సబ్ ఫీచర్

అనువాద వారధి.. ముదునూరి జగన్నాథరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు నడిబొడ్డులో శ్రీవిల్లిపుత్తూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపాళయం శ్రీ ముదునూరి జగన్నాథరాజావారి స్వగ్రామం. గురుస్వామి రాజా, అమ్మణియమ్మ దంపతులకు కుమారుడుగా 1933 జూలై 26న వీరు జన్మించారు. బాల్యంలో వీధి బడిలో ఆరవ తరగతి వరకు మాత్రమే వీరి విద్యాభ్యాసం కొనసాగింది. డిగ్రీలు ఏవీ లేకపోయినప్పటికీ వీరి ప్రతిభా పాండిత్యాలను, సాహిత్య కృషిని గుర్తించి తమిళ విశ్వవిద్యాలయం వీరిని గౌరవ ఆచార్యులుగా నియమించి గౌరవించింది. ఉత్తమ అనువాద రచనలకిచ్చే ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డును వీరు అందుకున్నారు. ఎన్నో జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధక పత్రాలను సమర్పించారు. ఈ విధంగా వీరు పొందిన సన్మానాలకు, అవార్డులకు లెక్కలేదు. బహుభాషాకోవిదులైన జగన్నాధరాజాగారి మాతృభాష తెలుగు. వీధి బడిలో తెలుగు, తమిళం నేర్చుకున్నారు. స్వయంకృషితో సంస్కృత, ప్రాకృత, పాళీ, కన్నడ, మలయాళ, హిందీ, ఆంగ్ల భాషలను నేర్చుకోవడమేగాక ఆయా భాషలలో రచనలు చేయగలిగే సామర్థ్యాన్ని కూడా సాధించారు. జగన్నాధరాజాగారి సాహిత్య వ్యాసంగం అనువాదాలు, సృజనాత్మక రచనలు, విమర్శ అనే మూడు పాయలుగా పవిత్ర త్రివేణీ సంగమంవలె గంభీరంగా సాగింది. జగన్నాధరాజాగారు వివిధ భాషా సాహిత్యాలను తమిళంలోనికి పరివర్తనం చేసి తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మహాకవి గురజాడ అప్పారావుగారు రచించిన కన్యాశుల్కం నాటకాన్ని అదే పేరుతో తమిళంలోనికి వీరు అనువదించారు. 1963లో ఇది పుస్తక రూపంలో వెలువడింది. ఉన్నవ లక్ష్మీనారాయణగారు రచించిన మాలపల్లి నవలను ‘చేరి’ అనే పేరుతో తమిళంలోనికి అనువదించారు. ఈ గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యాన్ని వీరు తమిళంలోనికి అనువదించారు. తమిళ అనువాదంతోపాటు లిప్యంతరీకరణం కూడా ఇవ్వడం ఈ గ్రంథంలోని గొప్ప విశేషం. ఈ గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఉత్తమ అనువాద రచనలకు బహుమతులనివ్వాలని నిర్ణయించినపుడు 1989లో మొట్టమొదటిసారిగా తమిళంలో అనువాద రచనకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథం శ్రీ రాజాగారి ఆముక్తమాల్యద. వేమన పద్యాలలో ముఖ్యమైన రెండువందల పద్యాలను ఎన్నుకొని వాటిని చక్కటి తమిళంలోనికి అనువదించారు. వీరి సుమతీ శతకం, కళాపూర్ణోదయం కావ్యానువాదాలను తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ ప్రచురించింది. దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారి ‘కృష్ణపక్షం’ ఖండ కావ్యాన్ని ‘తేయ్‌ప్పిరై’ అనే పేరుతో తమిళంలో గేయ రూపంలో అనువదించారు. వీరేశలింగంగారి వ్యాసాలలో విధవా వివాహం, స్ర్తి విద్య మొదలైన కొన్ని వ్యాసాలను సంకలనం చేసి వాటిని తమిళంలో పుస్తక రూపంలో ప్రచురించారు. టంగుటూరి ప్రకాశంపంతులుగారి ‘‘నా జీవిత యాత్ర’’ గ్రంథాన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం కోరిక మేరకు తమిళంలోనికి అనువదించి ఇచ్చారు.
