సబ్ ఫీచర్

మద్రాస్ ప్రెసిడెన్సీకి తొలి తెలుగు ప్రీమియర్ ఓమందూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓమందూరు రామస్వామిరెడ్డిగారు దక్షిణ రాష్టమ్రుగా విభజింపబడని కాలంలో దక్షిణ ఆర్కాటు, దిండివనం నగరమునకు సమీపమునగల ఓమందూరు గ్రామంలో 1895 ఫిబ్రవరి 1న జన్మించారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ ప్రాంతీయ ప్రభావంచే బ్రిటిష్‌వారు నెలకొల్పిన వాల్టర్ స్కడ్డర పాఠశాలలో చేరి తన విద్యాభ్యాసం కొనసాగించి పట్ట్భద్రులై న్యాయశాస్త్రం అభ్యసించి అఖండ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. బ్రిటిష్‌వారి అరాచక పరిపాలనను సహింపనివారై, పలు స్వాతంత్య్ర సమరయోధుల వీరధీర విన్యాసములను, వైదుష్యములను చదివి, చూచి వారి త్యాగ జీవితమును పుణికిపుచ్చుకొని అకుంఠితమైన దీక్షాదక్షతతో తన చిన్నప్రాయంలోనే స్వాతంత్య్ర సమరంలోకి అడుగు పెట్టారు. ఇది తెలుగువారికే పరాకాష్ఠ. కామరాజ్‌గారి మన్ననలకు పాత్రులై వారిచే ప్రతిపాదింపబడి అవిభక్త మదరాసు అధిష్ఠానము (Madras Presidency) నకు ప్రీమియరుగా (నేటి పేరు ముఖ్యమంత్రి) 1947 మార్చి 23న మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణము చేసారు. ఆంగ్లేయులు సైతము ఆశ్చర్యపడువిధంగా అనేక సంస్కరణలకు నాంది పలికి ఆచరణలోనికి తెచ్చిన గొప్ప రాజకీయవేత్త ఓమందూరు.
ముఖ్యమంత్రి హోదాలో ఆలయ ప్రవేశ చట్టమును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా అప్పటివరకు ఆలయ ప్రవేశమునకు అనర్హులుగా భావించబడిన దళితులు, నిరోధించబడిన మిగిలిన హిందువులు సంపూర్ణ స్వాతంత్య్రంతో ఆలయప్రవేశము పొందారు. సమాజంలో ఆరోజుల్లో తలెత్తి విరిసిన జమీందారులు, ఇనాముదారులు అను శోచనీయమైన సమాజస్తోమత విధానమును బృహత్తర కృషితో అనేక పోరాటములను, తిరుగుబాటులను, చేదైన అనుభవములను ధైర్యసాహసంతో ఎదుర్కొని చట్టంద్వారా దురదృష్టకరమైన తారతమ్యమునకు సమాధికట్టుటకు నాందిపలికారు. లంచగొండితనమును నిర్మూలించుటకై అసమానమైన, అనిర్వచనీయమైన చర్యలను పాలనలోనికి తెచ్చి మమేకంగా అట్టి దుష్టశక్తి కలిగిన వారిలో బీభత్సాన్ని సృష్టించారు. స్ర్తిలను మరియు పేద కుటుంబములను బాధిస్తున్న, నిలువునా చంపుతున్న, సాంఘిక దురాచారమైన మద్యపాన నిషేధం వీరి కాలంలో చట్టంగా ప్రవేశపెట్టబడి అమలుపరిచారు. ఆ రోజులలో సంఘంలో చోటుచేసుకొన్న అతి దుర్భరమైన దేవదాసి విధానమును బహిష్కరించి స్ర్తి జాతిని రక్షించవలయునన్న సదుద్దేశంతో చట్టమును ప్రవేశపెట్టి స్ర్తిల పాలిట దైవంగా కొనియాడబడ్డారు. ఈ విధానంలో కృంగి, కృశించి నిర్మూలనకై పడిగాపులు కాచిన స్ర్తిల హృదయాలలో ఆనందము కలిగించారు. అంతవరకు అమలులో లేని హిందూ మత కోవెలలు అభ్యున్నతికి దోహదపడు విధంగా సాంప్రదాయ మాన్యశాఖ చట్టమును (Hindu Religious & Endowment Act.) ఫ్రవేశపెట్టి అగ్రస్థానమును అధిష్టించియుండు హైందవ మతమును పరిపోషించి, పరిరక్షించి పరివ్యాప్తికి కృషిచేసి విజయం సాధించారు. ఈ విధంగా సమస్యలతో మిళితమైన అనేక సాంఘిక దురాచారములను ఏకధాటిగా నిర్మూలించిన అఖండమైన ఘనత వీరికే దక్కుతుంది.
