సబ్ ఫీచర్

మావోలను నిలదీసే సమయమిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల రాజధానిగా భావించే అబూజ్‌మడ్ అడవుల్లోకి భద్రతా బలగాలు అడుగుపెట్టాయి. ఈనెల 7న గాలింపు సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టు గెరిల్లాలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదకరమైన ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు ప్రభుత్వం కొత్తగా కొలువుదీరాక జరిగిన మొదటి ఎన్‌కౌంటర్ ఇది. బీజాపూర్ జిల్లా బైరాంగఢ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అడవిలో ఈ ఘటన జరిగిందని డీజీపీ డి.ఎం.అవస్థి తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలు, జిల్లా రిజర్వు పోలీసులకు మావోయిస్టుల సమాచారం తెలిసి గాలింపుకోసం వెళ్ళినప్పుడు ఈ భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోల కంచుకోటగా భావించే అబూజ్‌మాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో దీనికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. పక్కపక్కనే ఉన్న దంతెవాడ, జగ్దల్‌పూర్ జిల్లాల్లో మావోల పలుకుబడి, ప్రాబల్యం అధికంగా ఉన్న విషయం తెలిసిందే! దాంతో అడవిలో శిక్షణ కోసం గెరిల్లాలు గుమికూడగా డివిజనల్ కమిటీ సభ్యులు రాజ్‌మాన్ మాందవి, సుఖ్‌లాల్ నాయకత్వం వహించారని తెలుస్తోంది. పట్టుబడిన మందుగుండు సామగ్రి చాలా ప్రమాదకరమైనదని, భారీ విస్ఫోటనానికి వాడే ఐఈడీని శిక్షణ జరిగే ప్రాంతంలో ఉంచారని, 12 ఆధునిక ఆయుధాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారులు ప్రకటించారు. మరణించిన వారిలో చాలామంది ఆదివాసీలున్నారని తెలుస్తోంది. గత నవంబర్ 11న సుకుమా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు. అందులోనూ ఆదివాసీలే ఉన్నారు. తాజా ఎన్‌కౌంటర్ జరిగిన రోజే మహారాష్ట్ర గడ్చిరోలి ఆదివాసిని ఇన్‌ఫార్మర్ పేర మావోలు నరికి చంపేశారు. ఎనిమిది మంది ఆదివాసీలు పక్షం రోజుల్లో బలయ్యారు. ఇక్కడ ఓ క్షణం అందరూ ఆలోచించాలి.
ఇలా ఆదివాసీలు ఎంతకాలం ఆహుతి కావాలి? మానవ వనరులను ఎందుకు నష్టపోవాలి? ఇది కేవలం మావోయిస్టులకు, పోలీసులకు చెందిన సమస్య కాదు. ఆలోచనాపరులు, అభ్యుదయ అవగాహన గలవారు, సమాజ శ్రేయస్సుకోరే వారందరూ దీన్ని పట్టించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
దండకారణ్యంలో వేలాది మంది మావోయిస్టులు తిష్టవేశారు. ప్రత్యామ్నాయ జనతన సర్కారును కొనసాగిస్తున్నామని ప్రకటించారు. ఆ సర్కారును రక్షించుకునేందుకు గెరిల్లా సైన్యాన్ని రూపొందించారు. ఇది చట్టసమ్మతం కాదని, పోటీ ప్రభుత్వం కుదరదని, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం చెబుతోంది. మావోయిస్టు పార్టీని నిషేధించింది. ఆ పార్టీ చేసే కార్యక్రమాలన్నీ చట్టవిరుద్ధం. ఆయుధాలతో గెరిల్లాలు పోలీసులపై, పౌరులపై దాడులు జరపడాన్ని సహించని ప్రభుత్వం భారీ ఎత్తున సాయుధ బలగాలను దండకారణ్యంలో దింపింది. లక్ష మందికి పైగానే పారా మిలటరీ బలగాలిప్పుడు దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏరివేతను ప్రతిఘటించేందుకు మావోయిస్టులు మర తుపాకులు- మందుపాతరలు పేలుస్తున్నారు. వందలాది మంది ప్రాణాలను బలిగొంటున్నారు. దశాబ్దాలుగా ఈ తంతు సాగుతోంది. ఇది ఏ రకంగా ఆహ్వానించదగ్గ అంశం? వర్తమాన కాలానుగుణమైన వ్యవహారం ఎలా అవుతుంది? ఆర్థిక వనరులు, మానవ వనరులు ఇలా నేలపాలు కావలసిందేనా? దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని దశాబ్దాలుగా నినదిస్తున్నప్పుడు ఆ నినాదానికి అనుగుణంగా కార్యాచరణ కనిపించాలి కదా? లక్ష మంది పారామిలటరీ బలగాల శక్తిసామర్థ్యాలు, వేలాది మంది మావోల శక్తిసామర్థ్యాలు, సమయం ఇలా వృథాకావాలా?... ఇది ఏ రకమైన అభివృద్ధికి చిహ్నం?
