సబ్ ఫీచర్

ఉద్యోగానికి వెళ్లొచ్చినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు సినిమాల్లో నటిస్తుంటారు. కానీ, ఝాన్సీలాంటి ఆర్టిస్టుల కోసం సినిమాలే నటిస్తుంటాయ. ఫలానా పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ ఇమడలేరంటూ మారాం చేస్తుంటాయ. దర్శకుడో, నిర్మాతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సంతృప్తిపర్చటానికి ఆమెనే తీసుకోవాల్సి వస్తుంటుంది. బహుశ శంకరాభరణం చిత్రంలో మంజుభార్గవి తల్లి పాత్ర కోసం -ఝాన్సీని ఎంపిక చేసుకోవడంలో కళాతపస్వి విశ్వనాథ్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని ఉండాలి. లేదంటే -ఆ పాత్ర మరోలా ఉండేదేమో. సినిమా ఫలితమూ వేరేవిధంగా ఉండేదేమో కూడా. ఇది అతిశయోక్తి కాదు. శంకరాభరణం అంత గొప్ప చిత్రం అవ్వడానికి, మిగిలిన పాత్రల ఉదాత్తతను చాటేందుకు ఝాన్సీ పోషించిన పాత్ర ప్రభావం లేదని ఎవరు మాత్రం అంటారు. ఝాన్సీ మహానటి కాకపోవచ్చు. కానీ, మహానటితో కలిసి నటించిన గొప్ప నటి. నాకు నటించటం తెలీదు. దర్శకుడు ఏది చెబితే అదే చేసేదాన్ని. నిజంగా షూటింగ్ అంటే మాకు ఉద్యోగానికి వెళ్లొచ్చినట్టేనని చెబుతున్న ఆమె సినిమా జ్ఞాపకాలలో కొన్ని ముచ్చట్లను ఈవారం ఏరుకుంటూ చదువుకుందాం.
*
కాలం ఎవ్వరిని ఎటువైపు పరిగెత్తిస్తుందో తెలీదు. ఓడలు బళ్లయినట్టే.. బండ్లు ఓడలవుతాయి. ఈ క్షణాన ఇక్కడుంటే మరుక్షణం ఎక్కడుంటామో ఎవరికీ తెలీదు. ఇది జీవితం. అది సృష్టి ధర్మం.
ఎక్కడ గుడివాడలో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నటి ఝాన్సీ, చిన్నప్పుడే కుటుంబం సహా మద్రాసు రైలెక్కడం అటువంటిదే. కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో అమ్మా, నాన్న కలిసి ఝాన్సీని చిన్నప్పుడే మద్రాసు తీసుకెళ్లారు. అక్కడ నటి గిరిజ తెలిసినవారవడంతో వారి ప్రోత్సాహంతో బ్రతుకుదెరువు చూసుకుందామనుకున్నారు. కానీ అటువైపునుంచి ఎటువంటి ప్రోత్సాహమూ లేకపోడంతో తమ దారి తాము చూసుకోవడమే మంచిదనుకున్నారు ఝాన్సీ తల్లిదండ్రులు. కోడంబాకమ్‌లో ఓ ఇల్లు తీసుకున్నారు. చందమామ ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్టిస్టు అయిన మూర్తి దూరపు బంధువు కావడంతో ఆ కుటుంబానికి కొంత వెసులుబాటు అయ్యింది. ఆయన సినిమా స్లైడ్స్ కూడా రాసేవారు. దాంతో సినీ పరిశ్రమలో ఏదైనా పని దొరుకుతుందా? అని ఝాన్సీ తల్లి ప్రయత్నాలు చేసింది. తన కూతురుని డ్యాన్స్ మాస్టర్, రేపల్లె వాస్తవ్యుడైన వేణుగోపాలస్వామి వద్ద చేర్చింది. అక్కడ డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఝాన్సీకి శారద, వాణిశ్రీ, లలిత సహాధ్యాయులే. ‘గురువు వేణుగోపాలస్వామి వద్ద మేమంతా కలిసే నృత్యాలు నేర్చుకునేవాళ్లం’ అంటూ గుర్తు చేసుకున్నారు ఝాన్సీ. అలా ఇండియన్ బాలెట్ సెంటర్‌గా ఓ బృందాన్ని ఏర్పర్చి అనేకచోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. ఒక ప్రోగ్రామ్‌కు 30 రూపాయలు ఇచ్చేవారు. గ్రూప్ డాన్సులు చేయడం కూడా మొదలుపెట్టి అనేక చిత్రాల్లో చేశారు. ఆ ప్రయత్నాలే అప్రయత్నంగా ఆమె గమ్యాన్ని కొత్త తోవకు తోసాయి. నిర్మాతల పరిచయాలతోపాటు కౌతరం జయదేవ్, గుత్తా రామినీడు దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘కలిమిలేములు’ చిత్రంలో తొలిసారిగా అవకాశం లభించింది ఝాన్సీకి. -‘అది గుమ్మడి, ఎస్ వరలక్ష్మిలకు కూతురు పాత్ర. ఆ వయసులో నటనంటే ఏమిటో, ఎలా చేయాలో కూడా