సబ్ ఫీచర్

వక్రమార్గం పట్టిన బౌద్ధ భావనలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధుడు తన కాలానికి పెద్ద ‘రాడికల్’!.. బాగుంది.. మరి వర్తమానంలో ఆయన బోధనల పాత్ర ఏమిటి? ఇది పెద్ద ప్రశ్నార్థకం! ఈ విషయమై ఆత్మావలోకనం చేసుకోవలసినవారు జడత్వంలోకి జారుకోవడం విడ్డూరం. బుద్ధుని కాలం నాటి సామాజిక-రాజకీయ- ఆర్థిక పరిస్థితులు నేడు ఉన్నాయా? మరి ఆనాడు ప్రతిపాదించిన విషయాలు ఈనాటికీ ప్రాసంగికం ఎలా అవుతాయి? ఇది వౌలిక ప్రశ్న. రెండున్నర వేల సంవత్సరాల క్రితం ప్రశ్నించిన గొంతు, ప్రశ్నించడం నేర్పించిన వైనం నేడు ‘ఘనీభవించింది’, అక్కడే ఆగిపోయింది. బుద్ధుడు స్వయంగా రాజవంశానికి చెందినవాడు. ఆనాడు రాచరికం నగ్నంగా నాట్యమాడింది. ‘ఆమ్రపాలి’ అందుకు ఓ ఉదాహరణ. మరి వర్తమాన ప్రజాస్వామ్య యుగంలో ఆ పరిస్థితి ఏది? ఆనాటి నుంచి గంగానదిలో ఎంతో నీరు ప్రవహించి సముద్రంలో కలిసింది. ఈ తెలివిడి ఉన్నప్పుడే వర్తమానంపై చైతన్యవంతుల కర్తవ్యమేమిటో బోధపడుతుంది. దీన్ని విస్మరించి బిగుసుకుపోయి బుద్ధుని కాలం నాటి ఆలోచనలు, చైతన్యం, భావజాలంతో జలకాలాడుతాయని ఎవరు వాదించినా వారు సమాజానికి చెడు చేస్తున్నారనే అర్థం!
ఉత్తర భారతంలో బుద్ధుడిని ‘క్రాంతికార్’గా భావిస్తారు. అంటే ఆధ్యాత్మికంగానే గాక భౌతికంగా కూడా విప్లవాత్మక ప్రతిపాదనలు చేశాడని చెబుతారు. వర్తమానంలో బుద్ధుని బోధనలు కేవలం ఆధ్యాత్మిక నేపథ్యంలోనే చూసేందుకు, ఆచరించేందుకు ఇష్టపడేవారున్నారు. ఈ మెటీరియలిస్టిక్ (్భతికవాద) ప్రపంచంలో కేవలం ఆధ్యాత్మిక పార్శ్వంలోనే పరిశీలన చేస్తే ఫలితమేముంటుంది?
అసలు విషయమేమిటంటే...
తాను చేసిన జ్ఞానబోధ, ప్రవచనాల సారం కేవలం ఐదువందల సంవత్సరాల వరకే నిలుస్తుందని, పనిచేస్తుందని బుద్ధుడు మరణించేముందు ప్రకటించాడని అంటారు. మరి బుద్ధుడు మరణించి అప్పుడే రెండున్నర వేల సంవత్సరాలు దాటింది. బుద్ధుని మాటపై ‘‘గురి’’ ఉన్నవారైనా ఈ విషయమై మనసుపెట్టి ఆలోచన చేయాలి కదా? బుద్ధుడు చెప్పని అనేకానేక విషయాల వ్యాప్తి కోసం పోటీపడేవారు ఈ వాస్తవం గూర్చి... సత్యం గూర్చి ‘‘చర్చ’’ చేయాలి కదా? క్రీస్తుజనానికి ముందే బుద్ధుని బోధనల మహాత్మ్యం మటుమాయమైంది. బుద్ధుని అంచనా, లెక్కప్రకారం ఆ సమయం వరకే బౌద్ధం ప్రాసంగికత. విచిత్రమేమిటంటే వివిధ మతాలకు, ధర్మాలకు, ఆలోచనలకు ‘‘ప్రచ్ఛన్నం’’గా బౌద్ధాన్ని నిలిపేందుకు ఆయన అనుయాయులు, అభిమానులు పోటీపడ్డారు. అనేక సందర్భాల్లో భంగపడ్డారు. అయినా ఆ ప్రయత్నం నుంచి వారు విరమించుకోలేదు. దాంతో బౌద్ధం ‘‘వక్రమార్గం’’లో పయనించసాగింది. ఇప్పటికీ అదే పరిస్థితి కావడం విషాదం.
