపిస్తుంది- సంపాదన కేవలం జేబులు నింపుకోవడానికే కాదు, సంసార అవసరాలమటుకే కాదు, బాంక్ బాలెన్స్‌ల వరకే కాదు అని. ఇలా అనిపించటమే సంపాదనకు కొసమెరుపు.
* * *
సేవింగ్స్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, లాకర్స్ ఇలా ఎన్ని ఉన్నా మనకు కావలసింది ముప్పొద్దులా ఆహారం, కంటి నిండా నిద్రించటానికి ఒక మంచం. ఎంతటి ఇంద్ర భవనం ఉన్నా, ఎకరాలలో ఫార్మ్‌హౌస్ ఉన్నా చివరివరకు కావలసింది అలుపుతీర్చే నిద్ర, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం.
* * *
మన పిల్లలు- మన సంసారం - ఈ జీవితం వేరు. మన పిల్లలు-వారి సంసారం- జీవితం వేరు.
ఆరుపదుల జీవితంలో ఈవలి తీర ఛాలెంజెస్ వేరు. ఆవలి తీర ఛాలెంజెస్ వేరు. ఈ వయసులో మన జీవితమే మనకు ఛాలెంజ్ కాకూడదు అంతే!
మొత్తానికి- వయసు, మనసు, కుటుంబం, సమాజం- ఆరుపదుల వరకు ‘నా’ అనుకున్నవన్నీ మెల్లిమెల్లిగా ప్రశ్నార్థకాలుగా రూపుదిద్దుకుంటుంటాయి.
అయితే, ఆవలి తీర జీవితం సమాధానాలను తడుముకోవాల్సిన ప్రశ్నపత్రం కాదు. సమాధానాలను నెమరేసుకుంటూ సమాధాన పడవలసిన సంధ్యా సమీరం.

- విశ్వర్షి వాసిలి