సబ్ ఫీచర్

సీతారుణచిలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి రమణీయత ఆస్వాదనకు రెక్కలల్లార్చి ఎగిరే సీతాకోకచిలక -పువ్వు పువ్వునూ పకలరిస్తుంది. తన అందాన్ని పరిచయం చేస్తుంది. మకరందాన్ని గ్రోలుతుంది. మొత్తంగా -ప్రకృతితో మమేకమై చూసే కళ్లకు ఒకింత ఆనందాన్నిస్తుంది. ఈ వారం వెనె్నల అతిథి కూడా అలాంటి -సీతాకోకచిలుకే. ఎక్కడో పుట్టింది. ఎక్కడెక్కడికో ఎగిరింది. తనెలా ఉండాలో అలాగే ఉంది. ఎలా ఉండాలనుకుందో అలాగే ఉండటానికి ప్రయత్నించింది. తనెలావుంటే బావుంటుందని అందరూ అనుకునేవారో -వాళ్లకు అలాగే కనిపించింది. అల్లరి చేసింది. వినోదాన్ని పంచింది. సినిమా ప్రకృతితో మమేకమై -ఆమె సినిమా సీతాకోకచిలుక అనిపించుకుంది. ఆమె ఎవరో కాదు -ముచ్చటైన ముచ్చర్ల అరుణ.
అమ్మమ్మ, నాన్నమ్మలది గోదావరి జిల్లా నరసాపురం. అరుణ పుట్టినూరు మాత్రం కొత్తగూడెం. పెరిగింది హైదరాబాద్. వేసవి సెలవులకు మాత్రమే నరసాపురం వెళ్లేది. అదీ -కేవలం అల్లరి చేయడానికి. ముచ్చటైన పసితనపు అల్లరిలో -ఆమే ఫస్ట్. పక్కింట్లో జామకాయలు మాయమైతే -అరుణను తరిమేవారు. తోటల్లో చెట్లనుంచి మామిడికాయలు మిస్సయితే -అరుణను వెతికేవారు. ఆమెకు సంబంధం లేని అల్లరిలోనూ -ఊరి వేళ్లన్నీ అరుణనే చూపించేవి. ‘ఎప్పటికీ తిరిగిరాని మరుపురాని రోజులవి’ అంటారు అరుణ జ్ఞాపకాల దొంతర్లను తిరగేస్తూ.
***
హైదరాబాద్‌లో హైస్కూల్ చదువు. స్కూలు.. టీచర్లు.. పాఠాలు.. స్నేహితులు.. ఈ దశ నడుస్తున్నపుడే -కొత్త గమనం. అది సినిమా. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్లుక్కుల్ ఈరం’ తమిళ చిత్రం. హీరోయిన్ చాన్స్. హాయిగా సాగిపోతున్న లైఫ్ ముందు ఆ ఛాన్స్ పెద్దగా కనిపించలేదు. అందుకే -ఇష్టం లేకున్నా నటించాల్సి వచ్చింది. కట్‌చేస్తే -సినిమా హిట్.
అయినా అరుణ దృష్టంతా హైదరాబాద్‌వైపే. ‘సినిమా గినిమాలొద్దు. హాయిగా చదువుకుంటా’ అంటూ మళ్లీ హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ చిత్రమేమంటే -ఎవరైనా సినిమాల్లో అవకాశాల కోసం ట్రైనెక్కుతారు. అరుణ మాత్రం వచ్చిన అవకాశాన్ని వదలేసుకుని రిటర్న్ ట్రైన్ ఎక్కేసింది. స్క్రీన్‌కు నచ్చితే కెమెరా వదలదు- అంటాడో సినీ పెద్దాయన. అరుణ విషయంలోనూ అదే జరిగింది. సినిమాటోగ్రఫీ ఆమెను వదల్లేదు.
