సబ్ ఫీచర్

సాన్నిహిత్యం పెంచే పెళ్లిపిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిలవలేదంటు నెపములు పెట్టవలదు!
పనులు కలవంటు వచ్చుట మానవలదు!!
ఈ తరహా వాక్యాలు నాలుగు దశాబ్దాల క్రితం పెళ్లిపత్రికల్లో తరచుగా కనిపిస్తుండేవి. రవాణా సౌకర్యాలు పెద్దగా లేకపోయినా వివాహ మహోత్సవ శుభలేఖలు బంధుమిత్రులకు అందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించేవారు. వాటిని అందుకున్నవారు సైతం చలికాలంలో చలిని, వేసవిలో ఎండను లెక్కచెయ్యకుండా శుభకార్యాలకు హాజరై తమ ఆనందాన్ని బంధు మిత్రులతో పంచుకోవడంలోనైనా, కొత్త చుట్టరికాలను పెంచుకోవడంలోనూ ఆసక్తి చూపించేవారు. ఈనాటి మాదిరిగా మూడంకెల సంఖ్యలో ఆతిథ్యం వుండకపోయినా తృప్తిగా విందారగించేవారన్నది తిరుగులేని నిజం. అంతేకాదు, ఏదో ఒక సందర్భంలో నాటి వడియాల పులుసునో, గోంగూర పచ్చడినో, నేతి అరిసెలను నెమరువేసుకుంటూ ఎంత ఖర్చు చేసినా ఆనాటి వైభవమెక్కడని ప్రశ్నించేవారు లేకపోలేదు.
తల్లిదండ్రుల మాటను గౌరవించి, బంధు, మిత్రుల సలహాలను స్వీకరించి చేసుకున్న పెళ్ళిళ్లవి. స్వేచ్ఛ పేర ఇష్టారాజ్యంగా నడుచుకుంటూ తాను మెచ్చిందే రంభ, తనకు నచ్చినవాడే నవ యువ మన్మథుడంటూ జరుగుతున్నవి నేటి పెళ్లిళ్ళు. ఖర్చులు, హడావిడి, హంగామాలకు లోటులేకున్నా నాటి పెళ్లిళ్ళల్లోని ఆప్యాయతలను, అనుబంధాలను ఎక్కడ వెతుక్కోగలం? అలాగని గతమే ఘనకీర్తి కలిగినదని అందరూ అంగీకరించలేరు. కులగోత్రాలు, సంప్రదాయాలంటూనే పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే వెనకేడుతరాలెలా వుంది ఆలోచించి మరీ ముందేడు తరాలెలా వుండబోతుందో అంచనా వెయ్యగలగాలి అంటూనే కట్నకానుకల విషయంలో మాత్రం అత్తమామలు ఆడపడుచులు కలిసి మరీ కోడలిని, కోడలు కుటుంబంవారిని తీవ్రమనస్తాపానికి గురిచేసిన సంఘటనలు, ఇల్లరికం పేరుతో అల్లుడిని నౌకరుకంటే హీనంగా చూసిన సంఘటనలు నాటి నుంచి నేటిదాకా వౌఖికంగా ప్రచారం అవుతున్నవే! గతంలోని లోపాలను వర్తమానంలో జరగకుండా జాగ్రత్త పడగలిగేవారికి భవిత బంగారమే!
యువత విజ్ఞానపరంగా, వృత్తిపరంగా, కుటుంబ బాధ్యతల పరంగా ఏ మేరకు ఎదుగుతున్నారో కాని, ప్రేమలు పెళ్లిళ్ల విషయంలో మూడడుగులు ముందే వుంటున్నారు. కుల, మత, ప్రాంత పట్టింపులు లేకపోయినా చదువు, ఉద్యోగం, సంపాదన విషయాల్లో స్పష్టత కలిగి వుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. యువతీ యువకులు తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చినపుడు చదువు పేర, ఉద్యోగానే్వషణ పేర తమ పెళ్లిళ్ళకు తొందరేమీ లేదని చెబుతూనే ప్రేమలో వున్నవారు గోప్యత పాటిస్తున్నారు. మబ్బులేని వానలా తల్లిదండ్రులకు చివరి నిమిషంలో తమ ప్రేమలను పెళ్లిగా మార్చుకునే విషయాన్ని తెలియజేస్తున్నారు. కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఏమిటంటే, తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకపోయినా తమ పిల్లల ప్రేమ వ్యవహారాలకు ఆమోదముద్ర వెయ్యడం! వృద్ధాప్యంలో తమను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా వారి దాంపత్యం అనుకూలంగా వుండాలని కోరుకోవడం!
తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఆశీర్వాదాల మాటెలా వున్నా అన్యోన్యతను పెంచుకోవలసినవారు, కాపాడుకోవలసినవారు దంపతులే! పరిచయాన్ని స్నేహంగా, స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని ఇష్టంగా ఏడడుగులు నడిచి అంతకన్నా ఇష్టంగా మూడు ముళ్ళవైపు ఆసక్తి చూపినవారు ఇతరులు, ఇతర విషయాలెలా వున్నప్పటికి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ దాంపత్య జీవితాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా తీర్చిదిద్దుకోవలసిన అవసరముంది. అంతే తప్ప పెళ్లికి హజరైన వేలమందిలోని నలుగురంటే నలుగురు ఒకటి రెండు మంచి మాటలు చెప్పరు. ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నించినా వాటిలోని శ్రేయస్సుని అర్థం చేసుకునే స్థితిలో ఆలుమగలుండరు. కుల, మత, ప్రాంతీయ, జాతీయ భావాలకు అతీతంగా పుట్టుకొస్తున్న ప్రేమలైనా, అవి పెళ్లిపీటలెక్కడం ఆహ్వానించతగిన పరిణామమైనా ఎవరి అవగాహన ఏ మేర వుంటుందనేది ఎవ్వరూ చెప్పలేని విషయం. అకారణంగా పుట్టుకొచ్చే అనుమానాలకు, అపార్థాలకు ఎవరూ మినహాయింపుకాదన్న నిజాన్ని ఎవరు మాత్రం ఎలా కాదంటారు.
ఒకప్పుడు పెళ్లి ఎవరి ఇంటిమందు వారు జరుపుకునే ఆనందంతో కూడిన అందమైన వేడుక. బంధువులు, సన్నిహిత మిత్రులు దూరబారాలను భరించి మరీ పెళ్లికి హాజరవడంలో, తెలిసినవారితో మనసు విప్పి తమ బాగోగులు చెప్పుకోవటంలో, ఎదుటివారి బాగోగులు తెలుసుకొని సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకునేవారు. పనిలో పనిగా ఆ గ్రామంలోని బంధు మిత్రుల ఇంటికి వెళ్ళేందుకైనా దగ్గరి గ్రామాల బంధు మిత్రుల ఇళ్లకు వెళ్లొచ్చేందుకైనా ఆసక్తి చూపించేవారు.
కుటుంబాల్లో సభ్యులమధ్య ఆత్మీయతలు అంతంతమాత్రంగా వుంటున్న వర్తమానంలో బంధు మిత్రులపట్ల అంతకుమించిన ఆత్మీయతలు, అనుబంధాలు ఆశించడం దురాశే అవుతుంది. అలాగని పెళ్లిళ్ళలో డాబు, దర్పం తగ్గలేదు. సెల్‌ఫోన్, వాట్సాప్, ఇమెయిల్ లాంటి ఆధునికతను పెళ్లిపిలుపులకు ఉపయోగించుకుంటున్నారు. స్వయంగా కలిసి శుభలేఖను అందించడం ప్రయాసగా భావిస్తున్నవారు లేకపోలేదు. ఒక మోస్తరు ఆర్థిక వనరులున్నవారు సైతం పెద్ద పట్టణాల్లోని కనె్వన్షన్ సెంటర్‌నో, కనీసం జిల్లా కేంద్రంలోని కల్యాణ మండపాలను వివాహ వేదికగా వుండాలని కోరుకుంటున్నారు. సినిమా సెట్టింగ్‌లను తలదనే్న విధంగా వివాహ వేదికలను తీర్చిదిద్దేవారు లేకపోలేదు. పెళ్లికూతుర్ని చేసేటపుడో పెళ్లికొడుకుని చేసేటపుడో, వివాహానంతరమో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇవన్నీ ఎలా వున్నా ఆహ్వానించడంలో వచ్చినవారిని సమాదరించడంలో వధూవరుల ఇరు కుటుంబాలు ఎంత శ్రద్ధ వహిస్తే అంత ఆనందాన్ని బంధు మిత్రులకు కలిగించిన వారవుతారు.

- డా. కొల్లు రంగారావు, 9866266740