సబ్ ఫీచర్

అతని ఆలోచనే ఓ అభ్యుదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతమైన యాత్రకూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కసారి అడుగుపడ్డాక -వెనక్కి తిరిగి చూడకుండా ప్రయాణిస్తూనే ఉండాలి. అనేకమంది ఎదురవుతారు. కొంతమంది తోడవుతారు. ఇంకొందరు మనతో కలుస్తారు. తోడొస్తానన్న వారిలో కొందరు వడివడి నడకతో శిఖరాగ్రం చేరొచ్చు. యాత్ర ప్రారంభించిన వ్యక్తి యథాలాపంగా పైకి చూసి -అతను మనతో ప్రయాణించినవాడేనా? అని ఆనందం, సంభ్రమాశ్చర్యాలకు గురికావొచ్చు. అలాంటి వాళ్లలో దర్శకుడు రాజ్‌కుమార్‌కూ చోటుంటుంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ రెండోతరం అగ్ర హీరోగా వెలుగొందిన చిరంజీవితో చిత్ర ప్రయాణం మొదలెట్టిన వ్యక్తి రాజ్‌కుమార్. చిరంజీవితో తొలిసారి నలుగురు హీరోల్లో ఒకడిగా కథను రూపొందించి ‘పునాదిరాళ్లు’ వేసిన గొప్ప దర్శకుడతను.

విజయవాడ దగ్గర ఉయ్యూరులో 1947లో జన్మించాడు రాజ్‌కుమార్. మొదటినుంచీ క్రీడలపై ఆసక్తి ఉండటంతో క్రీడాకారుడిగా ఎదిగారు. ఫుట్‌బాల్‌లో అందెవేసిన కాలు అతనిది. ఎస్సారార్ మరియు సీవీఆర్ గవర్నమెంటు కాలేజీలో చదువుకున్నాడు. ఇదే కాలేజీలో నందమూరి తారక రామారావూ చదివారు. క్రీడలతోపాటుగా లలితకళలపై ఆసక్తి ఉందాయనకు. నటుడిగా, రచయితగా, పాటగాడిగా ఎదిగారు. కోట శ్రీనివాసరావు రాజ్‌కుమార్ క్లాస్‌మేట్. కళాకారునిగానూ తన ప్రతిభను హైస్కూల్లోనే చూపించాడు రాజ్‌కుమార్. పాటల పోటీలో ఎప్పుడూ మొదటి బహుమతే వచ్చేది. ఘంటసాల ఆలపించిన ‘నా హృదయంలో నిదురించే చెలి..’ పాట ఆయన ఫావరేట్. హైస్కూల్ విద్యను గుణదల బిషప్ గ్రానీలో పూర్తి చేశాడు. ఇటలీ బిషప్స్ ఆదరణలో ఆ స్కూల్ అభివృద్ధి చెందింది. తొలిసారిగా ఫుట్‌బాల్‌ను అక్కడే నేర్చుకున్నాడాయన. క్రీడాకారుడిగా రాష్టమ్రంతా పర్యటించాడు. కాలేజీకి వెళ్లాక కళాకారుడిగా దేశమంతా పర్యటించాడు. వైస్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్‌లోని ప్రతిభను గమనించి ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవమన్నారు. అలా హైదరాబాద్ దోమలగూడలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివారు. అక్కడా ఆయన ప్రతిభను గమనించిన అధ్యాపకుడు ఓ నిర్మాత దగ్గరికి తీసుకెళ్లారు. విజయవాడలో నాటకాలు వేసిన అనుభవంతో నటుడిగా ప్రయత్నిద్దామన్నది అప్పటికి రాజ్‌కుమార్ ఆలోచన. తరువాత హిందీ సంగీత దర్శకుడు శ్రీరామచంద్ర నిర్మాతగా, ఠాగూర్ దర్శకుడిగా రూపొందిస్తున్న ‘ఘర్ కుల్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. వారే రూపొందించిన ‘మీ తుఝా పతీ నహీ’ చిత్రానికీ పనిచేశాడు. తెలుగులో హరనాథ్ హీరోగా రూపొందించిన ‘నిజం చెబితే నమ్మరు’ చిత్రానికి కో డైరెక్టర్ అయ్యారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే దర్శకుడిగా అవకాశమిస్తానని నిర్మాత నుంచి ప్రామిస్ దొరికింది. తరువాత ‘పణత్తిమీర్’ చిత్రానికి ఎంఎస్ గోపీనాథ్ వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ టైంలోనే సినీగోయర్స్ సంస్థ సెక్రటరీ డి కిషన్‌తో పరిచయమైంది. ఆయనతో జగ్గయ్య మంచి స్నేహితుడవ్వడంతో తన తండ్రే నిర్మాతగా ‘పునాదిరాళ్ళు’ చిత్రాన్ని రూపొందించడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. కానీ చిత్రంలో ఒక లవ్ సీన్స్, డ్యూయెట్స్, ఫైట్స్‌లాంటి వ్యాపార సూత్రాలేమీ లేవు. బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రాన్ని చేద్దామనుకుంటే, నటుడు జగ్గయ్య కలర్‌లో రూపొందించమని సలహా ఇచ్చారు. అలా చేస్తే ఖచ్చితంగా సినిమాకు అవార్డులు వస్తాయని ఆనాడే జోస్యం చెప్పారాయన. ఆఫీసు మెంబర్ దేవానంద్ మద్రాస్ వెళ్లినపుడు అక్కడ కొత్తగా హీరో పాత్రలకోసం ప్రయత్నాలు చేస్తున్నవారి కోసం వాకబు చేశారు. అప్పుడే నటుడు చిరంజీవి ఆయనను కలిసి తన ఫొటోలు ఇచ్చి అవకాశం అడిగారు. మద్రాస్ వెళ్లిన రాజ్‌కుమార్‌కు నరసింహరాజుతోపాటుగా కెడి ప్రభాకర్, చిరంజీవి, హాస్యనటుడు సుధాకర్ పరిచయమయ్యారు. పునాదిరాళ్ళు చిత్రానికి కెమెరామెన్ నివాస్ ద్వారా కమల్‌హాసన్, రజనీకాంత్‌లూ నటిస్తామని వచ్చారు. చివరికి నలుగురిలో ఒక హీరోగా చిరంజీవిని ఎంపిక చేశామని ఆయన అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రాజమండ్రి వద్ద గుమ్మళ్ళదొడ్డి ఊరిలో షూటింగ్ మొదలైంది. యూనిట్‌తో కలిసి అందరినీ సమన్వయం చేసుకుంటూ రాజ్‌కుమార్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న మహానటి సావిత్రి కూడా రాజ్‌కుమార్‌లోని పట్టుదలను గమనించారు. ఒకే ఒక్క కుర్రాడు అన్నీ చూసుకుంటూ, షూటింగ్ చేస్తున్నారని, అందరూ అతనికి సహకరించాలని యూనిట్‌ను, కొత్త హీరోలను ఆమె అభ్యర్థించారు. ‘నెలపాటు అక్కడే షూటింగ్ చేయడానికి కావాల్సిన పాజిటివ్ దృక్పథాన్ని అందరికీ పంచారు సావిత్రి. అంత మంచి మనసు ఆవిడది’ అంటూ గతం నెమరేసుకున్నాడు రాజ్‌కుమార్. అలా రూపొందించిన చిత్రంలో రోజారమణి, కవిత, గోకిన రామారావుల పాత్రలూ అద్భుతంగా పండాయి. సినిమా విడుదల తరువాత అనేక అవార్డులు, రివార్డులూ వచ్చాయి. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులూ వరించాయి. ఒక్కసారిగా రాజ్‌కుమార్ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. నిర్మాతలంతా అడ్వాన్సులు పట్టుకుని రాజ్‌కుమార్ చుట్టూ చేరారు. తాను ప్రజల్లో మార్పుకోసమే చిత్రాలు రూపొందిస్తున్నానని, ఏవేవో కథలు తెచ్చి చేయమంటే తాను చేయనని, నిబద్ధత ఉందని నిర్మాతలకు చెప్పారు. ఓసారి సంగీత దర్శకుడు టి చలపతిరావు మాదాల రంగారావు రూపొందిస్తున్న ‘యువతరం కదిలింది’ కథను రాజ్‌కుమార్‌కు వినిపించి డైరెక్ట్ చేయమన్నారు. అందుకాయన ఇందులోనూ నలుగురు హీరోలు