**
గోరింటాకు సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఆ సినిమా నిర్మాత మురారి వచ్చి ‘జేగంటలు’ హీరోయిన్‌గా అడిగాడు. మళ్లీ ఇష్టం లేదు. తప్పలేదు. ఇంట్లోవాళ్లు సంబరపడ్డారు. అలా -కెమెరా ముందుకెళ్లింది అరుణ. అడుగుపెట్టగానే ఎదురైన అసలు ప్రశ్న -నాటకానుభవం ఉందా? అని. ‘నటన, డ్యాన్స్‌లు నాకేం తెలీవు. కనీసం మేకప్ వేసుకునే సంగతీ తెలిసేది కాదు. అందుకేనేమో -నేను చేసిన ఫస్ట్ ఫేజ్ చిత్రాల్లో మేకప్ లేకుండానే కనిపించాను’ అంటూ గుర్తు చేసుకుంది ముచ్చర్ల అరుణ.
శంకరాభరణం సూపర్ హిట్. ఆ సినిమాను దర్శకుడు కె విశ్వనాథ్ ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. నిర్మాతకు ఏడిద నాగేశ్వరరావుకు కాసుల పంట పండించాడు. అప్పుడు నిర్మాత ఏడిద, అరుణకు ఇచ్చిన అవకాశం ‘సీతాకోకచిలక’. భారతీరాజా దర్శకత్వం కనుక ఇబ్బందేమీ ఉండదన్న ధీమా. ఈసారి ఆలోచించి ఇష్టపూర్వకంగానే ఒప్పుకుంది. అందుకు కారణం.. ‘ఈ ఒక్క సినిమా చెయ్. తరువాత చదువుకోలనిపిస్తే, వెళ్లి హాయిగా చదువుకో’ -అన్నారు భారతీరాజా. అరుణకు నచ్చటంతో నటించింది, అనుకున్నట్టే వెంటనే హైదరాబాద్‌కు వచ్చేసింది.
అన్నీ అనుకున్నట్టే జరగవు. కొన్నిసార్లు జరిగేవాటిని అనుకోము. అందమైన సీతాకోకచిలుక దాక్కుంటానంటే -ప్రకృతి ఒప్పుకోదు. అరుణ విషయంలో అదే జరిగింది. సీతాకోకచిలక పసితనం, అమాయకత్వం, గాంభీర్యం.. ఆడియన్స్‌కి కనెక్టైంది. సినిమాను ఎక్కడో కూర్చుబెట్టారు. అంతేకాదు, బ్లాక్‌బస్టర్ ముద్రవేసేశారు. ట్రెండ్ సెట్టర్ మార్క్ ఇచ్చేశారు. దాంతో అరుణ వద్దన్నా అవకాశాల ఆగలేదు. వెంటవెంటనే -జస్టిస్ చౌదరి, అడవిసింహాలు, ఆలయశిఖరం, సీతమ్మపెళ్లి, శ్రీవారికి ప్రేమలేఖ, స్వాతి, స్రవంతి, చంటబ్బాయి, దొంగల్లోదొర, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు.. ఓహ్.. ఒకటేమిటి. దాదాపు 40 సినిమాలు పూరె్తైపోయాయి.
**
ఏ సినిమాకు ఆ సినిమా గొప్పదే అయినా -సీతాకోకచిలుక సీతాకోకచిలుకే అంటారు అరుణ. ఆనాటి షూటింగ్ టైం ముచ్చట్లను భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.
‘సాగర సంగమమే’ పాట చిత్రీకరణ జరుగుతోంది. సముద్రటొడ్డున
ఇరుకిరుకు గుహల్లో షూటింగ్. కెమెరా తిరగటానికీ కష్టమైన ప్రదేశం. ఇప్పటి సాంకేతికత అప్పడు లేదు కనుక, మాన్యువల్ పొజిషన్‌పైనే ఆధారపడి షూట్ చేయాల్సిన పరిస్థితి. హీరో కార్తీక్‌ని గట్టిగా కొట్టమని దర్శకుడు చెప్పారు. నాలుగైదుసార్లు చేయి పైకిలేపినా -అప్రమేయంగా కిందికి దిగిపోతుంది. దర్శకుడికి కోపమొచ్చింది. ‘కొడతావా కొట్టవా?’ అన్నారు కాస్త అసహనంతో. ‘చెంప చెళ్లుమనాలి. ఐదువేళ్లూ కనిపించాలి’ అని వత్తిడి చేశారు. ఆ సీన్ ఎలా చేశానో తలచుకుంటేనే -అదోలా ఉంటుంది అంటారు అరుణ.
