సబ్ ఫీచర్

రాని ‘హోదా’ కోసం రాద్ధాంతం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో ‘మరింత ఎక్కువ పనిచేసి’ జపాన్ తరహాలో నిరసన తెలుపుతామన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా దాడి చేయడం ప్రారంభించింది. తిరుపతిలో ఇటీవల ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కొందరు దాడి చేయడం వంటి ఘటనలతో కేంద్రం, రాష్ట్రం మధ్య దూరం మరింత పెరిగింది. భాజపా, తెదేపా నాయకుల పరరస్పర ఆరోపణలు కేంద్ర, రాష్ట్ర సంబంధాలను దెబ్బతీశాయి. ప్రజలను రెచ్చగొట్టే నేతలు పోలీసు బందోబస్తుతో భద్రంగానే వుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ‘టర్న్’ అయినా తీసుకుంటారు. అమాయక ప్రజలు మాత్రం తన్నుకొని తలలు పగలుగొట్టుకుంటారు. ప్రస్తుతం ఏపీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ డిమాండ్ల గురించి చెప్పమంటే- సమైక్యత తప్ప మరోమాట లేదని మన రాజకీయ, ఉద్యోగ నేతలు భీష్మించుకున్నారు. హైదరాబాద్ నగర ఆదాయంలో వాటా కోసం ఆనాడే పట్టుబట్టి ఉంటే కేంద్ర ప్రభుత్వం అంగీకరించక తప్పేది కాదు. 2014 ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఏపీకి బాసటగా నిలిచి, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఐతే ఇది ఐదు, పది సంవత్సరాలలో పూర్తయ్యే ప్రక్రియ కాదు. భారీ నిర్మాణాలను హడావుడిగా చేస్తే నాణ్యత లోపించి, అవినీతి, అక్రమాలు పెరగటం చూస్తున్నాం. కేంద్ర నిధులైనా, రాష్ట్ర నిధులైనా ప్రతి పైసా మన ప్రజల నుండి వసూలుచేసేదే. వాటిని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి కూడా వెచ్చించాలి. అయితే, ప్రధాని మోదీ మోసం చేశాడని, దగా చేశాడని నిత్యం దూషించటం తగదు.
తెలుగు రాష్ట్రాల్లో విభజన నాటి క్లిష్ట పరిస్థితులు నేడు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎంతో వెనుకబడ్డ బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలతోపాటు అభివృద్ధి చెందిన తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు సైతం అదే డిమాండ్ చేస్తాయి. ఆ రాష్ట్రాల డిమాండ్లను అంగీకరిస్తే కేంద్రం ఆదాయం తగ్గిపోయి కేంద్రం మిథ్యగా మిగులుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు భూములను, భారీగా రాయితీలిచ్చి చైనా వంటి శత్రుదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కొన్ని పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడ్తాయి. ప్రత్యేక హోదా ఇచ్చిన నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర వంటివి బాగా వెనుకబడిన గిరిజన సరిహద్దు రాష్ట్రాలు. వాటికి కృష్ణా, గుంటూరు జిల్లాలంత ఆదాయం కూడ వుండకపోవచ్చు. ఉద్యోగుల జీతాల కోసం కేంద్రంపై ఆధారపడే స్థితి ఆ రాష్ట్రాల్లో ఉన్నందున వాటితో మిగతా రాష్ట్రాలను పోల్చలేం.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం తన ఆదాయాన్ని డెబ్బయ్ శాతం నుండి అరవై శాతానికి తగ్గించుకొని రాష్ట్రాల వాటాను 30 నుండి 40 శాతం వరకు పెంచామంటున్నది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల ఆదాయం కూడ భారీగా పెరిగి వుంటుంది. అభివృద్ధిలోనూ తెలుగు రాష్ట్రాలు పోటీపోటీగా రెండంకెల వృద్ధితో దూసుకెళుతున్నాయి. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజలకు ‘అడగని వరాలతో’పాటు ఇంటింటికి నల్లా, నెట్, స్మార్ట్ఫోను హామీలతో, ప్రభుత్వోద్యోగులకు భారీ వేతనాలూ ఇస్తున్నట్లు నిత్యం పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు హిందీ రాష్ట్రాలను మించిపోతున్నాయని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష కోట్ల బడ్జెట్, నేడు రెండు రాష్ట్రాలకు కలిపి నాలుగు లక్షల కోట్లకు చేరువలో వుంది. కేంద్ర నిధులు పెరగటం, ప్రజలపై పన్నుల ఆదాయం పెరగటం వల్లే ఇది సాధ్యమైంది కదా!
ఇక, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చే అవకాశం తక్కువే. కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే హోదా ఇచ్చే అవకాశాలు లేనట్టే. ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరగటం, అవి ఏదో ఒక వంకతో పార్లమెంటులో నిత్యం రచ్చచేయటం జరుగుతోంది. ఏపీ రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రం కోరినంతగా నిధులను కేంద్రం తక్షణం ఇవ్వలేకపోవచ్చు. కొత్త రాష్టమ్రని ఎన్నో విద్యా సంస్థలను ఏపీకి మంజూరు చేశారు. ఇంతవరకు కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు అడిగినంతలా అన్ని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పాలకుల గురించే గాక, జనం దేశం గురించి, కేంద్రం గురించి కూడా ఆలోచించాలి. అమరావతి-అనంతపూర్ మధ్య ఎనిమిది లైన్ల రహదారి, కొత్త రాజధానికి కొత్త రైలుమార్గం, ఉక్కు ఫ్యాక్టరీ వంటివి వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నవి. ఇవన్నీ వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు పూర్తి కావడం అసాధ్యం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నా ఇంతకంటే ఇచ్చేది కాదేమో!
ప్రస్తుత వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం, అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యేక ప్యాకేజీలో మిగిలిన వాటి గురించి కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సమంజసంగా వుంటుంది. కేంద్రం కూడా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మంజూరు చేసిన నిధులు తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. రాయలసీమలోని గుంతకల్‌ను రైల్వే డివిజన్‌గా ప్రకటిస్తే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. విభజన సమస్యలపై చొరవ తీసుకొని శీఘ్రమే పరిష్కరించి తెలుగు రాష్ట్రాల మధ్య కీచులాటలకు తెర దించేందుకు కేంద్రం ప్రయత్నించాలి.

-తిరుమలశెట్టి సాంబశివరావు 92478 70141