ఉన్నారు. మళ్లీ నేను పునాదిరాళ్ళే చేసినట్టు ఉంటుందని సున్నితంగా తిరస్కరించారు. ఇన్ని మంచి బుద్ధులుంటే చిత్రరంగంలో ఎట్లా బతుకుతావయ్యా? అని చలపతిరావు వెళ్లిపోయారు. ఇదంతా విన్న మాదాల రంగారావు రాజ్‌కుమార్ మాటే నిజమని ఒప్పుకున్నారు. దర్శకుడిగా ఓ వైవిధ్యమైన స్టైల్‌తో కన్పించేవారాయన. ఆనాడే ఫ్రెంచి గెడ్డం ఆయన గుర్తుగా ఉండేది. అమ్మా నాన్నలు ప్రజా సేవలోనే తరించడంతో అదే నేచర్ నాకూ వచ్చిందని చెబుతారు రాజ్‌కుమార్. విజయవాడ నుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ కేశవ్ మెమొరియల్ హైస్కూల్‌కు రావడం, అక్కడ ఉద్యోగంలో ఉండగా 1969-70 ప్రాంతంలో ఆంధ్ర- తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. ఇదే సినిమా రంగంవైపు ఆయన చూడడానికి ప్రధాన కారణమైంది. సదరన్ మూవీ టోన్ నిర్మాతలు విజయ నాగిరెడ్డి బావలైన కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డిలు తమకు స్టూడియో ఉందని, సినిమా చేయమని అడగడం కూడా ఆయన జీవితంలో ఓ మేలిమలుపు. మొదట స్టూడియోలో మేకప్ టెస్ట్ వేసి విలన్ పాత్ర చేద్దామనుకున్నా, సంగీత దర్శకుడు శ్రీరామచంద్ర చిత్రానికి దర్శకత్వ శాఖలో వెళ్ళడం కూడా ఆయన జీవితంలో పెద్ద మార్పు. ఆ తరువాత చంద్రమోహన్- ప్రభ జంటగా లవ్ సెంటిమెంట్ యాక్షన్ చిత్రంగా తాండవకృష్ణ తారంగం రూపొందించారు. ఇండియన్ పనోరమాకు తొలిసారిగా షావుకారు జానకి, గోకిన రామారావులతో ఆయన రూపొందించిన ‘ఈ సమాజం మాకొద్దు’ ఎంపిక కావడం తనకు గర్వకారణం అంటారాయన. తరువాత సంజీవ్ కథానాయకుడిగా సోమయాజులు, జగ్గయ్య నటులుగా మనవూరి గాంధీ చిత్రం రూపొందించారు. ఇంకా తెలవారదేమి?, మా సిరిమల్లి, స్వర్ణ్భారతం, జనప్రియ తదితర చిత్రాలను రూపొందించిన ఆయన అభిరుచి కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. వామపక్ష భావాలతో టి కృష్ణకన్నా ముందే చిత్రాలను రూపొందించడం ఆయనకే చెల్లింది. పునాదిరాళ్ళు సినిమా గమనిస్తే, ఆ తరువాత వచ్చిన వామపక్ష భావాల చిత్రాలన్నింటిలో పునాదిరాళ్ళకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కడోచోట కనిపిస్తూనే ఉంటాయి. అది ఆయన వేసిన ముద్ర. ఇప్పటి సినిమాలు ఎలా ఉన్నాయని అడిగితే, ఒక్క దెబ్బకు పది పదిహేనుమంది గాలిలో ఎగిరి చచ్చిపోవడంలాంటి సన్నివేశాలు నేను తీయలేనని, ప్రేక్షకుణ్ణి మభ్యపెట్టే సన్నివేశాలు నాకు నచ్చవని చెబుతారాయన. సినిమాతో ప్రేక్షకుడు ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతూ నేర్చుకోవాలి కానీ, అబద్ధాలతో బతక్కూడదని అంటారాయన. టీవీ సీరియల్‌ను కూడా రూపొందించిన అనుభవం ఉండటంతో లేడీ విలన్స్ రాజ్యమేలుతున్న ఆ పద్ధతి నచ్చక వదిలేశానని అంటారాయన. అవకాశాల కోసం ఎవరినీ అర్థించలేదని, అది తన ఆత్మగౌరవానికి నచ్చని విషయమంటూ ముగించాడు రాజ్‌కుమార్.

-సరయు శేఖర్, 9676247000