సబ్ ఫీచర్

ఆ జ్ఞాపకాలే.. మధురానుభూతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర ఎప్పటికీ మారదు! ఎన్ని కొత్త విషయాలు అనుభవంలోకి వచ్చినా -చరిత్ర జరిగిన విషయానే్న కుండబద్ధలు కొట్టిచెబుతుంది. అదే విషయాన్ని మాస్టర్ కుందు కూడా నొక్కి చెబుతున్నారు. మాస్టర్ కుందు ఎవరో కాదు -ఇటీవల వచ్చిన యన్‌టిఆర్ బయోపిక్ తొలిభాగం ‘కథనాయకుడు’లో దొర్లిన తప్పును తప్పని చెప్పే ప్రత్యక్ష సాక్షి. ఆయనతో వెనె్నల ముచ్చట్లు.
*
మహానటుడు, మహా నాయకుడైన యన్‌టిఆర్ చరిత్రను వచ్చే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో -నందమూరి బాలకృష్ణ సంకల్పంగా బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో విజయావారి ‘పెళ్లిచేసి చూడు’ చిత్ర ప్రస్తావన వచ్చింది. ‘పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్’ పాటలో కనిపించిన బాలనటుడు కందా మోహన్ అంటూ చూపించారు. కానీ, అది తప్పుగా చూపించారని అంటున్నారు మాస్టర్ కుందు. ఎందుకంటే -ఆ పాటలో కనిపించింది ఆయనే. పెళ్లిచేసి చూడు చిత్రంలో ఎన్టీఆర్‌కి ఎంత నిడివి పాత్రవుందో అంతకంటే ఎక్కువగా కనిపించే పాత్ర మాస్టర్ కుందుది.
బెర్హమ్‌పూర్ వాస్తవ్యుడైన కుందు బాల్యం విజయనగరంలో సాగింది. తరువాత స్వయానా మేనమామ అయిన న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), కామేశ్వరీ దేవి (రేడియో అక్కయ్య)ల ప్రోత్సాహంతో చెన్నై వెళ్లారు. అక్కడ బాలానందంలో ఆయన ప్రదర్శించిన అనేక చిన్ని చిన్ని నాటకాలు, స్కిట్స్ చూసి అప్పటి తెలుగు దర్శక నిర్మాతలు పిల్లల పాత్రలువుంటే రేడియో అన్నయ్య, అక్కయ్యలను సంప్రదించి నటింపజేసేవారు. అలా బాలానందం సంఘం నుంచి బిగ్ స్క్రీన్‌కు వెళ్లిన వారిలో మాస్టర్ కుందు ఒకరు.
తొలి చిత్రం గుణసుందరి కథలో మంత్రికుడు అంజనం వేసి చూసే తొలి సన్నివేశమే కుందును చిత్ర రంగానికి పరిచయం చేసింది. తరువాత భానుమతి, నాగేశ్వరరావు నటించిన ‘లైలా మజ్ను’లో పిల్లలందరిలో ఆయనా ఒకరిగా కనిపిస్తారు. అంజలీదేవి- అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘శ్రీలక్ష్మమ్మ కథ’ చిత్రంలో జి వరలక్ష్మి కొడుకుగా నటించారు. తరువాత పిల్లల చిత్రం ‘దీక్ష’లోనూ జి వరలక్ష్మి, రామ్‌గోపాల్‌తోపాటు తెలుగు, తమిళ భాషల్లో నటించారు. తరువాత విజయవారి పెళ్లిచేసి చూడు, కళ్యాణం పణి పార్ చిత్రాల్లో జోగారావు తమ్ముడిగానూ కుందు కనిపిస్తారు.
అప్పటి విశేషాలు ఆయన మాటల్లోనే..
