సబ్ ఫీచర్

రసానుభూతి కలిగించిన సాహితీ స్పర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగసూరి విద్యాధికుడు, నిరంతర అధ్యయనశీలి. పేదరికంలో పుట్టినా, అన్నింటికి ఎదురీది ఉన్నత స్థానానికి ఎదిగిన ఘటికుడు. సైన్స్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసినవాడు. పత్రికలంటే విపరీతమైన మక్కువ పెంచుకున్నవాడు. ఈ ఇష్టమే జర్నలిజంలో ఆయన్ని డాక్టరేట్‌ను చేసింది. ఆకాశవాణిలో ఉన్నతోద్యోగం. దశాబ్దాలుగా టీవీ మాధ్యమాన్ని క్షీర, నీర న్యాయంతో వివేచన చేసి వ్యాసాలుగా వెల్లువెత్తించిన అనుభవం.. సమకాలీన పత్రికా సంపాదకులతో సాన్నిహిత్యం.. వివిధ రంగాల నిపుణులతో వృత్తిపరమైన అనుబంధం.. వీటన్నింటికి మించిన స్నేహశీలత, లోతైన పరిశీలన ధోరణి, సూటిగా స్పష్టంగా అభిప్రాయాలను వ్యక్తీకరించే తత్త్వం.. సంయమనం, పట్టువిడుపులతో ముందుకుసాగే నైజం. ఈ ‘వ్యక్తిత్వ స్పర్శం’తా దేనికంటే... ఈ వ్యాసాలన్నీ రచయిత వృత్తికి, ప్రవృత్తికి దగ్గరయినవని... వాటిని సాధ్యమైనంత ప్రేమతో... ఇష్టంతో నిర్వహించారని చెప్పటానికే. అనుభవంతో అక్షరాలను చిత్రికపట్టి.. లోతైన విశే్లషణలో రంగరించి.. పాఠకులకు రసానుభూతిని కలిగించారు.
తాపీధర్మారావు గురించి ఈతరం వారికి ఎంతమందికి తెలుసు? లోకవిరోధి, ఉత్కోచరావు, సందేహి లాంటి పేర్లు పెట్టుకుని పత్రికా రచన చేసే వారుంటారా?
‘జనవాణి’ పత్రికలో ఆయన కర్ణపిశాచం, వెర్రివెధవ, పేలుడు గాయాలు లాంటి చిత్రమైన శీర్షికలు నిర్వహించారంటే ఆశ్చర్యం కలుగుతుంది.
‘‘పదునైన వ్యక్తీకరణకు తాపీ పెట్టిందిపేరు. తెలుగు దినపత్రికల్లో వ్యవహారిక భాషను తొలిసారిగా ప్రవేశపెట్టిన సాహసి. విమర్శించ వలసిన సందర్భం వస్తే.. ప్రకాశం పంతుల్ని, రాజాజీని సైతం ఆయన వదల లేదు’’ అని నాగసూరి చెప్పుకొస్తారు. ‘తాపీ వచనంలో పరుగు, దూకుడు, లయ, అందం ఉంటాయి. హేతువు ఆయన జీవనాడి కనుక అది మూల పదార్థంగా శోభిల్లుతూ ఉంటుంది’ అని చెబుతారు. పత్రికా రచయితగా వైవిధ్యానికి ఎలా పెద్దపీట వేశారో వ్యాసం పూర్తిగా చదివితే అర్థం అవుతుంది.
రామమనోహర లోహియా... వ్యాస సంపుటి ‘ఇంటర్వెల్ డ్యూరింగ్ పాలిటిక్స్’లో ఉన్న ఓ వ్యాసాన్ని రచయిత పరిచయం చేశారు. పురాణ పురుషులయిన రాముడు, కృష్ణుడు, శివుడుల వ్యక్తిత్వాలను విశే్లషిస్తూ.. రాముడు ‘లిమిటెడ్ పర్సనాలిటీ, కృష్ణుడు ‘ఎగ్జబిరాంట్ పర్సనాలిటీ’, శివుడు ‘నాన్ డైమన్షల్ పర్సనాలిటీ’ అని లోహియా వ్యాఖ్యానించటం వెనుక కారణాలను లోతుగా విశే్లషించారు. రాజకీయ రంగంలో భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన లోహియా ఆలోచనలు ఇలా ఉంటాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వివేకం, విజ్ఞతతో ఓ రంగంలో నిష్ణాతులుగా గుర్తించబడిన వ్యక్తులు ఇతర విషయాల్లో, ఎలా ఆలోచిస్తారు? అనేది తెలుసుకోవటం ఎవరికైనా ఆసక్తికలిగించే అంశమే.
