సబ్ ఫీచర్

మతం మతానికి ప్రత్యామ్నాయం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్‌లో (ఒకనాటి బర్మా) మెజారిటీ సంఖ్యగా ఉన్న బౌద్ధ మతస్థులున్నారు. ఇటీవల ఆ దేశ సైన్యం మైనారిటీలైన రోహింగ్యా ముస్లింలపై దాడులుచేసి వారిని దారుణంగా హతమారుస్తుండటంతో వారు విదేశాలకు వలసపోతున్నారు. రోహింగ్యా ముస్లింలలో కొందరు అక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా తమ హక్కుల సాధనకోసం ఉగ్రవాద పంథాని ఎంచుకొన్నంతమాత్రాన వారందర్నీ ఉగ్రవాదులమని పిలువలేము. ఆ దేశాధినేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగశాన్ సూచి సైతం ఇరువర్గాల మధ్య శాంతియుతమైన చర్చలకు చొరవ చూపకపోవడం దురదృష్టకరం. 2017 ఆగస్ట్ 25నుంచి సుమారు నాలుగు లక్షల మంది ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్ళారు.
రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితమే బుద్ధుడు అహింస, శాంతియుత మార్గాల ద్వారా సమసమాజాన్ని స్థాపించవచ్చని బోధించాడు. అశోకుడు లాంటి గొప్ప చక్రవర్తికూడా బుద్ధుని బోధనలకి ప్రభావితమై యుద్ధాలకి స్వస్తిపలికి శాంతియుతంగా పరిపాలన సాగించాడు. తదనంతర కాలంలో బౌద్ధమతం హీనయాన, మహాయాన శాఖలుగా చీలిపోయింది. దేవుడే లేడన్న బుద్ధుడిని దేవుడిగా కొలుస్తున్నారు. వ్యక్తిగత ఆరాధన బుద్ధిజంలోనూ చోటుచేసుకుంది. బౌద్ధమతంలో కూడా స్ర్తిలకు అంతగా ప్రాముఖ్యత లభించలేదు. అయినప్పటికీ బుద్ధుని ప్రవచనాలు ఎప్పటికీ ఆచరణీయమే.
మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మతవ్ఢ్యౌంతో స్ర్తివిద్యని నిరాకరిస్తున్నారు. ఆ ఉగ్రవాదుల దాడికి అత్యంత ప్రాచీనమైన బమియన్ బుద్ధవిగ్రహాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో మలాలపై జరిగిన దాడి ప్రపంచానికి తెలిసిందే. పాకిస్థాన్‌లో రోజురోజుకూ హిందువుల సంఖ్య తగ్గిపోతోంది. సహనం, దాతృత్వం వంటి అత్యుత్తమ లక్షణాలని మనిషి కల్గిఉండాలని మహ్మద్ ప్రవక్త బోధించాడు. మనలో ఉన్న చెడు గుణాలపై జీహాద్ (పవిత్ర యుద్ధం) ప్రకటించాలని ప్రవక్త ప్రబోధించాడు. అంటే దానర్థం మనలోఉన్న చెడు లక్షణాలని తొలగించుకోవాలి. మహ్మద్ ప్రవక్త బోధించిన సూత్రాలని తు.చ. తప్పకుండా పాటిస్తూ ఇండోనేషియా ప్రజలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముస్లింలలో కొందరు జీహాద్‌ని వేరే మతస్థులపై ప్రకటిస్తున్నారు. మహ్మద్ ప్రవక్త గొప్ప సంఘ సంస్కర్త. చరిత్రలో ముస్లింలకు మరియు క్రైస్తవులకు మధ్య ‘క్రూసెడ్స్’ పేరుతో యుద్ధాలు జరిగిన విషయం విదితమే.
ఇంకోవైపు ప్రేమ, కరుణ, క్షమాగుణం వంటి ఉన్నత లక్షణాలని క్రీస్తు బోధించాడు. బానిస వ్యవస్థని ఎదిరించాడు. రాజుకూడా నామ మాతృడేనని వివరించాడు. క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. క్యాథలిక్కుల సనాతన సాంప్రదాయాలని ఎదిరించి ప్రొటెస్టెంట్స్ ఎదిగారు. ప్రొటెస్టెంట్స్ ఆధునిక భావాలని స్వాగతించారు. కాని రానురాను క్రైస్తవంలోకూడా అనేక శాఖలు వెలిశాయి. అనేక మూఢ విశ్వాసాలు ఈ మతంలోకి జొరబడ్డాయి. క్రీస్తు పిలుస్తున్నాడంటూ ఇటీవల ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయ్యింది. మత ప్రచారాన్ని కొందరు పాస్టర్లు తమ జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. బ్రిటిష్‌వారు క్రైస్తవాన్ని ఇతర దేశాలని తమ వలస రాజ్యాలుగా మార్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. తోటి వారిని ప్రేమించమని క్రీస్తు బోధించాడు. ఎదుటివారి ఆచారాలని, సాంప్రదాయాలని గౌరవించినప్పుడే అది సాధ్యమవుతుంది. అమెరికాలో శే్వత జాతీయులు అక్కడి నల్లజాతీయులపై దాడులు చేస్తున్నారు. వర్ణ వివక్షత అక్కడ అడుగడుగునా కన్పిస్తోంది.