సినిమాల్లో నటించాలన్న బలమైన కోరిక నాకేమీ ఉండేదికాదు. దాని గొప్పతనం కూడా ఆ వయసులో తెలీదు. అన్నయ్యగారు వెళ్లి నటించమంటే వెళ్లటం వరకే నాకు తెలుసు. ఉదయానే్న 5 గంటలకే కళాధర్ (ఆర్ట్ డైరెక్టర్)తోపాటుగా మరో ఇద్దరు కారులో వచ్చేవారు. నిద్రలేపి నన్ను పికప్ చేసుకునేవారు. కళాధర్ సెట్లో అంతా సిద్ధం చేసేసరికి మేకప్‌తో నేనూ సిద్ధమయ్యేవాడిని. ఓసారి -పసుమర్తి కృష్ణమూర్తి నృత్య దర్శకత్వంలో ‘రాధనురా’ అనే పాటకు డ్యాన్స్‌లో ఓ స్టెప్ సరిగా వేయలేదు. అందుకు ఆయన నాపై విసుక్కున్నారు. నాకు కోపమొచ్చింది. ఇంటికి వచ్చేసి షూటింగ్‌కు వెళ్లనంటే వెళ్లనని అన్నయ్యగారితో చెప్పేశాను. ఆయన చక్రపాణికి ఫోన్ చేసి ‘మావాడు రానంటున్నాడు, నృత్య దర్శకుడు ఇబ్బంది పెడుతున్నాడట’ అని చెప్పేశారు. దాంతో పసుమర్తి కృష్ణమూర్తికి చక్రపాణి సర్దిచెప్పడంతో విషయం కొలిక్కి వచ్చింది. ‘పిల్లలతో నెమ్మదిగా చెప్పి చేయించుకోవాలి’ అని ఆయన సలహాతో నృత్య దర్శకుడు -నా ఇష్టానికి వదిలిపెట్టేశారు. ‘నువ్వు ఎలా డ్యాన్స్ చేయగలవో అలా చెయ్యి’ అని చెప్పేవారు. అలా నేను గెలిచానన్నట్లుగా భావించేవాడిని. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏడాదిపాటు జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ చిత్రంలో పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్ అన్నపాటలో ఎన్టీఆర్ సతీమణి శ్రీమతి బసవరామ తారకం సెట్‌కువచ్చి ఎన్టీఆర్‌కు హార్మోనియమ్ నేర్పినట్టుగా చూపారట. కానీ వారెప్పుడూ షూటింగ్‌కు వచ్చినట్టు నాకు గుర్తులేదు. ఆమె షూటింగ్‌కు రావడం నాకు తెలియదు. వారినెప్పుడూ నేను చూడను కూడా లేదు. అది కరెక్టు కాదు. ఆ పాటను రెండు రోజులపాటు చిత్రీకరించారు. బహుశా వారు ఎన్టీఆర్‌కు ఇంట్లోనే హార్మోనియం నేర్పించారేమో, నాకు తెలియదు.
మీరన్నట్టుగా అన్న కలలో తమ్ముడు మన్మథుడిగా వచ్చి అన్నపై మన్మథ బాణాలు వేయడం అనేది వైవిధ్యమైన ఆలోచన. ఆ ఆలోచన చక్రపాణిదే. ప్రతి సన్నివేశంలో చక్రపాణి తనదైన బాణీతో సినిమాను చిత్రీకరింపజేసేవారు. ఆ చిత్రంలో పెళ్లిచేసి చూపిస్తాం అన్న ఓ పాట ఉంటుంది. అందులో జోగారావు, నేను రైల్లో వెళ్లే సన్నివేశం ఉంటుంది. అది కంపార్ట్‌మెంట్‌లాగా ఓ డబ్బాను తయారు చేసి మమ్మల్ని అందులో కూర్చోబెట్టేవారు. దాన్ని చిన్నగా కదుపుతూ వెనుక స్క్రీన్‌పై బ్యాక్ ప్రొజెక్షన్ చేసేవారు. ఇలాంటి సన్నివేశాలను రాత్రులలోనే చిత్రీకరించేవారు. అవన్నీ మర్చిపోలేని అనుభూతులే.
చేసింది కొన్ని చిత్రాలే అయినా, మహామహులైన ఎన్టీఆర్, సావిత్రి, జి వరలక్ష్మి, రేలంగి, ఎస్‌వి రంగారావు లాంటివారితో నటించడం ఇపుడు తలచుకుంటే ఆనందంగా ఉంటుంది. కానీ అపుడు వారు అంత గొప్ప నటీనటులని నాకు తెలీదు. సూర్యకాంతం చాలా గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి. వారి ఇల్లు మా ఇంటిదగ్గరే ఉండేది. అపుడపుడు వారింటికి వెళ్లేవాడిని. సావిత్రితో బాగా పరిచయం ఉండేది. తోడికోడళ్లు చిత్రంలో సూర్యకాంతం- రేలంగి తనయుడిగా నటించాను. నేను పెద్దై జీవితంలో స్థిరపడ్డాక మా మామయ్యను సావిత్రి నాగురించి అడిగి వాకబు చేసేవారట.