తెలీదు. దర్శకుడు చెప్పింది చేయడమే అప్పటికి నాకు తెలిసింది’ అంటూ నవ్వేశారామె. తరువాత సావిత్రి మరపురాని చిత్రం ‘చివరికి మిగిలేది’లో హెడ్ నర్స్‌గా నటించారు. అపుడు సావిత్రితో పరిచయమైంది. హరనాథ్, కాంతారావు, బాలయ్య తదితరులూ ఆ చిత్రంలో నటించారు. సావిత్రి జగపతి సంస్థ అధినేత విబి రాజేంద్రప్రసాద్‌కు ఝాన్సీని పరిచయం చేశారు. ఆమె నటన గురించి వివరించారు. ఏ పాత్రకైనా ధీటుగా నటించగల సత్తా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఝాన్సీ కళ్ల గురించే సావిత్రి వర్ణించేవారు. తరువాత నాగేశ్వరరావు-సావిత్రి జంటగా ‘ఆరాధన’ చిత్రంలో అవకాశం వచ్చింది. ‘నేను, శ్రీదేవి తల్లి రాజేశ్వరి, సులక్షణ తల్లి, ఏఎన్నార్ అందరం ఆ చిత్రంలో డాక్టర్లమే’ అంటూ ఓ మంచి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు ఝాన్సీ.
-‘తరువాత అదృష్టవంతులు, దసరాబుల్లోడు, అంతస్తులు లాంటి చిత్రాలు జగపతి సంస్థలో చేశాను. ముఖ్యంగా బాపు రూపొందించిన దాదాపు అన్ని చిత్రాల్లో నేను నటించడం నాకు గొప్ప విషయమే కాదు, కించిత్ గర్వం కూడా. బాలరాజు కథనుంచి పెళ్లిపుస్తకం వరకూ మంచి మంచి పాత్రలు బాపు చిత్రాల్లో నన్ను వరించాయి. చివరికి ఆయన రూపొందించిన టెలీ సీరియల్ భాగవతంలోనూ మంధర పాత్ర వేయించారు. నేను నటించిన చివరి చిత్రం సీతయ్య. ప్రేమలు పెళ్లిళ్లు, శంకరాభరణం, ధర్మదాతలాంటి ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు వేయడం ఇప్పటికీ ఆనందాన్నిస్తోంది’ అంటూ ఏళ్ల తరబడిన జ్ఞాపకాలను క్షణాలుగా గుర్తు చేసుకున్నారు ఝాన్సీ.
**
-చిన్నప్పటినుండి దర్శకులు చెప్పింది చేయడం అలవాటైంది కానీ, నాకు ప్రత్యేకంగా నాటకానుభవమంటూ ఏదీ లేదు. ఏనాడూ స్టేజీ ఎక్కిందీ లేదు. అప్పట్లో ఏమీ తెలీని వయసులో షూటింగ్ అంటే ఏదో విహారయాత్రకు వెళ్లినట్లుగా అనిపించేది. నాకు ఐదుగురు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు. ఇప్పుడు అందరూ పెద్దవారై ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.
ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం -శంకరాభరణం చిత్రంలో మంజుభార్గవి తల్లి పాత్ర. నిజానికి ఆ పాత్ర తాలూకు క్రెడిట్ అంతా దర్శకులు విశ్వనాథ్‌దే. నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి అన్న ప్రతి విషయాన్నీ ఆయన దగ్గరుండి నేర్పించి మరీ షూటింగ్ చేశారు. విశ్వనాథ్ దర్శకత్వంలో అల్లుడు పట్టిన భరతం, ప్రెసిడెంట్ పేరమ్మ, దాసరి దర్శకత్వంలో సర్కస్ రాముడు, ఏడంతస్థుల మేడ, అద్దాలమేడ తదితర చిత్రాల్లో మంచి పేరొచ్చింది.
***
ధర్మదాత చిత్రంలో ఏన్నార్‌కు చెల్లిగా, మరో ఏఎన్నార్‌కు మేనత్తగా ఓల్డ్ అండ్ యంగ్ గెటప్స్ రెండింట్లో నటించారు ఝాన్సీ. ‘ఆ రెండు పాత్రలు ఇప్పటికీ నాకు విచిత్రంగా అనిపిస్తాయి. సినిమా హీరో కాకముందునుంచే కృష్ణ నాకు పరిచయం. దర్శకుడు రాజాచంద్ర మా ఇంట్లో నాటకాలు ప్రాక్టీసు చేసే సమయంలో ఆయన అక్కడికి వచ్చి నాటకాల రిహార్సిల్స్ చూస్తుండేవారు. భానుమతి, దర్శకులు బాపు, విశ్వనాథ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వారి వ్యక్తిత్వాలు చాలా గొప్పవి. రాజశ్రీ దర్శకత్వంలో నేను, వాణిశ్రీ కలిసి ఓ చిత్రంలో నటించాం. షూటింగ్ అంటే నిజంగా ఉద్యోగంలా ఫీలయ్యేదాన్ని. షూటింగ్‌లకు వెళ్లడం, పనిచేసి మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఇంటికెళ్లడం.. నిజంగా అదో ఉద్యోగమే.