ఇక మన దేశ విషయానికొస్తే మెజారిటీలు మతపరంగా స్వతంత్రంగా ఉంటారు. హిందూ మతంలో కుల జాఢ్యం ఎక్కువ. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, పెద్దల పట్ల గౌరవం, మతపరంగా పెద్ద ఆంక్షలు లేకపోవడం వంటివి హిందూ మతంలో ఉన్నాయి. అయితే అంటరానితనం, కుల వివక్ష హిందూ మతానికి మాయనిమచ్చగా మిగిలాయి. ఇటీవల కాలంలో గోరక్షణ పేరుతో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. మత సామరస్యానికి కృషిచేస్తున్న గౌరిలంకేష్ వంటి వారిని దారుణంగా చంపడం మన దేశంలో పెరుగుతున్న మత అసహనానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ్భారత్, వనం-మనం, నీరుచెట్టు వంటి కార్యక్రమాలని మరింత సమర్థవంతంగా చేపడితే సరిపోతుంది. ప్రభుత్వాలే అశాస్ర్తియ విషయాలకు ప్రాధాన్యతనిస్తే, ప్రజలు డేరాబాబా లాంటి వారిని ఆశ్రయిస్తారు. మహాత్మా జ్యోతీరావుపూలే, డా.బి.ఆర్.అంబేద్కర్, స్వామి వివేకానంద వంటి వారిని పాలకులు తమతమ ప్రాంత, కుల, మత నాయకులుగా చిత్రీకరిస్తున్నారు. స్వామి వివేకానందుని మనం భారతావనికి ప్రతినిధిగా చూడాలి.
ప్రపంచంలో వివిధ మతాలలో జరుగుతున్న సంఘటనలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక మతం, మరొక మతానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయంకాదని స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మతస్థులు ప్రాంతంలోఉన్న మైనారిటీ మతస్తులకు రక్షణ లేకుండా పోతోంది. అల్పసంఖ్యాక వర్గాలు తమ హక్కులని కోల్పోతున్నారు. ఆయా ప్రాంతాల్లో వీరు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నారు. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువైపోతున్నాయి. గత్యంతరం లేక వీరు తమ ప్రాణాలని కాపాడుకోవడానికి వేరే ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. తమ హక్కుల సాధనకోసం హింసామార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలని ఉగ్రవాదంగా కాకుండా, సామాజిక సమస్యగా చూడాలి. ప్రతి ప్రాంతంలో మెజారిటీ మతస్తులే పాలకులుగా ఉంటున్నారు. వారి ఆదేశాలతోనే చట్టాలు తయారుచేయబడుతున్నాయి. ఈ చట్టాల పట్టాల కింద అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు నలిగిపోతున్నారు.
శాస్తవ్రేత్తలు ప్రజలతో కలవకుండా పరిశోధనాలయాలకే పరిమితం అవడం, పి.ఎమ్.్భర్గవలాంటి కొద్దిమందిని మినహాయిస్తే అత్యధిక మంది శాస్తవ్రేత్తలు ఏదో ఒక మత విశ్వాసానికి వత్తాసు పలకడం, పాలకులే మతపరమైన కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించడం వంటి కారణాలవల్ల మతాలే మనిషి జీవనాన్ని నిర్దేశిస్తున్నాయి. పాలకులకి ఓటు బ్యాంకుగా మారిపోతున్నాయి.
అమెరికాలాంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలలో జరుగుతున్న అలజడులని అవకాశంగా తీసుకొని ఆయా దేశాలల్లోఉన్న వనరులని దోచుకునే ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా ఉత్తరకొరియా వంటి దేశాలు హైడ్రోజన్ బాంబు పరీక్షని విజయవంతంగా చేపట్టామని ప్రకటిస్తూ అమెరికాకు పక్కలో బల్లెంలా తయారైంది. తాజా పరిణామాలన్నీ చూస్తుంటే జాత్యహంకారం మరల జడలు విప్పుతుందేమోనన్న అనుమానం కల్గకమానదు. అమెరికానుండి ఆఫ్రికా వరకు పరిశీలించినా మనకు మండేలా, గాంధీజీ, లూథర్‌కింగ్, లింకన్ వంటి ప్రపంచ నాయకులు కన్పించడంలేదు. ఎక్కడ చూసినా కుల, ప్రాంత, మత నాయకులే వర్ధిల్లుతున్నారు. ఆనాడు మతోన్మాదం, సామ్రాజ్యవాదాలే రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి. నాటి సైన్స్ పరిశోధనలు నియంతల పట్ల వరాలుగా మారాయి. ప్రస్తుత ప్రపంచంలో ఆనాటి పరిస్థితులే పునరావృతవౌతున్నాయి. మతానికి సైన్స్ మాత్రమే ప్రత్యామ్నాయం కావాలి. మతం మన వ్యక్తిగత జీవన విధానంగా ఉన్నంతవరకు పర్వాలేదు. అది రాజకీయ నినాదంగా మారకూడదు.

- ఎమ్.రాంప్రదీప్