సబ్ ఫీచర్

కళాప్రియ.. లక్ష్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-స్వీయలోపంబెరుగుట కూసు విద్య.
మన లోపాలు మనం తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. తత్వం తెలుసొస్తే తప్ప అనుభవంలోకి రాని విషయమిది. ఆ తత్వం బోధపడాలంటే -మళ్లీ అనుభవాల దొంతర్లే గతి. ఎంచుకున్న రంగంలో ఎంతదూరం ప్రయాణించామన్నది ఈ సింపుల్ సమ్మిళిత సూత్రంమీదే ఆధారపడి ఉంటుంది.
లక్ష్మీప్రియ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. తక్కువలో చెప్పడం సాధ్యమూ కాదు. సినిమా గురించి ఓనమాలు తెలీని పల్లెటూరునుంచి వచ్చి, పరిశ్రమతో ప్రపంచానే్న ఆవిష్కరించుకున్నారామె. ఆమె ప్రస్థానంలోని కొన్ని అడుగుల్లో మనమూ అడుగులేద్దాం. వాటిలోని జ్ఞాపకాలను తడిమి చూద్దాం.

నువ్వు అందంగా ఉన్నావ్ అంటే చాలు -ఏ అమ్మాయికైనా ఠక్కున గుర్తుకొచ్చేది స్క్రీన్‌మీది హీరోయినే. తళుక్కుమనే రంగుల ప్రపంచం గురించి ఏమాత్రం తెలీకున్నా -తనచుట్టూ తళుకులీనే కొత్త ప్రపంచం తిరుగాడుతూ చిటికెన వేలు పట్టుకుని అటువైపు లాక్కెళ్తుంది. ఇండస్ట్రీకి వచ్చినావాళ్లలో అధిక శాతం ఇలానేవస్తారు. సంకల్ప బలంతో ఎదిగేవాళ్లు కొందరు. ఎగిరెగిరిపడి చతికిలపడేవారు కొందరు. నటి లక్ష్మీప్రియకు ఒదిగి ఉండటం ముందే తెలుసు. సో, ఎదగటం పెద్ద కష్టం కాలేదు.
***
ఖమ్మం జిల్లా సత్యన్నారాయణపురంలో సత్యనారాయణ, సుభద్రమ్మ దంపతుల సంతానమే లక్ష్మీప్రియ. చదువంతా సొంతూళ్లోనే. టెన్త్ పరీక్షల కోసం పాస్‌పోర్ట్ ఫొటోలు తీయించుకుంది. వాటిని చూసినోళ్లంతా హీరోయిన్‌లా ఉన్నావనడం మొదలెట్టారు. ఆ బుల్లి ఫొటో -ఆమె ఆలోచన మార్చేసింది.
టెన్త్‌లో లెక్కలు అర్థంకాలేదుగానీ, లైఫ్ లెక్కను కరెక్ట్‌గా వేసింది. తనకిష్టమైన సినీ ప్రపంచవైపు ఎన్ని అడుగులు వేయాలో కచ్చితంగా లెక్కించుకుంది. ‘అప్పటి వరకూ పత్రికల్లో మామూలుగా కనిపించిన హీరోయిన్ల బొమ్మలు, ఆ తరువాత అచ్చంగా నాకులాగే కనిపించేవి. అలా ఆకర్షణ మొదలైంది. ఇంట్లో ఇష్టంలేకున్నా, నాపై నాకున్న నమ్మకంతో అమ్మతో కలిసి చెన్నైకి రైలెక్కేశా’ అంటూ తొలి అడుగుల్ని జ్ఞాపకం చేసుకున్నారు లక్ష్మీప్రియ. మొదట్లో నాటకాల అనుభవం వుందా? అని అడిగేవారట. అసలు డ్రామాకు డెఫినిషన్ తెలీని వయసు, అటువైపు చూడ్డానికే ఇష్టపడని కుటుంబ పెంపకం -ఆమె ఆశకు రెండు అడ్డుగోడలయ్యాయి.
‘స్క్రీన్‌మీద కనిపించాలంటే స్టేజి ఎక్కిఉండాలి. డైలాగ్ చెప్పాలంటే పద్యం వచ్చివుండాలి’ చెన్నైలో నాకు ఎదురైన ప్రశ్నల నుంచి తెలుసుకున్న తొలి పాఠమిది అంటారామె. అలా -సినిమా అవకాశం కొత్తవారికి ఇస్తున్నట్టు ఎక్కడైనా వింటే చాలు.. అక్కడికి వెళ్లడం.. వాళ్లు చెప్పమన్న విధంగా డైలాగులు చెప్పి వచ్చేవారు లక్ష్మీప్రియ. అలా ఎన్నో అనుభవాలు. కాని -షూటింగ్ సమయానికి మాత్రం అవకాశం వచ్చేది కాదు. చివరకు ఆమె దృష్టి -నాటకాలవైపు మళ్లింది. ప్రజానాట్య మండలి కళాకారుడు, సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు నాటకాలు వేస్తుండేవారు చెన్నైలో. నాటకాల కోసం ఆయన ట్రూప్‌లో చేరిపోయింది లక్ష్మీప్రియ. ‘ఓ రకంగా నాకు నటనలో ఓనమాలు దిద్దించిన గురువు రామారావే’ అంటారు అభిమానంగా ఆమె. రెండు మూడు నాటకాల్లో వేషం కట్టేసరికి -కొంత అనుభవం వచ్చింది. డైలాగ్ విధానం మారిపోయింది. అలా -విభ్రాంతి, క్రీనీడ, ఊరుమ్మడి బతుకులు, మండువాలోగిలి తదితర నాటకాలను పరిషత్ పోటీల్లో ప్రదర్శించే స్థాయికి ఎదిగారామె.
