సబ్ ఫీచర్

రాష్ట్రపతి పాలనే పరిష్కారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మేము వౌనంగా ఉన్నా.. లేనిపోని రభస చేసి ఆమె మాపై అకారణంగా నేరం మోపుతుంది..’ ఈ మాటలు అన్నది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు.. సాక్షాత్తూ దివంగత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనేత జ్యోతిబసు.
ఇంతకూ ‘ఆమె’ ఎవరు?
ఆమే- ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చిన్నప్పటి నుండి మానసికమైన ఒత్తిడులతో ఆమె పెరిగింది.
ప్రస్తుతం భారత రాజకీయాల్లో ఆమె సంచలనాలను సృష్టిస్తోంది. తాను భారత ప్రధాని కావాలని ఆశిస్తున్నది.
ఆశ ఎవరికైనా ఉండవచ్చు. అందుకు అర్హతలు కూడా ఉండాలి కదా? భారత రాజకీయాల్లో అర్హతలకన్నా ‘అవకాశం’ వచ్చినవారే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులను పొందుతున్నారు.
బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో కొనసాగిన సీపీఎంను బలంగా ఢీకొని మమత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. రెండోసారి సైతం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మమతా బెనర్జీపై చాలా అవినీతి ఆరోపణలున్నాయి.
బెంగాల్‌లో జరిగిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందరో మధ్యతరగతి కుటుంబీకులు శారదా చిట్‌ఫండ్‌లో తమ డబ్బును పొదుపు చేసుకున్నారు. ఉన్నట్లుండి ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ స్వయంగా మమతా బెనర్జీ నేతృత్వంలో నడిచిందన్న ఆరోపణలున్నాయి. నారదా టేపుల కుంభకోణం కూడా వార్తల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఇందులోనూ మమత ప్రమేయం ఉందన్న విమర్శలున్నాయి.
రోజ్‌వ్యాలీ కుంభకోణం కూడా మమత రాజకీయ జీవితంలో ప్రధానమైనది. ఫ్లైఓవర్లు కూలిపోయిన కుంభకోణం ఇది. పలు ఫ్లైఓవర్ల కాంట్రాక్టులను మమత తన ఆంతరంగికులకు కట్టబెట్టినట్లు ఫిర్యాదులున్నాయి.
మల్డా జిల్లాలో లక్షలాది బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు. వీరందరికీ మమత ప్రభుత్వం పౌరసత్వం కార్డులు ఇచ్చి ఓటర్లుగా గుర్తించింది.
శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై కోల్‌కతాలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సీబీఐ) విభాగం 2017 నుండి నగర పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు నోటీసులు జారీచేస్తూనే ఉంది. ఐతే ఆయన సీబీఐ నోటీసులకు ఏనాడూ స్పందించలేదు. సరికదా కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టాడన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నాడు. కమిషనర్‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు రావడంతో కొద్దిరోజుల క్రితం కోల్‌కతాలో పెద్ద రాజకీయ నాటకం నడిచింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం సీబీఐ అధికారులు రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించడానికి వెళ్లారు. వారిని స్థానిక పోలీసులు అరెస్టుచేశారు. షేక్స్పియర్ వీధిలో ఉన్న సీబీఐ కార్యాలయాన్ని బలవంతంగా మూసివేశారు. సిబిఐ అధికారుల కుటుంబాలను బెదిరించారు. ఈ తతంగం జరుగుతుండగా- ‘కేంద్రం మా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నది. అంతర్యుద్ధానికి ప్రేరేపిస్తున్నది..’ అంటూ మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె నడిరోడ్డుపై నిరసన దీక్షకు కూర్చున్నది. మొత్తం రాష్ట్రంలో రైళ్లు, బస్సులను స్తంభింపజేసింది. ఇదంతా ఎందుకు? సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోకుండా అడ్డుకునేందుకే అని వేరే చెప్పనక్కర్లేదు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో నిగ్గు తేలుతుందని ఆమె భయపడుతున్నారా?