అప్పట్లో 7 గంటలకు కాల్షీట్ ఉండేది. ఉదయం 7 గంటలకు షాట్ అంటే ఖచ్చితంగా 7 గంటలకు షాట్ తీసేవారు. అందాల రాముడు చిత్రం కోసం ఓ పాటను పూండీలో చిత్రీకరించారు. ఆ అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేను.
పరిశ్రమలో అందరూ నాకు స్నేహితులే. కానీ నేను ఏనాడూ ఎవరింటికీ వెళ్లింది లేదు. మావారు చిన్న కార్ల వ్యాపారం చేసేవారు. దానికితోడు సినిమాలకు ఫైనాన్స్ చేసేవారు.
అంతస్థులు షూటింగ్ అయిపోయాక డబ్బింగ్ చెబుతున్నాం. భానుమతి నా కూతురుగా నటించింది. ఆ డబ్బింగ్‌లో భానుమతికన్నా నేను వేగంగా డైలాగులు చెప్పడం చూసి ఆమె మెచ్చుకున్నారు. నేనే చాలా స్పీడ్ అంటే, నీ డైలాగు నాకన్నా స్పీడుందే! అన్న కితాబు నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది.
శంకరాభరణం చిత్రంలో నటించాక చాలా అప్లాజ్ వచ్చింది. ఎక్కడికెళ్లినా గుర్తుపట్టి మరీ పిలిచేవారు. పెళ్లిపుస్తకంలో గుమ్మడి భార్యగా చేసినపాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా శంకరాభరణం చిత్రాన్ని ముంబైలో రాజ్‌కమార్ కోసం ప్రత్యేకంగా షో వేశారు. అప్పుడు విలన్‌తో మాట్లాడుతూ నేను నా ముక్కుపుడక కొంగుతో సరిచేసుకునే సన్నివేశం చూసి ఆయన పకాపకా నవ్వేశారు. ఆ సన్నివేశాన్ని విశ్వనాథ్ ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఆ ఒక్క సీన్‌తోనే నా పాత్ర స్వభావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది.
ఇక విశ్వనాథ్- బాపుల దర్శకత్వం ప్రతిభ గురించి చెప్పాలంటే, బాపు మనల్ని ఓ వస్త్రంలాగా పిండేస్తారు. విశ్వనాథ్ అయితే పిండేసేసరికి ఆ వస్త్రం ఆరిపోతుంది. వందశాతం కరెక్టుగా వచ్చేదాకా నటీనటులను వదిలేవారుకాదు.
ఇపుడు నా వయస్సు 74ఏళ్లు. అపుడంతా ఆనందంగా గడిచిపోయింది. ఈ వయసులో గడవడం కష్టంగా ఉంది. సినిమాకు వెళ్లి చూసిన దాఖలాలు చాలా తగ్గిపోయాయి. టీవీలో వస్తే పాత సినిమాలు చూస్తాను. అప్పటి గొప్ప నటీనటుల వ్యక్తిత్వాలను గుర్తు చేసుకుని ఆనందిస్తాను. షూటింగ్ సమయాలలో ఏఎన్నార్‌తో చాలా గౌరవంగా మెలిగేదాన్ని. అలాగే ఎన్టీఆర్ అంటే భక్తితో కూడిన భయం ఉండేది. నామీద ఏఎన్నార్ ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా ఏదన్నా అంటే, వెంటనే ఆయన ‘ఏయ్, ఎవరనుకున్నాం. మా ఊరమ్మాయి’ అనేవారు. బాలచందర్, బాలుమహేంద్ర లాంటి దర్శకుల నేతృత్వంలో తమిళ సినిమాల్లోనూ చేశాను. తమిళం చదవగలను, రాయగలను. హిందీలో తీన్ బహు రాణియా, సద్మాలాంటి చిత్రాలకు మంచి పేరొచ్చింది. యమగోల, భక్తకన్నప్పలాంటి చిత్రాల్లో మంచి పాత్రలు దొరికాయి. ఏఎన్నార్- సావిత్రి జంటగా నటించిన ‘మనసే మందిరం’ చిత్రం ఒకే సెట్‌లో ఒకే షెడ్యూల్‌లో సారథి స్టూడియోలో పూర్తిచేశారు. అపుడు కాల్షీట్లు టైమ్ పట్టించుకునే వాళ్లం కాదు. ‘ఇపుడలా లేదనుకుంటాను. ఇప్పుడు సినిమాయే వేరు’ అంటూ ముగించారు ఝాన్సీ.

-సరయు శేఖర్, 9676247000