సబ్ ఫీచర్

ఆశయాల శ్వాస.. విశాలాంధ్ర తెలుగు కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషితోపాటే కథ పుట్టింది. జీవితం ఎన్ని మలుపులు తిరిగితే సాహిత్యం కూడా అన్ని మలుపులు తిరగక తప్పదు. తెలుగు జీవితాన్ని అంటిపెట్టుకొని ఎన్నో మెలికలు తిరిగిన సాహిత్య ప్రక్రియ తెలుగు కథానిక అంటారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ, వాకాటిగార్లు. దిద్దుబాటుతో తొలి కథకు శ్రీకారంచుట్టిన మహాకవి గురజాడ మొదలు వర్తమాన కథకులవరకు వందలాది కథకులు వేలాది కథలను తెలుగు దేశానికి అందించి తెలుగుతేజాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. చేస్తున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరన్నట్లు కాలానికి నిలబడి పాఠకుణ్ణి ఆలోచింపజేసే కథలు కొన్ని మాత్రమే. అలాంటి కథల్లో కొన్నింటిని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌వారు తెలుగు కథ పేరుతో ప్రచురించిన పుస్తకంలో 1910నుంచి 2000వరకు అంటే తొమ్మిది దశాబ్దాల్లో వచ్చిన ఆణిముత్యాలనదగిన కథల్లో 108 కథలను ఏరి అందించడం జరిగింది. ఒక రకంగా ఇదో కథా శతకమన్నమాట.
తొంభై ఏళ్ళకాలంలో తెలుగు కథ, వివిధ కాలాలలోని అనేకానేక ఘటనలకు స్పందించింది. ఎనె్నన్నో ప్రాదేశిక సమస్యలను కదలికలను చిత్రించింది. దేశీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రభావాలకు గురిఅయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు కథ చరిత్రగతిని ప్రతిఫలించింది. సమాజ పరివర్తనను సూచించింది. ఈ ప్రతిఫలనానికి, పరివర్తనకూ అనుకూలమైన తాత్విక భూమికను కథన వైఖరులనూ ఏర్పరచుకుంటూ వచ్చిందంటారు- తెలుగు కథ ప్రధాన సంపాదకుడు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. సింగమనేని నారాయణ, పెనుగొండ లక్ష్మీనారాయణ, సదానంద్ శారదగార్లు సంపాదకులుగా వ్యవహరించిన తెలుగింటి కథాతోరణంలో కథకులు తమ సొంత మాండలికంలో రాసిన కథలు, ప్రాంతీయ పరిమళాలు గుబాళించే అవకాశాలున్న కథలున్నాయి. సమాజ జీవితంలోని లోపాల్ని విమర్శకు పెట్టడమే అంతస్సూత్రంగా కనిపిస్తుంది. సంపాదక వర్గం మాటల్లోనే చెప్పాలంటే- కథల్లో ప్రస్తావించిన కాలఘటనలు అనేకం. సమస్యలు భిన్నం. వైరుధ్యాలు, ఘర్షణ చిత్రణ వేర్వేరు. ఈ కథల్లో రాజకీయాలు రాజ్యవ్యవస్థ, న్యాయవ్యవస్థ, సాంఘిక వ్యవస్థ స్వరూప స్వభావాలు శతాధిక రూపాల్లో కన్పిస్తాయి. సంఘసంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, ఆర్థిక మాంద్యం, వలస విముక్తిపోరాటాలు, తెలంగాణా సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, ఆకలి, నిరుద్యోగం, భూమి సమస్య, కరువుకాటకాలు, పర్యావరణ సమస్య, దోపిడి, దళారీ వ్యవస్థ, దళిత సమస్యలు, స్ర్తిల సమస్యలు- ఒకటేమిటి? సమాజంలోని అన్ని అంశాలను స్పృశించింది. చెడుని తుంచడం మంచిని పెంచడమే లక్ష్యంగా ముందడుగేసింది. జనాభాలో నాలుగింట మూడొంతులు నిరక్షరాస్యతతో, దారిద్య్రంతో ఎదుర్కొన్న బాధలున్నాయి. అక్షరాస్యులు, అధికారులైన వారి సంస్కార రాహిత్యానికి సాటివారు, సమాజమెంత బలవుతుందో చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఎక్కువ సందర్భాల్లో పలు సమస్యల తాలూకు మూలాధారాలు మనల్ని ప్రశ్నిస్తాయి. పరిష్కార మార్గాలు వెతకండని ప్రబోధిస్తాయి. జీవితాన్ని, జీవన విధానాన్ని జాగ్రత్తగా సరిచేసుకుంటూ జాగ్రత్తగా ముందడుగు వెయ్యమంటాయి.
