సబ్ ఫీచర్

చలం రచనల్లో ‘ఆమె’ స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం, సాహిత్యం ఒకటిగా ఆరు దశాబ్దాలుపైగా తెలుగు సమాజాన్ని శాసించి నిరంతర సంఘర్షణ, అశాంతి, తపన, అనే్వషణా పథగామిగా, ప్రభావితమైన చలం జన్మించి 125 సంవత్సరాలు కాగా, లోకాన్ని వదలి 40 ఏళ్ళయింది. 85 సంవత్సరాల జీవనయానంలో నిరీశ్వర, ఈశ్వర వివాదాస్పద వైరుధ్య వైవిధ్యంగా జీవితానందపు లోలోతుల్ని అనే్వషించటమే జీవన లక్ష్యంగా సంచలనం సృష్టించిన, గుడిపాటి వెంకటాచలం.. భారతీయ జీవన సాహిత్య సీమలో అరుదైన, అపురూప సామాజిక తత్త్వవేత్త. ఆస్తిక, నాస్తికవాదాలను రెండింటితో అవిశ్రాంతంగా దేనికీ తలవంచకుండా నిష్కల్మష, నిర్మొహమాట వ్యక్తిత్వంతో పోరాటంలో చలం తనను తాను అనుభూతి మార్గానే్వషణలో వెలుగుకోసం వెతుక్కుంటూ నడవటం, సాహిత్యపు వెలుగు దివిటీ ప్రసరింపచేయటం కారణంగా కాలాతీతమైన అజరం సాధించారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో మూడు దశాబ్దాల కాలం చలనం జీవన గమ్యాన్ని నాటి రోజులలో సనాతన సమాజం స్ర్తిల జీవితాలకు తొడిగే ఇనుప కచ్చడాలను ఛేదించే, లైంగిక కట్టుబాట్లు, స్వేచ్ఛకోసం పోరాటంగా కొనసాగింది. కందుకూరి, గురజాడ అప్పటికే అందించిన ఆయుధం చలం చేతిలోకొరడా అయింది. సూటిగా హృదయాలను స్పృశించే భావ తీవ్రత, నిజాయితీతో నిలదీసి ప్రశ్నించే పదునైన శైలి, తాను ప్రగాఢంగా విశ్వసించిన తిరుగుబాటు ధోరణులు చలాన్ని కదిలించాయి. చలం సున్నిత హృదయాన్ని ఆమె, ఈ భూమిమీదనే అమృతంతో నింపగల, స్ర్తి అనుభవిస్తున్న వేదన, సంఘర్షణ, దుర్నీతి కదిలించింది. ‘ఆమె’ కన్నీళ్ళు, కలలు ఊపిరాడనీయలేదు. సంఘం వెలిసింది. ఒంటరి పోరాటంలో ‘ఆమె’ స్వేచ్ఛ ప్రాతిపదికగా శారీరక మానసిక అణచివేతపై చలం సృష్టించిన సాహిత్యం నాటి సమాజాన్ని నిలదీసింది. కుటుంబ వ్యవస్థలో చిచ్చురగిల్చే అనైతిక సాహిత్యంగా ముద్రపడింది. అపకీర్తి, తీవ్ర నిందారోపణలు మూటకట్టుకున్న చలం ఎవరికీ, ఎన్నడూ తలవంచలేదు. రాజీపడలేదు.
సంచలనాత్మక సాహిత్యం
చలం స్ర్తిల సమస్యలతో పాటు తన కాలం నాటి సమాజంలోని ఎన్నో విషయాలను తన రచనలలో ప్రస్తావించారు. పిల్లలను కొడితే కానీ నాలుగక్షరం ముక్కలురావని నమ్మేరోజులు కావడంతో తండ్రుల దండన హింస చలం పసి హృదయంపై చెరగని ముద్రవేసి ‘బిడ్డల శిక్షణ’ రాయించింది. ‘మ్యూజింగ్స్’లో పిల్లల చదువులూ, పరీక్షలు, హింసలు వివరించారు. ఉపాధ్యాయునిగా, పాఠశాలల తనిఖీ స్కూళ్ళ ఇన్స్‌పెక్టర్‌గా, విద్యార్థులలో పోటీతత్వం నిరసిస్తూ విద్యావ్యవస్థలో అవలక్షణాలను దుయ్యబట్టారు. ‘‘కుర్రాళ్ళు పరీక్ష రాస్తుంటే కాపలా కూర్చోవటంలో నీచత్వం స్ఫురిస్తోంది’’ అంటారు మ్యూజింగ్స్‌లో. సుఖవంతమైన జీవితం అంటే ఒంటినిండా బంగారం, ఇంటినిండా అధునాతన సామగ్రితో బ్రతకటం అనే భావం నాడూ నేడూ స్థిరపడింది. వాటిని అందుకోవటానికే చదువుల్లో ర్యాంకుల కోసం, జీతాలు బాగా వచ్చే ఉద్యోగాలకోసం వెంపర్లాట. ఇది పిల్లలలో మానసిక ఒత్తిడికీ, ఆందోళనకు దారితీస్తోంది. ఈ పరిస్థితి మారాలి. ‘‘సింపుల్‌గా సుఖపడటం నేర్పాలి విద్య’’అన్నారు, ఆనాడే చలం.
