సబ్ ఫీచర్

లైంగిక ఉన్మాదులకు ఇదో హెచ్చరిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త, మహామేధావి స్టీఫెన్ హాకింగ్ ఓ సందర్భంలో ‘న్యూ సైంటిస్ట్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విచిత్రమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ‘నిత్య శాస్ర్తియ మేధాసంపన్నులైన మీకు ఎక్కువగా గ్రాహ్యం కాని ఆలోచన ఏమిట’ని ఇంటర్వ్యూలో జర్నలిస్టు ప్రశ్నించగా- ‘మహిళ’ అని జవాబిచ్చారు. మహిళ మనసులో ఏముం దో? ఆమె ఏం కోరుకుంటుందో అంతుపట్టని మిస్టరీ అని హాకింగ్ అన్నారు. సృష్టి ఆవిర్భావం నుండి స్ర్తి, పురుషుల మధ్య వ్యత్యాసం, శారీరక లక్షణాలు, లైంగిక అవసరాల దృష్ట్యా ప్రకృతి సహజమై పరిఢవిల్లింది. మానవ విలువలు ప్రభవించిన శతాబ్దాల కాలగతిలో పురుషాధిక్యత, అసమానతలు లేని స్ర్తి, పురుష జనన సాధన హేతువుల ఆధారంగా స్వచ్ఛజీవనం మాత్రం కొనసాగేది. క్రమేపీ మానవ జీవన పరిణామాలలో- శారీరక విధి ధర్మ విభేదాలు పురుషాధిక్య విధానాలకు అవకాశం కల్పించాయి. ఆటవికత నుంచి అధునాతనం వరకు స్ర్తి, పురుష సంబంధాలలో లైంగిక ఆకర్షణలు, వ్యామోహం, కోర్కెలు బలీయమై కుటుంబం, సామాజిక వ్యవస్థ రూపొందింది. ప్రాచీన రాజ్యాధిపత్య కాలంలోను, మధ్యయుగ రాచరిక వ్యవస్థలో మహిళ అణచివేతకు గురైంది. పిల్లల్ని కనడం, వారిని పెంచడం.. క్రమేపీ కుటుంబంలో ఆమె ప్రధాన భాగస్వామిగా నిలదొక్కుకొంది. రాజ్యాలు పాలించిన మహారాణులు తమ మేధాసంపన్నతతో పురుష ప్రపంచాన్ని ఎదుర్కొన్నారు. ఆధునిక యు గంలో మహిళలకు ఓటుహక్కు రావటం, సాధికారతలో పురుషులకు దీటుగా, అన్ని రంగాలలో నెగ్గుకు రాగల స్థాయిని సాధించారు.
ప్రస్తుత 21వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఆర్థిక సాధికారత, స్వేచ్ఛ, సమానతలను ఆశిస్తున్నారు. హింస, అత్యాచారాలు, అవమానాలు, అణచివేత, దౌష్ట్యం, పితృస్వామ్య అహంకారం, అరాచకత్వం, మగమదోన్మాదం తనను బలితీసుకోకుండా మహిళ ఎదురుతిరిగి పిడికిలి బిగిస్తోంది. వ్యక్తిత్వ విలువలు, సమాన హక్కులు, జీవించే హక్కులను ప్రగాఢంగా వాంఛిస్తున్న ఆధునిక యువతి పురుష ప్రపంచాన్ని నిలదీస్తోంది. స్నేహం, ప్రేమ, బాంధవ్యం, మాతృత్వం, పెద్దరికం వంటివి ఆశిస్తూ విద్యాధికురాలుగా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ తన స్థానాన్ని మహిళ పదిలం చేసుకొంటోంది. పురుషుల్లో మదోన్మాదం పెచ్చుమీరి వికృత లైంగికత్వం సృష్టిస్తున్న విపత్కర పరిణామాలు, హింసాద్వేషాల నుంచి బతికి బయటపడాలని నేడు భారతీయ యువతి గళం విప్పుతోంది. అందులో భాగంగా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ, ఆధ్యాత్మిక, క్రీడా, విద్య, రాజకీయ రంగాలలో కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కార్యాలయాలలో ‘మీ టూ’ ఉద్యమం పేరిట న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
లైంగిక ఉన్మాదంతో గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో నిస్సహాయులు, అమాయకులైన యువతులను, బాలికలను బలితీసుకొంటున్న నేర ప్రవృత్తిపై నేటి మహిళ ‘మీటూ’ కొరడా ఝుళిపిస్తోంది. గతంలో అమాయకత్వంతోనో, పరిస్థితులకు భయపడో నిస్సహాయత వల్ల తలవంచిన మహిళలు ఒకప్పటి బాస్‌లపై, సినీ ప్రముఖులపై ప్రస్తుతం వయస్సు, కాలంతో నిమిత్తం లేకుండా అస్త్రాలు సంధిస్తున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు పొందిన పోలన్‌స్కీ 40 ఏళ్ళ క్రితం 13 సంవత్సరాల బాలనటి సమంతా గైనుర్‌తో లైంగిక నేరం అంగీకరించి ఇపుడు తన 84వ ఏట కటకటాలు లెక్కపెడుతున్నాడు. ‘హాలీవుడ్ మొఘల్’ హార్వే వైన్‌స్టిన్ న్యూయార్క్ కోర్టులో ఈ ఏడాది సెప్టెంబరు 9న జరిగే తుది వాయిదాలో నేరం రుజువైతే 66 ఏళ్ళు పైబడిన వయసులో- జీవితఖైదు శిక్ష అనుభవించవలసి వుంది. అంతర్జాతీయంగా పేరు పొందిన ఎందరో మేధావులు గతంలో తాము పాల్పడిన లైంగిక వేధింపులకు ఇపుడు అపకీర్తి, అవమానం, అప్రతిష్ఠలేకాక కారాగారాలలో మగ్గే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
మన దేశానికి సంబంధించి ‘మీటూ’ ఉద్యమం సంచలనం సృష్టిస్తోంది. వివిధ రంగాలలోని విద్యాధిక, ఉద్యోగ, సంపన్న వర్గాల మహిళలను సైతం ఈ ఉద్యమం ప్రభావితం చేస్తోంది. కార్యాలయాలలో, పరిశ్రమలలో, కళా, సాంకేతిక, శ్రామిక రంగాలలో మహిళలను ఆటబొమ్మలుగా భావించి వ్యవహరించే వారికి గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. తెల్లారితే ఏ మహిళ నోట, ఎవరి పేరు బయటపడుతుందో ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వర్తమానాంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పైన, ప్రముఖ పాత్రికేయుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ఎం.జె. అక్బర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దేశంలో చర్చనీయాంశమైంది. ప్రముఖ పర్యావరణ శాస్తవ్రేత్త ఆర్.కె.పచౌరీ జర్నలిస్ట్ తేజ్‌పాల్ వంటి వారు ఎందరో ఇలాంటి ఆరోపణలతో సతమతమవుతున్నారు.
పురుషాధిపత్యంపై పోరాటంలో భారతీయ మహిళకు కాలగతిలో ఎందరో మహాత్ములు, మహనీయ సంస్కరణవేత్తలు మార్గదర్శకం అందించారు. భర్త తోడిదే లోకంగా ఆమె భారతీయ సంప్రదాయ కుటుంబ జీవన విధానాన్ని అనుసరిస్తోంది. ఆర్థిక స్వాతంత్య్రం, విద్యావికాసం, పాశ్చాత్య భావజాలం ఆమె జీవన స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. బాలిక, విద్యార్థిని, యువతి, మధ్యవయస్కురాలు, వృద్ధాప్యం జీవితంలో స్ర్తిపురుష బాంధవ్యంతో పెనవేసుకొని వుండటం ప్రకృతి సహజం. లైంగిక వేధింపులకు పాల్పడేవారు ఎవరైనా, ఎంతటి వారైనా తిరుగుబాటు చేయాలంటూ ‘మీటూ’ పిలుపు ఇస్తోంది. పొరపాటు చేస్తే పరువు పోతుందని, శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్న ఈ ఉద్యమం ప్రభావంతోనైనా మహిళల పట్ల లైంగిక వేధింపులు తగ్గుముఖం పట్టాలి.

-జయసూర్య