సబ్ ఫీచర్

మారుతున్న అత్తాకోడళ్ళ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్తగారు అనగానే మనకు వెంటనే సినిమాల్లో సూర్యకాంతం గుర్తొస్తుంది. కూతురిని గారాబం చేస్తూ కోడలిని రాచి రంపాన పెడుతూ, అత్తగారు అంటే ‘గయ్యాళి’ అనే అర్థం వచ్చేటట్లు చేశారు ఆమె. ‘‘నేను అలా రాచి రంపాన పెట్టడంవల్లనే కోడళ్ళ మంచితనం నలుగురికీ తెలుస్తుంది’’ అని తన పాత్రలను సమర్థించుకునేవారు సూర్యకాంతం. సరే, అవన్నీ సినిమా కథలు. నిజ జీవితంలో ఆ స్థాయిలో కాకపోయినా ఎంతోకొంత అత్తగారి పెత్తనం ఉండేది. ‘మగ పిల్లవాడి తల్లిని’ అనే ధీమా ఆమె మాటల్లో ధ్వనిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం అత్తగార్లుగా ఉన్నవారు ఒకప్పటి ఉమ్మడి కుటుంబంల్లో కోడళ్ళుగా ఉండేవారు. పెళ్ళయిన తర్వాత భర్తఅనుమతితో, ఆయన కట్టిన ఫీజుతో చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్నవారు, లేదా పెళ్ళయ్యేనాటికే చదువుకుని ఉన్నట్లయితే భర్త అనుమతితో ఉద్యోగంలో చేరినవారు అయి ఉంటారు. ఉదయాన్నే లేచి అత్తమామలకు, భర్తకు, పిల్లలకు వండి పెట్టి ఆదరాబాదరాగా ఆఫీస్‌కు వెళ్లి, సాయంత్రందాకా వర్క్ చేసి అలసిపోయి ఇంటికివచ్చేసరికి ఇంటెడు చాకిరీ ఎదురుచూస్తూ ఉంటుంది. కనీసం కాఫీ ఇచ్చి అలసట తీర్చేవారు కూడా ఉండరు. మళ్లీ అందరికీ వండి వార్చి వంటిల్లు సర్దుకుని నడుం వాల్చేసరికి రాత్రి ఏ పదకొండో అవుతుంది. మర్నాడు మళ్లీ మామూలే!
నెలంతా ఉద్యోగం చేసి వచ్చిన జీతంతో తనకిష్టమైనట్లు ఖర్చుపెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. పిల్లల స్కూల్ ఫీజులకో, పెద్దవాళ్ళ అనారోగ్యాలకో, ఇంకోదానికో, కుటుంబానికే ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఇలా సంవత్సరాల పాటు అష్టకష్టాలుపడి పిల్లలను పెంచి పెద్ద చేస్తారు. కోడలు వస్తే విశ్రాంతి దొరుకుతుంది, హాయిగా కూర్చోవచ్చు అని ఆశిస్తారు నిన్నటి కోడళ్ళు, నేటి అత్తగార్లు అయిన స్ర్తిలు. కానీ అందుకు పరిస్థితి భిన్నంగా వుంటుంది.
ఈనాటి కోడళ్ళకు పెళ్ళినాటినుంచే కావలసినంత స్వేచ్ఛ. ఇంకా చెప్పాలంటే పెళ్లికూడా ఆ అమ్మాయి ఇష్టప్రకారమే ప్రేమించినవాడితోనో, కోరుకున్నవాడితోనో జరిగిపోతుంది. పెద్దలు అంగీకరించారా సరే, లేకపోతే వారి అనుమతితో పనిలేదు. అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడితే చాలు! ఇద్దరూ చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వెళ్లిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అందుకని పెద్దల అంగీకారం లేనంత మాత్రాన మునిగిపోయేదేమీ లేదు అనుకుంటారు. కుర్రవాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత చేసేది లేక తల్లిదండ్రులు కూడా ఆమోదముద్ర వేస్తారు. పెళ్ళయ్యేవరకే ప్రేమ, పెళ్ళయిన క్షణం నుంచీ భార్యగా హక్కులు, అధికారాలు మొదలవుతాయి. తను గీచిన గీటు దాటకూడదు అని ఆంక్షలు విధిస్తారు. ఇంటిపనులు భర్త కూడా చేస్తే తప్పులేదంటారు. నీతోపాటు నేను కూడా ఉద్యోగం చేసి అలసిపోయాను, వంట పని, పిల్లల పని నువ్వే చేసుకోవాలని అల్టిమేటం ఇస్తారు. ఇవన్నీ చూస్తూ అత్తగారు బుగ్గలు నొక్కుకుంటుంది.