ప్రాకృత భాషలో ప్రసిద్ధమైన హాలుని గాథాసప్తశతి అనే గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా తమిళంలోనికి అనువదించిన ఘనత శ్రీ జగన్నాధరాజాగారికే దక్కుతుంది. తమిళ ఛందోభేదమైన అగవల్ ఛందస్సులో వీరీ గ్రంథాన్ని రచించడం విశేషం. ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికమైన అనువాదంగా తమిళ పండితుల ప్రశంసలను అందుకుంటున్నది. 16వ శతాబ్దానికి చెందిన జయవల్లభుడు అనే జినాచార్యుడు సంకలనం చేసిన నీతి గ్రంథం ‘వజ్జాలకం’. ప్రాకృత భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని రాజాగారు మొట్టమొదటిసారిగా తమిళంలోనికి అనువదించారు. పదో శతాబ్దికి చెందిన రాజశేఖరుడు ప్రాకృత భాషలో రచించిన ‘కర్పూర మంజరి’ అనే నాటకాన్ని తమిళంలోనికి అనువదించారు. ప్రాకృత భాషలో సిద్ధసేనుడు రచించిన జైనమత సిద్ధాంతాలను తమిళ ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాటిని ‘సన్మది సూత్రం’ అనే పేరుతో తమిళంలోనికి అనువదించారు. తత్త్వశాస్త్రంలో గాఢమైన పాండిత్యంగలవారు మాత్రమే దీనిని అనువదించగలరు. పాళీ భాషలో రాయబడిన ‘తీగనికాయం’, ‘మిళింద మన్లా’, ‘ఉదానం’ అనే బౌద్ధగ్రంథాలను శ్రీ రాజాగారు తమిళంలోనికి అనువదించారు. ప్రాకృత, పాళీ భాషలను స్వయంగా నేర్చుకొని నేరుగా ఆ భాషలనుండే వీటిని తమిళంలోనికి అనువదించడం గొప్ప విషయం. అలాగే వీరు సంస్కృత భాషనుండి అనేక గ్రంథాలను తమిళంలోనికి అనువదించారు. మొట్టమొదటిసారిగా క్షేమేంద్రుని ‘ఔచిత్య విచార చర్చ’ అనే గ్రంథాన్ని తమిళులకు పరిచయంచేసిన ఘనత వీరికి చెందుతుంది. అనువాద రచనల్లోనే కాదు. స్వతంత్ర రచనల్లోకూడా శ్రీ రాజాగారు సిద్ధహస్తులు. కవి, రచయిత అయిన రాజాగారు వివిధ సందర్భాల్లో రచించి పత్రికలలో ప్రకటింపబడిన ఛందోబద్ధమైన తమిళ కవితలను ‘కర్పనై పొయ్‌గై’ అనే పేరుతోను, వచన కవితాపద్ధతిలో రచించిన కవితలను ‘దరిశనం’ పేరుతోనూ 1972లో రెండు గ్రంథాలుగా వెలువరించారు. వివిధ ఛందోరీతులతో వీరు రచించిన తమిళ లఘుకావ్యం ‘కావ్యమంజరి’ 1986లో వెలువడింది. ‘అపుత్ర కావ్యం’, ‘తెరు’ అనే రెండు ఖండ కావ్యాలను కూడ వీరి లేఖినినుండి జాలువారాయి. ‘మణిమేఖల’ కావ్యంలోని ‘అపుత్రుడు’ అనే ఒక చిన్న పాత్రను ప్రధాన పాత్రగా చేసుకొని వీరు అపుత్ర కావ్యాన్ని రచించారు. వీరు కథాసాహిత్య ప్రక్రియలో కూడా పేరు గడించారు. వీరి కథాసంకలనం ‘పింజు కరంగళ్’ అనే పేరుతో పుస్తక రూపంలో వెలువడింది. ఇందులోని కొన్ని కథలు ఫ్రెంచి, జర్మను, ఆంగ్ల భాషల్లోనికి