మా తల్లిదండ్రులుపోయాక ఆ లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి పెళ్లిళ్లు చేసి జీవితంలో స్థిరపడేలాగా మా అన్నదమ్ములను తీర్చిదిద్దారు రేడియో అన్నయ్య, అక్కయ్య. అలాగే, పెళ్లిచేసి చూడు సినిమా షూటింగ్ సమయంలోనే మా అమ్మగారు పోయారు. అప్పటినుండి కెఎస్ ప్రకాశరావు, జి వరలక్ష్మిలు వాళ్ల కొడుకులాగా చూసుకునేవారు. ఆ తరువాత నేను విజయవారి పర్మినెంటు ఆర్టిస్టునయ్యాను. రోహిణి ప్రొడక్షన్స్ సంస్థ తరఫున హెచ్‌ఎం రెడ్డి రూపొందించిన ‘బీదల ఆస్తి’ చిత్రంలో నటించడానికి విజయవారి అనుమతి తీసుకున్నారు ఆయన. ఆ తరువాతే నేను ఆ చిత్రంలో నటించాను. కన్యాశుల్కంలో గిరీశంగా ఎన్టీఆర్ నటిస్తే, ఆయన శిష్యుడు వెంకటేశంగా నేను నటించాను. అప్పటికే ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశాను. కన్యాశుల్కం చిత్రంలో నాకు గుండు కొట్టించడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది. ఆ తరువాత సినిమాల్లో నటించడం అంత నచ్చేది కాదు. 1957లో గోవిందరాజుల సుబ్బారావు గిరీశం పాత్రలో నటిస్తే, నేను వెంకటేశంగా కన్యాశుల్కం నాటకాన్ని సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో ప్రదర్శించాం. రేడియో అన్నయ్య, అక్కయ్యల ప్రోత్సాహంతో అనేక రేడియో కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా పొట్టిబావ చిట్టి మరదలు లాంటి పాత్రలతో మాకు మంచి గుర్తింపు వచ్చింది.
తోడికోడళ్లు చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం రూపొందించేటపుడు కెబి తిలక్, కె విశ్వనాధ్ లాంటివాళ్లు పరిచయమయ్యారు. పెళ్లిచేసి చూడు చిత్రానికి కె విశ్వనాధ్ సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. బికాం పూర్తిచేసి రవీంద్రనాధ్ ఠాగూర్ అనే అకౌంటెంట్ దగ్గర అప్రెంటీస్‌గా నేను పనిచేస్తున్నపుడు అప్పుచేసి పప్పుకూడు సినిమా రూపొందిస్తున్నామని, అందులో గిరిజ తమ్ముడి పాత్ర ఉంది రమ్మని చక్రపాణి ఫోన్ చేశారు. కానీ మా సీనియర్ నేను వెళ్లడానికి అనుమతివ్వలేదు. దాంతో ఆ పాత్రను పెప్పర్ అని మేము పిలిచే ఓగిరాల నరసింహమూర్తి చేత వేయించారు. అలా ఆ అవకాశం చేజారింది. అవకాశం చేజారినందుకు బాధలేదు. అంత పెద్ద చక్రపాణి పిలిస్తే వెళ్లి చేయలేకపోయాననే బాధే ఉండేది.
కుందు అనేది మా నాన్న పిలిచే ముద్దుపేరు. ఆ పేరునే సినిమా పేరుగా పెట్టుకున్నాను. నా అసలు పేరు గాదె బాలకృష్ణారావు. బికాం పూర్తిచేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా భారతదేశం అంతా తిరిగాను. హైదరాబాద్‌లో రిటైరయ్యాను. నా భార్య గౌరి, ఇద్దరబ్బాయిలు. పెద్దబాబు జివిఎన్ ప్రసాద్. అశోక్ లైలాండ్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు. రెండో అబ్బాయి జగన్నాథ్ దాస్. ఓ పేరొందిన కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. పబ్లిసిటీ అంటే మొదటినుంచీ అంత ఇష్టంలేని నేను సినిమా ఫీల్డ్ వదిలేశాక ఎవరితో కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. నేను ఫలానా అని సొంత డబ్బా కొట్టుకోవడం ఇష్టంలేదు. జీవితంలో అనేక వరాలు దేవుడు అడగకుండానే ఇచ్చాడు. వాటితో సంతోషంగా ఉండటమే నాకు ఇష్టం.
నచ్చిన దర్శకులు కెవి రెడ్డి, కెఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావులు. అప్పట్లోనే బాలలందరితో బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, రాజయోగం అనే మూడు కథలతో ఒకే చిత్రాన్ని రూపొందించారు. అందులో రేలంగి తనయుడు సత్యనారాయణ బాబుతో కలిసి నటించాను. బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య సాంఘికాలైతే, రాజయోగం కథ జానపదం. ఇపుడు చిత్రాలు అప్పుడప్పుడు కొన్ని మంచివి వస్తున్నాయి. ఎక్కువగా జంధ్యాల మార్క్ చిత్రాలు చూడటానికి ఇష్టపడతా. ముఖ్యంగా వీనుల విందైన సంగీతంపోయి, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది ఇప్పటి చిత్రాల్లో. ఆ కాలంలో నాకు తెలియకుండానే అంత గొప్ప నటీనటులతో నటించినందుకు అవి మర్చిపోలేని అనుభవాలుగా మిగిలిపోయాయి. అపుడప్పుడు గుర్తొచ్చి ఆనందాన్నిస్తాయి.

-సరయు శేఖర్