సబ్ ఫీచర్

బాల్యానికి భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పిల్లలంతా పనిలో కాదు- బడిలో ఉండాలి’- అనే నినాదం ఆచరణలో నిజమైనపుడు ‘బాల కార్మిక వ్యవస్థ’ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. అప్పుడు పిల్లలు వారి హక్కులను ఆనందంగా అనుభవిస్తారు. కొందరు పిల్లలు పనులకు వెళ్లడం వల్ల వారు శారీరకంగా, మానసికంగా అవస్థలు పడుతున్నారు. దీంతో వారు తమ భవిష్యత్తును అందంగా ఊహించుకోలేక పోతున్నారు. బాల కార్మిక వ్యవస్థ మరోవైపు సామాజిక సమస్యలను సృష్టిస్తుంది. ఉపాధి విస్తరణ లేకుండా పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. పేదరికాన్ని నిర్మూలించకుండా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడం జరిగే పనికాదు. పేదవర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను డబ్బు సంపాదించే పనిలో పెడుతున్నారు. దీంతో ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను పొందాల్సిన వయస్సులో మిల్లులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, గనులు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ అందమైన భవిష్యత్తును కోల్పోతున్నారు. కొందరు స్వార్థపరులు పిల్లల చేత భిక్షాటన, దొంగతనం, దోపిడీ, మత్తు పదార్థాల విక్రయం లాంటి నేరాలు చేయిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సామాజిక, రాజకీయ సంకల్పం అవసరం.
ఏటా జూన్ 12వ తేదీన ‘బాల కార్మిక వ్యితిరేక దినం’ పాటిస్తూ, ఈ వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల్లో చైతన్యం రగిలించాలి. ఈ ఏడాది బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా ‘జనరేషన్ సురక్షితమైనది, ఆరోగ్యకరమైనది’ అనే ‘్థమ్’ ఇచ్చారు. 2025 నాటికి బాల కార్మికులు ఎక్కడా ఉండని రీతిలో ప్రయత్నించాలి. అంతర్జాతీయ శ్రామిక సంస్థ 2002లోనే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సుమారు 210 మిలియన్ల నిరుద్యోగులుగా ఉండగా, 200 మిలియన్ల బాలలు కార్మికులుగా మగ్గిపోతున్నారని నోబెల్ బహుమతి గ్రహీత సత్యార్థి చెప్పారు. ఈ సమస్యను అరికట్టేందుకు చట్టాలు పూర్తిస్థాయిలో అమలుకావాలని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 52 మిలియన్ల బాలలు ఫుల్‌టైమ్ వర్కర్లుగా అతి తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆయన అంటున్నారు. మన దేశంలో బాలలపై లైంగిక దాడులు పెచ్చుమీరుతున్నాయని సత్యార్థి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘యూనిసెఫ్’ అంచనా ప్రకారం బాలలు బలవంతంగానే పనుల్లోకి వస్తున్నారు. వారు వయస్సుకు సంబంధం లేని పనులు చేయటానికి ప్రధాన కారణం పేదరికం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆశపడుతుంటారు. పిల్లలు పనికి వెళ్తేనే ఆ కుటుంబానికి జీవనాధారమైనప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టీకరించింది. బాలల నేర న్యాయ చట్టం అమలు గురించి కేంద్రం అరకొరగా ప్రమాణ పత్రం దాఖలు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలంటే కేంద్రానికి పట్టింపులేదా? అని జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రాల్లో బాలల హక్కుల రక్షణ కమిషన్‌లు, రాష్ట్ర బాలల సంక్షేమ సొసైటీలు, జిల్లా స్థాయిలో బాలల న్యాయ బోర్డులపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆరునెలల క్రితమే ఆదేశించినా సరైన స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పర్యవేక్షణ లేమి, పెంపకంలో లోపాల ఫలితంగా పిల్లలు పక్కదారి పడుతున్నారని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేరాలకు పాల్పడుతున్న బాలల్లో అత్యధికులు కుటుంబ సభ్యులతో జీవిస్తున్నవారేనని తెలిపింది. పేదరికం కూడా పిల్లలను