ప్రపంచం కొత్త కక్ష్యలోకి ప్రవేశించి చాలాకాలమైంది. నాల్గవ పారిశ్రామిక విప్లవ సాంకేతిక పరిజ్ఞానం గొప్ప మార్పును తీసుకొచ్చింది. దాని ఫలితాలు పల్లెలను సైతం తాకుతున్నాయి. చివరికి దండకారణ్యంలోకి చొచ్చుకుపోతున్నాయి. దశాబ్దాలుగా వెనుకబడిన ఆదివాసీలకు మరింత వేగంగా నాల్గవ పారిశ్రామిక విప్లవ వెలుగులు అందాలి, అందివ్వాలి. కానీ దాన్ని విస్మరించి వందేళ్ళక్రితపు ఆలోచనలతో రాజ్యాధికారం యావతో ముతక ధోరణిలో కదం తొక్కితే కలిసొచ్చేది శూన్యం. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర దేశాల్లోని అనుభవం సైతం దీనే్న చెబుతోంది. ముఖ్యంగా నేపాల్, కొలంబియా దేశాల మావోయిస్టులు తమ పోరాటాన్ని విరమించి తమ ప్రజల అభివృద్ధిని, ఆదివాసీల పురోభివృద్ధిని కోరుకుంటూ కార్యాచరణను రూపొందించుకుని కదం తొక్కుతున్నారు. భారతదేశం కన్నా అనేక రంగాల్లో వెనుకబడిన ఆ దేశాల పరిస్థితి అలా ఉంటే ఎంతోకొంత మెరుగైన రీతిలోఉన్న మన దేశంలో పరిస్థితిని సరైన వెలుతురులో అంచనావేసి అడుగేయాలి. కానీ పిడివాదంతో పిడికిలి బిగించి, కసికొద్ది తుపాకులు పేల్చితే చిందేది రక్తమే తప్ప వెలుగులు విరజిమ్మవు.
మావోయిస్టుల మాట, ఆలోచనల ఆచరణతో ప్రజలు ఎక్కడా సుఖసంతోషాలతో లేరు. మావోయిజం బయల్దేరిన చైనాలోనే పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. దీన్ని ప్రపంచమంతటా పరిగణనలోకి తీసుకుంది. మార్క్సిజం, మావోయిజం కలికానికైనా కానరాని విధానాల ఆధారంగా వారి ఆర్థికవ్యవస్థ కొనసాగుతోంది. పక్కా మార్కెట్ ఎకానమీ దశాబ్దాలుగా దౌడు తీస్తోంది. తమ దేశ ప్రజలకు కావలసిన సౌకర్యాలను,ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నారు. విశాల జనాభా అవసరాలను తీర్చేందుకు మార్క్సిజం, మావోయిజం ఉపకరించవని మూడు దశాబ్దాల క్రితమే ఆ దేశ నాయకుడు డెన్ జియావోపింగ్ గుర్తించారు. కొత్త దారిని, తమదైన మార్గాన్ని ఏర్పరచుకుని కదులుతున్నారు. ఆ రకంగా భారతదేశం కన్నా దశాబ్దం ముందుగానే మేల్కొని, మార్కెట్ ఎకానమీని ఆలింగనం చేసుకుని అభివృద్ధి దిశన దూసుకుపోతూ అగ్ర రాజ్యంగా ప్రపంచ పటంలో చైనా నిలిచింది.
ఇంతవేగంగా మార్పులను చూపెట్టిన చైనా మార్గాన్ని అనుసరించడం అవసరం. ఒకప్పుడు చైనామార్గమే తమ మార్గమని చెప్పుకున్న నక్సలైట్లు ఇప్పుడు తాజాగా చైనా మార్గాన్ని ఎందుకు తులనాడుతున్నారు? అలా చేస్తున్నారంటే తప్పు- భారతదేశ నక్సల్స్... మావోయిస్టుల బుర్రల్లోనే ఉంది.
పార్టీకన్నా, సిద్ధాంతం కన్నా దేశం, ప్రజలు ముఖ్యం. ఈ కీలకాంశాన్ని మావోయిస్టులు తుంగలోతొక్కి తైతక్కలాడుతున్నారు. ఈ నేలతో, ఇక్కడి ప్రజలతో ఎలాంటి సంబంధం లేని ఇక్కడి సంస్కృతి- సాంప్రదాయాలు, భావోద్వేగాలతో పరిచయం లేని విదేశీయులైన మార్క్స్, లెనిన్, మావోల భావజాలాన్ని, సిద్ధాంత సూత్రీకరణలకు పెద్దపీట వేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నెలకొల్పుతాయని బందూకులు పడితే అదెలా ఆచరణకు నోచుకుంటుంది? ఈ ప్రశ్న గతంలో వేసుకోకపోయినా వర్తమానంలో తప్పక వేసుకోవాలి. ప్రపంచం మరోవైపు పరుగులు పెడుతుంటే దానికి వ్యతిరేక దిశలో ప్రజల్ని నడిపిస్తామని మావోయిస్టులు కంకణం కట్టుకుని దండకారణ్యంలో దండు నిర్మిస్తే అదేపనిగా తుపాకులు పేలిస్తే అదెలా సమర్ధనీయం? ఇన్ని ఆర్థిక-మానవ వనరుల్ని బుగ్గిపాల్జేస్తే ఎవరు క్షమిస్తారు? ప్రజలకు బాసటగా నిలవాల్సిన పార్టీ, ప్రజల చైతన్య స్థాయిని పెంచి, వారు ఆర్థికంగా బలపడి ప్రపంచంతో కలిసి నడిచేందుకు దోహదపడాల్సిన పార్టీ ఇలా ‘గుడ్డి’గా ఐఈడి (ఆధునిక పేలుడు పదార్థం)తో ఆటాడుకోవడం వల్ల ఆదివాసీలే అపారంగా నష్టపోతున్నారు. పేదల, ఆదివాసీల అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తున్నారు. దీన్ని ఎవరు, ఎందుకు స్వాగతించాలి? ఆ రకంగా మావోలను నిలదీసే సమయం ఆసన్నమైంది! వారి మొండి వైఖరిపై నిప్పులు కక్కాల్సిన సందర్భం వచ్చింది!

-వుప్పల నరసింహం 99857 81799