బ్రిటిష్ పరిపాలన మన దేశంలో అంతమొందు సమయంలో ఓమందూరు ముఖ్యమంత్రి పదవిని అలంకరించి అనేక సమాజ రుగ్మతలను నిర్మూలించుటకు విశ్వప్రయత్నముతో ధైర్యసాహసములను వెలిబుచ్చి, ఎటువంటి తిరుగుబాటులకు భయపడక యధాతథంగా సమాజంలో మార్పులు తెచ్చి అబ్బురపరచెను. ముఖ్యమంత్రి అనుమానాలకు తావివ్వక తాము కూడ తన ప్రజలవలె ఒక సాధారణ పురుషుడని నిరూపించగలిగారు. ఒకసారి రోగపీడితుండై వైద్యశాలలో చికిత్సనిమిత్తము చేరవలసిన ఆవశ్యకత ఏర్పడెను. ఓమందూరుగారు ముఖ్యమంత్రిగా ప్రత్యేక పద్ధతికి అర్హులైనప్పటికీ తాను ప్రభుత్వ వైద్యశాలలోనే చేర్చి అచ్చట మిగిలినవారికి యివ్వబడు చికిత్సనే కోరుకొనెను. తాను ముఖ్యమంత్రి కాబట్టి తనకు విశిష్ట చికిత్స అక్కరలేదని గట్టిగా హెచ్చరించెను. ఆ వైద్యశాలలో యున్న ఔషధములే చాలనియు, పాశ్చాత్య దేశములనుండి మందులను రప్పించడం పూర్తిగావలదని నిష్కర్షగా నిరాకరించెను. ముఖ్యమంత్రి అయినంతమాత్రాన ప్రత్యేక ఏర్పాట్లుగానీ, వసతులు గాని ఏర్పాటుచేయకూడదని శాసించెను. ఇంతటి వినయ విధేయతలు గలిగిన ఒక వ్యక్తి రాజ్యపరిపాలనలో ఒకసారి భారతదేశ విలీనకరణ సంఘటనలో ప్రత్యేక శ్రద్ధవహించి హుటాహుటిన తీసుకొన్న కార్యసాధన మరువరానిది.
భారతదేశం స్వాతంత్య్రం పొందిన కాలఘట్టంలో మొత్తం 562 సంస్థానములుగాయుండి దేశం మొత్తం జమీందారులు, ఇనాందారులు (సంస్థానాధీశుల) పరిపాలనలో ఉండేవి. సంస్థానాధీశుల ఆధిక్యమునకు వీడ్కోలు పలికి రాష్టమ్రుల నేర్పఱచి అవి ప్రజలచే పరిపాలింపబడితే తప్ప మన నాయకులు కన్నకలలు నిజంకావు అనే ఆలోచనతో గుజరాత్ రాష్టమ్రునకు చెందిన అతి ప్రాముఖ్యత వహించిన స్వాతంత్య్ర సమరయోధులు, గాంధీ, నెహ్రూగార్లకు సన్నిహితులు, ఆత్మీయులు, రాజకీయ అపరచాణక్యుడు ఉక్కుమనిషి బిరుదాంకితులు సర్దార్ వల్లభాయ్‌పటేలు. అనేక ప్రాంతములలో జమీందార్లు అనుభవించుచుండిన మహోల్లాస జీవితము, అధికారం, విలీనంతో అంతరించునన్న విషయం తెలిసినప్పటికీ దేశ సౌభాగ్యమును ప్రధానంగా భావించి విలీనమునకు సమ్మతించి సర్దార్‌పటేల్‌తో ఏకీభవించారు. కాశ్మీరము, హైదరాబాదు అధీశులు మాత్రము విలీనమునకు సమ్మతించక తిరుగుబాటుచేశారు. కాని ఈ సమస్యను పరిష్కరించుటకే జన్మించిన విధంగా సర్దార్ పటేల్ దృఢ నిశ్చయంతో ముందుకుసాగెను. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రాంత ముఖ్యమంత్రి ఓమందూరు హైదరాబాదు నిజాము చేపట్టిన కుట్రను తెలుసుకొని విలీనకరణలో తానుకూడ భాగస్వామ్యం వహించ పూనుకొనెను. ఆ తరుణంలో హైదరాబాదు నిజాము పాకిస్థాన్‌నుండి హైదరాబాదుకు ఆయుధములు, విధ్వంసాత్మక పరికరములు విమానం మూలం దిగుమతియగు విషయమును, రహస్యమును సకాలంలో ఓమందూరు, విలీనకరణకర్త అయిన సర్దార్ పటేల్‌గారికి తెలిపి, రానున్న ప్రమాదమును హెచ్చరించి అట్టి విద్రోహశక్తిని అరికట్టుటకు అనన్యసామాన్యమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. చివరగా సర్దార్‌పటేల్ ఆధ్వర్యంలో సైనిక బలంతో హైదరాబాద్ సంస్థానము భారతదేశంతో విలీనమొందెను. ఇది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడిన చెరగని ముద్ర. తమిళనాడు రాజకీయవేత్తలతో ముఖ్యంగా కామరాజర్‌తో భేదాభిప్రాయాలు మొలకెత్తినవి. తనతో సంప్రదించకుండా విచ్చలవిడిగా తీర్మానములు తీసుకొనుచున్నారని అలిగి కామరాజ నాడార్ ఓమందూరుపై లెజిస్లేచర్ పార్టీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఏప్రిల్ 1949లో ముఖ్యమంత్రి పదవినుండి తొలగించారు. తనకిచ్చిన చాలా తక్కువ కాలంలో ఎక్కువ సంస్కరణములు ప్రవేశపెట్టినందులకు కృతజ్ఞతలు తెలుపుతూ పదవినుండి సంతృప్తితో వైదొలగెను. పదవినుండి వైదొలగిన తర్వాత జీవిత శేషము ఆధ్యాత్మిక బాటలో పయనించి వినూత్నమైన, విలక్షణమైన కార్యక్రమములను చేపట్టారు. వళ్ళలార్ రామలింగస్వామి అడిగళార్ వారి గురుకుల పాఠశాల, అప్పర్ అనాధ శరణాలయం, పేద విద్యార్థుల నిలయం, అప్పర్ సాండ్రోర్ నిలయం, రామలింగస్వామి భక్తుల నివాసము అని అనేక సేవాసంస్థల వ్యవస్థాపకులై ఆధ్యాత్మిక, సాంఘిక, సామాజిక గరిష్ఠ సేవలను ప్రదానంగావించారు. ఆయన పూర్వ ఆస్తులను సమరసశుద్ధ సన్మార్గ సంఘానికి త్యాగంచేసి వదాన్యతకు వ్యాకరణంగా వెలశారు.
ఉదాత్తమైన వరవడిని తన జీవిత సందేశంగా మనకు వదలి 1970లో తన 75వ ఏట పరమపదించిరి. వీరిని స్మరిస్తూ తమిళనాడు ప్రభుత్వం పలు కార్యాలయాలుగల విశాల ప్రాంగణానికి ఓమందూరు ఎస్టేట్స్ అని నామకరణం చేసింది. తమిళనాడు ప్రభుత్వంవారి స్వంత గ్రామంలో మణిమండపం నిర్మించింది. భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపుకూడ విడుదల చేసింది.

(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)

- టి.ఆర్.ఎస్.శర్మ, పి.ఆర్.కేశవులు