మహాకవి గురజాడగారి మీ పేరేమిటి కథతో మొదలై ఇనయతుల్లాగారి ‘‘వలస’’కథతో ముగిసిందీ సంకలనం. మీ పేరేమిటి కథ మత వైషమ్య చిత్రణ ద్వారా మత వ్ఢ్యౌ నిరసన కాగా, వలస కథ పేరుకీ తీరుకీ సంబంధంలేని సంక్షేమాన్ని ఎండగట్టింది.
కనుపర్తి వరలక్ష్మమ్మగారి కుటీరలక్ష్మి, గుడిపాటి వెంకటచలంగారి భార్య, సురవరం ప్రతాపరెడ్డిగారి వకీలు యెంకయ్య కథలున్నాయి. ఉప్పల లక్ష్మణరావుగారి నిద్రలేని కథ మానవతకు పట్టంకట్టింది. కాళీపట్నం రామారావుగారి అప్రజ్ఞాతం కథలో సుదర్శనం నేటి యువతకు సైతం ప్రాతినిధ్యం వహిస్తుంది. లోకోపవాద భీతిలో కొందరు ప్రాణాలనే త్యాగంచేస్తారు. సుదర్శనం విశ్వాస త్యాగంచేయడం వింత కాదు. అవగాహన వేరు. అవగాహన మేరకు జీవించడం వేరని తేల్చి చెప్పారు రామారావుగారీ కథలో.
మాకంటె మీరేం తక్కువ కథలో వట్టికోట అళ్వారుస్వామిగారు రంగడి పాత్రతో పలికించిన- ‘‘మీరు సర్కారు నడిపితే మేము చప్రాసి కొలువుకి కూడా పనికిరామా?’’ ప్రశ్న రాజకీయవాదులకు చురకే. కె.సభాగారి ఎండమావుల్లో తిమింగిలాలవేట కథ నీళ్ళులేని చెరువుల్లో సైతం జెల్లలనో ఇసకుదొందులనో పెంచుకోకుంటే దేశం తిబ్బతింటుందనే నేతలపై ఎక్కుపెట్టిన వ్యంగ్య వైభవం. వాస్తవం తెలిసాతెలియకనా పాలకులిలా చేసేదని ఆలోచించాలా?
మట్టిని నమ్ముకొని పరులకు పాయసం తినిపిస్తూ తాము గంజికి నోచుకోని రైతన్న గుండెకోత. చేసిన తప్పులు తీరక, సర్కారుకిస్తు కట్టలేక జప్తుకు గురైన రైతుకథ ‘‘సర్కారుకిస్తు’’గా అందించారు మంద రామారెడ్డి. కేవలం మనుషులం కథలో నెల్లూరి కేశవస్వామిగారు కుల మతాలకతీతమైన మానవతా సందేశాన్ని అందించారు. సక్సీనా, బిల్కీస్‌లు ఆదర్శవివాహం చేసుకోవడమేగాక పట్నంలో సంపాదనకన్నా పల్లెటూళ్ళో స్థిరపడాలన్న వారి ధ్యేయం నిస్సందేహంగా మానవసేవే.
మత కలహాలు, మారణహోమాలకన్న మానవత్వం మిన్నని చాటిన మంజీర కథ ధర్మవ్యాధుడు. వృత్తిరీత్యా కథలోని షేరాలీ మేకలను చంపి మాంసం అమ్ముకున్నా చాలీచాలని సగటు జీవితం గడిపేవాడు. అనాధ ముసలమ్మను ఆదరించి ఆకలి తీర్చిన దయామూర్తి.
