సబ్ ఫీచర్

జీవితాల్ని ఆర్పేస్తున్న కట్నదాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి మహిళ అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా కూడా ఇంకా పురుషాధిక్యత నిండిన సమాజంలో చాలావాటికి బలికావాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైనది వరకట్నం. పూర్వపు రోజుల్లో కన్యాశుల్కంగా ఆడపిల్లల్ని డబ్బులు చెల్లించి పెళ్లిచేసుకునేవారు. అది కాలక్రమేణా మార్పులకు గురి అవుతూ ఇపుడు అబ్బాయిలను కట్నంతో కొనుక్కోవాల్సి వస్తోంది. కన్యాశుల్కం కాస్తా ‘వరకట్నం’గా పేరు మారింది. ఎనభై, తొంభై దశకంలో ఈ వరకట్న దురాచారం చాలా తీవ్రంగా వుండేది. ఆడపిల్ల పెళ్లి చెయ్యాలంటే మధ్యతరగతి తల్లిదండ్రులకి పెద్ద గండంగా ఉండేది. ఆడపిల్ల చదువుకోవడమే కష్టం అనుకుంటే ఉన్నత చదువులు చదివించడం గుదిబండగా మారిపోయింది. తక్కువ చదువు చదివిస్తే దానికి తగ్గట్టు ఎవరికో ఒకరికి ఇచ్చి చేయొచ్చు అని భావించేవారు. గంతకి తగ్గ బొంత అన్నట్టుగా అతి తక్కువ నగదుతో అబ్బాయికి ఇచ్చి పెళ్లిచేసేవారు. అప్పట్లో కొంచెం తక్కువ ఇచ్చినా అమ్మాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి సర్దుకుపోయేవారు.
ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిపోయిందో, అప్పటినుండి అబ్బాయిల తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు వచ్చాయి. అత్యాశ పెరిగిపోయింది. అబ్బాయిని కట్నం తెచ్చేవాడిగా పెంచడం మొదలైంది. లక్షలకి లక్షలు కట్నంగా అమ్మాయిలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. అబ్బాయి చదువు, హోదా, ఆస్తులు వుంటే ఇక కట్నాల మార్కెట్‌లో బాగా ధర పలుకుతాడు. అసలు కట్నం ఎందుకు తీసుకోవాలి అని ఆలోచిస్తే అక్కడ కూడా ఆడపిల్లల కోణం నుంచే ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక కుటుంబంలో అమ్మాయి, అబ్బాయి వుంటే.. అమ్మాయిని మామూలుగా చదివించి అబ్బాయిని ఎక్కువ చదివిస్తున్నారు. మంచి ఉద్యగం వచ్చి జీవితంలో స్థిరపడితే ఇక పండగే. లక్షల కట్నం గుంజుతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తే-తమకి ఒక అమ్మాయి ఉంది అని, తనకి కూడా మేము వేరొకరికి కట్నం ఇవ్వాలని చిత్రమైన సమాధానం చెప్తున్నారు. అంటే ఒక నష్టం పూడ్చడానికి మరో లాభాన్ని వెతుక్కుంటన్నారు. అమ్మాయిల తరఫువారు బాగా ఉన్నవాళ్లు అయితే ఇచ్చుకోగలరుకానీ మధ్యతరగతివారు, పేదరికంలో వున్నవారు ఎలా భరించగలరు. పెళ్లి అయి మూడు నెలలు కాకముందే అదనపు ట్నం తెమ్మని అత్తా, మామ, భర్త, ఆడబిడ్డలు హింసిస్తుంటే ఆ పెళ్లికూతురు ఎలా భరించగలదు. అయినాసరే పుట్టింటివారికి మచ్చ తీసుకురావద్దు అని బాధల్ని వౌనంగా భరిస్తున్నారు.
