సబ్ ఫీచర్

‘ఆన్‌లైన్ గేమ్స్’తో అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఐఐటీలో చదువుతున్న ఆ కుర్రాడు క్లాసులకు వెళ్లడం లేదు.. కళ్లు పీక్కుపోయి రోగిష్టిలా మారాడు.. చదువులో వెనుకబడి పోవడంతో కళాశాల ప్రిన్సిపాల్ ఆ కుర్రాడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.. కాన్పూర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు ఢిల్లీ వచ్చి తమ కుమారుడి పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు.. శుభ్రత లేని గదిలో పిచ్చివాడిలా రోజులు వెళ్లదీస్తున్న తమ కుమారుడిని వారు సొంత ఊరికి తీసుకుపోయారు.. ఎప్పుడూ ఫస్ట్‌మార్కులు తెచ్చుకొనే ఆ విద్యార్థి ఇలా దయనీయ స్థితికి చేరడానికి కారణం ‘ఆన్‌లైన్ గేమ్స్’కు బానిస కావడమే. దీంతో ఆ కుర్రాడిని తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌనె్సలింగ్ ఇప్పించారు. అంతర్జాలంలో ఆటలకు, స్మార్ట్ఫోన్లలో ‘టిక్‌టాక్’ వంటి యాప్‌లకు బానిసలవుతున్న ఎంతోమంది విద్యార్థులు తమ చేజేతులా భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లలో గంటలకు గంటలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నవారు పలురకాల శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు, కొన్ని యాప్‌లకు బానిసలవుతున్న వారు తమ రోజువారీ పనులను చేసుకునేందుకు కూడా బద్ధకిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు వీరు క్రమంగా దూరమవుతున్నారు. సామాజిక బంధాలను, కుటుంబ వ్యవస్థను వీరు నిర్లక్ష్యం చేస్తూ తమదైన లోకంలో ‘అంతర్జాలమే సర్వస్వం’ అని ఒంటరిగా బతికేస్తున్నారు. చదువుకు, శారీరక శ్రమకు, మానసిక వికాసానికి దూరం అవుతున్నారు. తగినంత నిద్రకు నోచుకోక పలురకాల అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. అదేపనిగా కంప్యూటర్‌కు అతుక్కుపోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, చేతినొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. నిరంతరం కంప్యూటర్‌పై కాలక్షేపం చేస్తున్నా, కెరీర్‌కు పనికొచ్చే ఆధునిక సాంకేతికతకు, ఉద్యోగ నైపుణ్యాలకు వీరు దూరం అవుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందున గంటలకొద్దీ ‘గేమ్స్’తో కాలక్షేపం చేస్తూ తమ జీవిత లక్ష్యాలను విస్మరిస్తున్నారు.
‘పబ్‌జీ’ వంటి ఆన్‌లైన్ గేమ్స్, ‘టిక్‌టాక్’ వంటి మొబైల్ యాప్‌లకు బానిసలవుతున్న యువత వల్ల వారికే కాదు.. ఇతరులకూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ అలవాట్లు క్రమంగా వ్యసనంగా మారడంతో కొందరు యువకులు కుటుంబ వ్యవస్థను, చదువును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రోజుకు 16 గంటలపాటు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన విద్యార్థులు సైతం ఉన్నారని మానసిక వైద్యులు అంటున్నారు. నగరాల్లో 50 నుంచి 60 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడుతున్నారు. ప్రాణాంతకంగా మారుతున్న కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించాలని సామాజిక నిపుణులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. అవసరం ఉన్న మేరకు ఇంటర్నెట్‌ను వినియోగించుకునేలా పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కట్టడి చేయాల్సి ఉంది.
పిల్లలు, యువకులే కాదు.. వివాహితులు సైతం ‘టిక్‌టాక్’ వంటి మొబైల్ యాప్‌ల్లో తమ వీడియోలను ‘అప్‌లోడ్’ చేస్తున్నారు. మొదట్లో కొద్దిసేపు ‘టిక్‌టాక్’ చూసేవారు ఆ తర్వాత గంటల కొద్దీ దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు. ‘యాప్’లలో మునిగితేలుతున్నందున భార్యాభర్తల మధ్య ఘర్షణలు సైతం జరుగుతున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. కొత్త ప్రపంచానికి దారులు తెరిచే ‘అంతర్జాలం’ వల్ల విజ్ఞానం, వికాసం, నైపుణ్యం పెరగాలే తప్ప ఇలా మానసిక, శారీరక రుగ్మతలు, కుటుంబ కలహాలు పెరగడం వైపరీత్యమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వివాహిత మహిళలు, వృద్ధులు సైతం ఈ తరహా ‘యాప్’లకు అలవాటు పడుతున్నారు. దీంతో మానసిక వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సామాజిక పరంగా, కుటుంబపరంగా వైపరీత్యాలకు కారణమవుతున్న ఆన్‌లైన్ గేమ్స్‌పై, యాప్‌లపై అన్ని వర్గాల్లో చైతన్యం కల్పించడం తక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
*