సబ్ ఫీచర్

శ్రీ తిరుపతమ్మ అమ్మవారు - పెనుగంచిప్రోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగడుగునా ఆలయాలకు ఆలవాలమై ఆధ్యాత్మికత వెల్లివిరిసే పుణ్యభూమి, ధన్యభూమి భరతభూమి. ఈ గడ్డపై వెలసిన హిమాలయాలు మహిమాలయాలు, మానస సరోవరాలు, కైలాసగిరులు, వేదాల సిరులు జనజీవనాన్ని ముక్తిమార్గంవైపు నడిపించే అరుదైన ఇంధనాలు, సాధనాలు. కనిపించని దేవతలు దేవుళ్లు లోకహితం, పారమార్థిక చింతనకోసం అవసరమైన దిశానిర్దేశం చేస్తారని భక్తజనం ప్రగాఢ నమ్మకం. దైవం మానుష రూపేణా అన్నది ఎంత నిజమో.. సత్‌ప్రవర్తనతో జీవితాన్ని పునీతం చేసుకున్నవారు సైతం జనం గుండెల్నే గుడిగా మలచుకుని అర్చనలు అందుకుంటారన్నది అంతే సత్యం. అందుకు ఉదాహరణే శ్రీ తిరుపతమ్మ అమ్మవారు.
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పెదగంచిప్రోలు మండలం కేంద్రంలో వెలసిన అమ్మవారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ నేలపై నడయాడి, ఇక్కడ గాలి పీల్చి, నీరు తాగి జన జీవనంలో ఒకటిగా మసలి, సామూహిక జన సంక్షేమం కోసం తనవంతు కృషి చేయడమే కాకుండా అవధుల్లేని ప్రేమని పంచి ఇచ్చిన మహిమాన్విత. ధన్యచరిత.. ధీర. కానీ, ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన తన భర్త మరణవార్త తాళలేక తననితానే యోగాగ్నిలో దహింపజేసుకుని తనువు చాలించి.. తర్వాత కాలంలో గుడిలో కొలువై భక్తజన కొంగుబంగారమై వెలసిన అనుపమాన దేవత.. ఆమె శ్రీతిరుపతమ్మ అమ్మవారు. ఈనాడు ఆలయాన దేవతగా వెలసి అశేష భక్తజన పూజాదికాలు అందుకుంటున్న కథ మహత్తర కావ్యం.
వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శ్రీతిరుపతమ్మ అమ్మవారి సేవలో తరిస్తూ ఆమె అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తజనం తహతహలాడడం, తపన పడడం, తపస్సు చేయడం దైవత్వానికి అచ్చమైన, స్వచ్ఛమైన ప్రతీక.
ఒక్కసారి కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు వెళ్లి అక్కడ వెలసిన అమ్మవారినోసారి దర్శించుకోండి. మనసా వాచా ఆ తల్లి మహిమల్ని తలచుకుని సేదతీరండి.
తిరుపతి వరప్రసాదిని
శ్రీ తిరుపతమ్మ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వరప్రసాదం. గోపినేనిపాలెం గ్రామంలో కొల్లా శివరామయ్య, రంగమ్మ దంపతులు సంతానం లేక కలత చెంది సంతాన ప్రాప్తికోసం శ్రీ తిరుమలేశుడిని వేడుకున్నారు. ఆ స్వామి అనుగ్రహ ఫలితంగా వారికి ఆడపిల్ల జన్మించింది. తిరుపతాంబ అనే పేరుతో ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తిరుపతాంబకు చిన్నతనం నుంచీ ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువే. భగవంతుడి సేవలో తరించేది. నిత్యం దేవతార్చనలో పునీతమయ్యేది.
పెనుగంచిప్రోలు ఆధ్యాత్మికతకు నెలవు
నూటొక్క దేవాలయాలతో అలరారే పవిత్రభూమి. ఆ గ్రామంలో కాకాని వంశానికి చెందిన కృష్ణయ్య, వెంకమ్మ దంపతులకు గోపయ్య అనే కుమారుడున్నాడు. పెళ్లీడుకొచ్చిన గోపయ్యకు వివాహం జరిపించేందుకు కృష్ణయ్య దంపతులు ప్రయత్నిస్తుండగా కొల్ల శివరామయ్య కూతురు తిరుపతాంబ సంబంధం వచ్చింది.
గోపయ్య మంచివాడనే ఉద్దేశ్యంతో తమ కుమార్తెను ఇచ్చి పెళ్లిచేశారు. వివాహానంతరం తిరుపతాంబ అత్తవారి ఊరైన పెనుగంచిప్రోలుకి వచ్చింది. ఆమె అడుగిడిన వేళావిశేషంతో ఆ గ్రామం సుభిక్షంగా మారింది. ఏ కష్టం లేకండా గ్రామస్థులందరూ సుఖసౌఖ్యాలతో జీవిస్తున్నారు. కాలం ఒకే రీతిన గడిస్తే చెప్పుకునేందుకు చరిత్రేముంటుంది?
ఒక్కసారిగా పెనుగంచిప్రోలును కరవు కబళించింది. ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తుంటే... పశుగ్రాసం దొరక్క పశువులు సైతం చిక్కి శల్యమవుతున్నాయి. ఆ సమయంలో గోపయ్య తమ ఆవుల మంద పోషణార్థం భద్రాచలం సమీపంలోని అడవులకు తోలుకుని వెళ్లాడు. అక్కడ తిరుపతాంబకు ఎంతో ఇష్టమైన ఆవు బలైంది. ఆవును రక్షించే క్రమంలో గోపయ్య పులితో పోరాడుతూ మరణించాడు. భర్త మరణవార్త ముందుగానే తన దివ్య దృష్టిచేత తిరుపతాంబకు తెలిసింది. తాను తన భర్త ఆనవాళ్ళతో యోగాగ్ని ప్రవేశం చేస్తానంటూ గ్రామస్థుల ముందు ప్రకటించింది. భర్తతో యోగాగ్ని ప్రవేశం చేసేముందు తిరుపతాంబ అక్కడికి చేరుకున్న గ్రామస్థులతో యోగాగ్ని ప్రదేశంలో మంగళసూత్రాలు, కుంకుమభరిణె, రూపులు కనిపిస్తాయంటూ గ్రామాధికారులు వీటిని భద్రపరచి ఆలయాన్ని నిర్మించాలంటూ ఆదేశించింది.
అదే సమయంలో ప్రతి మాఘపౌర్ణమినాడు చంద్రునిలో తన రూపాన్ని దర్శించుకోవాల్సిందిగా కూడా సూచించింది. తిరుపతాంబ యోగాగ్ని ప్రవేశం తర్వాత గ్రామాధికారులు ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఇపుడు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి పొందింది. వివిధ సమస్యలున్నవారు అమ్మవారి కళ్యాణం జరిపించి, అమ్మవారి పసుపు కుంకుమ, అక్షితలు స్వీకరించి అన్నప్రసాదలు సేవిస్తే పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం. తిరుపతాంబను కష్టకాలంలో ఆదుకున్న పాపమాంబ వంశీకులైన ముదిరాజులే ఈ ఆలయంలో అర్చనాదులు నిర్వహిస్తున్నారు.

