సబ్ ఫీచర్

నమో కాశివాసి! నమో వారణాసి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల్లో 3 దశల పోలింగ్ ముగిసింది. నాయకుల వాదప్రతివాదాలు కొనసాగుతున్నాయి. రాఫెల్ వివాదంపై రాహుల్ గాంధీ మాట మీరి సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పాడు. ఆయన చేసిన ఆలయ ప్రదక్షిణలు, హోమాలు, పట్టుబట్టలతో పటాటోపాలు, కైలాస మానస సరోవరం వెళ్ళివచ్చిన దర్పం తాలూకు డాంబికాలు ఏమైనాయో తెలీదు. కేరళలో ముస్లింలు 35% వున్న వైనాడ్‌కు చేరుకున్నాడు. వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి ‘సై’ అన్న రాహుల్ సోదరి ప్రియాంక తల్లి మాట విని చల్లగా జారుకొంది. సైనికులను సమర్ధిస్తూ మాట్లాడితే యుద్ధోన్మాదం అంటూ శేఖర్ కపూర్ లాంటి వాళ్ళు వ్యాసాలు రాస్తున్నారు. ‘తీవ్రవాదాన్ని దెబ్బతీయడమే న్యూ ఇండియా లక్షణమం’టూ మోదీ ఎన్నికల ప్రచారంలో శతఘ్నిలా దూసుకుపోతున్నాడు. కాశీ అంతా కదలి వచ్చిన వేళ, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు తనను బలపరచిన ఆత్మీయ సందర్భంలో, ఓ వృద్ధమాత ఆశీర్వచనం తీసుకుని మోదీ నామినేషన్ వేశారు. కాశీ ప్రజలకు గత ఐదేళ్ళుగా అండగా వుండి, అక్కడ అభివృద్ధి చేపట్టి, గంగామాత ప్రక్షాళనకై ప్రత్యక్ష కార్యాచరణలో అగ్రపథంలో నిలబడిన మోదీ ‘నమో కాశివాసి, నమో వారణాసి’ నినాదాన్ని నిజం చేశారు.
17.5 కి.మీ బాబట్‌పూర్- వారణాసి నాల్గు లైన్ల హైవే కావచ్చు, కాశీ ‘తీర్థ రాజమ’నే స్పృహను కలిగించే విద్యుద్దీపాలంకరణ కావచ్చు.. వారణాసిని వాసికెక్కిన పట్టణంగా తీర్చిదిద్దాయి. కోట్లాది రూపాయల ధనం వౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపార రంగ విస్తరణకు వెచ్చించబడుతోంది. ఈ- పడవలు, ఈ- రిక్షాలు రవాణాకు కొత్త రూపునిచ్చాయి. ట్రాఫిక్ నియంత్రణకు ఒక కేంద్రం, స్నానఘట్టాలు, ఆసుపత్రులు, ప్రాథమిక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పారిశుద్ధ్యం వీటన్నిటిపై మోదీ దృష్టి పెట్టారు. ఒక తీర్థక్షేత్రాన్ని అభివృద్ధిచేసే దిశలో హృదయ్ (HRIDAY-Heritage city Development and Augu mentation Yojana) యోజన రూఫుదాల్చింది. 34 రోడ్లను, టౌన్‌హాల్ పునర్నిర్మాణం, 81 తీర్థ స్థానాలు, దుర్గాకుండం సుందరీకరణ, అసిఘాట్ వద్ద ఉద్యానవనాల అభివృద్ధి వంటి పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరా లైన్లను భూగర్భ మార్గాల ద్వారా క్రమబద్ధకరించేందుకు 362 కోట్లు, వర్షపునీటి క్రమబద్ధీకరణకు 253 కోట్లు, బడాలాల్‌పురా వద్ద వ్యాపారాభివృద్ధి కేంద్రానికి 212 కోట్లు, వంట గ్యాస్ సరఫరా లైన్ కోసం 158 కోట్లు, క్యాన్సర్ ఆసుపత్రికి 111కోట్లు, తాగునీటికి 134 కోట్లు, మల్టీ మోడల్ టెర్నినల్‌కు 208 కోట్లు, రింగ్‌రోడ్డు కోసం 760 కోట్లు, 56వ జాతీయ రహదారి అభివృద్ధికి 812 కోట్లు కేటాయించగా పనులు జరుగుతున్నాయి. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఓ నమూనాగా జాతీయ నీటి సరఫరా, నీటి రవాణా అభివృద్ధి పథకం ‘జలమార్క్ వికాస్ ప్రాజెక్టు’ నిర్మాణంలో వుంది. ఈ పనిలో భాగంగానే గంగానదిపై మల్టీ మోడల్ టెర్మినల్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రజలకు, వ్యవసాయదారులకు కావాల్సిన నీటిని సరఫరా చేయడమే కాకుండా లక్షా 60వేల మందికి ఉద్యోగావకాశాలు కలిగించే పథకం ఇది. గంగానది మీదుగా సరకు రవాణాకు పడవలు, లాంచీలను వినియోగంలోకి తెచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయమై యువతలో కౌశలం పెంచేందుకు శిక్షణ ఇస్తారు. జాతీయ నీటి రవాణా మార్గాలను అధికం చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. గంగానది మీదుగా వారణాసి నుంచి వాల్దియా వరకు పెద్దపెద్ద నౌకలను నడిపే వీలుంది. 1500-2000 టన్నుల భారం గల సరకు రవాణా ఈ రకంగా సులభమవుతుంది. 1320 కి.మీ. రవాణా సౌకర్యం చౌకగా, పర్యావరణ రహితంగా జరిగే వీలు యిందులో వుంది. 5,369 కోట్ల పెట్టుబడితో ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి జాతీయ నీటి రవాణాకుద్దేశించిన మల్టీ మోడల్ టెర్మినల్ పనులు యిప్పటికే పూర్తయ్యాయి. దీనే్న ‘సాగరమాల ప్రాజెక్టు’ అన్నారు. రైలు, వాయు మార్గాల అభివృద్ధి జరిగాక గంగానది మీదుగా జలమార్గం రవాణా తగ్గిపోయింది. నిజానికి 1986లోనే ప్రయాగ నుంచి వాల్దియా వరకు 1620 కి.మీ. సాగరమాల ప్రాజెక్టుకు యోచన జరిగింది. కాని తరువాత దాన్ని గురించిన ప్రయత్నమేదీ ఎవరూ చేయలేదు. మోదీ ప్రభుత్వం ఈ బృహత్తర యత్నాన్ని సాకారం చేసేందుకు నడుం బిగించింది.
యూపీ, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలిపేందుకు 1720 కి.మీ. జలమార్గ్ వికాస్ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణంలో వుంది. రెండవ దశలో దీన్ని బంగ్లాదేశ్‌కు కూడా విస్తరించనున్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీ ఎన్నికైన తరువాత అక్కడి గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా లభిస్తున్నది. వారణాసిలో పాస్‌పోర్టు ఆఫీసు ఏర్పాటైనందున ఇపుడు లక్నో వెళ్ళే అవసరం లేదు. అస్సీఘాట్‌ను శుభ్రమైన ఘాట్‌గా తీర్చిదిద్దారు. జయపూర్, నాగేపూర్ గ్రామాలను సంసద్ గ్రామాభివృద్ధి యోజన కింద మోదీ ఎంపిక చేసుకున్నారు. వస్త్ర పరిశ్రమ విస్తరణకు పవర్ లూమ్ సెంటర్, హస్తకళల మ్యూజియం, వ్యాపారాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. ప్రపంచం మొత్తం నుంచి ప్రజలు తరలివచ్చే వారణాసిని గొప్ప వ్యాపార కేంద్రంగా మలచాలనేది మోదీ సంకల్పం.
2015 డిసెంబర్‌లో జపాన్ ప్రధాని షింజోఅబితో బాటు మోదీ దశాశ్వమేధ ఘాట్‌లో గంగాహారతిలో పాల్గొన్నారు. వారణాసి-టోక్యో భాగస్వామ్య నగర ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. జపాన్ సాంకేతిక సహకారంతో తాగునీరు, మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, పట్టణ రవాణా మెరుగుదలపై వారణాసి పట్టణ అధికార యంత్రాంగం పనిచేస్తున్నది. క్రీ.శ.1780 తరువాత మళ్ళీ వారణాసిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అన్నిటికన్నా మించి ‘నమామి గంగే’ ప్రాజెక్టుపై మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. మొదటి మూడేళ్ళ కాలంలో యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం నుంచి సహకారం కొరవడి పనులు మందకొడిగా సాగాయి. తరువాత భాజపా ప్రభుత్వం ఏర్పడిన గత కొద్ది కాలంలో పనులు వేగమందుకున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో 20,000 కోట్ల నిధులు వృథా అయిన సందర్భంలో నమామి గంగే ప్రాజెక్టును గురించి చర్చించడం చాలా అవసరం.
