సబ్ ఫీచర్

జ్ఞానఫలమే పళని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి నారదునికి శివపార్వతు లను చూడాలనిపించింది. కైలాసం బయలుదేరి చేతిలో ఏదైనా పండు ఉంటే బాగుంటుందనుకొని ఓ జ్ఞాన ఫలాన్ని తీసుకొని వెళ్లి కైలాసంలో శివపార్వతులను దర్శనం చేసుకొని శివుని చేతిలో ఆ జ్ఞాన ఫలాన్ని నారదుడు పెట్టాడు. నారదుడు ఇచ్చిన పండును బంగారు వనె్నతో మెరిసిపోతుంటే చూసి శివుడు తన అర్ధ్భాగమైన పార్వతీదేవికి ఎంతో ప్రీతిపాత్రంగా ఇచ్చాడు. ఆమె తిరిగి ఆ పండును తన ముద్దుల తనయులు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరులకు తినమని ఇచ్చింది.
ఇలా పండు చేతులు మారడం చూసి నారదుడు అయ్యా ఇది మామూలు పండు కాదు. జ్ఞాన ఫలం దీనిని ఒక్కరు మాత్రమే ఆరగించాలి అని చెప్పాడు. అలా కాకుండా ఒకరికంటే ఎక్కువ మంది తింటే ఆ పండు ప్రభావం చూపించదని చెబుతాడు. అది విన్న వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ ఫలం ‘నాదంటే నాది’ అని తగువులాడుకోవటం మొదలుపెడతారు. అది చూసిన శివుడు, ఆ సమస్యని పరిష్కరించదలచి, మీ ఇద్దరిలో ఎవరు ముందుగా భూగోళాన్ని చుట్టి వస్తారో.. వారికే ఈ ‘జ్ఞాన ఫలం’ అందుతుందని చెబుతాడు. దానితో వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు తన నెమలి వాహనంపై భూగోళాన్ని చుట్టి రావటానికి బయలుదేరి వెళ్ళగా, వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి భూగోళం మొత్తం చుట్టివచ్చినంత ఫలితం పొంది, ఫలితంగా ఆ ‘జ్ఞాన ఫలం’ కైవసం చేసుకుంటాడు.
భౌగోళాన్ని చుట్టి వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఈ విషయం తెలిసి తనకు ‘జ్ఞానఫలం’ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి, అన్నింటినీ త్యజించి శివగిరి కొండపైకి చేరుకుని తపస్సు ప్రారంభిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు కైలాసం నుంచి దిగి వచ్చి శివగిరి కొండకు చేరుకుని కుమారస్వామిని ఎంతో బతిమాలుతారు. కోపం తగ్గించుకోమని కాని కుమారుడు కోపం తగ్గించుకోడు. చివరకు నీవే జ్ఞాన ఫలానివి నీవే అంటూ వారిద్దరూ స్వామిని అనునయించటంతో ఆ స్వామి శాంతించి తాను ఇక్కడే ఉంటానని తల్లిదండ్రులతో చెప్పారట. అప్పటి నుంచి మానవులెవరైనా ఈ కోవెల కువచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే వారికి జ్ఞానం లభ్యమవుతుంది అని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది. జ్ఞానమే రూపుకట్టిన మూర్తి కనుక ఈ ‘పుణ్యస్థలానికి పళనీ’ అనే పేరు స్థిరపడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వామిని కుళందైవేలన్, బాలసుబ్రహ్మణ్యం, షణ్ముఖుడు, దేవసేనాపతి, స్వామినాథుడు, వల్లీమనోహరుడు, దేవయాన మనోహరుడు, పళని స్వామి, కురుంచి ఆండవర్, ఆర్ముగం, జ్ఞాన పండితుడు, శరవణన్, సేవర్ కొడియన్ అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. సర్వసాధారణంగా హిందూ దేవాలయాలలో మూల విరాట్టు విగ్రహాలను రాయితో మలుస్తారు. కానీ, పళని ఆలయంలోని దండాయుధ పాణి మూల విరాట్టు మాత్రం నవలోహాలతో తయారుచేయబడిఉంది. ఈ మూర్తిని ‘నవ పాశం’గాపిలుస్తారు. మామూలుగా రాయితో చేయబడే విగ్రహాలు మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అంటూ పంచ భూతాలతో కూడి వుంటాయి. ‘పాశనం’ అంటే విషం, లోహం అనే అర్ధాలున్నాయి. కాబట్టి తొమ్మిది విషతుల్యమైన లోహాలను కలిపి రూపొందించిన దండాయుధపాణి విగ్రహం ఆ తొమ్మిది లోహాల కలయికతో శక్తినిచ్చే కొత్త లోహ పదార్థంగా ఏర్పడిందని, అది సర్వరోగ నివారిణి అని భక్తుల విశ్వాసం. కాలి నడకన పర్వత శిఖరంపై ఉన్న ఈ ఆలయానికి 660 మెట్లు ఉన్నాయ. మెట్లపై నడుచుకుంటూ వచ్చి నీ దర్శనం చేసుకొంటామని మొక్కుకుని కొందరు భక్తులు ఇక్కడకు వస్తుంటారు.ఈ మెట్ల దారి కాకుండా దిగువ నుంచి కొండపైకి ఏనుగులను తీసుకువెళ్ళే దారి ఒకటుంది. ఆ దారి ద్వారా కూడా పర్వతాన్ని అధిరోహించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం చేసుకోవచ్చు.