ఇదంతా బాగానే ఉంది. కానీ -‘పుట్టి పెరిగిన వాతావరణం అంతతొందరగా మనసును వదిలిపోదుగా. అందుకే -ఎక్కడికెళ్లినా ఊళ్లో స్నేహితులు, బంధువులు.. వాళ్ల మాటలే మళ్లీ మళ్లీ వినిపించేవి. అలా ప్రయాణిస్తూనే -నాటకాల నుంచి సినిమా రంగానికి వచ్చేశాను’ అంటున్నారు లక్ష్మీప్రియ. సినిమాల్లో తొలి అవకాశం నిర్మాత గబ్బిట వెంకటరావు తనయుడు మధు రూపంలో వచ్చింది. ఆయన కమెడియన్ సుధాకర్‌తో కలిసి నాటకాలు వేసేవారు. సుధాకర్, హరిప్రసాద్, చిరంజీవిలాంటి వారంతా అప్పుడు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. మేము రిహార్సల్స్ చేసేటప్పుడు చిరంజీవి కూడా వచ్చి చూసేవారని ఆమె అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నిర్మాత జివి ప్రభాకర్ ‘అగ్ని సంస్కారం’ అనే చిత్రం రూపొందిస్తోన్న సమయం. ‘సినిమాలో గ్రామసేవిక అనే ఓ మంచి పాత్ర ఉందని, అందుకు సరైన నటికోసం వెతుకుతున్నారని తెలియడంతో వెళ్లి కలిశారు లక్ష్మీప్రియ. మంచి డైలాగ్ చెప్పమన్నారు. దాదాపు అనేక ప్రాంతాల్లో తిరిగి 40, 50సార్లు ప్రదర్శించిన ‘క్రీనీడ’లోని డైలాగ్ చెప్పాను. ఫోన్ చేస్తామన్నారు. నేనైతే వచ్చేశాను, ఎదురు చూడలేదు. కాని వారం తరువాత హైదరాబాద్‌లో ఔట్‌డోర్ షూటింగ్‌కు రమ్మంటూ కబురందింది’ అంటూ అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారామె. చిరంజీవి, ధూళిపాళ, రూపాదేవి, భావన అనే ఆర్టిస్టులతోపాటు తానూ ఆ చిత్రంలో నటించానని, ఓ బెంగాలీ చిత్రానికి రీమేక్‌గా అవార్డుల కోసం ఆ సినిమా రూపొందించారని చెప్పారామె. ‘షూటింగ్‌లో అంతా కొత్తవాళ్లమే. సో, ఫ్రెండ్లీగానే ఉండేవాళ్లం. ఆ సినిమాలో మెయిన్ విలన్‌గా ధూళిపాళ. అనుభవజ్ఞుడైన ఆయన నటనలో ఎన్నో మెళకువలు చెప్పేవారు. మంచి సలహాలిచ్చేవారు’ అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా తరువాత లక్ష్మీప్రియకు అక్కా, వదిన, తల్లి పాత్రలు వచ్చాయి. ఎర్రమట్టి, విప్లవశంఖం, మహాప్రస్థానం లాంటి వామపక్ష భావాల చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ‘బలిపీఠంపై భారతనారి’ చిత్రంలో నటనకు అనేక రివార్డులొచ్చాయ. బి విఠలాచార్య రూపొందించిన ‘మోహినీ శపథం’, మలయాళ దర్శకుడు బేబి రూపొందించిన ‘ఆదివారం అమావాస్య’లో అచ్యుత్, రాజా, జెవి సోమయాజుల కాంబినేషన్‌లో నటించడం మర్చిపోలేని విషయాలని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘ప్రాణస్నేహితులు’ చిత్రంలో కృష్ణంరాజు, శరత్‌బాబులకు, ధవళసత్యం దర్శకత్వంలో ‘గుడిగంటలు మ్రోగాయి’లో తల్లి పాత్రలు చేశారామె. అలాగే కెప్టెన్ నాగార్జున చిత్రంలో నాగార్జునకు తల్లిగా నటించారు. జయమ్ము నిశ్చయంబురా, చూపులు కలిసిన శుభవేళ లాంటి చిత్రాల్లో జంధ్యాల దర్శకత్వంలో నటించడం ఓ మర్చిపోలేని అనుభూతి అంటారామె. ముఖ్యంగా ఆయనతో పనిచేయడం చాలా హోలీగా ఉండేదని, విగ్గులు, అతి మేకప్ లేకుండా సహజంగా చిత్రీకరించే ప్రయత్నం చేసేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే విఠలాచార్య కూడా చాలా సౌమ్యంగా తనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ చెప్పి చేయించుకునేవారని గుర్తు చేసుకున్నారు.