కోడలు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతుందో అత్తగారికి తెలియదు. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతుంది. ఎక్కడికి వెళుతుందో, ఎప్పుడు వస్తుందో చెప్పదు. అడిగితే, ‘‘నేనేమైనా చిన్నపిల్లనా! తప్పిపోతానా?’’ అని గయ్‌మని లేస్తుంది. ఇంకొక విషయం- పాపం, అత్తగార్లు టెక్నాలజీలో కోడళ్ళకన్నా రెండడుగులు వెనకబడే ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలు చేసినా టీచర్లు, క్లర్కులు, టైపిస్టులు ఇలాంటివే చేశారు గానీ ఈ కోడళ్ళలాగా కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌లు, స్మార్ట్ఫోన్‌ల గురించి అంతగా తెలియదు. కోడళ్ళు సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్ డెస్క్‌టాప్‌లు లాక్ చేసి ఉంచుతారు. పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పరు. అంతా సీక్రెట్ వ్యవహారం. ఎప్పుడైనా అత్తమామలు తమ బెడ్‌రూంలోకి అడుగుపెడితే నేరస్తులను చూసినట్లు చూస్తారు.
కోడళ్ళని ఒక్కమాట అనడానికి కూడా వీలులేదు. ‘‘అష్టకష్టాలు పడి కొడుకుని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేస్తే ఈ అమ్మాయిలు ప్రేమ పేరుతో గద్దలా తన్నుకుపోతారు’’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మనసులోనే గొణుక్కుంటుంది కోడలికి వినబడకుండా. వినబడిందా, అందరిమీదా కేసు పెట్టి జైల్లోకి తోయిస్తుందేమోననే భయం! ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా తగలడ్డాయి. మా కాలంలో మాకింత ధైర్యం లేదు అని మెటికలు విరుచుకుంటుంది అత్తగారు.
ఇప్పటి కోడళ్ళు బంధువులతో కలవరు, ఆప్యాయంగా పలకరించరు, పెద్దలను గౌరవించరు. కాళ్ళకు పసుపు రాసుకోవడం, జడలో పూలు పెట్టుకోవడం, వాకిట్లో ముగ్గులు వేయడం రాదు. పేరంటం అంటే తెలియదు. తెల్లవారుజామునే తలారా స్నానం చేసి తులసికోట చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వంటివి గతవైభవ చిహ్నాలు. ఏమైనా అంటే ‘అవన్నీ నాకిష్టంలేదు, నాకు నచ్చినట్లు ఉంటాను’ అని నిష్కర్షగా చెబుతారు.
అందరూ ఇలాగే ఉన్నారని అనటంలేదు. కొంతమంది ఇలా కూడా ఉంటున్నారు. ఏళ్ళతరబడి అణచివేతకు గురైన స్ర్తి జాతి తిరగబడుతూ ఉంది. స్వేచ్ఛను ప్రకటించుకుంటూ ఉంది. పురుషాధిక్యతనూ, సంప్రదాయాలను ఎదిరిస్తూ ఉంది. వ్యక్తిగత ఇష్టాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూంది. ఒక విధంగా పగ సాధింపు ధోరణిలో ప్రవర్తిస్తూంది. దాని ఫలితంగా బంధాలు బీటలువారతాయి, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందని అంటారా! ఆ విషయం మాకు అనవరం. మాకు కావాల్సింది స్వేచ్ఛ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు నేటి తరం.
కానీ ఒక్క విషయం- అణచివేసింది ఎవరు? అణచివేతకు గురైంది ఎవరు? మీ ప్రవర్తనవల్ల బాధపడేది ఎవరు? అనే విషయాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అత్తా ఒకింటి కోడలే అన్నట్లుగా కోడళ్ళు కూడా భవిష్యత్తులో అత్తలే! వారి కోడళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తే తమ పరిస్తితి ఏమిటి? అని ఆలోచించుకోవాలి. ‘మంచి’ వారసత్వం కావాలిగానీ, చెడు ఎన్నటికీ వారసత్వం కాకూడదు.

-గోనుగుంట మురళీకృష్ణ 9701260448