పారిశ్రామికీకరణ పేరిట గంగను కలుషితం చేస్తున్న 10 నగరాలను ఎంపిక చేశారు. అందులో మొదటిది కాన్పూరు. కాన్పూరులో రోజూ 37.5 కోట్ల లీటర్ల వ్యర్థజలం తయారవుతుంది. 48.7 కోట్ల లీటర్ల సామర్థ్యం గల వ్యర్థజల శుద్ధి యంత్రాలను నాలుగుచోట్ల ఏర్పాటుచేశారు. కాన్పూరులోని సీసావౌ కాలువ ద్వారా 14 కోట్ల లీటర్ల మురుగునీరు రోజూ గంగలో కలుస్తుంది. దీన్ని ఆపి వ్యర్థ జల శుద్ధి యంత్రాల ద్వారా శుద్ధిచేయడం మొదలైంది. 2 కోట్ల లీటర్ల మురుగునీటి శుద్ధికోసం కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్మాణం జరుగనుంది. కాన్పూరు పరిసర గ్రామాలలో కూడా వ్యర్థ జల శుద్ధి యంత్రాల స్థాపన జరుగనుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత గత 70 ఏళ్ళలో ఎవరూ చేయలేని పని మోదీ ప్రభుత్వం చేపట్టింది. మహానగరాలలో వ్యర్థజల శుద్ధికోసం సర్వసామాన్యంగా వినియోగించే యంత్రాలను కూడా గంగ వంటి జీవనదుల పరిరక్షణ విషయమై ఏ ప్రభుత్వమూ, అధికార యంత్రాంగమూ వినియోగించకపోవడం భౌతిక దారిద్య్రమో, భావ దారిద్య్రమో అర్థం కాదు. కాన్పూర్‌లో 23 ఘాట్‌ల నిర్మాణం జరిగింది. గంగానదిలో చెత్తను తొలగించేందుకు ట్రాష్ స్కిమ్మర్‌లను వాడుతున్నారు. ప్రయాగలో బయలుదేరి 106 కి.మీ ప్రవహించి గంగలో కలుస్తున్న వరుణానది శుద్ధి జరిగింది.
వారణాసిలో ప్రవహిస్తున్న గంగానదిలో వ్యర్థ జలశుద్ధి సామర్థ్యాన్ని రోజుకు 412 మిలియన్ల లీటర్లకు పెంచారు. గంగతో పాటు అన్ని నదుల ప్రక్షాళన గావిస్తామని మోదీ చెప్పారు. 40 కోట్ల మంది ప్రజలు గంగానది మీద ఆధారపడ్డారు. ఉత్తరఖండ్, యూపీ, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హరియానా, ఢిల్లీలలో 300 ప్రాజెక్టుల నిర్వహణను చేపట్టారు. విశ్వనాథ మందిరం కారిడార్‌ను ప్రారంభించారు. కాశీ విశ్వనాథ మందిరం చుట్టూ ఇరుకుగా వున్న వీధులు, బహుముఖంగా వ్యాపించిన ఇళ్లు మందిర పవిత్రతను భగ్నం చేస్తున్న దృష్ట్యా విశ్వనాథ మందిర విస్తరణ పనులను చేపట్టారు. గంగలో స్నానం చేశాక నేరుగా విశ్వనాథుని దర్శనం చేసుకునేలా వీధులను విస్తరిస్తున్నారు. ఇందుకోసం ఇళ్ళ యజమానులు- హిందూ ముస్లిం అనే భేదం లేకుండా సహకరించారు. ఔరంగజేబు కాలంలో విశ్వనాథ మందిరం ధ్వంసమైంది. లింగాన్ని బావిలో పడవేయడం, ఆ స్థానంలో మసీదును నిర్మించడం చరిత్ర. గాంధీజీ కాశీని దర్శించినపుడు ఈ పవిత్ర క్షేత్రం దయనీయ స్థితిపై చింతించారు. శతాబ్దాల తరువాత మళ్ళీ మందిర పునరుద్ధాన, విస్తరణ పనులు మోదీ హయాంలో ప్రారంభమయ్యాయి. కాశీకి, కాశీవాసులకు, కాశీని పవిత్ర క్షేత్రంగా భావించే కోట్ల మంది హిందువులకు ఇది ఆత్మవిశ్వాసాన్నిచ్చే విషయం. భక్తితో పాటు భావ సమైక్యతను కలిగించే ఈ తరహా పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ కాశీ చరిత్రలో, దేశ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. గంగామాతకు తనయుడినని నిరూపించుకున్నారు.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888