ఓసారి షూటింగ్‌లో మెట్లమీదనుంచి పడాలి. డూప్ పెట్టారు. కానీ నేను డూప్ లేకుండానే ఆ సీన్ చేశాను. అందుకు నొచ్చుకున్న విఠలాచార్య సున్నితంగా కోప్పడ్డారు. నాచురల్‌గా ఉండాలనే తాను చేశానని వివరించినా ఒప్పుకోలేదు. ఎందుకమ్మా, మీరలా చేస్తారు. డూప్ పెట్టాను కదా. మీకేమైనా దెబ్బలు తగిలితే మళ్లీ షూటింగ్ ఎలా చేస్తాం అంటూ అనునయించారు. అలాగే వి మధుసూదనరావు దర్శకత్వంలో నటించడానికి భయపడేవాళ్లం. ఆయన గతంలో కాంచనను, శోభన్‌బాబును కొట్టారని ఓ మాట వినిపించేది. అందుకు భయపడేదాన్ని. కానీ అటువంటిదేమీ లేకుండా ఎలాంటి నటన కావాలో చెప్పి రాబట్టుకునేవారు’ అంటారు లక్ష్మీప్రియ. వందేమాతరం, బంగారుగాజులు, ధర్మయుద్ధం, మనసు మమత, ఏడుకొండలస్వామిలాంటి చిత్రాల్లో నటించారామె. ఏడుకొండలస్వామి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు కూడా ఎంతో గొప్ప దర్శకులని, ఆయన దగ్గర చేయడం కూడా తన పూర్వజన్మ సుకృతంగా గుర్తు చేసుకున్నారు లక్ష్మీప్రియ. యజ్ఞం చిత్రంలో నటించినందుకు పిఎల్ నారాయణతోపాటుగా నంది అవార్డు తీసుకున్నట్టు చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు. 30 ఏళ్లపాటు అనేక చిత్రాల్లో నటించిన మీకు, జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ విషయమేదీ అంటే నవ్వేశారామె. ‘నాటకానుభవం లేదు. డైలాగ్ ఎలా చెబుతావ్?’ అని ఎగతాళిని ఎదుర్కొన్న విషయమేనంటారామె. ప్రస్తుతం లక్ష్మీప్రియ అనేక పాత్రలతో సీరియల్స్‌లో బిజీ అయ్యారు. సినిమాల్లో ఒకటీ అరా సన్నివేశాలుంటే, సీరియల్స్‌లో మూడు నాలుగు సన్నివేశాలుంటాయని, ఎక్కడైనా మేకప్, నటన ఒకటేనని చెబుతారామె. నటనతోపాటు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మంచి పేరు సాధించారామె. మంజుల, సుజాత, శ్రీవిద్య, కెఆర్ విజయ, లత తదితర హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. గొప్పగా పేరురాకున్నా దేవుడు మనకు ఎంత రాసివుంటే అంత దొరుకుతుందన్న సంతృప్తి ఆమె మాటల్లో వినిపించింది. కళ్లలో కనిపించింది. భర్త నందకుమార్ వ్యాపారం చేస్తూ సీరియల్స్ కూడా చేస్తున్నారు. ఓ బాబు యుఎస్‌లో, మరో బాబు ఆంధ్రలో, మరోబాబు చెన్నైలో వున్నారు. ఇప్పటి సినిమాలు చూడటం చాలా తక్కువంటారామె. ఏదైనా టీవీలో పాత చిత్రాలు వస్తే చూస్తానని, ఇప్పటి హీరోయిన్లు ముఖాలే గుర్తుపట్టలేనని అంటోంది లక్ష్మీప్రియ. హీరోలూ అంతేనంటారామె. ఎక్కడికెళ్లినా అమ్మా.. అమ్మా అంటూ పలకరించేవాళ్లను చూసి ఆనందం కలుగుతుందని, ప్రస్తుతం ముత్యాలముగ్గు, జీ తమిళ్ సీరియల్ ఒకటి చేస్తున్నానన్నారు. ‘ఎక్కడో ఉండేవాళ్లం. పరిశ్రమ గురించి తెలీనోళ్లం. ఇక్కడికి వచ్చాం. ఇలా జీవిస్తున్నాం. ఇదంతా రాసిపెట్టి ఉన్నదే. ఇదే పూర్వజన్మ సుకృతం అనుకుంటాను’ అంటూ ముగించారు లక్ష్మీప్రియ. స్వీయలోపంబెరుగుట కూసు విద్య. ఇది లక్ష్మీప్రియకు బాగా తెలిసిన విద్య. అదే ఆమె సక్సెస్.

-సరయు శేఖర్, 9676247000