శ్రీ తిరుపతమ్మవారి సహదేవతలు

తిరుపతమ్మ తన మహిమలను చూపించడం తర్వాత అంతకుముందు ఆమెకు ఎగ్గులు చేసినవారు పశ్చాత్తాపపడ్డారు. అలా పశ్చాత్తాప పడినవారిలో తిరుపతమ్మవారిపెద్దబావగారైన మల్లయ్య కొద్దికాలానికే మరణించెను. ఆయన భార్య తన తప్పిదాలవల్లనే తన భర్త మరణించారని తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తంగా తాను కన్న కుమార్తెను కూడా చేతినందుచుకొని పతితోపాటు సహగమనం చేసింది. అపుడు తిరుపతమ్మ శ్రీశైలపతి అన్న భక్తునకు కలలో కనపడి తనకు గుడి కట్టించినట్లుగానే పెద్దవారైన మల్లయ్య చంద్రమ్మలకు వారి పాపతో సహా గుడిని నిర్మించమని తమను దర్శించుకోవాలనుకొని వచ్చేవారు ముందుగా శ్రీ చంద్రమ్మ మల్లయ్య స్వామివార్లను దర్శించుకుని తమను దర్శించాలని అమ్మ సెలవిచ్చింది.
ఆదిపరాశక్తి అంకమ్మ
పెనుగంచిప్రోలు గ్రామ దేవత అంకమ్మ అమ్మ. ఈతల్లిని పూజించి నిమ్మకాయలను నివేదన చేసి నిమ్మకాయలతో అలంకరణ చేసి ఈతల్లి ప్రసాదంగా నిమ్మకాయలు తమ జేబులల్లోను, వాహనాలో,లేక ఇంట్లో ధనము పెట్టుకునే పెట్టెలోను భద్రపరిస్తే సర్వతోముఖాభివృద్ధి పొందుతారు. కోరిన కోరికలను ఈ తల్లి వెంటనే నెరవేరుస్తుంది. తిరుపతమ్మను పూజించడానికి వచ్చిన వారు ఈ అంకమ్మ తల్లి ఆశీస్సులను కూడాపొందుతారు.
శ్రీవినుకొండ అంకమ్మ వారు
ఈ తల్లి మొదట పల్నాడు సీమలో వినుకొండ గ్రామంలో వేంచేసి ఉండేది. కాని కాలాంతరంలో పెనుగంచి ప్రోలు అంకమ్మ ఆదేశంతో ఈ తల్లి కూడా ఇక్కడికే వచ్చి నివసిస్తోంది. అప్పటినుంచి ఈ తల్లికి వినుకొండ అంకమ్మ అమ్మవారు పేరిట ధూపదీప నైవేద్యాలను భక్తులు సమర్పిస్తుంటారు.
శ్రీమద్దిరావమ్మ అమ్మవారు
మంచిరాల పురం పరిపాలకుడైన రెడ్డిరాజు ఓసారి శత్రువులతో యుద్ధంచేస్తూ అనుకోకుండా వీరమరణం పొందారు. విషయం తెలుసుకున్న ఆయన సతీమణి విజయలక్ష్మి తానే స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించి శత్రువులను ఓడించి రాజ్యాన్ని గెలిపించింది. ఆ తరువాత ఈ తిరుపతమ్మ అమ్మవారి సన్నిధికి వచ్చి ఇక్కడ ఓంకారాన్ని జపిస్తూ తన హృదయస్పందనను ఆపుచేసుకొన్నది. నాటి నుంచి నేటి వరకు శ్రీ మద్దిరావమ్మ అమ్మవారుగా భావించి ఇక్కడి భక్తులను పూజిస్తారు. ఈ తల్లిని పూజించిన వారికి అన్నింటా విజయం వరిస్తుంది. అంతేకాక పశుసంపదను రక్షించే కల్పవల్లిగా కూడా భక్తులచేత మద్దిరావమ్మ అమ్మవారు కొనియాడబడుతోంది.