ఉదయం నాలుగు గంటలకు తెరువబడే ఈ ఆలయం, రాత్రి ఎనిమిది గంటలకు జరిగే చివరి అర్చనా కార్యక్రమం ముగిసేంత వరకూ తెరిచే వుంటుంది. ప్రతి నిత్యం స్వామివారిని బంగారు రథంలో ఊరేగిస్తారు. స్వయంగా భక్తులే స్వామివారి బంగారు రథాన్ని లాగే ఈ వేడుకలో పాల్గొంటారు. రాత్రి ఎనిమిదికి ఆరంభమయ్యే చివరి అర్చనాసేవలో స్వామి శరీరానికి మంచి గంధం దట్టంగా పట్టిస్తారు. ఔషధ యుక్తమైన ఈ స్వామి శరీరాన్ని రాత్రంతా అంటుకుని వుండే ఆ గంధానికి ఔషధీయ గుణాలువస్తాయి. ఈ గంధాన్ని భక్తులకు పంచిపెడుతారు. స్వామివారి మూర్తి కొన్ని వేల సంవత్సరాలుగా అభిషేకాలు, సేవలు ఎన్ని జరుగుతున్నా, చెక్కుచెదరకుండా, అలాగే ఉండటం ఆ స్వామి లీలఅని భక్తులు భావిస్తారు. స్వామివారికి అభిషేకించిన పంచామృత తీర్థం దీర్ఘకాలం పాడైపోకుండా నిలువ వుండటం కూడా మరో అద్భుతం. పండుగలు, ఉత్సవాలు వంటి పర్వదినాలలో ఈ దండయుధపాణి స్వామి వారిని నిత్యం రెండు లక్షల మందికి పైగా దర్శనం చేసుకుని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఎంతోమంది ముని పుంగవులు, యోగులు, రాజులు, చక్రవర్తులు, ఇంకా అన్ని మతాలకు, వర్గాలకు చెందిన భక్తులు ఈ పుణ్యస్థలం పళనిలో కొలువుతీరిన దండాయుధపాణి స్వామిని పూర్వకాలం దర్శించుకుని జ్ఞానాన్ని పొందారని స్థలపురాణం చెబుతుంది.
పళని పర్వతంపై ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దర్శనీయ స్థలాలు, పుణ్య క్షేత్రాలూ ఇంకా ఎన్నో వున్నాయి.
తమిళనాడులో తూర్పు కనుమలలోని శివగిరి కొండపై ఉన్న పళని సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో ఉంది.
పళనికి చేరు మార్గం
తమిళనాడులో మధురై-కోయంబత్తూర్ రైలు మార్గంలో పళని ఉంది. మధురైకి 110 కి.మీ దూరంలోనూ, కోయంబత్తూర్‌కి 109 కి.మీ దూరంలోనూ పళని స్టేషన్ వస్తుంది. రైల్వేస్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలోనూ బస్ స్టాండునుండి 1 కి.మీ. దూరంలోనూ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం వుంది.

- వాణి ప్రభాకరి