‘కన్యాకుమారి దగ్గరున్న ముట్టయ్‌లో షూటింగ్. మధ్యాహ్న సమయానికి పాట చిత్రీకరించే గుహలోకి సముద్రం అలలు వచ్చేసేవి. షూటింగ్ ఆగిపోయేది. అలా పొద్దున 6నుంచి సాయంత్రం వరకు చేస్తే ఒకటి రెండు షాట్స్ పూర్తయ్యేవి. ఆ సన్నివేశంలో -సముద్రపు అలలతోనే అనేక భావాలు చెప్పించడం దర్శకుడి ప్రతిభకు గీటురాయి. అద్భుతమైన అల ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసేవాళ్లం’ అంటూ గుర్తు చేసుకున్నారు అరుణ.
మరో షాట్‌ను వివరిస్తూ ‘ఓ తోటలో అన్న శరత్‌బాబుకు కనిపించకుండా కార్తీక్‌తో కలిసి పారిపోవాలి. వెరీ లాంగ్ షాట్. తోట చాలా పెద్దది. ఎటుపరిగెత్తాలో అర్థమయ్యేది కాదు. పరుగెత్తుకుంటూ వెళ్లిపోతే యూనిట్ దూరమైపోయేది. నేనిక్కడున్నా అంటూ అరవాల్సి వచ్చేది’ అంటూ సందర్భాన్ని గుర్తు చేసుకుని నవ్వేశారు ముచ్చర్ల అరుణ.
మరో సన్నివేశాన్ని చెప్తూ ‘క్లైమాక్స్‌లో స్మిత నన్ను చెంపదెబ్బ కొట్టాలి. నిజంగానే ఆమె కొడుతుందన్న విషయం నాకు చెప్పలేదు. ఊరికే కొడతా కొడతా అంటూ చెయ్యెత్తి చూపు అన్నారు. నాకు అంతవరకే తెలుసు. అయితే, స్మితకు మాత్రం చెంపదెబ్బ కొట్టాలని చెప్పినట్టున్నారు. డైలాగ్ పూర్తయ్యాక స్మిత చెళ్లుమని చెంపపై ఒక్కటేసింది. ఒక్కసారిగా షాక్‌తిన్నాను. స్క్రిప్ట్‌లో ఇలా లేదు కదా. నిజంగానే కొట్టిందేమిటి? అనుకుంటూనే ఆమెవైపు కోపంగా చూశాను. షూటింగ్ స్పాట్ కనుక ఏమీ అనలేకపోయా. కళ్లలో నీళ్లొచ్చాయి. అయితే, ఆ టెంపో సినిమా సీన్‌లో బాగా పండింది. అలా పాత్ర పండటం నాకు ఆశ్చర్యం అన్పించింది. ఒకరకంగా అక్కడ దర్శకుడు ముందుగానే ఆ సీన్‌ని అలా ఊహించి చేయించి ఉంటారు’ అంటూ గుర్తు చేసుకున్నారామె.
‘మోడ్రన్, సంప్రదాయ దుస్తులు ఏవైనా నాకు సౌకర్యంగానే ఉండేవి. ఎలాంటి డ్రెస్‌లైనా నీకు నప్పుతాయి’ అనేవారు అంతా. అందుకే డ్రెస్ సెన్స్‌లో నేను ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు అన్నారు ముచ్చర్ల అరుణ.
**
జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ కుమార్తెగా నటించటం, తనకు బాగా నచ్చే మరో పాత్ర అంటారు అరుణ. షూటింగ్ టైమ్‌ని చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఎన్టీఆర్ ప్రక్కన కూర్చోబెట్టుకుని ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఎదగాలో సూచనలు చేసేవారు. ఓ గాడ్ ఫాదర్‌లా ప్రతి విషయాన్నీ వివరించి చెప్పేవారు. డిసిప్లిన్‌కు డెఫినిషన్ ఒకరకంగా ఆయన దగ్గరే నేర్చుకున్నానేమో. ఆయన అప్పుడిచ్చిన సలహాలు సూచనలే రియల్ లైఫ్‌లో నా పిల్లలకు షేర్ చేస్తుంటా. ఆ మహానటుడి సలహాలే నాకు ఆదర్శమై, వ్యాపారంలో భర్తకు సూచనలు చేస్తుంటానని భావోద్వేగంతో చెప్పారు ముచ్చర్ల అరుణ.