మాల్దాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించడానికి వీలు లేకుండా మమత ప్రభుత్వం అడ్డుకొంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ కోల్‌కతాలో దిగకుండా అడ్డుకున్నది. అమిత్ షా పర్యటించే ప్రాంతాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. గతంలో సుబ్రో మెహతా అనే దళితుడు భాజపాను బలపరిచినందుకు అతనిని హత్యచేసి, ‘ఎవరైనా భాజపాను బలపరిస్తే ఇదే గతి ఖాయం’ అని ఒక ప్లకార్డును మృతదేహంపై తృణమూల్ కార్యకర్తలు ఉంచారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలు సీపీఎం హత్యా రాజకీయాలకు విసిగి వేసారి ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఆమె స్వయంగా సీపీఎం తరహాలోనే వ్యవహరించడం గమనార్హం. సీపీఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి విధ్వంసకాండలకు దిగుతున్నారు.
కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమంటున్న మమతకు ఇపుడు కాంగ్రెస్ సహా దేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. బెంగాల్‌లో తన ప్రభుత్వాన్ని అన్యాయంగా రద్దు చేసి, రాష్టప్రతి పాలన విధించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మమత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాసటగా నిలిచారు.
‘నా రాష్ట్రంలోకి సీబీఐ అధికారులను అడుగుపెట్టనివ్వను’ అంటూ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మమతను బలపరుస్తున్నారు. దీక్ష చేస్తున్న ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు కోల్‌కత వెళ్లి తన సంఘీభావాన్ని ప్రకటించారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవగౌడ సైతం మమతకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ మద్దతుతో దేవగౌడ కుమారుడు కుమారస్వామి ప్రస్తుతం కర్నాటక ముఖ్యమంత్రిగా ఉంటూ, దినదిన గండంగా అధికారాన్ని నెట్టుకొస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద నాయకుడు ఒమర్ అబ్దుల్లా, బిహార్‌కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్, పలు కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి, అవినీతి ఆరోపణలతో పరిపాలన సాగించలేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు మమతకు అండగా నిలిచారు.
ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన బావమరిది రాబర్ట్ వాద్రా, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం తదితర కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక కుంభకోణాల్లో నిందితులైన నేతలు బెంగాల్‌లో మమతపై అన్యాయం జరిగితే సహించమని హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాంటి నేతలంతా కలసి తమను తాము కాపాడుకునే నిమిత్తం ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసుకొని ‘ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని పరిరక్షించాలి’ అనే నినాదంతో మోదీపై దాడి మొదలుపెట్టారు. అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల నాయకత్వంలో ప్రజాస్వామ్యం సురక్షితమేనా? వీరిలో కొందరు చైనా, పాకిస్తాన్ ఆదేశాలతో పనిచేస్తున్నారు. భారతదేశాన్ని రష్యావలే చిన్న చిన్న దేశాలుగా మార్చాలని చైనా ప్రయత్నిస్తున్నది. ఈ విషయమై గతంలోనే పలు వార్తా కథనాలు వెలుగు చూశాయి.
ఫెడరలిజం పేరుతో, భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అవలంబించిన తప్పుడు విధానాలతో ఇప్పటికీ భారత్ సమస్యలతో సతమతమవుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలమయింది. దేశంలో వేర్పాటు వాదాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే కొత్త చట్టాలను సైతం రూపొందించి అమలు చేయాలి. ప్రాంతీయతత్వం పేరిట దేశం విచ్ఛిన్నమైతే చైనా వంటి దేశాలు మరిన్ని చొరబాట్లకు ప్రయత్నిస్తాయి. ప్రజలకు కావలసింది నిరంతర ఎన్నికల ప్రక్రియ కాదు. దేశ సుస్థిరత్వం. రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం అన్నింటికీ పరిష్కారం కాదు. పరిస్థితులు విషమించినపుడు కేంద్రం ఎలాగూ ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. బెంగాల్‌లో పరిస్థితులు విషమించక ముందే కేంద్రం తగు చర్యలు తీసుకోవాలి. ముస్లింలు, చొరబాటుదారుల మెప్పు పొందేందుకు మమత చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టాలి. బెంగాల్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తే మమతకు ప్రజల్లో సానుభూతి వస్తుందని భాజపా నాయకులు భయపడుతున్నారు. రాజకీయాల సంగతెలా ఉన్నా, బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి విషమించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. భాజపా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ కక్షలు తగ్గితేనే బెంగాల్‌లో పరిస్థితి కుదుటపడుతుంది. అయితే, లోక్‌సభ ఎన్నికల సమయంలో వోటుబ్యాంకు రాజకీయాల ఫలితంగా పరిస్థితులు చక్కబడే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.

-డా. ముదిగొండ శివప్రసాద్