మన తలరాత ఇంతే అంటూ తరతరాలుగా పిరికితనాన్ని నూరిపోస్తున్నారు. అమ్మాయి ఉన్నతమైన చదువు చదివినా కూడా కట్నం ఇచ్చుకోవాలి. అబ్బాయితో సరిసమానమైన ఉద్యోగం చేస్తున్నా కూడా కట్నం ఇవ్వాల్సిందే. నీతో సమానంగా నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోరు. పైగా చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది, ఎంత పొగరో చూడు అన్న సూటిపోటిమాటలు. అత్తాంటివాళ్ల హింసలకు అంతే ఉండదు. విషాదకరమైన విషయం ఏమిటీ అంటే, ఈ దురాచారం చదువుకోనివాళ్ళతోపాటు, బాగా చదువుకున్నవాళ్ళలో కూడా ఉండటం, వీటిని వాళ్ళు కూడా ప్రోత్సహించడం.
వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నకానుకలను ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. దీన్ని నిరోధించేందుకు మాత్రమే ఈ చట్టం రూపొందించబడింది. అయితే ఎంతో చదువుకున్న మహిళలకు కూడా ఈ చట్టం గురించిన చైతన్యం, అవగాహనే లేదనే చెప్పాలి. మన చట్టాలలో వున్న లోపాలు కూడా ఫిర్యాదు చేసేదానికి లేదు. పరువుపోతుంది అన్న భయంతో ఎన్ని బాధలైనా భరిస్తారు. చివరికి మృత్యువే దిక్కని అర్థాంతరంగా జీవితాల్ని చాలిస్తున్నారు. అసలు కట్నం తెమ్మని వేధించడం కూడా హింసకిందకు వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం, 2005 ప్రకారం కట్టుకున్న భార్యని ఎలాంటి వేధింపులకు గురి చెయ్యరాదు. కానీ ఇక్కడ ప్రతి నిత్యం అత్తగారు, భర్త, మరిది, ఆడబిడ్డల రూపంలో నిత్యం నరకం చూస్తోంది. ఇది ప్రతి మహిళకి రక్షణ ఇచ్చే చట్టం. అదృష్టవశాత్తు ఇప్పటి తల్లిదండ్రులు కూడా మన ఖర్మ, తలరాత అనుకోకుండా ధైర్యంగా గృహహింసకు, కట్నపు వేధింపులకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ దురాచారాన్ని అరికట్టాలంటే ముందుగా అబ్బాయిలలో మార్పురావాలి. చదువుకున్న తోటి మహిళలను గౌరవించాలి. అలాగే ఇప్పటి అత్తలు కూడా నిన్నటి కోడళ్లే అన్న సంగతిని గుర్తెరిగి మసలుకోవాలి. తమకి ఒక కూతురు ఉంటే తాను కూడా అలాంటి వేధింపులే ఎదుర్కోవాల్సి వస్తే ఎంత బాధగా వుంటుందో తెలుసుకోవాలి. తరతరాలుగా వస్తున్న ఈ దురాచారాన్ని ఒక్క రోజులో రూపుమాపలేకపోయినా దీన్ని అరికట్టాలన్న సంకల్పంతో అందరూ కలిసి కృషి చేస్తే రేపటి తరానికైనా ఈ కట్నపు బాధ ఉండదు. అదృష్టశాత్తు ఇపుడిప్పుడే నేటి యువతరంలో అవేర్‌నెస్ పెరుగుతోంది. ఎంతోమంది నేటితరపు అబ్బాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా తమకి నచ్చినవాళ్లని పెద్దలను ఎదిరించి వారికి ఇష్టమైన రీతిలో జీవితాన్ని లీడ్ చేసుకుంటున్నారు. వెబ్‌సైట్స్ కూడా అంతో ఇంతో దోహదం చేస్తున్నాయి. www.idontwantdowry.com అనే వెబ్‌సైట్‌లో అయితే పైసా కట్నం లేకుండా అమ్మాయిని పెళ్లిచేసుకునేవాళ్లు మాత్రమే ఇందులో రిజిస్టర్ అవుతున్నారు.
ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కూతురుని తమ గుండెలపై కుంపటిగా భావించకుండా తమ కాళ్ళమీద తాము నిలబడేలా చదివించి పైకి తీసుకురావాలి. నేటి మహిళల్లో చైతన్యం వెల్లివిరిసినపుడే ఈ దురాచారాన్ని పూర్తిగా అరికట్టగలం. జయహో మహిళా.. జయహో..

- పుష్యమీ సాగర్ 90322 15609