తప్పుదారి పట్టిస్తోంది. ఒకప్పుడు బాల నేరస్థుల్లో ఎక్కువ మంది వీధిబాలలు ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని అధ్యయనాలు తేల్చిచెబుతున్నాయి. పిల్లల ప్రవర్తన, కదలికలపై కొందరు తల్లిదండ్రులు ఉదాసీనంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వారు చెడుమార్గంలో పయనిస్తున్నా తల్లిదండ్రులు గుర్తించలేక పోవడంతో విపరీత పరిణామాలు తలెత్తుతున్నాయి. బాల నేరగాళ్లలో 41.45 శాతం ప్రాథమిక విద్యతో ఆపేసిన వారేనని ఓ అధ్యయనం తేల్చింది. నేరాల్లో బాలల ప్రమేయం ఏటేటా పెరగడం ఆందోళనకరం. ఈ పరిస్థితి సరికొత్త సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. బాల నేరస్తులకు పునరావాసం కల్పించడం ఎంత ముఖ్యమో, వాళ్ల చేతిలో అఘాయిత్యాలకు గురికాకుండా మహిళలు, ఇతరులకు రక్షణ కల్పించడం అంతే ప్రధానం. బాల నేరస్తుల (జువైనల్ జస్టిస్-జెజె) చట్టం-2000 ప్రకారం బాలలకు జైలుశిక్ష నిషిద్ధం. హత్య, అత్యాచారం, దోపిడీ వంటి ఘోరాలకు పాల్పడే బాలల సంఖ్య పెరిగిపోతున్న దృష్ట్యా జువైనల్ చట్టానికి సవరణలు తేవాలని సర్వోన్నత న్యాయస్థానం 2011లోనే అటార్నీ జనరల్‌ను కోరింది. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో సామూహిక అత్యాచర ఘటన జరిగాక జువైనల్ జస్టిస్ చట్టాన్ని సవరించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. హత్యలు, అత్యాచారాల వంటి ఘోర నేరాలకు పాల్పడే 16-18 ఏళ్ల బాలలను పెద్దవారితో సమానంగా పరిగణించి శిక్షించాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. 2001లో బాల నేరస్తులు చేసిన అత్యాచారాలు 399, 2011నాటికి అవి 1149కు పెరిగాయని జాతీయ నేర గణాంక సంస్థ నివేదించడం సమస్య తీవ్రతను బయటపెట్టింది. ఈ పరిస్థితుల్లో జెజె చట్టం-2000ను రద్దుచేసి, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించిన బాలల న్యాయ (బాలల రక్షణ, సంరక్షణ) చట్టం-2015 ప్రకారం క్రూరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల వయసు 16నుంచి 18 ఏళ్లమధ్య ఉంటే, వారిని వయోజనులుగా గుర్తించాలా? లేదా పిల్లలుగానా? అనే విషయాన్ని బాలల న్యాయ బోర్డులు నిర్ణయిస్తాయి. నేరం రుజువైతే శిక్ష విధించవచ్చు. మరణశిక్ష, జీవితఖైదు మాత్రం ఉండదు. వారికే ఉద్దేశించిన ప్రత్యేక కారాగారాలలో 21 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉంచుతారు. అప్పుడు వారి ప్రవర్తనను మదింపువేస్తారు. నేరస్తుడు పరివర్తన చెందితే శిక్షను తగ్గించవచ్చు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) నివేదిక ప్రకారం బాలలు చేసిన నేరాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా 10, 14 స్థానాల్లో ఉన్నాయి. బాలలపై జరిగిన నేరాల్లో ఇవి 16, 17 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా జైళ్లను తనిఖీ చేసి, 16 ఏళ్లు నిండని వారుంటే పరివర్తన గృహాలకు (జువెనైల్ హోమ్) తరలించాలని ఢిల్లీ హైకోర్టు గతంలో ఎన్‌సీపీసీఆర్‌ని ఆదేశించింది. దరిమిలా సామాజికవేత్తలు, న్యాయవాదులతో కూడిన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి.
నేరం చేసి పట్టుబడిన బాలలకు సరైన సంస్కారం నేర్పడం, పునరావాసం కల్పించడం చక్కని పరిష్కారమవుతుందని ఐరాస సూచించింది. గ్రామాల్లో సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలను పెంచి వలసలు తగ్గించాలి. పట్టణాల్లో క్రీడా, వినోద సౌకర్యాలను విస్తరించి యువశక్తిని సరైన గాడిలోపెట్టాలి. జనాభాలో అధిక శాతమున్న యువజనులు, బాలలను దేశప్రగతికి గొప్ప చోదకశక్తిగా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం, తల్లిదండ్రులు చొరవ తీసుకుంటేనే బాల్యానికి భరోసా ఏర్పడుతుంది.
(నేడు బాలకార్మిక వ్యతిరేక దినం)

-ఎస్.కలీల్ 94403 36771