‘క్రాంతికారుని’ బాటను, ఆలోచనను చివరికి ‘‘ప్రశాంత చిత్తం’’ కోసం పీఠాలు ఏర్పాటుచేయడం కోసం వాడుకోవడం విచిత్రం గాక ఏమవుతుంది? దేవుడు లేడని, ఏదీ శాశ్వతం కాదని, మృత్యువు అనివార్యమని, మోహపాశాలు పెట్టుకోరాదని అదేపనిగా మరీమరీ బుద్ధుడు చెప్పినప్పటికీ చివరికి ఆయననే దేవుడిని చేయడం ఎంత దారుణం? సిద్ధార్థుని తల్లి మాయాదేవికి సైతం ఓ గుడి నిర్మించి ప్రార్థనలు జరపడం ఎంతటి అజ్ఞానం! ఎంతటి అంధ విశ్వాసం?
క్రీస్తుపూర్వం ఐదువందల సంవత్సరాల క్రితం సమాజ స్థితిగతులను మార్చేందుకు చేసిన సంకల్పం, తీసుకున్న నిర్ణయం అనుసరణీయమవుతాయి తప్ప ఆ సమయంలో ఆయన బోధించిన ‘‘మోక్షమార్గం’’ అష్టాంగ యోగసాధన... భిక్షాపాత్ర పట్టుకుని తిరగడం 21వ శతాబ్దపు జ్ఞాన సంచయానికి ఉపకరించవు. అష్టాంగ మార్గయోగ సాధన ఆనాటి ‘‘జ్ఞానం’’ కావచ్చు. వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక విప్లవం నేపథ్యంలో జ్ఞానం ‘‘రూపం’’ మారిందని గ్రహించకుండా ‘‘గుడ్డి’’గా అనుసరించడం, ప్రశాంత చిత్తం కోసం, ఆధ్యాత్మిక భావనల కోసం.. బుద్ధగయలో పగోడాల ముందు భక్తితో పూనకం ఊగడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అక్కడ కూడా ఎవరి ‘దుకాణం’వారిదే. ఎవరి పద్ధతి వారిదే.. ఎవరి విధానం వారిదే, దేవుడు లేడని చాటిన సిద్ధార్థునికి ‘‘జ్ఞానోదయం’’ జరిగిందని చెప్పిన బుద్ధగయలో పోటీపడి మందిరాలు, గుళ్లు-గోపురాలు నిర్మించి, ఆయన విగ్రహాలను ఆరాధించడం, ఆయనే మహిమాన్విత దేవుడని ప్రవచనాలు చెప్పడం, భక్తిపారవశ్యంలో మునిగితేలటం చూస్తే జాలేస్తుంది. మహానుభావుల మాటలను ఎలా ‘వక్రీకరించి’ కొందరు తమ ‘పబ్బం’ గడుపుకుంటారో అక్కడ కనిపిస్తోంది. కాలమాన పరిస్థితుల్ని విస్మరించి ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ వీధికోగుడి కట్టేందుకు పూనుకోవడం చూస్తే- చదవేస్తే ఉన్నమతి పోయిన చందంగాతోస్తుంది. వాస్తవానికి బుద్ధుడు ఓ ‘‘ఆచార్యుడు’’. ఎంతోమంది ఆచార్యులతో చర్చలు జరిపినా, వారి జ్ఞానబాటలపై లోతుగా పరిశీలన చేసినా తనకు తృప్తికలగకపోవడంతో తనదైన పద్ధతిలో ఆచార్యుడిగా కొన్ని ప్రతిపాదనలు తన శిష్యులముందు పెట్టాడు. దీన్ని తమ సౌకర్యార్థం పూర్తిగా విస్మరించి బుద్ధుడిని భగవంతుడిని చేసి కొలిస్తే, అలాంటివారిని ఎవరు రక్షిస్తారు?
బుద్ధుని కాలానికే కపిలవస్తు, ఇతర రాజ్యాలలో ‘జైనం’ బోధనలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ‘‘తీర్థంకరులు’’ ధార్మిక జీవనం, సహన శీలత, అహింస, సత్యసంధతతో ధర్మబద్ధ జీవనం కొనసాగించాలని ఆయా రాజ్యాలలో జనపదాలలో ప్రజలకు బోధిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎందరో శిష్యులు ఆ మార్గాన పయనిస్తున్నారు. యాదృచ్ఛికమనుకోవాలో లేక అనుకరణ అనుకోవాలోగాని బౌద్ధ బోధలోనూ అవే అంశాలు కనిపిస్తాయి. బుద్ధుని బోధ... ఆలోచన పూర్తిగా కొత్తది.... స్వచ్ఛశీలమైనది కాదని జైనం గూర్చి అధ్యయనం చేస్తే అర్థమవుతుంది.
బోధ్‌గయలో బోధి వృక్షం కింద సిద్ధార్థుడు కొన్ని రాత్రుళ్లు, పగళ్లు ధ్యానం చేసిన అనంతరం ‘‘నిద్రలోనుంచి మేల్కొన్నట్టు’’ నిండు పూర్ణిమ రోజు ‘జ్ఞానోదయం’ కలిగిందని... దాని సారాంశం ‘‘మోక్షం’’ అని చెప్పడం.... ఆ మోక్షాన్ని చేరుకోవడానికి ధ్యాన ప్రక్రియ (అష్టాంగ విధానం) బోధించడాన్ని పరిశీలిస్తే... సిద్ధార్థుడు యువరాజుగా వాహ్యాళికి, నగర సందర్శనకు వెళ్ళినప్పుడు తనకు కనిపించిన రోగి, వృద్ధుడు, శవయాత్ర దృశ్యాల, ఆ సమస్యల పరిష్కారం కోసం, వాటి నుంచి ఉపశమనం పొందే విధానం కోసం చేసిన ‘‘అనే్వషణ’’ ఇదా? అని నివ్వెరపోవడం సాధారణ పౌరుల వంతయింది. రోగాలు, నొప్పులు, ఆకలి దప్పులు, వృద్ధాప్యం, ఇతర క్లేశాలు ధ్యానంతో, అష్టాంగ విధానంతో ఆనాడు దూరం కాలేదు. ఈనాడు అంతకన్నా మాయం కాలేదు. కావు. అయినప్పటికీ ఓ రకమైన అతివిశ్వాసం, అతి గురి.. ‘‘ఆధ్యాత్మిక పిచ్చి’’ ముదిరి సిద్ధార్థుడు జ్ఞానోదయంతో బుద్ధుడయ్యాడని, ఆ బుద్ధుడిని భగవంతుడిని చేసి తమ పెత్తనం ‘‘ప్రభ’’ వెలిగేలా పాటుపడవచ్చునన్న దృష్టికోణం పడగవిప్పి శతాబ్దలపాటు నాట్యమాడింది. అనేక నిందాపలుకులు ఆ బృందంలోని వారే, బుద్ధుని అనుయాయులు, అనుచరులే పలికారు. ఘోరంగా బౌద్ధమార్గాన్ని వక్రీకరించారు. ఆ పని ఇంకా కొనసాగడం విడ్డూరం. అంతిమంగా ఓ ‘‘కొత్త మతం’’ పురుడుపోసుకుంది. బుద్ధుడు మతం కోసం తాపత్రయ పడలేదని గుర్తించాలి. మతం ఓ మత్తుమందు అని చెప్పిన వాళ్లు సైతం ఈ మతంతో అంటకాగడం మరో విడ్డూరం. ఆ రకంగా ‘‘సత్యాన్ని’’ సమాధి చేయడంలో తమ వంతు పాత్రను సమర్ధవంతంగా పోషించారు. సమాధిలోనుంచైనా ‘‘సత్యం’’ తన్నుకొస్తుందని వారికి తెలియకపోవడం మంచిదే!

-వుప్పల నరసింహం 99857 81799