సబ్ ఫీచర్

మన్యంలో పప్పుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి పండుగ.. అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లు.. అయిపోయిన పండుగకు వ్యాసమేంటి? అయినా మాఘమాసంలో సంక్రాంతి పండుగేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ.. మన్యం వాసులు సంక్రాంతి పండుగ గడిచిన నెల తరువాత సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఎందుకో.. కారణాలు తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
తెలుగువారికి సంక్రాంతి అంటే పెద్ద పండుగ. అదంటే వారికి ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంధుమిత్రులతో కలిసి ఆడంబరంగా జరుపుకునే పండుగ ఇది. కానీ తూర్పు కనుమల మధ్య కొలువైన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మన్యం వాసులకు మాత్రం సంక్రాంతి సందడి ‘కొత్తల పండుగ’లో కనిపిస్తుంది. దీనే్న వారు ‘పప్పుల పండుగ’ అని కూడా పిలుచుకుంటారు. ఈ సంప్రదాయ వేడుకతో గిరిజన గ్రామాలు కొత్త కళను సంతరించుకుంటాయి.
ఈ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల్లో వింత వింత ఆచారాలు ఉంటాయి. అందులో ఒకటే సంక్రాంతిని మాఘమాసంలో జరుపుకోవడం. వ్యవసాయదారులు తమ పంట చేతికి వచ్చిన సమయంలో జరుపునే మకర సంక్రాంతి మాదిరిగానే మన్యం వాసులు తమ పంట చేతికందే సమయంలో ‘పప్పుల పండుగ’ను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఏజెన్సీ మొత్తం సందడిగా మారుతుంది. అన్ని ఇళ్లూ కళకళలాడిపోతుంటాయి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అలా పండించిన పంటల సాయంతోనే వారు పొట్ట పోసుకుంటారు. ఈ వ్యవసాయం సక్రమంగా సాగేందుకు వనదేవతలను ఆరాధించడం వారి సంప్రదాయం. ఇందుకు తగ్గట్టుగా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు. సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. ఈ పండుగ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, డోలు దరువులు, విందులు-వినోదాలతో ఏజెన్సీ ప్రాంతమంతా కోలాహలం కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్తపప్పులు తినడానికి వారు ససేమిరా అంటారు. కారణం.. తాము పండించిన కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు.. ఇలా ఏ పంటైనా వారు తినడానికి ముందు పితృదేవతలు, వనదేవతలకు నైవేద్యంగా పెడతారు. ఇందుకోసం మకర సంక్రాంతి తరువాత నెలరోజులకు ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ ముహూర్తాన్ని అనుసరించి ఆ రోజు గిరిజన గ్రామాల్లో ఆనందం తాండవిస్తుంది. అందరూ బాధలన్నింటినీ పక్కన పెట్టి పూర్తి సంతోషంతో పండుగను జరుపుకుంటారు.
పూర్వం నుండి.. అంటే తాతాముత్తాతల నుండి వచ్చిన ఈ పప్పుల పండుగ జరుపుకోవడం తమకు చాలా ప్రత్యేకమైనదని చెబుతారు గిరిజనులు. ఈ పండుగ రెండు రోజుల పాటు జరుగుతుంది. ప్రతి గిరిజనుడూ కల్లు తాగుతూ సంప్రదాయ డోలా దరువులకు తగ్గట్టుగా రేలా పాటలతో నృత్యాలు చేయడం వీరి సంప్రదాయం. దూర ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఈ పండుగకు మన్యం ప్రాంతానికి చేరుకుంటారు. ఏటా రెండు రోజుల పాటు జరిగే ఈ సంప్రదాయ పండుగలో డోలాలను వినియోగిస్తారు. అలాగే వనదేవత అనుగ్రహం కోసం పూజలు చేసిన తర్వాత అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డితో అల్లిన కొరడాతో దెబ్బలు తింటారు. ఇలా దెబ్బలు తినడం వీరి ఆనవాయితీ. పిల్లలు, పెద్దవారు అందరూ ఈ దెబ్బల కోసం ఎగబడతారు.