వృత్తి నైపుణ్యాన్ని కోరుకునే ప్రతి జర్నలిస్టూ.. ఈ రంగంలో నిష్ణాతులయిన నార్ల వెంకటేశ్వరరావు, కొడవటిగంటి కుటుంబరావు, శివలెంక శంభుప్రసాద్, నీలంరాజు శేషగిరిరావు, సి.రాఘవాచారి వంటి పత్రికా సంపాదకుల గురించి ఎంతోకొంత తెలుసుకుని తీరవలసిందే. నార్ల తెలుగువాడుక భాషను స్థిరపరిచి, అభివృద్ధిచేస్తే కుటుంబరావు తన రచనల ద్వారా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఈ ఇద్దరు రచయితల నడుమ పోలికను ‘ఇద్దరు ధృవతారలు’ వ్యాసం వివరిస్తుంది. కొడవటిగంటి కుటుంబరావు, వాస్తవికత, హేతువు, పరిష్కారాల దృష్టితో.. సైన్సును జనసామాన్యానికి అర్థమయ్యేరీతిలో ఎంత సరళంగా అందించారో చదువుతుంటే ఖచ్చితంగా అనుసరించదగిన విషయంగా అనిపిస్తుంది. రాఘవాచారి లోతైన అధ్యయనం, విషయ పరిజ్ఞానం, సాధికారత గురించి... శ్రీమతి హిమాండూరి ఎం.్ఫల్ సిద్ధాంత గ్రంథంలో ఉటంకించిన విషయాలను రచయిత పరిచయం చేస్తారు. మూడు దశాబ్దాలు పత్రికా యజమానిగా ఉన్నా శివలెంక శంభుప్రసాద్ నిగర్విగా ఆకుచాటు పిందెలా మిగిలిపోయిన విషయం ఆశ్చర్యం గొలుపుతుంది. ఎనిమిదిపదుల పండువయసులో జ్ఞానపీఠాన్ని అందుకున్న రావూరి భరద్వాజపై పరిచయ వ్యాసం గుండెల్నిపిండేస్తుంది. ఎనిమిదివరకూ చదివి ఆపేసిన భరద్వాజ బతుకు విశ్వవిద్యాలయంలో ఎనలేని అనుభవాలతో ఎన్నో పట్టాలు పొందారంటారు. తాత్వికత, విషాదంతో కూడి భరద్వాజ డైరీల రూపంలో వెలువరించిన స్మృతికావ్యాలకు సాహిత్యంలో ఎంతటి విశేషస్థానం ఉందో చెప్పుకొచ్చారు. ఇక బూదరాజు రాధాకృష్ణ.. భారతీయ సాహిత్య నిర్మాతలు పేరుతో చిన్నయసూరిపై రాసిన పుస్తకం హేతువుకు, తర్కానికి అందనితీరును ఎండగట్టటానికి రచయిత వెనకడుగువేయలేదు.
‘వేటూరి పాటల పూదోట’ వ్యాసం నిడివిపరంగా ఈ పుస్తకంలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. వేటూరి సాహిత్యగని.. ఎంత తవ్వినా ఆయన కవిత్వంలో పాండిత్య నిక్షేపాలు ఇంకా కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. పండిత భాషను పామర జనరంజకంగా చెప్పగలగటంలో ఆయనను మించిన సినీ కవి మరొకరుండరేమో.. ‘ఇందువదన... కుందరదన... మందగమన.. మధుర వచన’ అంటే అర్థమయ్యే వాళ్లెంతమంది? ‘్ధక్కరీంద్ర జిత హిమగిరీంద్ర సిత కందరా నీలకంథరా.. క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా.. విని తరించరా’.. అన్న వాక్యాలు బుర్రకెక్కుతాయా? కానీ సామాన్యుని నోట కూడ ఈ పాటలు మారుమోగిన విషయాన్ని మరిచిపోగలమా? ‘ఎక్కితొక్కి నీ అందం వెలకిలా పడుతుంటే..’ ‘చిలకకొట్టుడు కొడితే చిన్నదానా..’ ‘ఆకుచాటు పిందె తడిసె..’ పాటల సరసన ఈ పాటలనుచేర్చి సినీ జీవులతో కాదు.. సామాన్య ప్రేక్షకులూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ‘గురూ గురూ..’ ఈ పాటలో ద్వంద్వార్థం కనిపిస్తోందండీ.. అని ఎవరైనా అభిమాని నొచ్చుకుంటూ ఆయనకు చెప్పబోతే.. ‘అవునయ్యా.. అందులో వేరే అర్థం లేదు.. ఉన్నది ఒక్క బూతర్ధమే..’ అని సూటిగా చెప్పగల వ్యక్తి. రాశిలోనూ, వాసిలోనూ ఆయన దరిదాపుల్లోకి రాగల మరో రచయిత కనిపించరు. పింగళి తర్వాత సినీ సాహిత్యంలో పదాలతో గారడీచేసి కొత్త పదసృష్టికి బీజంవేసిన కవి. ఆయన తర్వాత ఎందరొచ్చినా.. వారంతా ఆయన వేసిన మార్గంలో సాగవలసిందే అన్నంతలా సినీ కవిత్వానికి ఒక సింటాక్స్‌ను ఏర్పరచారు. నంది అవార్డు పొందిన గీతాన్ని పేర్కొనటమే కాదు. వేటూరి కవితా వైశిష్ట్యాన్ని విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు నాగసూరి. ‘వేటూరి ఒకదరి మనసును ఆకట్టుకునే గీతాలకు చిత్రికపడుతూనే, మరోవైపు చెవికి రక్తించే గీతాలతో శబ్దించారు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘శబ్దించారు’ అన్నది ఆకట్టుకునే ప్రయోగం. సంగీత పరిజ్ఞానంతో పాటలకు పల్లవులను అద్ది చరణాలను పరుగులు పెట్టించారని సోదాహరణంగా చెప్పే ప్రయత్నం చేశారు. ‘శబ్దాల ఊయలలో శ్రోతను కూర్చోబెట్టి ఊపినట్టు..’ అన్నారొకచోట. ‘మానసవీణ.. మధుగీతం..’, ‘ఈ దుర్యోధన.. దుశ్శాసన..’ ‘బృందావని ఉంది...’ ‘ఉప్పొంగెలా గోదావరి’ పాటల విశే్లషణలు మిగిలిన వాటికంటే కొంచెం పైస్థాయిలో కనిపించాయ. ‘ప్రతి పదానికి సన్నివేశాన్ని మోసే శక్తి ఉండాలి. ప్రతి అక్షరంలోనూ తన గవాక్షంలోనుంచి అనంత విశ్వాన్ని దర్శింప చేయగల బీజశక్తి ఉండాలి..’ అన్న వేటూరి వాక్యాలు ప్రతి రచయితకీ శిరోధార్యాలే.. ఉర్దూ పదాలను విరివిగా వాడటంలోనూ, వీణ పాటల రచయితగానూ ప్రసిద్దుడయిన కవి దాశరథిని ఏ మూసలోనూ బిగించలేమని చెప్పుకొచ్చారు. ఈ కవి గురించి మరిన్ని పరిశోధనలు అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
మీడియాలో తెలుగు తీరుతెన్నులు వ్యాసం విశే్లషణాత్మకంగా సాగుతుంది. ముందుమాటలో తన తల్లిగారి వ్యక్తిత్వాన్ని వివరించటంలోనే కాదు.. యూనివర్సిటీ జ్ఞాపకాల్లోకి జారిపోయి... స్నేహమాధుర్యంలో తనివితీరినప్పుడు, ఇంటి ముంగిట సుంకేసరి పూలను చూస్తూ.. అనుభవాలను నెమరువేసుకున్నప్పుడు రచయిత వ్యక్తీకరణలు గుండె బరువెక్కించేలా సాగాయి. వీటన్నింటి మధ్య.. అసంతృప్తి కలిగించే విషయాలు రెండు.. సైన్స్ పదాల అనువాదంపై ఓ మంచి వ్యాసం (పేజీ 98లో) పేజీల అమరికలో లోపంవల్ల అర్ధాంతరంగా ముగుస్తుంది. అలాగే రోహిణీప్రసాద్ వ్యాసం (పేజీ 102) కూడా. ఈ రెండు సంపుటాలు ప్రాధాన్యం ఉన్న అంశాలు. మలి ముద్రణలో రచయిత సవరించుకుంటే బాగుంటుంది.
చివరగా ఒక్క మాట..
కట్టమంచి రామలింగారెడ్డి గురించి చెబుతూ..నాగసూరి ఓ మాట అంటారు. ‘ఆయన విమర్శనా త్రాసు కడు కచ్చితత్వంతో తులతూగుతుంది’ అని... ఈ వ్యాస సంపుటి చదివి పక్కనపెట్టే ముందు ఈ రచయితపైనే అదే అభిప్రాయం కలిగింది.
మీరూ చదివి ‘సాహితీ స్పర్శ’ మాధుర్యాన్ని అనుభూతించండి.

- డాక్టర్ పార్థసారథి