సబ్ ఫీచర్

వోటరు కష్టాలు తీరాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశం మనది. పరిపాలనను శాసించే ఎన్నికల ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగినది ఓటుహక్కు. ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలకమైన ఎన్నికల విధానం రానురానూ అపహాస్యం పాలవుతోంది. ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటున్న తప్పులు, చిత్తశుద్ధిలేని అధికారుల నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇటీవల 21 విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలసి, మళ్లీ ‘బ్యాలెట్’ విధానం అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) తారుమారు చేసే ప్రమాదం ఉందన్న ప్రతిపక్షాలు ఎన్నికల ఫలితాలను వీవీ ప్యాట్ స్లిప్‌లతో బేరీజు వేయాలని పట్టుబడుతున్నాయి.
మన దేశంలో ఎన్నికలు సజావుగా సాగుతున్నాయా? ఎన్నికల కమిషన్ తన విధులను సక్రమంగా నిర్వహిస్తోందా? ఈ కమిషన్‌కు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే ఇతర శాఖలతో సమన్వయం ఉందా? ఈవిఎంలతో అక్రమాలు సాధ్యమేనా? అనే అనుమానాలు వస్తున్నాయి. మళ్లీ బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల వచ్చే నష్టం ఏమిటనే విషయమై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వోటుహక్కు సామాన్యునికి వరం లాంటిది. ఆ హక్కు సాధారణ పౌరుడికి సైతం గుర్తింపునిచ్చింది. ఐదు సంవత్సరాలకు ఒకసారైనా పౌరుడనేవాడు ఉన్నాడని రాజ్యాంగం గుర్తుచేస్తుంది. జనం ఆగ్రహిస్తే ఎంతటి నేతలైనా ఇంటిముఖం పట్టాల్సిందేనని వోటు హెచ్చరిస్తుంది.
మన రాజ్యాంగంలో 326 ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క వయోజనుడికీ కుల, మత, వర్గ,వర్ణ, లింగ భేదం లేకుండా వోటు హక్కు కల్పించారు. ప్రపంచ దేశాలలో ఓటు ద్వారా క్రమంగా స్వేచ్ఛ, సమానత్వం సాధించుకుంటే మన దేశంలో మాత్రం ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. రాజకీయాలను వ్యాపారంగా మార్చిన ధనవంతులు, బడా వ్యాపారవేత్తలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా అవతారమెత్తి చట్టాలను తమకు లాభకరంగా మార్చుకుంటున్నారు. దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఎన్నికల విధానం సక్రమంగా లేకపోవడం, 70 సంవత్సరాల గణతంత్ర భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఈనాటికీ సజావుగా సాగకపోవడం శోచనీయం. ఓటర్ల జాబితా సక్రమంగా ఉండదు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా వుండదు. ఈ ప్రక్రియలో కీలకమైన బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తనిఖీలు చేసి సవరించాల్సి ఉంటుంది. ఇందుకుగాను వారికి ప్రత్యేకంగా పారితోషికాలు కూడా చెల్లిస్తారు. వీరు సమన్వయంతో, బాధ్యతతో పనిచేయకపోవడం వల్ల ఓటర్ల జాబితా ఎప్పుడూ తప్పుల తడకలుగా ఉంటుంది. ఓటరు తాను నివాసం ఉంటున్న ప్రాంతంలోనే వోటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండాలి కాని, ఒకే ఇంట్లో నలుగురు వోటర్లు ఉంటే వారికి వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో వోట్లు ఉంటాయి. ఎన్నికల సమయంలో ఓటర్ స్లిప్పులను పంచాల్సిన అధికారులు సిబ్బంది తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు.
వోటు వేయడానికి ఆసక్తి చూపనివారు కొందరైతే, ఎలాగైనా వోటు వేద్దామని వచ్చేవారికి నిరాశే ఎదురవుతోంది. గంటలకొద్దీ లైన్‌లో నిలబడినవారి ఓట్లు జాబితాలో ఉండవు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియని పరిస్థితి కొందరికి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వోటు వెయ్యడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఓటర్ల జాబితా సవరణ, నకిలీ ఓట్ల తొలగింపు పేరిట లక్షలాది వోట్లను తొలగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వెలుగు చూస్తున్న వోట్ల గల్లంతు వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. చివరి క్షణంలో ఉన్నతాధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంటోంది. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ తీరు ఏ మాత్రం సరిగ్గా లేదు. తమను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేనట్టుగా ఎన్నికల కమిషన్ వ్యవహరించడం విమర్శల పాలైంది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందన్న సందేహాలను నివృత్తి చేయడంలో ఎన్నికల కమిషన్ విఫలమవుతోంది.
వోట్ల తొలగింపులో అక్రమాలను అడ్డుకోవడం, ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటింగ్ శాతం పెంచడం, వోటర్లలో పోలింగ్ పట్ల ఆసక్తి పెంచడం వంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ పూర్తిగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. ఎన్నికల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియగా కమిషన్ పలుమార్లు ప్రకటించింది. ఇందుకు అవసరమైన చర్యల్ని చేపట్టడానికి వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకూ సమర్ధవంతంగా పనిచేయడానికి తగిన కార్యాచరణ అవసరం. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, అది భావితరాలకు అందాలంటే ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నికల కమిషన్ మరింత క్రియాశీలకంగా మారాల్సి ఉంది.

-సురేష్ కాలేరు 98661 74474