‘‘తాత దిగిపోయిన బండి’’ మొక్కుబళ్ళుగా మారిన మహనీయుల సంస్మరణలకు కలువకొలను సదానందగారి అక్షర నీరాజనం.
వాసిరెడ్డి సీతాదేవిగారి కథ తరాలు-తరాలుమారే తరానికి పెరిగే విజ్ఞానానికి ప్రతీక. ఈనాడు చదువుకుంటున్న పిల్లలు రేపు కోడళ్ళూ అత్తలవుతారు. వాళ్ళు అత్తలయ్యేటప్పటికి అత్తాకోడలు ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు పట్టించుకోకుండా ఒకర్నొకరు అర్థంచేసుకొని బ్రతకటానికి ప్రయత్నించవచ్చునని ఆశించారు సీతాదేవి. అబ్బూరి ఛాయాదేవిగారి కథ కర్త, కర్మ,క్రియ-ప్రతిభకన్న, ప్రమోషన్ కన్న ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పిందీ కథ.
సింగమనేని నారాయణ జూదం, చిలుకూరి దేవపుత్ర సమిధలు గ్రామీణ రైతు జీవితాన్ని అందులోని బాధలను కళ్ళకు కట్టిన కథలు.
కేతు విశ్వనాథరెడ్డిగారి కథ పీర్లసావిడి, ఆర్వీఆర్‌గారి అందలం మన దేశంలో ఎన్నికల తతంగానికి అద్దంపట్టాయి. ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం పాలవుతుందో ఈ కథలు చదివితే తెలుస్తుంది.
చాగంటి తులసిగారి వలయం, సత్యవతిగారి పునాది కథలు చదువుల తీరుతెన్నుల్ని సామాన్యుల స్థితిగతుల్ని పట్టిచూపించాయి. సహనం తిరగబడితే ఎలా బుసలుకొడుతుందో తిరగబడ్డ భూమి కథలో ఉప్పల నరసింహంగారు చెబితే, బూటకపు కేసు బనాయింపులతో తల్లడిల్లుతున్న పల్లెలను శత్రువు నేర్పినపాఠంగా అల్లం రాజయ్య అందించారు.
భారతీయులు కలిస్తే ఇంగ్లీషు వాడిదేమీలేదని కలవనంతకాలం అంతా ఇంగ్లీషువాడిదేనని గోపీచంద్ చెప్పిన కథ గోడమీది మూడోవాడు మత సమైక్యతకు ముచ్చటైన కానుక.
డా.లంకిపల్లె ‘‘కడియాలు’’ కన్నీళ్ళు తెప్పించే కథ.
‘‘రైతుకొక తల్లివుంది. ఆ తల్లికి ఆకలెక్కువ. ఆమె ఆకలి తీర్చడానికి అప్పుచేయవలసి వస్తుంది. కండలు కరిగించినా ఎముకలు వంచి కష్టించినా ఆమెకు కనికరం లేదు. ఆమె ఆకలి నీటితో, ఎరువుతో తీర్చకపోతే పైరు పెరగదు. పైరు లేక పంట లేదు. ఆరుకాలం కష్టపడే రైతుకు అవరోధాలెన్నో వున్నాయి. మట్టిమీద రైతుకున్న మమతానుబంధాలు సంకెళ్ళు. కంటికి కనబడని ఆ బంగారు సంకెళ్ళని ఎవరూ విడగొట్టలేరు. అయితే ఆ సంకెళ్ళే కడియాలుగా మారే రోజు వస్తుంది. ప్రతి మనిషికి కడుపునిండా తిండి వున్నపుడే దేశానికి నిండు గౌరవం పట్నవాసులనైనా పల్లె వాసుల్నయినా ప్రతి నిత్యం వెంటాడే మాటలివి... కాదుకాదు రైతు జీవన బాధలు నేటికీ పరిష్కారానికి నోచుకోని బాధలివి.
నేటివరకు ఎందరో పాఠకుల్ని స్పందింపజేసి మరెన్నో కథా సంపుటాలకు తెలుగు కథ ప్రేరణగా నిలిచింది.

- డా. కొల్లు రంగారావు