చలం చిరంతన అనే్వషి. సున్నిత హృదయుడు. పురుషాధిక్యతను మరింతగా సమాజాన్ని ఏలుతున్న రోజులలో ‘ఆమె’ స్వేచ్ఛ ప్రధాన అంశంగా రచనలలో ప్రశ్నించారు. ఈ ప్రపంచం ఇవ్వగల సుఖాలన్నింటిలోనూ అత్యంత ఆకర్షణీయమైన లైంగిక స్వేచ్ఛకు ఘోరత్వం, నీచత్వం ఆపాదించి అణచివేయటం పట్ల ఎన్నో నవలలు, కథలు, రూపకాలు, లేఖలు కఠోర వాస్తవాలను రాసారు. తన బతుకంతా తెలుగు నేలపై అక్షరాల సొగసు, సౌందర్యంతో భావోద్వేగంతో ప్రతీ అంశంలో కల్మషం పోగొట్టే, స్వచ్ఛ జీవన మాధుర్యం ఆశించారు. ఇలాంటి సత్యానే్వషణ ఒక పట్టాన లోకానికి ఆమోదయోగ్యం కాదు. అర్థం అవటం కూడా అంత తేలిక కాదు. చలం భావజాలం, రచనల తీరుతెన్నులు సమజాన్ని మేల్కొలిపే వైతాళిక అంతరార్థాలు కుహనా ఆధ్యాత్మికతను, అశాస్ర్తియ మూఢ విశ్వాసాలకు చెంపపెట్టుగా పరిణమించాయి. సత్యానే్వషణలో జీవనయానంలో ముందుకు అడుగులు పడే కొద్దీ, చలం జీవితం మహాప్రస్థానంగా సాగిపోయింది.
రమణాశ్రమ పవిత్ర సన్నిధిలో..
1979మేలో తుదిశ్వాస విడిచేవరకు చలం జీవితయానం, సుమారు 53 ఏళ్ళు తెలుగునాట, 27 ఏళ్ళు అరుణాచలేశ్వరుని దివ్యసన్నిధి రమణాశ్రమంలో గడిచింది. 1920 దశకంలో శశిరేఖ తొలి నవలగా 1930-40 మధ్య అరుణ, బ్రాహ్మణీకం, జీవితాదర్శం, మ్యూజింగ్స్, స్ర్తి, దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు, బుజ్జిగాడు, పురూరవ ఎన్నో రచనలు చలం సాహిత్యం ఆధునిక యుగాన్ని ఆవిష్కరింపజేసింది. పూర్వాశ్రమంలోను, రమణాశ్రమం నుంచి దశాబ్దాల తరబడి రచనలతోపాటు మిత్రులకు, అభిమానులకు రాసిన లేఖలలో ఆత్మీయ స్పర్శ, హృదయ ఆర్ద్రత పలకరిస్తుంటాయి. అనిర్వచనీయమైన ప్రేమ, నిష్కాపట్యం, నిర్మొహమాటం, హాస్యపుజల్లులు, వేదాయుత స్పందనలు తెలుగు సారస్వతానికి నూతన అలంకారాలుగా విలసిల్లుతున్నాయి. తనకోసం కాకుండా అపరిచితుల, అభిమానులకు కేవలం సంతోషపెట్టడానికి, వారి లేత, అజ్ఞాన భావాల పలకరింపుగా మురిపించటానికి లేదా జాలిపడి ప్రత్యుత్తరాలు రాసారు. వ్యక్తిత్వం, దస్తూరీ, రసికత, ఆప్యాయత, మెరుపు చురకల్లాంటి తేట మాటలు, పసిపిల్లవాని హృదయం ఆ లేఖలలో స్పష్టమవుతోంది. ఆయన అభిమానిగా 1969, 1974 మధ్య అయిదు జవాబులు అందుకొనే ధన్యత ఈ వ్యాస రచయితకు దక్కింది. చిలిపిగా నేను రాసిన ఉత్తరానికి జీవన చరమాంకంలో శారీరకంగా కృశించటంవల్ల, వణుకుతున్న అక్షరాలతో రాసిన ఉత్తరం బహుశా స్వయంగా రాసిన ఆఖరి ప్రత్యుత్తరం కావచ్చు. ‘‘భగవాన్నించి నేను అవలోకించిన దివ్యానుభూతి నాకే చాలకుండా వుంది. మీకెక్కడ పంపగలను?’’ అని రాస్తూ ‘‘అప్పుడే కాదు’’అన్నారు. ఈశ్వర కరణ, ఈశ్వరాదరణ, ఈశ్వరాశీర్వాదాలతో చలం పలకరింపులు నేటికీ చలింపచేస్తున్నాయి. ‘భగవాన్ పాదాలముందు’ పుస్తకంలో యశోద గీతాలు, విన్నపాలు, నివేదన, పాటలు ప్రచురించబడ్డాయి. ఈ పుస్తకంలో గీతాలు నేను ఎటెంప్ట్ చేసినవి కావు. ఏదీ ఉద్దేశించలేదు. భగవాన్ నాకు ప్రసాదించినవి. నాలోంచి పలికినవి. వాటి స్పిరిట్ కవిత్వం కాదు. కవిత్వం ఏమాత్రం లేదు. నాటి ప్రయోజనం వేరు’’ అన్నారు చలం.
*
రేపు చలం జయంతి సందర్భంగా..

- జయసూర్య 94406 64610