సబ్ ఫీచర్

పదవులు చిన్నవే.. బాధ్యతలు బోలెడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోలాహలం పల్లెపల్లెలో నెలకొంది. గ్రామ రాజకీయాలు లోక్‌సభ ఎన్నికలను సైతం ప్రభావితం చేస్తాయి గనుక సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవుల కోసం హోరాహోరీగా పోరు సాగుతోంది. తెలంగాణలో గతంలో 8 వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుండగా, తెరాస ప్రభుత్వం ఇటీవల కొత్తగా 4 వేల పంచాయతీలను ఏర్పాటు చేసింది. 12వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు ఈ నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులకు, సర్పంచ్ పదవులకు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. మొదటి విడత ఎన్నికలలో భాగంగా నామినేషన్ పర్వం కూడా ముగిసింది. గ్రామాలలో స్థానిక స్వపరిపాలన కోసం జరిగే ఎన్నికలలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు నెలకొంటాయనడం అక్షర సత్యం.
గ్రామాలలో విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమయానుకూలంగా నడుచుకుంటూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను సైతం బరిలోకి దింపుతుంటారు. అన్నా తమ్ముడు, అన్నా చెల్లెలు, తల్లీ కొడుకు, అత్తాకోడలు.. ఇలా రక్తసంబంధీకులు సైతం గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఎన్నికల సమరంలో దిగుతుంటారు. ఈ ఎన్నికలలో డబ్బు ఏరులై పారుతుంది. మద్యం పరవళ్లు తొక్కుతుంది. ఓటర్లను ఆకర్షించడానికి స్థానిక నాయకులు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్నో హామీలిస్తూ, వోటర్లను బతిమిలాడుతూ, భయపెడుతూ, బహుమతులనిస్తూ ప్రచారం చేస్తుంటారు.
వాస్తవానికి గ్రామం అభివృద్ధి చెందినపుడే యావత్ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే గ్రామాలలో ఎన్నికయ్యే సర్పంచ్ పైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌లు ఇంటికి పెద్ద దిక్కువలే పల్లెవాసుల నిరంతర క్షేమం, సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతుండాలి. వౌలిక వసతుల ఏర్పాటుకు సర్పంచ్‌లు చొరవ చూపించాలి. గ్రామస్థులకు ఎలాంటి విద్యనందించాలో అనారోగ్యానికి పాల్పడితే ఎలాంటి చికిత్స చేయించాలో, ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్లాలో ఆలోచిస్తుండాలి. గ్రామానే్న తన కుటుంబంగా భావించి, ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి నిరంతర అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి. అంతేకానీ ఏదో హోదా కోసమో, ఆర్థికపరమైన వ్యవహారంగానో భావించి లక్షలలో ఖర్చుపెట్టి గెలిచాను, వడ్డీతో సహా సంపాదించుకోవాలనో ఎన్నికలలో పోటీచేయడం గ్రామ స్వరాజ్య స్ఫూర్తికే విరుద్ధం.
గ్రామ ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, డబ్బుకు ప్రాధాన్యతనివ్వకుండా సేవాదృక్పథం కలిగిన వ్యక్తిని గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది. వచ్చే నెల నాటికి తెలంగాణలో నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు కొలువుతీరి ఉంటారు. వారి ముందున్న లక్ష్యాలు చాలా విస్తృతమైనవి. ఆ వివరాల్లోకి వెళితే......
* సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవులు చేపట్టిన తర్వాత ఒక రోజులకే వేసవికాలం ప్రారంభం కాబోతున్నది. గ్రామ ప్రజలకు పరిశుద్ధమైన మంచినీటిని అందించే బాధ్యత గ్రామ పాలకులపైనే వున్నది. ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా క్లోరినేషన్‌తో కూడిన త్రాగునీటిని అందించాల్సిన అవసరం వున్నది.
* గ్రామంలో ప్రతి వీధిలో సిమెంటు రోడ్లు వేయించడం, ప్రతిరోడ్డు ప్రక్కన మురికి కాలువలు నిర్మించడం, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి వుండే విధంగా కృషిచేయాలి.
* వీధి లైట్లు సక్రమంగా వెలిగేలా, గ్రామం స్వచ్ఛతతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వున్నది.
* సకాలంలో గ్రామ సభలను నిర్వహిస్తూ, ప్రతి వార్డు సభ్యుడూ పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ, వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించే విధంగా ముందుకెళ్లాలి.
* గ్రామంలో 100 శాతం అక్షరాస్యతకు కృషి చేయడంలో భాగంగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల సలహాలు, సూచనలతో గ్రామంలోని పాఠశాలను ప్రోత్సహించాలి. మంచి నాణ్యతతో విద్యను పిల్లలకు అందించేలా పాటుపడుతూ ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ఉన్నతమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని నిరూపించాలి.
* గ్రామంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండటానికి, పిల్లలకు పోలియో చుక్కలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీకాలు ఇప్పించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపులు నిర్వర్తిస్తూ, తమ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమర్ధవంతంగా పనిచేసేలా కృషిచేయాలి.
* గ్రామ అభివృద్ధికి రాష్ట్రం, కేంద్రం ప్రవేశపెట్టే పథకాలపై అవగాహన తెచ్చుకొని, వాటిని గ్రామ ప్రజలకు వివరిస్తూ, నిధులను సద్వినియోగం చేస్తూ, ఆ ఫలితాలను గ్రామ ప్రజలకు అందేటట్లు చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై వున్నది.
* హరితహారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోవసం ప్రతి ఇంటి వద్ద, అన్ని వీధులలో రోడ్డుకు ఇరువైపున చెట్ల మొక్కలు నాటుతూ, వాటిని పరిరక్షిస్తూ పచ్చదనానికి ప్రాముఖ్యతనివ్వాలి.
* పంచాయతీకి వచ్చే నిధులతో, పన్నులతో పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామ పరిధిలో ఉండే గ్రామ కంఠం భూములను, ఆస్తులను కాపాడుతూ ప్రతి విషయాన్నీ రికార్డుల రూపంలో ఉంచాల్సిన అవసరం ఉంది.
* గ్రామంలోని యువత చెడు మార్గంలో పయనించకుండా, వారిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచే విధంగా ప్రోత్సహిస్తూ, నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు నిర్మించి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే పుస్తకాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
* గ్రామ సభలను పారదర్శకంగా జరుపుతూ, హాజరైన ప్రతి ఒక్కరి ఆలోచనలను తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, నిర్దిష్ట కాలంలో చేయవలసిన పనులను, ప్రణాళికలను ఖరారు చేసుకోవాలి.
* ప్రజా పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తూ, అందరికీ నిత్యావసర సరకులు అందుతున్నాయో లేదో సరి చూసుకుంటూ, ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కార మార్గాలను చూపిస్తూ ముందుకు నడవాలి.
* మహిళా సంఘాలను, పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తూ, వారికి అన్ని విధాలా సహకరిస్తూ అభివృద్ధి చెందేటట్లు చేయడం పంచాయతీ పాలకులపైనే ఉంటుంది.
* గ్రామాల్లో పద్ధతి ప్రకారం జనన, మరణాలను నమోదు చేస్తూ, మహిళా శిశు సంక్షోభానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత గ్రామ పాలకులపైనే వుంటుంది.
* గ్రామంలో వున్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ ఫలాను అందేటట్లు కృషిచేస్తూ గ్రామాభివృద్ధికి దోహదపడాలి.
లాభార్జన వద్దు...
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తమ జీవితాలను ప్రజాసేవకు అంకితం చేసే వ్యక్తులను గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత గ్రామ ఓటర్లపైనే వుంటుంది. ప్రజలు అలాంటి వ్యక్తులను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాసేవ చేయడానికి, ఎలాంటి లాభార్జనకు ఆశించకుండా గ్రామాభివృద్ధికి దోహదపడే వ్యక్తులు గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నిక కావాలి. అలాంటి లక్షణాలున్న వారు మాత్రమే ఎన్నికల్లో గెలుపొందితే గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే అవకాశం ఉంది.

-డా. పోలం సైదులు 94419 30361