**
తొలి చిత్రాల్లో విజయశాంతితో కలిసి నటించడం వల్ల మంచి స్నేహం ఉందంటారు. అలాగే సుహాసిని, నళినిలాంటి వారు ఇప్పటికీ చక్కగా స్నేహపూర్వకంగా మాట్లాడతారని గుర్తు చేసుకున్నారు. కెరీర్‌లో మర్చిపోలేని పాత్రంటే -బాపు దర్శకత్వంలో ‘సీతమ్మ పెళ్లి’ చిత్రంలో చేసిన పాత్రే. ఆ పాత్ర నాకెంతో ఇష్టమని గుర్తు చేసుకుంది అరుణ. నిజానికి -‘ఆ పాత్రలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఓ సన్నివేశంలో చేపను పట్టుకుని డైలాగ్ చెప్పాలి. చేప వాసనొస్తోంది. అది భరిస్తూ డైలాగ్ చెప్పడం కష్టంగా ఉంది. ఆ సన్నివేశం కోసం తొమ్మిది టేక్ తిన్నా’ అంటారు అరుణ. కలలు కనే కళ్లు చిత్ర దర్శకుడు బాలు -‘మనం డ్యాన్స్‌చేస్తున్నా, నటిస్తున్నా భావం లోపలనుండి రావాలి’ అని సలహా ఇచ్చేవారట. అది మొదట్లో అర్థమయ్యేది కాదని, ఇపుడు నా సినిమాలు చూస్తుంటే ఇంకాస్త బాగా చేయొచ్చుకదా అనిపిస్తుందని, అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇపుడు అర్థమవుతున్నాయంటూ గలగల నవ్వేసారామె. శృతిలయలు చిత్రంలో గలగల నవ్వే పాత్రలో అలరించింది అరుణ. తమిళంలో దాదాపుగా అందరి హీరోలతో 25 చిత్రాలదాకా నటించారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో ‘ఓమక్కుయిల్’, ‘మన్సోర్ మహా సముద్రం’, ‘పిన్నిలవు’, ‘శ్రీకృష్ణపరుంత్’, ‘నేతావు’, ‘పొమ్మదాతుపెన్ను’లాంటి ఇరవై చిత్రాల్లో నటించారు. కన్నడలో సౌభాగ్యలక్ష్మి, వందాగిబాలు చిత్రాలు చేశారు. నచ్చని పాత్రంటే ‘ఆడదే ఆధారం’ చిత్రంలో చేసిందే. నెగటివ్ టచ్‌తో సాగే పాత్రను ఎందుకొప్పుకున్నానో ఇప్పటికీ అర్థంకాదు. మొదట చెప్పలేదు. కొన్ని సీన్లు అయ్యాక ఇలా నటించాలని చెప్పడంతో నటించక తప్పలేదు. అలాంటి పాత్రలు ఆ సినిమా తరువాత చాలా వచ్చాయి. నేను అలాంటి మనస్తత్వం వున్నదాన్ని కాదు. నా పాత్ర చూసి ప్రేక్షకులు హ్యాపీ ఫీలవ్వాలనుకుంటా. ఆ పాత్ర గురించి ఎవరు గుర్తు చేసినా ఇప్పటికీ బాధ కలుగుతుంది. అలాంటి పాత్ర చేయకుండా ఉండాల్సింది. కానీ ఆ పాత్ర హిట్టవ్వడంతో ఎన్నో ఆఫర్లొచ్చాయి. కానీ చేయలేదు, చేయలేనని చెప్పేశాను అంటారామె.
ఇపుడు స్ట్రిక్టుగావుండే మదర్, వదినలాంటి పాత్రలిస్తే చేయడానికి సిద్ధమే. ఇపుడొస్తున్న నటీనటులంతా అన్నీ నేర్చుకునే వస్తున్నారనిపిస్తుంది. అంతబాగా చేస్తున్నారు’ అంటూ కితాబిచ్చారు ముచ్చర్ల అరుణ.

-సరయు శేఖర్, 9676247000