ఉత్సవమూర్తులు

శ్రీగోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల నిత్యకల్యాణ మూర్తులు దివ్యదంపతుల ఉత్సవ మూర్తులు. ఎవరైనా పెళ్లికాని కన్యలు కాని బ్రహ్మచారులు కాని ఉంటే వారు ఈ అమ్మవారికి మొక్కుకుని ఇక్కడకు వచ్చి ఈ ఉత్సవ మూర్తులకు కళ్యాణ వైభోగ సేవ చేయిస్తే చాలు వారికి వెనువెంటనే కళ్యాణ యోగం పడుతుంది. కలతలు కాపురాల్లో చోటు చేసుకొంటే కూడా ఆ దంపతులు కూడా ఇక్కడకు వచ్చి ఈ కళ్యాణ మూర్తులకు వివాహశోభ ను జరిపిస్తే వారింట కలతలు బాసిపోయి ఆ దంపతులు అన్యోన్యఅనురాగాలతో కాపురాలు చేసుకొంటారు. ఇదే నమ్మకంతో ఇక్కడ ఈ శ్రీగోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ మూర్తులు నిత్యకళ్యాణశోభతో అలరారుతుంటాయి. శ్రీజేష్టాదేవి పెద్దమ్మ అమ్మవారు: గోపయ్య భౌతిక దేహానికి మరణాన్ని ఇచ్చిన ఈపులిరూపంలోని ఈ పెద్దమ్మ అమ్మవారు తిరుపతమ్మ అమ్మవారి గుడికి వచ్చి అమ్మకు మోకరిల్లి, తిరిగి ఇక్కడి మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఇక్కడే తుదిశ్వాస విడిచింది. ఈపులిరూపంలోని ఉన్న అమ్మకు సమాధిచేయడానికి తవ్వగా ఆ గోతిలో పెద్దపులివాహన రూఢియై పెద్దమ్మ తల్లి విగ్రహం లభ్యమైంది. అందుకే ఈ అమ్మవారికి ఇక్కడే దేవాలయాన్ని నిర్మించి ఈ తల్లిని కూడా పూజిస్తున్నారు.
తిరుపతమ్మ తిరునాళ్లు
మాఘపౌర్ణమి నుంచి ఐదురోజులు అత్యంత వైభోగంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. మాఘ పున్నమికి 41రోజుల ముందు భక్తులు అమ్మవారి మాలధారణ స్వీకరించి దీక్ష పూనుతారు. పెద్దతిరునాళ్ల సమయంలో భక్తులు తిరుముడిని అమ్మవారికి సమర్పిస్తారు. ఇవి మాఘ మాసంలో జరుగగా చినతిరునాళ్లు అని ఫాల్గుణ పౌర్ణమి నుంచి ఐదురోజులు తిరిగి తిరునాళ్లు జరిపిస్తారు. ఈ చిన తిరునాళ్లల్లో పసుపుకుంకుమ బండ్లు రావడం ప్రత్యేకం.

-మారిబోయిన వెంకటరమణ ప్రధాన అర్చకులు