అనువదింపబడ్డాయి. జగన్నాథరాజుగారు ప్రాచీన తాళపత్రాల సేకరణలో, పరిష్కరణలో ఎంతో కృషిచేశారు. తాళపత్ర ప్రతుల్లో శిథిలమైపోతున్న అపూర్వ గ్రంథాలను వీరు పరిష్కరించి ప్రకటించడం మన అదృష్టం. నిడదవోలు వెంకట్రావు, ఆరుద్ర మొదలైన సాహిత్య చరిత్రకారులు నష్టగ్రంథంగా తెలిపిన ‘నాంచారు పరిణయం’ తాళపత్ర ప్రతిని సంపాదించి, పరిష్కరించి ప్రకటించారు. పారిజాతాపహరణం, సీతాకళ్యాణం, సావిత్రి అనే మూడు యక్షగానాలు రాజపాళయంలో లభ్యమయిన తాళపత్ర గ్రంథాలు. వీటిని పరిష్కరించి ‘రాజపాళయం రాజకవుల యక్షగానాలు’ అనే పేరుతో పుస్తక రూపంలో వెలువరించారు. రాజపాళయంలో లభ్యమయిన ‘దశావతార చరిత్ర’ అనే మరొక ద్విపద కావ్యాన్నికూడా వీరు పుస్తక రూపంలో తీసుకువచ్చారు. సాహిత్య తత్త్వశాస్త్ర గ్రంథాల పరిరక్షణకోసం జాతీయ సమైక్యతా దృష్టితో వీరు ‘జగన్నాథరాజా లిటరరీ ఫిలాసఫిక్ రిసర్చి అండ్ ట్రాన్స్‌లేషన్’ అనే ట్రస్టును ప్రారంభించారు. ఈ సంస్థలో ప్రాకృత, పాళీ, సంస్కృత భాషల్లోని అపూర్వ గ్రంథాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలే కాక కన్నడ, మలయాళ, హిందీ, ఆంగ్ల భాషల్లోని గ్రంథాలు కూడా ఈ గ్రంథాలయంలో లభ్యమవుతాయి. రాజాగారు ఎన్నో నిఘంటువులను, విజ్ఞాన కోశాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచారు. గరిమెళ్లవారి ‘మాకొద్దీ తెల్లదొరతనము’ పుస్తకం మొదటి ప్రతి ఆంధ్రదేశంలో ఏ గ్రంథాలయంలోనూ లభించలేదు. కానీ రాజాగారి గ్రంథాలయంలో వాటిని చూడవచ్చు. తమిళనాడులోనే ఇదొక అపూర్వ గ్రంథాలయం. జగన్నాధరాజాగారు రాజపాళయంలో ‘మణిమేఖలై మన్రం’ అనే సాహితీ సంస్థను స్థాపించి తెలుగు తమిళ సాహితీ సంస్కృతులకు ఎనలేని కృషిచేశారు. ఆరుద్ర, దాశరథి, ఆచార్య సి.నారాయణరెడ్డి, తిరుమల రామచంద్ర ఆదిగాగల ఎందరో సాహితీవేత్తలు రాజపాళయం తెలుగువారి అతిథి మర్యాదలను చవిచూశారు.రాజపాళయంలోని తెలుగువారికి రాయడం, చదవడం నేర్పించాలనే ఉద్దేశంతో వీరు తమ ఇంట్లోనే ‘‘తెలుగు విద్యాలయం’’ ప్రారంభించారు. పిల్లలకు తెలుగు నేర్పడమేకాక, ఉత్సాహమున్న యువతీయువకులను ఎంపికచేసి వారిచే అనువాద కార్యక్రమాన్నికూడా సాగిస్తూ వచ్చారు శ్రీ రాజాగారు. వీరి శిక్షణలో దాదాపు పది మంది రచయితలుగా, అనువాదకులుగా గుర్తింపబడి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. బహుభాషా పండితులైన శ్రీ ముదునూరి జగన్నాథరాజాగారు తమ 65వ ఏట అనగా 2008వ సంవత్సరం డిసెంబరు 2న పరమపదించారు.
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)

- ఆచార్య ఎన్.జయప్రకాశ్