సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

754. భగవదారాధనను గూర్చి శ్రీ గురుదేవుడొకప్పుడు కేశవ చంద్రసేనునితోడను ఆతని యనుచరులతోడను ఇట్లు పలికెను: ‘‘భగవానుని వైభవమును గూర్చియు భక్తులను గూర్చియు మీరంతగా స్తోత్రములు చేయుచుందురేల? తండ్రి యెదుటనున్న బిడ్డ, ‘మా నాయనకన్ని యిండ్లు, వాకిండ్లు నున్నవి, ఇన్ని గుఱ్ఱములున్నవి, ఇన్ని యావులున్నవి, ఇన్ని తోటలున్నవి’అని తలపోయునా? లేక తనపై తండ్రికెంతటి గాఢానురాగము కలదో, తనె్నంత మక్కువతో జూచునో తలపోయునా? తండ్రి తన బిడ్డలకు అన్నవస్తమ్రులిచ్చి పోషించి వారిని సుఖపెట్టుట అబ్బురమా? మన మందఱము వాని బిడ్డలముకామా? మన యోగ క్షేమములనాతడు ప్రేమతో వహించుటలో ఆశ్చర్యమేమున్నది? కావున నిజమైన భగవద్భక్తుడు వాని వైభవమును గూర్చి చింతించుటకు బదులు వానితో సన్నిహిత సంబంధము నేర్పఱుచుకొని వానిని తన వానినిగా నొనర్చుకొనును, తన ముద్దు చెల్లింపుమని పట్టుపట్టును, ‘్భగవంతుడు నావా’డని గర్వించు, ‘నాకు నీవు సాక్షాత్కరింపక తప్పదు’అని నిర్బంధించును. వాని వైభవమును గూర్చి- విభూతులను గూర్చి-మీరంతగా చింతించుచున్న పక్షమున వానిని మీరు సన్నిహితునిగా- ఆప్తునిగా- భావింపజాలరు; వానిని నిర్బందింపజాలరు, మీ యభీష్టము నొసగుమని పట్టుపట్టజాలరు. అపుడు ‘్భగవంతుడెంత మహిమాన్వితుడో! ఎంత యతీతుడో!’- ఇట్టి భావములే మీ తలపునకు వచ్చును. భగవంతుని వీలైనంతవఱకు ఆప్తునిగా భావింపుడు, అపుడు మీరు వానిని వశమొనర్చుకొనగలరు.’’
755. స్థిరముగా ఏదియో యొక భావము నవలంబించి భగవంతుని మీ వానినిగా జేసికొనవలయును. అపుడాతడు మీ యభీష్టమును దీర్పవలసినవాడగును. ఇరువురు వ్యక్తులకు అంతగా పరిచయము లేనప్పుడు వారు తమ సంభాషణలందు ‘మీరు, మీరు’అని సంబోధించుకొనుచు, గౌరవమర్యాదలను విశేషముగా పాటించుచుందురు. పరిచయము ముదిరి ప్రాణ స్నేహమైనంతనే ఆ మర్యాదలన్నియు వెనుకబడి, అరమరిక లేకుండ, ‘నీవు, నీవు’అని సంబోధించుకొనుచు మాటలాడుకొందురు. అటులనే భగవానునితో మనము అత్యంత సన్నిహితమైన సంబంధము గలిగియుండవలయును. వ్యభిచారిణియగు స్ర్తి తన ప్రియునితో మెలగు విషయమున ప్రారంభముననెంతయో సిగ్గుబిడియములు గలిగియుండును, తన ప్రియుని సంగతి అతి రహస్యముగానుంచి కడు జాగరూకతతో మెలగును. కాని ప్రేమ గాఢమైనంతనే ఇక సిగ్గు బిడియములు వెనుకబడును. అపుడామె నిర్భయముగా తన యింటిని వాకిలిని విడిచిపెట్టి తన ప్రియునితో నడివీధిలో గాన్పించును. అటు పిమ్మట ప్రియునకు తనపై వలపు తగ్గినను, తన్ను విడనాడ జూచినను వానిని మెడవంచి పట్టుకొని బాహాటముగా- నిర్భయముగా- నిట్లడుగును: ‘‘నీకోసము నా యిల్లువాకిలి విడిచినానుగదా, ఇక నన్ను సంరక్షించెదవా, లేదా, చెప్పు!’’
భక్తి: ప్రాపంచిక ప్రేమ
756. జ... అనువాని తల్లి వృద్ధురాలయ్యెను. సంసారమును విడిచి యామె తన యంత్యదశను ప్రశాంతముగా బృందావనమును గడపుట విధ్యుక్తమని భావించి తన అభిప్రాయమును శ్రీరామకృష్ణునకు దెలిపెను. కాని శ్రీగురుదేవుడామె పరిస్థితులను బాగుగా నెఱిగియుండుటచే అందులకు ఆమోదింపక యిట్లు సమాధాన మొసగెను: ‘‘నీ మనుమరాలు (కుమారుని కూతురు) అనిన నీకు పంచప్రాణములుగదా, నీ వెచ్చటికి వెడలినను ఆ బిడ్డ తలపునకు వచ్చి నిన్ను ఆందోళన పఱచును. నీకిష్టమైన పక్షమున బృందావనములో నుండవచ్చును గాని నీ మనస్సు సదా నీ యింటిమీదనే యుండును. ఇందులకు బదులు నీ మనుమరాలు సాక్షాత్తు శ్రీరాధికయని భావన చేసి ఆమెపై ప్రేమానురాగములను జూపుదువేని బృందావనమున నివసించు పుణ్యము స్వయముగా నీకు లభించును.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి